క్రీడాభూమి

బీసీసీఐ ప్రయత్నాలు కోర్టు ధిక్కారమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: నిబంధనావళిలో భారీ మార్పులుచేర్పులు చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) చేస్తున్న ప్రయత్నాలు కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని లోధా కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర్‌నారాయణన్ హెచ్చరించాడు. క్రికెట్ ప్రక్షాళనకు ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు తెరపైకి వచ్చిన తర్వాత, వివిధ నాటకీయ పరిణామాల మధ్య కేసు సుప్రీం కోర్టుకు చేరిన విషయం తెలిసిందే. లోతుగా విచారణ జరిపిన సుప్రీం కోర్టు, బీసీసీఐలో అవినీతికి అడ్డుకట్ట వేసి, పారదర్శకమైన పాలన కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించాల్సిందిగా లోధా కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా విచారణ జరిపిన తర్వాత, పలు సూచనలు, ప్రతిపాదనలతో నివేదికను అందచేసింది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీం కోర్టు, తు.చ తప్పకుండా అమలు చేయాలని బీసీసీఐని ఆదేశించింది. అంతేగాక, లోధా సిఫార్సులు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు వినోద్ రాయ్ నేతృత్వంలో పాలనాధికారుల బృందాన్ని (సీఓఏ)ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం పాలనాపరమైన అంశాలను సీఓఏ పర్యవేక్షిస్తున్నది. కాగా, బోర్డు అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎన్నిక కావడంతో, భారీ మార్పులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పశ్చిమ బెంగాల్‌పై పట్టుకోసం గంగూలీని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అతను చేయబోయే ప్రతిపాదనలను ఆమోదించే అవకాశాలు లేకపోలేదన్న వాదన కూడా ఉంది. ఈ తాజా పరిణామాల పట్ల లోధా కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర్‌నారాయణన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాంటి ప్రయత్నాలు క్రికెట్‌కు మంచివి కావని ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక, నిబంధనావళిని మార్చడం ద్వారా లోధా కమిటీ సిఫార్సులను, కనీసం కొన్నింటిని అమలు చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని స్పష్టం చేశాడు. బోర్డుకు కార్యదర్శిగా ఎన్నికైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది. తండ్రి నుంచి అతనికి పూర్తి మద్దతు ఉంటుందనేది వాస్తవం. ఒకవేళ అదే జరిగితే, బీసీసీఐ కొత్త నిబంధనావళితో, కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. గతంలో మాదిరిగానే ఎవరికీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేకుండా, ఏకపక్ష నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశాలను తన ఇంటర్వ్యూలో శంకర్‌నారాయణన్ ప్రస్తావించాడు. లోధా కమిటీ చేసిన సిఫార్సులకు, వాటిని అమలు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అవినీతిలో కూరుకుపోయిన భారత క్రికెట్‌ను ప్రక్షాళన చేయడానికి లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో తమకు అనుకూలమైన వాటిని మాత్రమే ఉంచి, మిగతా వాటి నుంచి తప్పించుకోవడానికి ఏకంగా బోర్డు నిబంధనావళినే మార్చేందుకు కొత్త కమిటీ ప్రయత్నించడం దారుణమని శంకర్‌నారాయణన్ వ్యాఖ్యానించాడు. 2015 జనవరి 22న సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ అదే ఏడాది జూలై 14న నివేదికను సమర్పించింది. అయితే, దానిని అమలు చేసేందుకు ఇష్టం లేని బీసీసీఐ ఎన్నో అభ్యంతరాలను తెరపైకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పలుమార్లు వివరణ ఇచ్చినప్పటికీ బీసీసీఐ పట్టించుకోవకపోవడం వల్లే సీఓఏను సుప్రీం కోర్టు నియమించిందని వివరించాడు. ఇప్పుడు లోధా కమిటీ సిఫార్సులను, సుప్రీం కోర్టు ఆదేశాలను, వాటి అమలుకు సీఓఏ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఏకంగా నిబంధనావళినే మార్చాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తున్నదని ఆయన అన్నాడు. అదే జరిగితే, సమస్య మళ్లీ మొదటికి వస్తుందని హెచ్చరించాడు. నిబంధనావళిలో భారీ మార్పుల పేరుతో లోధా సిఫార్సుల నుంచి తప్పించుకోవడానికి బీసీసీఐ ప్రయత్నిస్తే, భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నాడు. ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని బీసీసీఐ నూతన కార్యవర్గానికి హితవు పలికాడు.
*చిత్రం... గోపాల్ శంకర్‌నారాయణన్