రాష్ట్రీయం

కాల్‌మనీపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 25: కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉండవల్లి ప్రజావేదికలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రెండోరోజు మంగళవారం ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారునుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఏ పార్టీ వారు ఉన్నా విడిచి పెట్టొద్దని ఆదేశించారు. ఎవరికైనా ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు చేపట్టాలని, విజయవాడలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత దారుణమన్నారు. ఈ రాకెట్‌లో వైఎస్సార్ పార్టీ వారు ఉన్నా సరే ఉపేక్షించవద్దని, ఈ సెక్స్ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించాలని ఆదేశించారు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమందిని అరెస్టు చేశారని అధికారులను ప్రశ్నించారు. సీఎం ఆదేశాలతో పోలీసుశాఖ కాల్‌మనీ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
రాష్ట్రంలో దశలవారీ మద్యపాన నిషేధం అమల్లో భాగంగా అక్టోబర్ 1 నాటికి బెల్టుషాపులు పూర్తిగా ఎత్తేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమాజానికి మంచి చేసే నిర్ణయాల అమల్లో త్వరగా అడుగులు ముందుకు పడాలన్నారు. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు ఉండరాదని, దాబాల్లో మద్యం అమ్మకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపడంతోపాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జరిమానా విధించే ముందు ప్రజల్లో అవగాహనకు పెద్ద పీట వేయాలన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, భద్రతా నిబంధనలు, నియమాలపై హోర్డింగ్‌లు పెట్టించాలని సూచించారు. అదేవిధంగా గంజాయి సాగుని పూర్తిగా నియంత్రించాలని, గంజాయి నిర్మూలన దిశగా ఆగస్టులో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాలని, గిరిజనులకు ఉపాధి అవకాశలు కల్పించి గంజాయి సాగు నుంచి దూరం చేయాలని అన్నారు.
ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పాలనా వ్యవస్ధలో పోలీసులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమేనని, పర్సనల్ ఈగోలు పక్కనపెట్టి పని చేయాలని సూచించారు. జిల్లాలో ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్లకు జిల్లా పోర్టల్ ప్రారంభించమని చెప్పామని, అందులో భాగంగా ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, లైసెన్స్‌లు, అనుమతులు ఇలాంటివన్నీ పెట్టాలన్నారు. వేగం, పారదర్శకత కోసమే ఈ విధానం అన్నారు. పోలీసుల పనితీరుకు సంబంధించి నివేదిక ఉండాలని, ఇది థర్డ్‌పార్టీ చూడాలని, పోలీసు అధికారుల పనితీరుపై బాధితులు, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సూచించారు. రెవిన్యూ వ్యవస్ధలో స్పందన కార్యక్రమం మాదిరిగా పోలీసు వ్యవస్ధలో కూడా ఇలాంటి విధానం అమలు చేయాలని, ప్రతి జిల్లాతోపాటు ప్రతి పోలీస్టేషన్ పరిధిలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని, అదేవిధంగా ఎస్పీలు ఆయా పోలీస్టేషన్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేసి, ప్రజలతో నేరుగా మాట్లాడటం, ఆ రోజు రాత్రి అక్కడే బస చేయడం వంటి కార్యక్రమాల అమలు ద్వారా కింద స్ధాయి పోలీసుల పనితీరును తెలుసుకోవాలని ఆదేశించారు.
సైబర్ క్రైం అంశంపై ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ ఈ తరహా కేసులను పూర్తిగా అడ్డుకోలేకపోతున్నామనే అభిప్రాయం ఉందన్నారు. సైబర్ వేధింపులను కఠినంగా అణచివేయాలని, మహిళల హక్కులను కాపాడాలని సూచించారు. వీలైతే అధికారులందరికీ శిక్షణ ఇవ్వాలని, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారో అధ్యయనం చేయాలన్నారు.ఈవ్‌టీజింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని మంచి ప్రభుత్వం, మంచి పాలన, సరైన విధానాలు, నెంబర్ వన్ పోలీసింగ్ కోసం ప్రజలతో మమేకపై ‘ఫ్రెండ్లీ’ పోలీసింగ్‌ను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.

చిత్రం...ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి