రాష్ట్రీయం

ఉగ్రదాడిపైనా రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 21: మన సైనికులపై పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి అమానుషమని మన ప్రధాని సహా దేశ ప్రజలంతా విశ్వసిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పాకిస్థాన్ ప్రమేయం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తరహాలో మాట్లాడుతున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మన ప్రధాని కంటే పాకిస్థాన్ ప్రధానిపైనే నమ్మకం ఉన్నట్టుందని ఎద్దేవాచేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని స్పిన్నింగ్ మిల్లు గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన బీజేపీ ఉభయ గోదావరి జిల్లాల శక్తికేంద్రాల సమ్మేళనంలో అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్వామాలో బలిదానమైన మన సైనికుల ఆత్మలకు, వారి కుటుంబాలకు హోరెత్తి విన్పించేలా భారత్ మాతాకీ జై అంటూ నినదించాలని ముందుగా తన ప్రసంగాన్ని ఆరంభించారు. సాంస్కృతిక రాజధాని, సంఘసంస్కర్తల పురిటిగడ్డ, చారిత్మ్రాక విశేషత కలిగిన పుణ్యభూమి రాజమహేంద్రవరం అంటూ శ్లాఘిస్తూ ఇటువంటి నేలపైకి రావడం గర్వంగా ఉందన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిరాతకంగా మన జవాన్లను ఇటీవల హతమార్చారన్నారు. గడచిన ఐదేళ్లలో ప్రధాని మోదీ మన సైనిక సంపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించారన్నారు. ప్రతీకార దాడికి తాను వెన్నంటి ఉంటానని మన సైనికులకు మోదీ ధైర్యాన్నిచ్చారన్నారు. కశ్మీర్ సమస్యకు కారణం కాంగ్రెస్ పార్టీకి చెందిన నెహ్రూ అని దుయ్యబట్టారు. మన జవాన్ల వీరమరణాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. మోదీ మన సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంటే, కాంగ్రెస్ వారి చావులను రాజకీయం చేస్తోందని ఆరోపించారు. మోదీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, సర్జికల్ స్ట్రైక్ సమయంలో భారత సైనికులను కించపర్చుతూ మాట్లాడ్డం ఎంత వరకు సమంజసమని అమిత్‌షా ప్రశ్నించారు. బీజేపీ దేశభక్తిని ప్రశ్నించే నైతికత ఏ పార్టీకి లేదని, బీజేపీ రక్తంలో దేశభక్తి కలిసివుందన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీజేపీకి పట్టంకట్టే శక్తి మీ చేతుల్లోనే ఉందన్నారు. ఏపీని వదిలేసి చంద్రబాబునాయుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ధర్నాలు చేయడం కంటే రాష్ట్రాన్ని టీడీపీ మోసం చేసినందుకు సొంత పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేయాలని హితవు పలికారు. చంద్రబాబునాయుడు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఏపీని వంచనకు గురిచేసిన కాంగ్రెస్‌తో ఏ విధంగా జతకడుతున్న చంద్రబాబుకు బీజేపీని ప్రశ్నించే నైతికత లేదన్నారు. చంద్రబాబునాయుడులో మోస ప్రవృత్తి ఎక్కువగావుందని, ఆయనకు ఎందులో అవార్డులు వచ్చినా, రాకపోయినా వెన్నుపోట్లు, మోసంచేయడంలో అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవాచేశారు. ఆయనలో మోస ప్రవృత్తివుందని, ఒకపుడు ఎన్టీఆర్‌ను మోసం చేసిన ఆయన ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయిని, ఇపుడు మోదీని మోసంచేశారన్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలని అమిత్‌షా దుయ్యబట్టారు. ఈ పార్టీలకు కుటుంబమే ముఖ్యమని, ఏపీకి మేలు చేయాలనే ఆలోచన లేదన్నారు. మోదీవల్లే అవినీతి రహిత పాలన సాగి ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో బీజేపీకి అవకాశమిస్తే ఏపీలో విశేష అభివృద్ధి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చంద్రబాబునాయుడు ప్రయత్నాలకు బీజేపీ కార్యకర్తలు వెరవొద్దని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు నేతృత్వంలో స్థానిక బీజేపీ నాయకులు అమిత్‌షాను పూల కిరీటంతో సత్కరించారు. కేంద్రంలో కొత్తగా మత్య్స మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయడంపై మత్య్సకార ప్రతినిధులు అమిత్‌షాను జాలరి ఆహార్యంతో సత్కరించారు. అమిత్‌షా ముందుగా అమర జవాన్లకు నివాళి అర్పించారు. అమిత్‌షా హిందీ ప్రసంగాన్ని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధ్రేశ్వరి తెలుగులోకి అనువదించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపీలు గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబు, జీవిఎల్ నరసింహరావు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ నేతలు సునీల్ ధియోదర్, మురళీధరన్, సత్యగోపీనాథ్ దాస్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, అయ్యాజీవేమా తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. చేప, జాలరి టోపీతో అమిత్‌షాను సత్కరిస్తున్న మత్స్యకార నేతలు