రాష్ట్రీయం

బాబు వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై చర్చించటమే ప్రధాన అజెండాగా రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులు మంగళవారం రాత్రి విజయవాడ పున్నమిఘాట్‌లోని టూరిజం హోటల్‌లో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అనిల్ చంద్ర పుణేఠాపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసి, ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించడం తెలిసిందే. ఈ నియామకంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ప్రతిపక్ష నేత జగన్ కేసుల్లో సహ నిందితుడుగా ఉన్న ఎల్వీని సీఎస్‌గా నియమించడాన్ని ఆక్షేపించారు. దీంతో కొంతమంది మాజీ ఐఏఎస్ అధికారులు గవర్నర్‌ను కలిసి సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ వినతిపత్రం ఇచ్చారు. దీనిపై కూడా సీఎం చంద్రబాబు స్పందిస్తూ సీఎస్‌ను మార్చడం, రాష్టప్రతికి కొంతమంది మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాయడం, ముగ్గురు ఎస్పీలను బదిలీ చేయడం వంటి అంశాలపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఇలాఉంటే ఎన్నికల తరువాత వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలకు సీఎస్ హాజరు కాకపోవడం, తదితర అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు.. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య కొంత దూరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు సమావేశం కావటం గమనార్హం. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘంలో 184 మంది సభ్యులు ఉండగా, అందులో 14 మందే ఈ సమావేశానికి హాజరయ్యారు. కోరం ఉండాలంటే 46 మంది హాజరు కావాలని ఆ సంఘం కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సీఎస్ సుబ్రహ్మణ్యంపై సీఎం చేసిన వ్యాఖ్యలే తమ సమావేశ ప్రధాన అజెండా అని వివరించారు. చాలామంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో సమావేశం నిర్వహించేందుకు వీలు కలుగలేదన్నారు. కనీస స్థాయిలో సభ్యులు హాజరు కాకపోవడం వల్ల అజెండాపై చర్చించ లేదని, ఎటువంటి తీర్మానాలు చేయలేదన్నారు. ఇలాఉంటే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సమావేశానికి హాజరైన ఐఏఎస్‌లు తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి ఐఏఎస్ అధికారులు జవహర్ రెడ్డి, జేఎస్వీ ప్రసాద్, ప్రవీణ్ కుమార్, ప్రసన్న వెంకటేష్, కరికాల వలవన్, ఉషా కుమారి, సునీత శ్యామ్యూల్ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు వారాల్లో వెలువడనున్న తరుణంలో ఐఏఏస్ అధికారుల సంఘం సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నికోనుండటం విశేషం.