రాష్ట్రీయం

ప్రపంచం చూపు భారత్ వైపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు/తడ, ఏప్రిల్ 23: భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని , యువశక్తి, మేధోశక్తి అధికంగా ఉండే దేశం మనదేనని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మంగళవారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్‌లో నెలకొల్పిన ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పతకాలు, డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మనదేశంపైన చిన్నచిన్న దేశాలు దండెత్తి అన్నిరకాలుగా దోచుకున్నాయని, మన దేశం శక్తి వంతమైన దేశం అయినా కలసి బతకాలనే గొప్ప సిద్ధాంతం మనదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 2015లో కేంద్రమంత్రి హోదాలో శ్రీసిటీ ఐఐఐటీ శంకుస్థాపన చేశానని, ఇప్పుడు ఉప రాష్టప్రతిగా మొదటి స్నాతకోత్సవ వేడుకలకు హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. పీపీపీ మోడల్‌లో నిర్మితమైన ఈ ట్రిపుల్ ఐటీ ద్వారా చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 100 పరిశ్రమల హబ్ అయిన శ్రీసిటీ ఆధ్వర్యంలో ఈ ట్రిపుల్ ఐటీ నడవడం గొప్ప విషయం అన్నారు. భారతదేశ చరిత్ర చూస్తే ఒకప్పటి విద్యా భాండాగారంగా ఉన్న నలందా, తక్షశిల, పుష్పగిరి విశ్వవిద్యాలయాల్లో విద్య కోసం విదేశాల నుండి వచ్చేవారన్నారు. చైనా చరిత్రకారులు హుయాన్‌త్సాంగ్, పాహియాన్ వంటి వారే మన దేశంలో విద్యారంగం ఓ మేటి అని ఆనాడే కొనియాడారన్నారు.
ప్రస్తుతం దేశంలో 900 విశ్వ విద్యాలయాలు ఉంటే ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో 200 ర్యాంకులో కూడా మనం లేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్య పటిష్టతకు ప్రభుత్వాలు ప్రపంచస్థాయి విద్యనందించే విధంగా విద్యాలయాలను తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు మనపై ఉందన్నారు. ట్రిపుల్ ఐటీలు ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థుల కోసం ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు.
వచ్చే పది పదిహేనేళ్లల్లో రూ.10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగి ప్రపంచంలోనే మూడవ అత్యుత్తమ ఎకానమీగా అవతరించబోతోందన్నారు. దీనికి కారణం నేటి సంస్కరణలు, సాంకేతిక అభివృద్ధి, పరస్పర సహకారమేనని అన్నారు. ప్రస్తుతం మన దేశం వృద్ధి రేటు 7.3 శాతంగా ఉందని, దేశవ్యాప్తంగా 65 శాతం మంది 35 యేళ్లలోపు యువతే ఉన్నారని, వారే మన బలమన్నారు. ఏ దేశంలో కూడా ఇంత యువత లేదన్నారు. నేడు యువతకు కావాల్సింది శాంతి, అభివృద్ధి, ప్రగతి కలిపి మన దేశానికి, ప్రపంచ శాంతికి మనవంతు అందించాలనే ధోరణిలో ఉండాలన్నారు. దేశ అభివృద్ధిలో ప్రధాని, ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు మాత్రమే భాగస్వాములు కారని, ప్రజలు కలిస్తేనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు.
మనదేశ జనాభాలో 65 శాతం గ్రామాల్లో నివసిస్తున్నారన్నారు. మహాత్మాగాంధీ పిలుపు గ్రామాలకు తరలండి, మరలండి అనే నినాదాన్ని మనం పాటించి, అగ్రికల్చర్ మన దేశ కల్చర్ అని నిరూపించి మీరు చదువుతున్న సాంకేతికత వ్యవసాయానికి అందించాలన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, వాతావరణ మార్పులు, పోషకాహార లోపం, పల్లెలు, పట్టణాల మధ్య అంతరం వంటి సమస్యలకు పరిష్కారం కోసం యువత ముందుకు రావాలన్నారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఐఐటీ, ఐఎస్‌బి, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు బోధనతో సరిపెట్టకుండా పరిశోధనల దిశగా ప్రోత్సహించాలన్నారు. విద్యను అందించడంతో తమ బాధ్యత పూర్తయ్యిందని భావించకుండా, విద్యార్థుల భవిష్యత్తు కోసం వారికి ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలతో క్రమబద్ధమైన సమన్వయాన్ని కలిగి ఉండాలని విద్యాసంస్థల యాజమాన్యానికి సూచించారు.
తాత్కాలిక హామీలకు స్వస్తిచెప్పాలి
ఎన్నికల వేళ రాజకీయనాయకులు ప్రజలకు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే హామీలకు, తాయిలాలకు స్వస్తిచెప్పాలన్నారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా హామీలు ఉండేలే తప్ప దేశానికి కావాల్సింది తాత్కాలిక హామీలు కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా రాజకీయాలు మారాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు కావాల్సింది 12 గంటల నాణ్యమైన విద్యుత్ అని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 71 యేళ్లు గడిచినా నేటికీ 21శాతం ప్రజలు పేదరికంలో, 22శాతం మంది ప్రజలు నిరక్ష్యరాస్యులుగా ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలని, ప్రజలు స్వయంగా అభివృద్ధి సాధించేలా అలాంటి అవకాశాలను పాలకులు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే యువత, విద్యార్థులు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకొని వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. పాశ్చాత్య సంస్కృతిని, జంక్ ఫుడ్ అలవాట్లను మార్చుకొని మన పెద్దలు తినే ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామాలు, యోగా చేసి దృఢంగా ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలన్నారు.
లేటెస్ట్ స్కిల్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనాలిటిక్స్, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫింటెక్ లాంటి నైపుణ్యాలను నేర్చుకొని మంచి ఉద్యోగాలు పొందాలని, అలాగే దేశ, సామాజిక, తల్లిదండ్రుల సేవలో యువత కీలక భూమి పోషించాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ నుంచి పట్ట్భద్రులైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మీ తరువాత విద్యాసంస్థలో చేరే విద్యార్థులకు మీరే స్ఫూర్తి ప్రదాతలుగా ఉండాలని కోరారు. శ్రీసిటీ ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీసిటీ ఛైర్మన్ శ్రీనిరాజు, ఎండీ రవీంద్రసన్నారెడ్డిలను ఆయన ప్రశంసించారు. 2017-18 విద్యాసంవత్సరంలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి, 136 మంది విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను, అత్యంత ప్రతిభ చూపిన హర్షిత, ఐశ్వర్యరాయ్, కృతికరణ్, సంతోషిణిరెడ్డిలకు బంగారు పతకాలను అందించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీదేశాయ్, డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్, ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ సత్యనారాయణలకు ఉపరాష్ట్రపతి జ్ఞాపికలను అందించారు. స్నాతకోత్సవంలో 136 మంది పట్టాలు పొందగా వీరిలో 105 మంది అండర్ గ్రాడ్యుయేట్‌లు, 29 మంది హానర్స్ పట్ట్భద్రులు, ఎంఎస్ డిగ్రీ విద్యార్థులు ఉన్నారు.

చిత్రం...ఐఐఐటి తొలి స్నాతకోత్సవ వేడుకల్లో పట్ట్భద్రులతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు