క్రీడాభూమి

ఐపిఎల్‌లో తాత్కాలిక జట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో తాత్కాలిక జట్లుగా పుణె, రాజ్‌కోట్ అడుగుపెట్టబోతున్నాయి. వచ్చే రెండేళ్లు ఈ రెండు జట్లు ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడతాయి. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ రెండేళ్లపాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనితో ఆరు జట్లతోనే ఐపిఎల్‌ను కొనసాగించాలా లేక నిషేధానికి గురైన ఫ్రాంచైజీల స్థానంలో తాత్కాలికంగా రెండు కొత్త జట్లను తీసుకోవాలా అన్న విషయంపై ఐపిఎల్ పాలక మండలి చర్చించింది. చివరికి కొత్త ఫ్రాంచైజీలకు రివర్స్ బిడ్స్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ బిడ్స్‌లో తక్కువ మొత్తాన్ని కోట్ చేసిన రెండు ఫ్రాంచైజీలను వచ్చే రెండేళ్లలో ఐపిఎల్ ఆడేందుకు అనుమతిస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించాడు. మంగళవారం ఐపిఎల్ గవర్నింగ్ బాడీ సమావేశం ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ కోల్‌కతాకు చెందిన వ్యాపార దిగ్గజం సంజీవ్ గోయెంకాకు చెందిన న్యూ రైజింగ్ సంస్థ పుణె ఫ్రాంచైజీని తీసుకుందని తెలిపాడు. అదే విధంగా రాజ్‌కోట్ ఫ్రాంచైజీని ఇంటెక్స్ మొబైల్స్ సంస్థ సొంతం చేసుకుందన్నాడు. ఈ రెండేళ్ల కాలంలో బిసిసిఐ నుంచి ఈ రెండు సంస్థలు ఒక్క రూపాయి కూడా తీసుకోవని స్పష్టం చేశాడు. పైగా, పుణె ఫ్రాంచైజీ ఏడాదికి పది కోట్ల రూపాయలు, రాజ్‌కోట్ ఫ్రాంచైజీ రెండేళ్ల కాలానికి 16 కోట్ల రూపాయలు బిసిసిఐకే ఇస్తాయని ఠాకూర్ వివరించాడు. బిడ్‌లో హర్ష్ గోయెంకా (ఆర్‌పిజి గ్రూప్), యాక్సిస్ క్లినికల్, చెట్టినాడ్ సిమెంట్ సంస్థ కూడా పాల్గొన్నట్టు చెప్పాడు. న్యూ రైజింగ్, ఇంటెక్స్ మొబైల్స్ కంటే ఈమూడు కంపెనీలు ఎక్కువ మొత్తాన్ని కోట్ చేశాయని తెలిపాడు.
15న ఆటగాళ్ల వేలం
సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో ఆడుతున్న క్రికెటర్లకు ఈనెల 15న వేలం జరుగుతుంది. రాజ్‌కోట్, పుణె ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొని, ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి. వేలంలో ఆటగాళ్లను తీసుకోవడానికి రెండు ఫ్రాంచైజీలు కనీసం 40 కోట్లు, అత్యధికంగా 66 కోట్లు ఖర్చు చేయవచ్చు. చెన్నై, రాజస్థాన్ ఆటగాళ్లను అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన, ఆడని గ్రూపులుగా విభజిస్తారు. డ్రాఫ్ట్ విధానంలో ఆటగాళ్లకు వేలం కొనసాగుతుంది.
రెండేళ్ల తర్వాత..
కొత్త ఫ్రాంచైజీలు రెండు సంవత్సరాలు మాత్రమే ఐపిఎల్‌లో ఆడతాయి. ఆతర్వాత సస్పెన్షన్‌ను ముగించుకొని చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలు మళ్లీ ఐపిఎల్‌లోకి అడుగుపెడతాయి.