శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (వాసుదాసు వ్యాఖ్యానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాలి బలపరాక్రమాలను
శ్రీరాముడికి తెలిపిన సుగ్రీవుడు
*
కిష్కింధకాండ
*
తన దుఃఖం ఉపశమించేట్లు చేస్తానని శ్రీరాముడు చెప్పిన మాటలకు సంతోషించిన సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. ‘‘అసమాన కీర్తి! నువ్వు కోపంతో బాణాలను వదిలితే. అవి లయకాలంలోని సూర్యకిరణాల లాగా, లోకాలన్నిటినీ అల్పకాలంలో కాల్చి బూడిద చేస్తాయి. అయినప్పటికీ, వాలి ధైర్యం, ఆయన అద్భుత పరాక్రమం గురించి చెప్తాను. ఏకాగ్రచిత్తంతో విను. విన్న తరువాత ఎలాంటి ఉపాయం చేయాలో ఆలోచించి అలాగే చేయి. వాడు పెద్ద-పెద్ద కొండలను పైకి ఎత్తి చిన్నపిల్లలు గోలీలు ఆడినట్లు ఆడుతాడు. ప్రతీరోజు సూర్యోదయం కాకముందే సంధ్య వార్చడానికి తూర్పు సముద్రంలో స్నానం చేసి, దక్షిణ సముద్రంలో ఆచమనం చేసి, పడమటి సముద్రంలో అర్ఘ్యం ఇచ్చి, మరో సముద్రంలో జపం చేసి, సూర్యోపస్థానం చేస్తాడు. ఇలా వాలి ప్రతీరోజు నాలుగు సముద్రాలలో సంధ్య వారుస్తాడు. ఇంత తిరిగి వచ్చినా కొంచెమైనా అలసట ఉండదు వాలికి. తన బలాన్ని ప్రదర్శించడానికి అడవిలోని పెద్ద పెద్ద చెట్లను చేతిదెబ్బతో విరగ్గొడతాడు. నిర్మల చిత్తా! అతడి బలం వర్ణించడం కష్టం.’’
దుందుభి వృత్తాంతాన్ని శ్రీరాముడికి చెప్పిన సుగ్రీవుడు
‘‘వెండికొండ శిఖరం లాంటి తేజస్సు గల దుందుభి అనే మహిష స్వరూపం గల ఒక రాక్షసుడు , వరబలంతో వేయి ఏనుగుల బలం కలవాడై, సముద్రుడిని చూసి, తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు. వీడికి చేటుకాలం సమీపించిందని తలచిన సముద్రుడు, అతడితో యుద్ధం చేయడానికి తాను సరిజోడీ కాదని, ఈశ్వరుడి మామ, కొండలరాజు, తపస్సు చేసే వారికి ఆశ్రయం ఇచ్చేవాడు. అనేకమైన గుహలతో ప్రకాశించే వాడైన హిమవంతుడు దానికి సరిపోతాడని చెప్పాడు. సముద్రుడిని భయపడ్డాడని తలచాడు దుందుభి. యుద్ధాసక్తుడైన దుందుభి హిమవంతుడి మీదకు పోయాడు. ఇలా పోయి, తన కొమ్ముల బలంతో పెద్ద పెద్ద బండలను నేల మీద పడవేయసాగాడు. అప్పుడు హిమవంతుడు తెల్లటి రూపంతో శిఖరం మీద నుండి వాడితో ఇలా అన్నాడు.’’
‘‘రాక్షస శ్రేష్ఠుడా! ననె్నందుకు బాధపెడుతున్నావు? నువ్వేమో ధర్మాత్ముడివే? నేను మునులకు ఆశ్రయమిచ్చే వాడిని. నువ్విలా చేస్తే వాళ్లకు హాని చేసినట్లే కదా?’’ హిమవంతుడి మాటలకు జవాబుగా దుందుభి, ‘‘నువ్వు భయపడితే, నాతో యుద్ధం చేయగలవాడి పేరు చెప్పు’’ అని అంటాడు. హిమవంతుడు ‘‘మహా ధైర్యవంతుడు, బలవంతుడు, ఇంద్రుడితో సమానమైన వాడు, చాలా బుద్ధిమంతుడు. వాలి అనే వానరుడు కిష్కింధలో ఉన్నాడు. అతడు నీతో సంతోషంగా ద్వంద్వ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయాలని నీకు కోరిక ఉంటే అతడి మీదకు యుద్ధానికి పో. అతడు వెంటనే నిన్ను చక్కగా చేస్తాడు. నముచికి యుద్ధ బిక్ష ఇంద్రుడు ఇచ్చినట్లు నీకు వాలి ఇస్తాడు’’ అని వాలి దగ్గరకు పొమ్మంటాడు దుందుభిని.
వాలి మీద యుద్ధానికి పోయిన దుందుభి
‘‘పాపాత్ముడైన దుందుభి రాక్షసుడు రోషంగా, గర్వంగా, కళ్లు మూసుకుపోగా, కాళ్ల తొక్కిడితో భూమి వణుకుతుంటే, కిష్కింధకు పోయి, మహిష స్వరూపం ధరించి, వాడి కొమ్ములతో ఏనుగులాగా చెట్లను, నగరం బైటున్న తలుపులను చీల్చాడు. విచ్చలవిడిగా ఆ రాక్షసుడు చెవులు దద్దరిల్లేట్లు నగరాలాగా మధ్య మధ్యన పెద్ద ధ్వని చేశాడు. అంతఃపురంలో ఉన్న వాలి ఈ చప్పుడు విని స్ర్తిలతో సహా బయటకు వచ్చి ఆ రాక్షసుడితో, అతడు దుందుభి అని తనకు తెలుసనీ, దనుజ శ్రేష్టుడైన అతడు ఎందుకు ఈ విధంగా బుద్ధి లేకుండా తన పట్టణం వాకిట్లో ధ్వని చేస్తున్నాడనీ, అతడికి ఊపిరితో జీవించి ఉండాలన్న ఆశ లేదా అనీ, ఉంటే మరెక్కడికైనా పొమ్మనీ అంటాడు.’’
జవాబుగా దుందుభి, ‘‘వాలీ, ఆడవారి ఎదురుగా పౌరుషపు బింకాలు పలకగానే వచ్చిన లాభం ఏంటి? నువ్వు పరాక్రమం కలవాడివైతే, యుద్ధానికి రా. నీ భుజబలం ఎలాంటిదో అప్పుడు తెలుస్తుంది. అలా కాకపోతే ఉదయం దాకా వేచి ఉంటాను. నీ ఇష్ట భార్యలతో అప్పటిదాకా సుఖపడు. నువ్వు ఇంటికి పో. పరలోకంలో నీకు సుఖం కలగడానికి చేయాల్సిన దానాలు చేయి. నీకు ప్రియమైన వారినందరినీ కౌగలించుకో. నీ స్ర్తిలతో భోగించు. పట్నమంతా ఒక్కసారి కడసారిగా కలియచూడు. నీతో సమానమైన వాడిని రాజ్యానికి పట్ట్భాషిక్తుడిని చేయి. ఆ తరువాత రా యుద్ధానికి. నీ పొగరు అణచివేస్తాను. మత్తు పదార్థాలు తినడం వల్ల, తాగడం వల్ల, శరీరం తెలియని వాడిని, ప్రమాదంలో ఉన్న వాడిని, నిద్రించే వాడిని, ఆయుధాలు లేనివాడిని, నీలాగా కామంతో వొళ్లు తెలియని వాడిని చంపితే భ్రూణహత్యా దోషం వస్తుంది’’ అంటాడు.
‘‘దుందుభి చెప్పిన మాటలు విన్న వాలి, చిరునవ్వు నవ్వి, తన భార్య తారను, ఇతర స్ర్తిలను ఇళ్లకు పొమ్మని, రాక్షసుడిని చూసి, ‘‘అసుర శ్రేష్ఠుడా! నువ్వు పిరికివాడివి కాకపోతే నన్ను మట్టుడిగా అనుకోవద్దు. నేను తాగింది వీరపాణం అనుకో. చూడు.. కాచుకో’’ అని చెప్పి, తన తండ్రి ఇచ్చిన బంగారు దండను మెడలో ధరించి త్వరగా పోయి రాక్షసుడైన దుందుభిని తాకాడు. ఇలా తాకి, వాడి మీద పడి గట్టిగా అదిమి, పౌరుషంగా వాడి కొమ్ములు పట్టుకుని రివ్వు రివ్వున వాడిని తిప్పి తిప్పి, వాడు బలహీనుడై పోగా, నేల మీద కొట్టాడు. నేల మీద పడ్డ వాడు చెవుల నుండి నెత్తురు కారుతుంటే, ధీరుడై లేచాడు. మోకాళ్లతో, మోచేతులతో, చెట్లతో పెద్ద రాళ్లతో వాలి మహిషాసురుడిని బలంగా కొట్టినా దుందుభి భయపడకుండా వాలిని ఎదుర్కొన్నాడు. ఒకరినొకరు గెలవాలని యుద్ధం చేశారు. క్రమక్రమంగా, అంతకంతకు వాలి బలం పెరిగింది. రామచంద్రా! దుందుభి బలం తగ్గింది. దీనికి కారణం వాలి ధరించిన బంగారు దండ, అది శత్రువు దేహాన్ని తాకినప్పుడట్లా వాడి బలం లాగి వాలి దేహంలో ప్రవేశపెడుతుంది. అదే దండలోని మంత్ర బలం.’’
-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12