క్రీడాభూమి

పంత్ సమర్థుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రావిడెన్స్ (గయానా), ఆగస్టు 7: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సమర్థుడని, అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి రెండు టీ-20 ఇంటర్నేషనల్స్‌లోనూ షాట్ లెంగ్త్‌లలో పొరపాట్లు చేసిన పంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే, భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. 42 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, మరో 4 సిక్సర్లతో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని సమర్థంగా భర్తీ చేస్తాడని అంచనాలున్న తను ఆ స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చివరిదైన మూడో టీ-20లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (58), రోవ్‌మన్ పావెల్ (32) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 3 ఓవర్లు బౌల్ చేసి, కేవలం 4 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నవదీప్ సైనీ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లోకేష్ రాహుల్ (20), శిఖర్ ధావన్ (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరనప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి తను చక్కటి భాగస్వామ్యాన్ని అందించాడు. 3వ వికెట్‌కు వీరు 106 పరుగులు జోడించడంతో భారత్ విజయానికి చేరువైంది. 59 పరుగులు చేసిన కోహ్లీ ఔట్ కాగా, పంత్ నాటౌట్‌గా నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, భారత్ జట్టు ఈవిధంగా 3 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఇది నాలుగోసారి. 2016లో ఆస్ట్రేలియాను, 2017లో శ్రీలంకను, 2018లో వెస్టిండీస్‌ను, తాజాగా ఇదే జట్టును మరోసారి 3-0 తేడాతో భారత్ ఓడించడం విశేషం. వెస్టిండీస్‌పై టీ-20లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలుచుకున్న జట్ల జాబితాలో భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరింది. 2018-19లో టీమిండియా 6 మ్యాచ్‌లను వరుసగా సొంతం చేసుకుంది. పాకిస్తాన్ 2016-17 మధ్య కాలంలో వరుసగా 5 మ్యాచ్‌లలో విండీస్‌పై గెలిచింది. దక్షిణాఫ్రికా 2008-10, శ్రీలంక 2009-12, ఆస్ట్రేలియా 2010-12, పాకిస్తాన్ 2017-18 మధ్య కాలాల్లో తలా నాలుగేసి చొప్పున వెస్టిండీస్‌పై వరుస విజయాలను నమోదు చేశాయి. వెస్టిండీస్ టీ-20 ఫార్మాట్‌లో ఇది 58వ ఓటమి. ఈ ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఓడిన జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. శ్రీలంక, బంగ్లాదేశ్ చెరి 57 పర్యాయాలతో రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 56 పరాజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 54, పాకిస్తాన్ 52, జింబాబ్వే 50, ఇంగ్లాండ్ 50, దక్షిణాఫ్రికా 44 చొప్పున మ్యాచ్‌లను చేజార్చుకున్నాయి. దక్షిణాఫ్రికా 44 మ్యాచ్‌లలో ఓడింది. భారత్ అన్నింటికంటే తక్కువగా 44 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. విండీస్‌పై సాధించిన క్లీన్‌స్వీప్ తమ సమష్టి కృషి ఫలితమని కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. పంత్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపిస్తూనే, మిగతా ఆటగాళ్లంతా తమ వంతు పాత్రను పోషించారని అన్నాడు. అంతర్జాతీయ వేదికలపై పంత్ నిలకడగా రాణించాలంటే అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వకతప్పదని అన్నాడు. 4 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించిన యువ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌ను కూడా కోహ్లీ ప్రశంసించాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పోల్చదగ్గ ఫాస్ట్‌బౌలర్‌గా అతనిని అభివర్ణించాడు. బంతిని స్వింగ్ చేసే విధానం అద్భుతంగా ఉందని కొనియాడాడు. వెస్టిండీస్‌పై జరిగే వనే్డ, టెస్టు సిరీస్‌లలోనూ విజయాలు నమోదు చేస్తామని కోహ్లీ దీమా వ్యక్తం చేశాడు.