రాష్ట్రీయం

ఆక్రమణదారుల్లో గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 25: రాజధాని అమరావతిలో కృష్ణా కరకట్టపై ప్రభుత్వ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమవుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారం గోదావరి నది ఒడిలో అక్రమార్కులకు గుబులురేపుతోంది. ఇది ఒక్క అమరావతితోనే సరిపోదని, జిల్లాల స్థాయిలో కూడా జరగాలని కలెక్టర్లకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో గోదావరి గర్భంలో అక్రమ నిర్మాణాలు జరిపిన వారిలో వణుకుపుడుతోంది. గోదావరి నది ఒడ్డున తాత్కాలిక కట్టడాల పేరుతో శాశ్వత కట్టడాలు వందల సంఖ్యలో నిర్మించేశారు. నదీ గమన దిశలు మారిపోయే విధంగా గోదావరి తీరం కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది. నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ సాగిన ఈ ఆక్రమ నిర్మాణాల భవిష్యత్తు ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో ఏమవుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 1884 ఆగస్టు 28న అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రివర్ కన్జర్వెన్సీ యాక్టు అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం గోదావరి
తీరం పొడవునా వసిష్ఠ, వైనతేయ, గౌతమీ నదీ పాయలను ఆనుకుని అప్పట్లో ఏటిగట్లు ఏర్పాటయ్యాయి. నదీ ప్రవాహానికి, ఏటిగట్టుకు మధ్య ఉండే స్థలంలో ఏ విధమైన నిర్మాణం చేయరాదనేది ప్రధాన నిబంధన. ఈ భాగంలో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాణాలు చేయడం అనివార్యమైతే హెడ్ వర్క్సు విభాగం నుంచి అనుమతి తీసుకోవాల్సి వుంది. దాని ప్రకారం నదీ ప్రవాహంలోని వరద ముంపు నీరు ప్రవాహానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ఏటిగట్టుకు మించిన ఎత్తులో స్తంభాలు వేసి వాటిపై నిర్మాణాలు చేపట్టాలి. ఈ ప్రదేశంలో జిరాయితీ భూములైనా, ప్రభుత్వ భూములైనా ఎందులోంచీ మట్టి తవ్వితీసి తరలించడం గానీ, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ మెరక చేయడం చట్టవిరుద్ధం. వీటిని అతిక్రమిస్తే సాధారణ జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నాయి. అయితే ఇటువంటి నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కారు. పర్యవేక్షించే నాథుడు కన్పించడం లేదు. సీతానగరం నుంచి ధవళేశ్వరం వరకు ఎక్కడబడితే అక్కడ గోదావరి గట్టు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతోంది.
రెవెన్యూ, జల వనరులు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ భూముల్లో ఆక్రమణలు తొలగించాలని 2014లోనే సుప్రీం కోర్టు ఆదేశించినా నేటికీ పట్టించుకున్న దాఖలాల్లేవు. ప్రధానంగా అఖండ గోదావరి నది పరీవాహ ప్రాంతం ఎంతమేర ఆక్రమణలకు గురైందనే విషయాన్ని విజిలెన్స్ సర్వేచేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. గోదావరి జిల్లాల్లో ఆక్రమణలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజనచేసి చర్యలు చేపట్టాల్సిందిగా గతంలోనే సుప్రీం ఆదేశించింది. ఏ కేటగిరిలో శాశ్వత కట్టడాలు, బీ కేటగిరిలో తాత్కాలిక కట్టడాలు, సీ కేటగిరిలో మార్చేందుకు వీలుగా ఉన్న ఆక్రమణలుగా గుర్తించారు. ఈ ఆక్రమణలపై చర్యలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, పోలీసు అధికారులతో ఒక కమిటీని కూడా నియమించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు గతంలోనే ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన నివేదిక ప్రకారం ఒక్క జల వనరుల శాఖకు సంబంధించే అఖండ గోదావరి పరీవాహంలో మొత్తం 2500 ఆక్రమణలు వున్నాయని గుర్తించారు. ఇందులో రకరకాల ప్రార్థనా మందిరాలు, భవనాలు తదితరాలు ఉన్నాయి. చిత్రమేమిటంటే జల వనరుల శాఖకు చెందిన భూములను రెవెన్యూ లీజులకు ఇచ్చేసి పెత్తనం చేయడమే కాకుండా కనీసం లీజు మొత్తం కూడా వసూలుచేయని స్థితిలోవుంది. 535 కిలోమీటర్ల పరీవాహ ప్రాంతంలో ఇటు పోలవరం నుంచి అటు వశిష్ఠ, గౌతమీ, వైనతేయ అంతర్వేది చివరి వరకు ఉన్న ఆక్రమణలో 80 శాతం వరకు జల వనరుల శాఖ భూముల్లో రెవెన్యూ పెత్తనం చెలాయిస్తే కేవలం 20 శాతం భూములను మాత్రం జల వనరుల శాఖ పర్యాటక శాఖకు కేటాయించింది. పర్యాటక శాఖ నుంచి ప్రైవేటు వ్యక్తులు వివిధ సంస్థల పేరిట లీజులకు తీసుకున్నారు. జల వనరుల శాఖ అభ్యంతరం తెలియజేసినప్పటికీ రెవెన్యూ నుంచి, పర్యాటక శాఖ నుంచి భూములను లీజులకు తీసుకున్న సంస్థలు శాశ్వత కట్టడాలు చేసి నదీ గమన దిశలు మారిపోయే దుస్థితికి తీసుకొచ్చారు.
గోదావరి నది గట్టుదాటి లోపలకు వచ్చి శాశ్వత నిర్మాణాలు చేపట్టినా, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నా సంబంధిత శాఖలు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి 2003లో కొంత మేర భూమిని జల వనరుల శాఖ పర్యాటక శాఖకు కేటాయించింది. ఇదే అదనుగా కొంత మంది పర్యాటక శాఖ నుంచి లీజులకు తీసుకుని శాశ్వత కట్టడాలు నిర్మించేశారు. పర్యాటక రంగుతో రాజకీయ పలుకుబడితో యధేచ్ఛగా తీరంలో శాశ్వత కట్టడాలు వెలిశాయి. ఇదే అదనుగా మిగిలిన వారు వాటి పక్కకు చేరి ఆధ్యాత్మిక సంస్థల ముసుగులో వసతి సౌకర్యాల కోసం ప్రత్యేక గదులు నిర్మించి అద్దెలు వసూలుచేస్తున్నారు. కొంత మంది ఎకో టూరిజం పేరుతో హోటళ్లు నడుపుతున్నారు. గోశాల పేరుతోనూ, డెయిరీల పేరుతోనూ ఆధ్యాత్మిక కట్టడాల చెంతన ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గోశాల వెనుక ప్రాంతంలో ఏకంగా గోదావరి పాయను కప్పేస్తున్న వైనం బయట పడింది. ఎటువంటి లీజులు లేకుండానే అరటి, ఇతర పంటలను సాగుచేస్తూ పాగా వేశారు. కొంత మంది భూమిని అనుకూలంగా మార్చుకుని తాత్కాలిక కట్టడాలతో కబ్జాలకు పాల్పడినా జల వనరుల శాఖ పట్టించుకున్న దాఖలాలు కన్పించడంలేదు. అయితే గోదావరి పరీవాహ ప్రాంతంలో ఎటువంటి లీజుగానీ, శాశ్వత ప్రాతిపదికన అనుమతులు మంజూరుచేయలేదని జల వనరుల శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం.
గోదావరి నది ప్రవాహం సజావుగా సాగేంత వరకు బాగానే వుంటుందని, వరదల సమయంలో నదీ గమన దిశలు మారేవిధంగా మాత్రం కట్టడాలు వుంటే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్టే. ఇప్పటికైనా రివర్ కన్జర్వేషన్ యాక్టును తూచ తప్పకుండా పాటిస్తే నదీ గమన దిశలు మారకుండా ఎటువంటి ముంపునకు గురయ్యే ప్రమాదాలు వుండవని నిపుణులు పేర్కొంటున్నారు. ఆక్రమణలపై చర్యలు తీసుకుని లీజులను పునసమీక్షించాల్సి ఉందంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ నదుల ఆక్రమణల తొలగింపుపై ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో గోదావరి గర్భంలో ఆక్రమణలను అధికారులు ఏంచేస్తారో వేచిచూడాల్సిందే.

చిత్రం... గోదావరి నదిని భవనాల శిథిలాలతో పూడ్చేస్తున్న దృశ్యం