రాష్ట్రీయం

ఉద్దండులను లోక్‌సభకు పంపిన నంద్యాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, మార్చి 25: కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్‌సభ స్థానానికి దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు హ్యాట్రిక్ సాధించారు. అలాగే నీలం సంజీవరెడ్డి లోక్‌సభ స్పీకర్‌గా, రాష్టప్రతిగా ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో నంద్యాల నుంచి గెలిచారు. ఇక్కడి నుంచి గెలిచిన ఉద్దండులైన రాజకీయ నాయకులు ఢిల్లీలో నంద్యాల కీర్తి ప్రతిష్టలను దశదిశల వ్యాపింపచేశారు. ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నంద్యాల గురించి వాకబు చేయడం గమనార్హం. వేర్ ఈజ్ నంద్యాల అని అప్పటి సీనియర్ రాజకీయ నాయకులను అడిగి తెలుసుకున్నారు. అప్పట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలినా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు మెజారిటీ వచ్చింది. మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 41 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఒక్క నంద్యాలను కోల్పోయింది. ఇక్కడి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం సంజీవరెడ్డి ఘనవిజయం సాధించి లోక్‌సభ స్పీకరుగా పనిచేశారు. తదనంతరం ఆయన రాష్టప్రతిగా పనిచేసి నంద్యాల ప్రతిష్ట పెంచారు. అలాగే 1991లో ప్రధానమంత్రిగా పనిచేస్తున్న పీవీ నరసింహారావు నంద్యాల నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసి 5.50 లక్షల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించడంతో మరొక్కసారి నంద్యాల పేరు దేశంలో మారుమోగింది. నంద్యాల నుంచి పెండేకంటి వెంకటసుబ్బయ్య ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. ఆయన వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తదనంతరం ఆయన కేంద్ర మంత్రిగా, బీహార్, కర్నాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. ప్రధాని పీవీ నరసింహారావుపై తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి ఓటమి పాలైనా శభాష్ అనిపించుకున్న భూమా నాగిరెడ్డి తదనంతరం జరిగిన మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అలాగే ఎంపీ ఎస్పీవైరెడ్డి వరుస విజయాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు.
1952 నుంచి నంద్యాల లోక్‌సభ స్థానానికి 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు ఉప ఎన్నికలు ఉన్నాయి. 1977లో జనతా పార్టీ తరపున ఎన్నికైన నీలం సంజీవరెడ్డి రాష్టప్రతిగా ఎన్నిక కావడంతో తొలిసారి ఉప ఎన్నిక జరిగింది. అలాగే ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు ఎంపీగా ఎన్నిక కావడానికి 1991లో గంగుల ప్రతాపరెడ్డి లోక్‌సభకు రాజీనామా చేయడంతో రెండవ సారి నంద్యాలకు ఉప ఎన్నిక జరిగింది. మళ్లీ 1996లో నంద్యాల ఎంపీగా రెండవ సారి ఎన్నికైన పీవీ నరసింహారావు రాజీనామా చేయడంతో మరోసారి ఉప ఎన్నిక జరిగింది. 1952 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రాయసం శేషగిరిరావు గెలుపొందారు. 1957, 62, 67, 71 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పెండేకంటి వెంకటసుబ్బయ్య వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. 1977 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన నీలం సంజీవరెడ్డి ఘనవిజయం సాధించారు. 1977 ఉప ఎన్నిక, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెండేకంటి వెంకటసుబ్బయ్య గెలుపొందారు. 1984లో టీడీపీ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డి గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి బొజ్జా వెంకటరెడ్డి గెలిచారు. 1991లో కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డి విజయం సాధించారు.
1991లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పీవీ నరసింహారావు భారీ మెజారిటీతో గెలిచారు. 1996లో పీవీ మరోసారి గెలుపొందారు. 1996 ఉప ఎన్నిక, 98, 99 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్పీవైరెడ్డి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఎస్పీవైరెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2019 ఎన్నికల్లో నంద్యాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డి, వైకాపా అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి, జనసేన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ఎస్పీవైరెడ్డి పోటీ చేస్తున్నారు. నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 14,69,051 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 7,37,023 మంది, మహిళలు 7,45,869 మంది ఉన్నారు.
*
నంద్యాల లోక్‌సభ నుంచి ఎన్నికైనవారు
సం. పేరు పార్టీ
1952 రాయసం శేషగిరిరావు స్వతంత్ర అభ్యర్థి
1957 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్
1962 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్
1967 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్
1971 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్
1977 నీలం సంజీవరెడ్డి జనతాపార్టీ
1977 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్
1980 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్
1984 మద్దూరు సుబ్బారెడ్డి టీడీపీ
1989 బొజ్జా వెంకటరెడ్డి కాంగ్రెస్
1991 గంగుల ప్రతాపరెడ్డి కాంగ్రెస్
1991 పీవీ నరసింహారావు కాంగ్రెస్
1996 పీవీ నరసింహారావు కాంగ్రెస్
1996 భూమా నాగిరెడ్డి టీడీపీ
1998 భూమా నాగిరెడ్డి టీడీపీ
1999 భూమా నాగిరెడ్డి టీడీపీ
2004 ఎస్పీవైరెడ్డి కాంగ్రెస్
2009 ఎస్పీవైరెడ్డి కాంగ్రెస్
2014 ఎస్పీవైరెడ్డి వైకాపా
*

చిత్రాలు.. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, పెండేకంటి వెంకటసుబ్బయ్య