రాష్ట్రీయం

ఆకర్షణీయంగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: ప్రపంచం మెచ్చే స్థాయిలో కొత్త రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాల నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలో తొలిసారి ప్రభుత్వ విభాగాలు, పథకాలు, కార్యక్రమాలన్నింటినీ ఆన్‌లైన్ చేసి ఆధునిక పరిపాలనకు రూపాంతరం చెందామని, కొత్త రాజధానిలో ప్రభుత్వ సముదాయాలు దానికి తగినట్టుగా అత్యంత ఆధునికంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ఉదయం విజయవాడ తాజ్ గేట్‌వే హోటల్‌లో సిఆర్‌డిఎ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్కిటెక్చర్స్ జ్యూరీ పరిచయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని, సీడ్ క్యాపిటల్ నిర్మాణాలపై మార్గదర్శనం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, జాతీయస్థాయిలో పేరొందిన ఆర్కిటెక్చర్లు ఈ జ్యూరీలో ఉన్నారు.
జ్యూరీ సభ్యులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొత్త రాష్ట్రం ప్రత్యేకతలు వివరించారు. సుదీర్ఘ కోస్తాతీరం, పుష్కలమైన జల, ఖనిజ వనరులు, నిత్య ఆవిష్కరణలు, ఆలోచనలు సాగించే దృఢ సంకల్పం గల మానవ వనరులకు ఈ రాష్ట్రంలో లోటు లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అందుబాటులో, రాష్ట్రానికి నడిబొడ్డున, నది ఒడ్డున ఉండేలా కొత్త రాజధాని ఎంపిక జరిగిందని చెప్పారు. అమరావతి చారిత్రక ప్రాశస్థ్యాన్ని నిలబెట్టేలా, ఆంధ్రుల సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబించేలా ప్రభుత్వ భవనాల నిర్మాణం జరగాలన్నారు. సచివాలయం, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి, రాజ్‌భవన్ తదితర ప్రధాన ప్రభుత్వ భవనాలన్నీ ఐకానిక్ కట్టడాలుగా ఉండాలన్నారు. కేవలం ఈ భవనాలను సందర్శించేందుకే ప్రపంచ పర్యాటకులు వచ్చేలా రూపకల్పన చేయాలని కోరారు.
భవిష్యత్‌లో ఇది టూరిజం డెస్టినేషన్ సిటీగా ఉండి తీరాలన్నారు. బ్లూ, గ్రీన్, ఆక్వా సిటీగా అమరావతి ప్రభుత్వ భవనాలను డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచంలోని టాప్-5 నగరాలకు దీటుగా ఉండేలా అమరావతిని నిర్మించడానికి తగినట్టుగా సింగపూర్ దేశం మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని వివరించారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల రాజధాని నిర్మాణాల్లో ఏ నగరం కూడా ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మారలేకపోయాయని, అమరావతి నిర్మాణం ఆ లోటును తీర్చే నగరంగా విలసిల్లాలని సూచించారు.
తొలుత సిఆర్‌డిఎ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ ఆర్కిటెక్చర్స్ జ్యూరీని ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. సిఆర్‌డిఎ కార్యదర్శి అజయ్‌జైన్ రాజధాని నిర్మాణ ప్రణాళికను తెలిపారు. ఫిబ్రవరి నాటికి ఈ జ్యూరీ తమ డిజైన్లను సమర్పించవలసి ఉంటుందని చెప్పారు. సచివాలయంలో సిఎంవో సహా ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల ప్రభుత్వ ఉన్నతాధికారుల కార్యాలయాలు ఒకేచోట ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు చెప్పారు.

చిత్రం... విజయవాడలో చంద్రబాబుతో సమావేశమైన వరల్డ్ ఆర్కిటెక్చర్స్ జ్యూరీ సభ్యులు