క్రీడాభూమి

లలిత్ మోదీకే రాజస్థాన్ క్రికెట్ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 16: వివాదాలతో చెట్టపట్టాలేసుకొని నడుస్తున్న రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సిఎ) అధ్యక్ష పగ్గాలు లలిత్ మోదీకే దక్కడం ఖాయమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌కు కమిషనర్‌గా వ్యవహరించి, ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఈవెంట్‌గా తీర్చిదిద్దిన లలిత్ మోదీని 2013లో ఆ పదవి నుంచి బిసిసిఐ సస్పెండ్ చేసింది. ఆర్థిక లావాదేవీల్లో భారీగా అవకతవకలు జరిగాయని పేర్కొంటూ అతనిపై విచారణకు ఆదేశించింది. అంతేగాక, కోర్టులో కేసును ఫైల్ చేసింది. అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఉద్దేశపూర్వకంగా తనపై నిందలు మోపుతున్నాడని ఆరోపిస్తూ లలిత్ మోదీ కౌంటర్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఆ కేసు రాజస్థాన్ కోర్టులో నడుస్తున్నది. ఇలావుంటే, ఆర్‌సిఎకు జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి లలిత్ మోదీ పోటీ చేశాడు. అతనిని అనర్హుడిగా ప్రకటించాలన్న బిసిసిఐ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల్లో నిలబడడానికి, ఎన్నిక కావడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని, ఒకవేళ నేరం రుజువైతే అతను తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని కోర్టు వివరించింది. కోర్టులో చుక్కెదురు కావడంతో, లలిత్ మోదీని ఏమీ చేయలేకపోయిన బిసిసిఐ ఇతరత్రా మార్గాల్లో అతనిపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకుంది. ఏకంగా ఆర్‌సిఎపైనే సస్పెన్షన్ వేటు వేసింది. కోర్టులో ఆర్‌సిఎ సస్పెన్షన్‌పై స్టే లభించడంతో, 15 అనుబంధ జిల్లా క్రికెట్ సంఘాలను మచ్చిక చేసుకున్న శ్రీనివాసన్ వారితో లలిత్ మోదీపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదింప చేసేందుకు వ్యూహ రచన చేశాడు. ఆతర్వాత జరిగిన బిసిసిఐ ఎన్నికల్లో శ్రీనివాసన్‌కు పోటీ చేసే అవకాశం రాకపోవడం, జగ్మోహన్ దాల్మియా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిపోయాయి. దాల్మియా హఠాన్మరణంతో బోర్డు అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యం కాగా, శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. శ్రీనికి చిరకాల ప్రత్యర్థిగా మనోహర్ ముద్రపడ్డాడు. దీనితో బోర్డులోనూ సమీకరణలు మారిపోయాయి. ఆ ప్రభావమే ఆర్‌సిఎపై చూపినట్టు స్పష్టమవుతోంది. లలిత్ మోదీపై గతంలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన యోచనను విరమించుకున్నట్టు ఆర్‌సిఎలో సభ్యత్వం ఉన్న 33 మంది ప్రకటించారు. దీనితో సంఘం పగ్గాలు అతని వద్దే ఉండడం ఖాయమైంది. తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఉపాధ్యక్షుడు అమీన్ పఠాన్ నుంచి లలిత్ మోడీ తిరిగి బాధ్యతలను స్వీకరిస్తాడు.