రాష్ట్రీయం

కర్నూలు శివారు ప్రాంతాలకు వరద ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 12: కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద పోటెత్తడంతో కర్నూలు నగరంలోని పాతపట్టణానికి ముంపు ముప్పు పొంచిఉంది. దీంతో అధికారయంత్రాంగం ప్రజలు అప్రమత్తం చేసింది. కృష్ణా, తుంగభద్ర నదులకు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం ఏమాత్రం సోమవారం సాయంత్రం వరకు ఏమాత్రం తగ్గలేదు. కృష్ణానది నుంచి 8,21,498 క్యూసెక్కులు, తుంగభద్రనది నుండి 2,08,363 క్యూసెక్కుల నీరు సంగమేశ్వరం వద్ద కలుస్తున్నాయి. అయితే కృష్ణానది నుంచి వస్తున్న వరద అత్యధికంగా ఉండడంతో తుంగభద్ర నీరు ముందుకు పోలేక వెనక్కి మళ్లుతోంది. దీంతో జలాశయం పరిసర గ్రామాలు, కర్నూలు నగరంలోని పాత పట్టణానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది. తుంగభద్ర నది పరివాహక మండలాలు కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం, సి.బెళగళ్, కర్నూలు రూరల్, నందికొట్కూరు, పగిడ్యాల, కొత్తపల్లె మండలాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తుంగభద్ర జలాలు ముందుకు పోలేక వెనక్కి మళ్లడంతో కర్నూలు నగరంలోని వన్‌టౌన్, జోహరాపురం ప్రాంతాల్లోకి వరద జలాలు చేరుతున్నాయి. దీంతో కలెక్టర్, ఇతర అధికారులు వన్‌టౌన్‌లో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అవసరమైతే ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు తుంగభద్ర నది పరివాహక మండలాల్లోని అన్ని పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఏ క్షణాన ఎలాంటి ఉపద్రవం తలెత్తినా ఎదుర్కొనేందుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఆయా మండలాల్లోని అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వరద ముప్పు ప్రమాదం తొలగేంత వరకు పరివాహక గ్రామాల్లో పహారా కాయాలని కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు నగరం గుండా ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో వరద పోటెత్తడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. కాగా శ్రీశైలం జలాశయానికి 10.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో దిగువకు 8,48,673 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పది క్రస్ట్‌గేట్లను ఎత్తి 7,50,180 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 29,255 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులు కలిపి మొత్తం 9.05 లక్షల క్యూసెక్కుల నీరు దిగువ నాగార్జునసాగర్‌కు పంపుతున్నారు. జలాశయం ఎగువన పోతిరెడ్డిపాడు నుండి 28 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా నుండి 2,363 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 735 క్యూసెక్కుల నీటిని జలాశయం వెలుపలికి పంపుతున్నారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తి పది వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండండి: సీడబ్ల్యూసీ
తుంగభద్ర, కృష్ణానదులకు కొనసాగుతున్న వరద మరో రెండు రోజులు ఉంటుందని అందువల్ల ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాల్లోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మొదటి ప్రమాద హెచ్చరిక 271.9 మీటర్లు కాగా, ప్రస్తుతం ఆ స్థాయిలో వరద ప్రవాహం ఉంది. 273 మీటర్ల స్థాయి దాటితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీడబ్ల్యుసీ సూచించింది. కాగా వరద ప్రవాహం 274 మీటర్లు దాటితే పెను ప్రమాదం తప్పదని హెచ్చరించింది. కర్నూలు వద్ద ఉన్న వరద సూచికల వద్ద నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయి అప్రమత్తంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించి విపత్తు నివారణ శాఖ సిబ్బందిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం. సీడబ్ల్యుసీ హెచ్చరికలు మంగళవారం సైతం కొనసాగుతాయని ఆ తరువాత పరిస్థితులను బట్టి మరో బులిటిన్ విడుదల చేస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు.