మెయిన్ ఫీచర్

సొంతిల్లు.. అనుబంధాల హరివిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి జీవితంలో అనుబంధాలు అనిర్వచనీయమైన అనుభూతిని, ఆహ్లాదాన్ని, సుఖ సంతోషాలను నిరంతరం అందించే సాధనాలు. మనిషికి ప్రేమబంధం అనేది తన కుటుంబ సభ్యులతో, సాటి మనిషితో ఇంకా ప్రాణం వున్న జీవులు, పెంపుడు జంతువులతోనే కాదు.. ప్రాణం లేని తన ఇల్లు, వాకిలి, తను వాడే వస్తువులు, నిత్యం తను చూసే పరిసరాలు, స్థలాల మీద కూడా ఉంటుందని చెబితే అందులో ఆశ్చర్యపోవాల్సింది లేదు. ప్రతి ఒక్కరికీ జీవితంలో అది ఏదో విషయంలో, ఏదో సందర్భంలో అనుభవానికి వచ్చే సంగతే గనుక! ఇంకా చెప్పాలంటే ‘మనుషుల మీద కన్నా ఆస్తులపైనె ఇంకొంచెం ప్రేమ ఎక్కువ’ అని చెప్పినా అతిశయోక్తి లేదు. మనిషికి తను నివసించే ఇల్లు అంటే ఎంతటి ఇష్టమో, మరెంతటి ప్రేమనో చెప్పటానికి మాటలు సరిపోవు. అది అద్దె ఇల్లు అయినా స్వంత ఇల్లు అయినా ఆ అనుబంధం చెప్పలేనిది. కిరాయి ఇల్లు మారేవాళ్ళకే దాన్ని ఖాళీ చేసి వెళ్ళే ముందు బాధతో కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. అలాంటిది దగ్గరుండి ఇటుకా.. ఇటుకా పేర్చి ఇల్లు కట్టించుకుని.. అందులో కుటుంబ సభ్యులతో హాయగా ఉంటే ఆ గృహం నిజంగా స్వర్గసీమే.
మన ఇల్లు.. పూరి గుడిసె అయినా, పెంకుటిల్లు అయినా, బంగళా అయినా, సూపర్ డీలక్స్ లగ్జరియస్ ఫ్లాట్ అయినా అది ఆనందాల హరివిల్లు. అదంటే మనకు ఇష్టం.. మనకు ప్రాణం. ఏ ఊరయినా వెళ్లినపుడు కొన్ని రోజులు ఇంటిని చూడలేకపోతున్నందుకు ఎంత బాధో చెప్పలేం. కొన్నాళ్లు ఇల్లు వదిలిపెట్టి ఏ అమెరికాకో వెళ్లిపోతే- అపుడు తెలిసొస్తుంది. తిరుగు ప్రయాణమై ఇంటికి వస్తున్నపుడు ఏమనుకుంటామంటే- జీవితంలో అత్యంత ఆనందకరమైన ప్రయాణం ఏమిటంటే కొంతకాలం బయట ఉన్న తర్వాత మన ఇంటికి మనం తిరిగి రావటం అని!
‘ఇల్లు’ అంటే అది ఇటుకలతో, ఇసుక, సిమెంట్‌తో కట్టిన కట్టడం మాత్రమే కాదు.. అదొక అనుబంధాల హరివిల్లు. కొన్ని తరాల వాళ్ళు తాతమ్మ, బామ్మ, తల్లి, తండ్రి, పిల్లలూ అంతా కలివిడిగా ఒక దగ్గర కలిసి జీవించే పొదరిల్లు. ఆ ఇంట్లో ఎన్నో పండుగలు, పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు జరిగి వుంటాయి. ఒక్కోసారి కుటుంబ సభ్యులమధ్య మనస్పర్థలు, చిరాకులు, చికాకులు, సమస్యలు కూడా వచ్చి ఉంటాయి. అయినా అవి మాత్రం తాత్కాలికమే. మళ్లీ ఏదైనా అవసరం వచ్చినపుడు.. ఏ ఒక్కరికైనా ఏ చిన్న కష్టమో, నష్టమో వచ్చినపుడు మళ్లీ అందరూ ఒకటైపోతారు. ప్రేమానురాగాలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఒక్కోసారి మన ఇంటిమీద కూడా మనకు కోపం వస్తుంది. ఏ రిపేర్లో చేయాల్సి వచ్చినపుడు విసుగుతో ‘పాడుకొంప.. దీనికి చాకిరీ చేయలేక చస్తున్నాను’ అనుకుంటాం. ఆ కోపం ఎలాంటిదంటే పిల్లవాడు అల్లరి చేస్తుంటే అమ్మ కోపంతో వీపున ఒక చిన్న దెబ్బేసి.. మళ్లీ అంతలోనే ‘దెబ్బ తగిలిందా నాన్నా’ అని దగ్గరికి తీసుకోవడం లాంటిది. ఇంటి విషయంలోనూ అంతే. ఇపుడు మన ఇంటిని మనం విసుక్కున్నవాళ్ళమే మళ్లీ అంతలోనే ‘మన ఇంట్లో మనకు ఎంత ప్రశాంతత దొరుకుతుంది..!’ అనుకుంటాం. పూరి గుడిసెలో ఉండేవాడ్ని.. పెద్ద ప్యాలస్‌కి తీసుకెళ్లి ‘రాజభోగాలు అనుభవించ’మన్నా.. ‘ఇక్కడ నాకేం బాగోలేదు.. నా ఇల్లే నాకు బాగుంది’ అని తిరిగి తన గుడిసెకి పరుగెత్తుకటుని వస్తాడు. కన్నతల్లి దూరమైతే బెంగ పెట్టుకున్న పిల్లాడిలా.. తన ఇంటి నుంచి బయటకు వస్తే.. మళ్లీ తిరిగి వెళ్ళేదాకా ఎంతటి దిగులో! ఆ ఇల్లు పెచ్చులూడిపోయిన గోడలు, పెంకులూడిపోయిన పైకప్పు కలిగిన పాత ఇల్లు అయినా సరే..! మన ఇంటిమీద మనకు ఎంత మమకారం, ఎంతటి అనుబంధం అంటే... దాన్ని అమ్మేయటానికి, పడగొట్టి మరో కొత్త ఇల్లు కట్టుకోవడానికి ససేమిరా అంటూ మన మనసు అంగీకరించదు.
అందుకే- ముప్ఫయేళ్ళుగా (లేక యాభై ఏళ్ళుగా) ఈ ఇంట్లో ఉంటున్నాం... ఈ ఇంట్లోని గోడలు, తలుపులు, కిటికీలు, మూలమూలలు ఒక్క మాటలో చెప్పాలంటే అణువణువుతో మాకు అనుబంధం ఉంది. ఈ జీవితం అంతా ఇక ఈ ఇంట్లో గడిచిపోవాల్సిందే..!’ అని పట్టుబట్టి కూర్చుంటున్న పెద్దవాళ్ళను చూస్తున్నాం. ఈ విషయం మీద తల్లిదండ్రులకు, పిల్లలకు వాగ్వివాదాలు జరిగిన ఇతివృత్తంతో వచ్చిన ఎన్నో కథలను చదివాం.
మనం పుట్టి పెరిగిన, ఆడుకున్న, అనుబంధం పెంచుకున్న మన ఇంటిమీద మనకు ఎంతటి ఆత్మీయానుబంధాలు ఉన్నా జీవితంలో ఒక్కోసారి ఆ ఇల్లు వదిలిపెట్టి మరో ఇంటికి మారక తప్పదు. ఆడపిల్లలు పెళ్లి చేసుకుని పుట్టింటిని వదిలిపెట్టి అత్తగారింటికో, భర్త ఉద్యోగం చేసే ఊరిలోని ఇంటికో వెళ్ళక తప్పదు. వృద్ధులు కాళ్ళూ చేతులూ సహకరించని స్థితిలో స్వగ్రామంలోని స్వంత ఇల్లు వదిలిపెట్టి కొడుకుల ఇళ్ళకు తరలి వెళ్లక తప్పదు. అలాగే ఆర్థిక ఇబ్బందులవల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన డెవలప్‌మెంట్ సంస్కృతివల్లనో.. మరి ఇంకేవో కారణాలవల్ల ఒక్కోసారి ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న ఇంటిని వదిలిపెట్టి దాంతో అనుబంధాన్ని తెంపుకోక తప్పదు.
అలాంటప్పుడు స్మృతిపథంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయిన పాత రోజులు, ఆ ఇంట్లో గడిపిన ఆహ్లాదకరమైన క్షణాలు పదే పదే గుర్తుకు వచ్చి.. గిలిగింతలు పెడతాయి. ఆ ఇంటిమీద, ఆ పరిసరాల మీద, ఆ ఇంట్లోని చెట్టు, తీగ, గిలక బావి, తులసికోట, రుబ్బురోలు, వంటింట్లో దావిగుంట, చల్లకవ్వం వంటి చిన్నా పెద్దా వస్తువులు, గృహోపకరణాలు అన్నీ కళ్ళముందు మెదిలి మనసులో వాటి స్థానాన్ని మరింత పదిలం, శాశ్వతం చేస్తాయి. అదే మనకు, మన ఇల్లుకు వున్న గొప్ప అనుబంధం.

-కొఠారి వాణీచలపతిరావు