క్రీడాభూమి

ఆసీస్ చారిత్రక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, నవంబర్ 29: క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను దక్కించుకున్న ఆస్ట్రేలియా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 138 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారి జరిగిన డే/నైట్ మ్యాచ్‌ని మూడు వికెట్ల తేడాతో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్ తర్వాత 187 పరుగుల లక్ష్యాన్ని 51 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ మ్యాచ్‌ని గెలవడం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. బౌలర్లకు అనుకూలించిన ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగియడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులు చేసిన కివీస్‌పై ఆస్ట్రేలియా 22 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన న్యూజిలాండ్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 115 పరుగులు చేసింది. ఈ ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు, ఆదివారం ఆటను కొనసాగించి, మరో పరుగు జోడించి వాల్టింగ్ (7) వికెట్‌ను కోల్పోయింది. క్రెగ్ 15 పరుగులకు హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో నెవిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్‌కాగా, కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న రిచర్డ్ సాంట్నర్ 45 పరుగులు చేసి, లియాన్ బౌలింగ్‌లో బంతిని అర్థం చేసుకోలేక, వికెట్‌కీపర్ పీటర్ నెవిల్ స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు. బ్రాస్‌వెల్ వీరోచిత పోరాటాన్ని కొనసాగించి, 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే టిమ్ సౌథీ (13), ట్రెంట్ బౌల్ట్ (5) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో కివీస్ రెండో ఇన్నింగ్స్ 62.5 ఓవర్లలో 208 పరుగుల వద్ద ముగిసింది. హాజెల్‌వుడ్ 70 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టగా, మిచెల్ మార్ష్‌కు మూడు వికెట్లు లభించాయి. న్యూజిలాండ్‌ను ఓడించి, మొట్టమొదటి డే/నైట్ టెస్టుతోపాటు సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి 187 పరుగులు సాధించాల్సి ఉండగా, 51 ఓవర్లలో ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ వార్నర్ 35, షాన్ మార్ష్ 49, మిచెల్ మార్ష్ 28, ఆడం వోగ్స్ 28 పరుగులు చేసి ఆసీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. మరో మూడు వికెట్లు చేతిలో ఉండగానే గెలుపొంది ఆసీస్‌కు సిరీస్ కూడా దక్కింది. కివీస్ ఆటగాడు బౌల్ట్ 60 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది.

సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 65.2 ఓవర్లలో 202 ఆలౌట్ (టామ్ లాథమ్ 50, మిచెల్ సాంట్నర్ 31, వాల్టింగ్ 29, మిచెల్ స్టార్క్ 3/24, జొస్ హాజెల్‌వుడ్ 3/66, పీటర్ సిడిల్ 2/54, నాథన్ లియాన్ 2/42).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 72.1 ఓవర్లలో 224 ఆలౌట్ (స్టీవెన్ స్మిత్ 53, నెవిల్ 66, నాథన్ లియాన్ 34, మిచెల్ స్టార్క్ 24 నాటౌట్, బ్రాస్‌వెల్ 3/18, బౌల్ట్ 2/41, క్రెగ్ 2/53).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 37 ఓవర్లలో 5 వికెట్లకు 116): 62.5 ఓవర్లలో ఆలౌట్ 208 (రాస్ టేలర్ 32, సాంట్నర్ 45, క్రెగ్ 27, హాజెల్‌వుడ్ 6/60, మిచెల్ మార్ష్ 3/59).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 51 ఓవర్లలో 7 వికెట్లకు 187 (డేవిడ్ వార్నర్ 35, షాన్ మార్ష్ 49, వోగ్స్ 28, మిచెల్ మార్ష్ 28, బౌల్ట్ 5/60).