రాష్ట్రీయం

నమ్మకం పోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 15: దేశవ్యాప్తంగా ఏకపక్ష విధానాలతో ఎన్నికల సంఘం ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఈవీఎంలపై నమ్మకం లేదని రాజకీయ పార్టీలు ఘోషిస్తున్నా ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. వీవీప్యాట్ రసీదులు 50 శాతం లెక్కించేందుకు వారం రోజుల వ్యవధి పడుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం అందించిందని లెక్కింపుపై అభ్యంతరాలెందుకని నిలదీశారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక సమావేశ మందిరంలో విలేఖర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేపర్ బ్యాలెట్‌కు ఉన్న సౌలభ్యాన్ని పరిశీలించకుండా ఈవీఎంల విషయంలో సీఈసీ డ్రామాలాడుతోందని విమర్శించారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల కోసం రూ 9 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. యంత్రాల నిర్వహణ, మరమ్మతులకు అనుభవజ్ఞలు లేరని తెలిపారు. తెలంగాణలో పాతిక లక్షల ఓట్లను తొలగించి ఒక్క సారీతో సరిపెట్టారని ఆక్షేపించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చాం.. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. ఎన్నికల విధానంపై ప్రజలకు స్పష్టంగా తెలియాలన్నారు. ఈవీఎంల పనితీరు, ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై అనేక అంశాలను వివరించామని, పేపర్ బ్యాలెట్‌కు వెళ్లటం వెంటనే సాధ్యం కాదు కనుక వీవీ ప్యాట్ రశీదులను పూర్తిగా లెక్కించాలని డిమాండ్ చేశారు. 2009 నుండి తమ పార్టీ ఈవీఎంల విషయమై పోరాడుతోందని గుర్తు చేశారు. అసలు ఎన్నికల సంఘం పారదర్శకతకు ఎందుకు అంగీకరించటం లేదని ప్రశ్నించారు. వీవీప్యాట్ల లెక్కింపుపై మీనమేషాలెందుకన్నారు. పోలింగ్ రోజున రాష్ట్రంలో అక్రమాలు జరుగుతుంటే ఈసీ చోద్యం చూడటంలోని ఆంతర్యమేమిటన్నారు. అధికారులను ఆగమేఘాలపై బదిలీచేసి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ధ్వజమెత్తారు. పోలింగ్ రోజున పరిస్థితిని గమనించి తాము వీడియో రిలీజ్ చేశామని అది చూసిన తరువాతే ప్రజలు పెద్దఎత్తున తిరిగి ఓటింగ్‌కు తరలి వచ్చారన్నారు. ఎక్కడా సజావుగా ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవన్నారు. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగటం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలపై ముఖ్యమంత్రి వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈవీఎంలను ఎప్పటికప్పుడు సమీక్షించి పర్యవేక్షించే వ్యవస్థ మన దేశంలో లేదన్నారు. అన్నీ సవ్యంగా ఉన్నాయని తప్పుడు లెక్కలు రాసుకోవటం దురుదృష్టమన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాకే వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. నోట్ల రద్దు ద్వారా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశారన్నారు. గతంలో కంటే విరుద్ధంగా ఏపీలో ముందుగా ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారంటే ఎన్నికల సంఘం నుంచి సమాధానం లేదన్నారు. నమో టీవీ విషయంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. వీటిపై మాట్లాడుతుంటే ఓడిపోతున్నారనే తప్పుడు సంకేతాలు పంపుతున్నారని, ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో వేసిన ప్రతి ఓటు తెలుగుదేశానిదే అన్నారు. ఎన్నికల సంఘం బాగా పనిచేసిందని ఓ నేత అభినందించటం దౌర్భాగ్యమన్నారు. మోసాలకు అవకాశాలు లేకుండా ఈవీఎంలు, ఈసీ పనితీరుపై పోరాడుతామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘంపై తమకెలాంటి కోపం లేదని, ఏకపక్ష విధానాల వల్లే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈసీకి మద్దతిచ్చే రాజకీయ పార్టీలు కూడా సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్థిరత్వం కోల్పోయి ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారని ఖండించారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా గతంలో ఆయన రాసిన డెమోక్రసీ ఎట్ రిస్క్ పుస్తకాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అండర్ కరెంట్ చూడబోతున్నారని నూరు శాతం టీడీపీ గెలవనుందని ధీమా వ్యక్తంచేశారు.

చిత్రం...బీజేపీ ఎంపీ జీవీఎల్ గతంలో రాసిన పుస్తకాన్ని చూపిస్తున్న చంద్రబాబు నాయుడు