క్రీడాభూమి

పరస్పర ప్రయోజనాలపై నేడు బీసీసీఐ చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 18: పలువురు మాజీ లేదా ప్రస్తుత క్రికెటర్లు వివిధ హోదాలను కలిగి ఉండడం ద్వారా పరస్పర ప్రయోజనాలు పొందుతున్నారన్న విమర్శలకు తెరదించేందుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సమాయత్తమవుతున్నది. సోమవారం జరిగే బోర్డు అనధికార సమావేశంలో పలువురు క్రికెటర్లు, ఇతర ప్రముఖులు ఈ విషయంపై తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. బోర్డు పాలనాధికారుల బృందం (సీఓఏ) నుంచి కనీసం ఒకరు ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం. వినోద్ రాయ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీఓఏలో డయానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రవి థోడ్గే సభ్యులు. బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో, బీసీసీఐ భారీ ప్రక్షాళనకు నడుం బిగించిన సుప్రీం కోర్టు, అందులో భాగంగానే సీఓఏను నియమించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోకుండా సీఓఏ జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇలావుంటే, పలువురు మాజీ క్రికెటర్లకు పరస్పర ప్రయోజనాలు చేకూరే హోదాలు ఉన్నాయని, కాబట్టి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వివిధ ఫిర్యాదుల్లో క్రికెట్ అభిమానులు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు పేర్కొన్నారు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చేరాడు. భారత-ఏ, జూనియర్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్‌కు పరస్పర ప్రయోజనాలు ఉన్నాయంటూ బీసీసీఐ ఎథిక్స్ కమిటీ నోటీసును జారీ చేసింది. ద్రవిడ్‌కు పరస్పర ప్రయోజనాలు కలిగే హోదాలు ఉన్నాయని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ గుప్తా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఈ నోటును పంపింది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్ గ్రూప్‌కు వైస్‌ప్రెసిడెంట్‌గా ద్రవిడ్ వ్యవహరిస్తున్నాడని సంజయ్ గుప్తా ఆరోపణ. పరస్పర ప్రయోజనాలను కలిగించే హోదాల్లో ఉన్నందున ద్రవిత్ భారత్-ఏ, జూనియర్ జట్లకు కోచ్‌గా ఎలా ఉంటాడన్నది అతని ప్రశ్న. కాగా, గుప్తా ఆరోపణల ఆధారంగా ద్రవిడ్‌పై బీసీసీఐ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. పరస్పర ప్రయోజనాల అంశంలో స్పష్టతనివ్వాలని అందులో ఆదేశించింది. ఎన్‌సీఏకు డైరెక్టర్‌గా ద్రవిడ్ కొనసాగడంలో ఎలాంటి అభ్యంతరం లేదని సీఓఏ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ హోదాలో కొనసాగడం వల్ల అతనికి పరస్పర ప్రయోజనాలు చేకూరే అంశాలేవీ కనిపించడం లేదని సీఓఏ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇలావుంటే, సోమవారం జరిగే బీసీసీఐ అనధికార సమావేశంలో మాజీ బ్యాట్స్‌మన్ దిలీప్ వెంగ్‌సర్కార్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్ తదితరులు పరస్పర ప్రయోజనాల అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్, ప్రస్తుతం ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్రవిడ్ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. వివాదాలకు దూరంగా ఉండాలనుకునే బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ సహజంగానే ఈ సమావేశానికి హాజరుకాడని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా సమావేశానికి రావడం లేదని తెలుస్తోంది. అయితే, అతను ఇది వరకే తన అభిప్రాయాలను బీసీసీఐకి లేఖ ద్వారా తెలియపరిచాడు.
కాగా, ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ద్రవిడ్ కొనసాగడంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోయినప్పటికీ, ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీఓఏ సభ్యుడు రవి థోడ్గే వ్యాఖ్యానించాడు. ఎథిక్స్ కమిటీ అధికారి డీకే జైన్ తుది నిర్ణయం తీసుకుంటారని వివరించాడు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో సభ్యులుగా ఉన్న సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, సచిన్ తెండూల్కర్ స్థానంలోనే కపిల్ దేవ్‌ను ఛీఫ్‌గా, శాంత రంగస్వామి, అంశుమాన్ గైక్వాడ్‌ను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీయే టీమిండియా చీఫ్ కోచ్‌గా రవి శాస్ర్తీని మరో రెండేళ్ల కాలానికి కొనసాగించాలన్న నిర్ణయం తీసుకొని, విమర్శలకు గురవుతున్నది. 2021 నాటి టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌తో రవి శాస్ర్తీ కాంట్రాక్టు ముగుస్తుంది.
కాగా, సోమవారం ప్రారంభం కానున్న బీసీసీఐ సమావేశం గురువారం వరకూ కొనసాగుతుంది. టీమిండియాకు సపోర్టింగ్ స్ట్ఫా నియామకంపై తుది నిర్ణయం ప్రకటిస్తారు. జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సపోర్టింగ్ స్ట్ఫా కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటర్వ్యూలు తీసుకుంటారు. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్. శ్రీ్ధర్ తమతమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగార్‌ను ఎంపిక చేయవచ్చని అంటున్నారు. మొత్తం మీద సోమవారం నాటి అనధికార సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పరస్పర ప్రయోజనాల అంశంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సీఓఏపై ఉంది. అందుకే, మిగతా విషయాలతో పోలిస్తే, బీసీసీఐ సమావేశంలో ఈ అంశమే కీలకంగా మారింది.