AADIVAVRAM - Others

లోపలి అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీముఖి తన తండ్రితో తమ తోటకి వెళ్లింది. తండ్రి మోటర్ ఆన్ చేసి మామిడి, జామచెట్లకి నీళ్లు పెడుతూంటే, శ్రీముఖి తలెత్తి జామచెట్లని చూస్తూ మంచి పండు కోసం వెదకసాగింది. కొందరికి పచ్చి జామకాయలంటే ఇష్టం. కానీ శ్రీముఖికి మాత్రం పసుపుపచ్చ రంగులకో తిరిగి పండిన జామపళ్ళే ఇష్టం. ఓ చెట్టుకి దోరగా పండిన పళ్ల మధ్య బాగా పండిన, అరచేతిలో పట్టేంత పెద్ద పండు శ్రీముఖి కంటపడింది.
తండ్రి పని అయ్యాక ఆ పండుని చూపించి కోసివ్వమని కోరింది. ఆయన లాఘవంగా చెట్టెక్కి దాన్ని, మరికొన్ని దోర పండ్లని కోసి సంచీలో వేసుకుని దిగాడు. ఇద్దరూ ఆయన స్కూటర్ మీద ఇంటికి చేరుకున్నారు. తల్లి ఆ జామపండుని శుభ్రంగా కడిగి, కత్తి పీటతో రెండు చెక్కలు చేసి వెంటనే చెప్పింది.
‘అయ్యో! దీనికి పురుగు పట్టింది!’
కదలుతున్న ఆ పురుగుని శ్రీముఖికి చూపించింది.
‘అందుకే దోర పళ్ళు తినాలి. బయటికి చక్కగా కనిపించినా బాగా పండిన పళ్లలోలా దోర పళ్లలో పురుగులు ఉండవు’
‘్ఛ! బయటికి చూడడానికి పండి ఎంతో బావుంది.’ శ్రీముఖి విచారంగా చెప్పింది.
‘కానీ లోపల ఉన్నదే ముఖ్యం కదా?’ తండ్రి సూచించాడు.
‘నిజమే’ శ్రీముఖి ఒప్పుకుంది.
‘ఇది మనుషులకి కూడా వర్తిస్తుంది’ కొద్దిక్షణాలు ఆగి ఆయన చెప్పారు.
‘అంటే?’ శ్రీముఖి ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది.
‘మనం ఇతరులకి శుభ్రంగా, ఎంతో అందంగా కనపడచ్చు. మనం మంచివాళ్లలా నటించచ్చు కూడా. కానీ పరమాత్మకి మన లోపల మనసులో, హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో తెరిచి చూడకుండానే తెలుస్తుంది. మన భావనలు, ఆలోచనలు ఆయనకి కొట్టిన పిండే. బయటకే కాక మనం లోపల కూడా అందంగా ఉండటం మంచిది’ అన్నది తల్లి.

ఉపకారికి ఉపకారము
-కనె్నగంటి అనసూయ

అనగనగా కోసల రాజ్యంలో రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో కోనయ్య అనే చిన్న సన్నకారు రైతు ఉండేవాడు. అతను తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయంతోపాటుగా కొన్ని గొర్రెలను కూడా మేపుకుంటూ కుటుంబాన్ని పోషించేకునేవాడు.
అయితే కోనయ్య పొలం ఊరి శివార్లలో ఉండటంతో అక్కడికి అడవి దగ్గరగా ఉండేదేమో... అప్పుడప్పుడూ అడవిలోని క్రూర జంతువులు కోనయ్య పొలంలోకి జొరబడి గొర్రెలను ఎత్తుకుపోతూ ఉండేవి. అందుకని చాలా జాగ్రత్తగా గొర్రెలను కాపలా కాస్తూ ఉండేవాడు.
కోనయ్య ఎంత జాగ్రత్తగా గొర్రెలను కాపాడినప్పటికీ ఒకరోజు కోనయ్య పొలంగట్ల మీద గడ్డి మేస్తున్న గొర్రెలలో ఒక గొర్రెపిల్ల దారితప్పి అడవిలోకి వెళ్లిపోయింది. అది గమనించని కోనయ్య అప్పటికే చీకటి పడటంతో తన గొర్రెలను తోలుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఇంటికి వెళ్లాక గొర్రెపిల్ల తప్పిపోయిన విషయం గ్రహించినా, చీకటి పడటంతో ఆ సమయంలో వెళితే తన ప్రాణాలకే ముప్పని ఆలోచించి చేసేదేం లేక తెల్లారేక చూద్దాం లెమ్మని ఊరుకున్నాడు.
ఆ రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు.
అయితే దారి తప్పిన గొర్రెకు కొంతసేపటికే తను దారి తప్పినట్టు అర్థమైపోయి భయంతో ఏడుస్తూ ఎవరికీ కనపడకుండా పొదల్లో దూరి దాక్కుంది.
ఆ మర్నాడు ఉదయం ఆహారం కోసం అటుగా వచ్చిన బుల్లి ఏనుగు పిల్లలు గొర్రెను చూశాయి. ఏనుగు పిల్లలను చూసి మరింతగా వణికిపోయింది గొర్రెపిల్ల.
గొర్రెపిల్ల వణికిపోవటం చూసి ఆ రెండు ఏనుగు పిల్లల్లో ఒకదానికి దాని మీద జాలి కలిగింది. ఆ జాలితోనే దానిని ఎలాగైనా రక్షించాలనుకుని అదే మాటను రెండో ఏనుగు పిల్లతో చెప్పింది.
రెండో ఏనుగు పిల్ల అందుకు ఒప్పుకోలేదు సరిగదా...
‘దానిని రక్షించే పనిలో నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.. బాగా ఆలోచించుకో’ అంది.
అయినా మొదటి ఏనుగు పిల్ల పట్టు వదల్లేదు. గొర్రెపిల్లను రక్షించాలనే గట్టిగా అనుకుని... ‘తన వాళ్లందరికీ దూరమై భయంతో వణికిపోతున్న ఈ గొర్రెపిల్లని చూస్తే జాలేస్తోంది. నేను దానికి సహాయం చెయ్యాలనుకున్నాను. కానీ నీ సలహాతో నేను వెనక్కి తగ్గితే దానిని ఏ పులో, సింహమో చంపేసి తినెయ్యటం ఖాయం. అప్పుడు నాకు మరింత బాధ కలుగుతుంది. మనకేదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆపదలో వున్నవాళ్లని ఆదుకోకుండా ఉంటామా? మనలాగే ఆ గొర్రె కూడా ఈ భూమి మీద బ్రతకానికే పుట్టింది. మన ప్రాణాలు దక్కించుకోవటానికి దాని ప్రాణాలను అలా వదిలేస్తామా?... నాకు అలా ఇష్టం లేదు. దానికి నేను సహాయం చేసి తీరతాను’ అంటూ గొర్రె వైపు బయలుదేరింది.
అయితే ఈ మాటలన్నీ అక్కడికి దూరంలో ఉన్న తల్లి ఏనుగు విని ‘శభాష్ బిడ్డా.. నువ్వన్నది నిజము. ఈ గొర్రె.. మన అడవి పక్కనున్న పేదరైతు గొర్రెల మందలోనిది. సరిగ్గా నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు ఒకసారి చెరకు తినాలనిపించి పేద రైతు చెరకు తోటలోకి వెళ్లి గుంటలో పడిపోయాను. ‘నా చెరకు తినటానికి వచ్చి ఇక్కడ పడిపోయింది. దీనిని నేనెందుకు రక్షించాలి’ అని అనుకోకుండా ఆ పేద రైతు నన్ను రక్షించాడు. అప్పుడు అతనలా నన్ను రక్షించకుండా ఉండి ఉంటే మనమెవ్వరం ఉండేవాళ్లం కాము. అప్పుడు నేను అతని చేలోని చెరకు తినేసి అతనికి అపకారము చేయ తలపెట్టాను. అయినా నన్ను రక్షించి నాకు రైతు ఉపకారము చేశాడు. ఇప్పుడు ఆ పేద రైతుకి మనం ఉపకారము చేద్దాము’ అంది.
అందుకు సరేనన్నాయి పిల్ల ఏనుగులు రెండూ.
అప్పుడు తల్లి ఏనుగు మెల్లగా గొర్రెపిల్ల దగ్గరకు వెళ్లి దానికి ధైర్యం చెప్పి మూడూ కలిసి గొర్రెపిల్లను వెంటపెట్టుకుని తీసుకెళ్లి అతని చేలో వదిలేశాయి. సరిగ్గా అప్పుడే గొర్రెల్ని తోలుకుని ఆత్రుతగా పొలానికి వస్తున్న రైతు ఇది చూసి ఎంతో సంతోషపడిపోయాడు. అప్పుడు నేను రక్షించిన ఏనుగు ఇప్పుడు తనకిలా సహాయం చేసిందని గ్రహించి దాని దగ్గరకొచ్చి ప్రేమగా దాని తొండం మీద చెయ్యేసి నిమిరాడు.
ఒక మంచి పని చేసామన్న సంతోషంతో ఏనుగులన్నీ ఆనందంతో వెనుదిరిగాయి.
గొర్రెపిల్లను దగ్గరకు తీసుకున్న తల్లిగొర్రె కృతజ్ఞతగా చూసింది ఏనుగుల వైపు.

గెలీలియో
-పి.వి.రమణకుమార్
గెలీలియో గెలిలే 1564వ సం. ఫిబ్రవరి 18న ఇటలీలో జన్మించాడు. తండ్రి విన్సన్ జియో మత బోధకుడిగా ఉండేవాడు. అంతకు యాభై సంవత్సరాల క్రితమే కోపర్నికస్ ‘్భమి కూడా ఒక గ్రహమే. తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతోంది’ అని ప్రకటించినందుకు అతన్ని వెలివేశారు. ప్రజలు వెలివేసినా కొంతమంది దాని గురించి తీవ్రంగా ఆలోచించారు. వారిలో ముఖ్యుడు గెలీలియో.
గెలీలియో ఖగోళ, భౌతిక, గణిత శాస్త్రాలు అభ్యసించి ఆయా శాస్త్రాలకు సంబంధించిన పెద్దలను కలిసి, తన అనుమానాలను నివృత్తి చేసుకుంటూ పీసా యూనివర్సిటీలో గణితశాస్త్ర బోధకుడిగా ఉద్యోగం చేస్తూనే ఖగోళ, భౌతిక శాస్త్ర సిద్ధాంతాల విషయంలో అంతవరకూ ఉన్న నమ్మకాలను గెలీలియో వమ్ము చేశాడు. ఆయన చేసిన అపరిమిత ప్రయోగాల ఫలితమే ‘టెలిస్కోప్’. గెలీలియో కనిపెట్టిన టెలిస్కోప్ నక్షత్రాలను, చంద్రమండలాన్ని కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేట్లు చేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవమానించిన వారే గెలీలియోను గొప్పగా ప్రశంసించారు.
అయితే టెలిస్కోప్ ద్వారా కొన్ని నిజాలను శాస్ర్తియ పద్ధతిలో గెలీలియో ప్రతిపాదించాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుందన్న కోపర్నికస్ సిద్ధాంతం అక్షర సత్యమని నిరూపించాడు. ఈ సిద్ధాంతం అప్పటి చర్చి అధికారులకు కోపం తెప్పించింది. వారి మాటలే శిరోధార్యంగా భావించే ప్రజలు, చక్రవర్తి గెలీలియోకు పిచ్చెక్కిందని భావించారు. చివరికి వారు అతన్ని కోర్టుకు లాగారు. కోర్టులో ఓటమి అంగీకరించినా గెలీలియో తన సిద్ధాంతాన్ని విడనాడలేదు.
జరిగిన అవమానానికి బాధపడుతూ ఆరోగ్యం పాడైపోయిన గెలీలియోకు చెవుడు, గుడ్డితనం కూడా వచ్చాయి. చివరికి తన 78వ ఏట అంటే 1642లో ఆ మహానుభావుడు మరణించాడు. ఆయన మరణానంతరం శాస్త్ర ప్రపంచంలో గెలీలియో సృష్టించిన టెలిస్కోప్ ఎన్నో ఆవిష్కరణలకు దిక్సూచిగా మారి ఆయనను చిరస్మరణీయుడిగా నిలిపింది.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి