స్మృతి లయలు

సర్క్యులేషన్‌కి స్పీడు బ్రేకర్లు-90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు తెలిసినంత వరకు హింధీ, ఇంగ్లీషు సామెతల కన్నా తెలుగు సామెతలు చాలా పవర్‌ఫుల్. మన వాటిలో చరిత్ర, జాగ్రఫీ మరియు జీవన సత్యం కూడా తొణికిసలాడుతుంటాయి. ఉదాహరణకు ‘‘కూర మంచి కుండ చేదు’’ అన్న సామెత ఉంది. గొప్ప చేదు నిజాన్ని దైనందిన జీవితంలో ఆవిష్కరిస్తుంది. నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు ఎంత పూసుకు రాసుకు తిరిగినా నువ్వు చేదుకుండవే. నీ పనివాడితనం బాగుంటే అది కూర మంచి. నీ గొప్ప కాదు. అట్లాగ ‘ఎస్సార్’ గారు దేశంలో లేనప్పుడు మేము శ్రమించి లక్ష కాపీలు వేసి -మార్కెటుకి పంపగలిగేము. అదో ‘రెడ్ లెటర్ డే’ నాకు. గానీ రాధాకృష్ణగారు వస్తూనే విసుక్కున్నారు.
నిజమే. న్యూస్ ప్రింట్ కొరత దారుణంగా ఉంది. కానీ, బై హూక్ ఆర్ క్రూక్ ఇండెంట్ పెరిగితే వెయ్యాలి అంటాము మనం. కానీ, అందులో ఉన్న సాధక బాధకాలు యజమానులకే కదా తెలిసేది. ‘‘ముద్దొచ్చినప్పుడే సంకెక్కేమన్నారు’’ అన్న సామెత చందాన అప్పుడు పాఠకులకు మోజు ఉంది. ప్రకటనల స్పీడు పెరిగింది కానీ పేజీలకో, ప్రకటనలకే మధ్య దామాషా ఉండాలి అన్నారు. ఇరవై ఎనిమిది పేజీలకి లిమిట్ చేసేశారు. దినపత్రిక కాపీలు తగ్గించమని, లేదా బకాయిలు కట్టడంలో లేటు చేసినా వారపత్రిక ఇండెంట్‌లో కొన్ని కాపీలు కట్ చేయడం మొదలు పెట్టారు. ‘‘చందాలు పెరిగినా - కాపీలు అందటం లేదు’’ అన్న ఫిర్యాదులు ఎక్కువైనాయి.
ఆరా తీయగా, పోస్ట్ మ్యాన్‌లు చెప్పారు ‘‘సీరియల్స్ బాగుంటే, తీసి చదివి, ఓ రోజు అటు ఇటూగా ఇచ్చేస్తాము. ఇవ్వకుండా ఉండం. గానీ, అసలు మ్యాగజైన్ల కాపీలు ఆర్.ఎమ్.ఎస్ ఆఫీసులోనే ఉంచేస్తున్నారు. కావాలంటే పోయి చూడండి’’ అని.
నిజమే! అక్కడ గుట్టలు పడి ఉన్నాయి. బుక్‌పోస్టు మ్యాగజైన్లు. ఏజెంట్లు దినపత్రిక తీసుకోనిదే బాయ్‌ని పెట్టలేమనేవారు. దీనితో విడి అమ్మకాలు పెరిగాయి. కాకపోతే క్రిస్టిన్ కీలర్ లాంటి సీరియల్ 1963 లో వేసినప్పుడు యువజనులు చదివారు. కుర్రకారుకి ఆసక్తిపోకుండా ఉండాలి ‘యువప్రపంచం’ అంటూ ఆడవాళ్ల శీర్షికల్లాగే అభిప్రాయాలూ - అభిప్రాయాలకు కళాశాల వార్తలూ మొదలెట్టాము. కానీ, ఆంధ్రప్రభ ప్రింటింగు -కాగితం మెరుగైంది.
ఆంధ్రప్రభ వాళ్ల దినపత్రిక జోరందుకున్నది. దినపత్రికతో లింకు కనుక మా వీక్లీ వెనుకబడే ప్రమాదముంది. కానీ, సాంకేతికమైన ఇబ్బందులు కూడా మార్కెటు పోటీని మాకు గుర్తుచెయ్యడం మొదలు పెట్టాయ. ‘మదుపు’ కావల్సిన దగ్గర ‘పొదుపు’ ఉద్యమం మొదలెట్టారు ఎస్సార్ గారు.
‘కథల ఎంపిక’ అది జరిగాక ప్రచురణలో జాగు - రచయితలకు విసుగు, కోపం కూడా తెచ్చేది మాసపత్రికల ‘జోరు’ కూడా ఎక్కువైంది. అయితే మాదో పద్ధతి ఉంది. కథ ప్రచురణకి తిరస్కరించబడితే ఓ ప్రింటెడ్ తెల్ల కార్డులు మీద కథ పేరు రాసి సంతకం పెట్టి పోస్ట్ చేసే వాళ్లం. అదే కథ ఆమోదం పొందితే గులాబీ రంగు కార్డు మీద ఆ శుభవార్త అందచేసే వాళ్లం. మొదట్లో గులాబీరంగు కార్డు మీద రాధాకృష్ణ గారే సంతకం చేసేవారుట. కానీ అటు తరువాత తనకి అవతల పనులు ఎక్కువై నేనే సంతకం పెట్టేవాణ్ణి. బొమ్మల విషయంలో ఆర్టిస్టుకి నేను కథలు కొన్ని పేరాలు గుర్తుపెట్టి ఫలానా క్యారెక్టర్‌ని హైలెట్ చేయమంటూ సూచనలు ఇచ్చేవాణ్ణి. కాని యిది ‘బాసు’కు ఇష్టం లేకపోయేది. ముందే సైజులకు కూడా చూచాయగా తెలిపేవాణ్ణి.
మీకు చాదస్తం ఎక్కువ. బెడిసి కొడుతుందేమో అనేవాడు. నేను నవ్వేసేవాణ్ణి. ‘బాపు’ కథ చదివి లేదా చదివించుకొని- దానిమీద మనసు పెట్టి ‘్థమ్’ వర్క్‌వుట్ చేసినట్లు అందరూ చెయ్యరు. వాళ్లకి వేరే పొట్టతిప్పలు ఉంటాయి. పారితోషకం మీదనే వాళ్లు బ్రతుకలేరు గదా అనేవాణ్ణి. కొంతమంది ఆర్టిస్టులకు బద్ధకం ఎక్కువ ‘ఆడ’, ‘మగ’ సెక్స్ అప్పీలు చూసేసి వో బొమ్మ లాగించేరు. ‘కేతినీడి’ వాష్ డ్రాయింగ్ బొమ్మలు వేసే ట్రెడిషనల్ ఆర్టిస్టు. అతని లైను బావుండదు. కొత్తగా ఆర్టిస్టులను యువకులను ప్రోత్సహించాలని వాదించాను. ‘వ్యంగ్యంగా’ ఉన్న కథలకు మంచి టాలెంట్ ఎడ్యుకేషన్ ఉన్న కార్టూనిస్టులను ఉపయోగించాలన్న నా కోరిక నెరవేరింది. ఏ కొత్త మార్పులయినా పాఠకులు హర్షించేవారు. బొమ్మల కథలకి విశ్వాత్ముల నరసింహమూర్తి శ్రీ సత్యమూర్తి మొదలుగా ఎందరో బాబు దాకా పత్రిక వీక్లీ కారణంగా రాణించారు. రచయిత పేరు ప్రముఖంగా వెయ్యడంలో ప్రతి రచయిత వారపత్రికకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయేవారు. ఓ రకమైన సెంటిమెంట్ పెంపొందించాను. కానీ రాధాకృష్ణగారికి కొంతమంది అంటేనే ఇష్టం. నాది యూనివర్సల్ ప్రేమ. కొత్తవాడైతే చాలు వర్జిన్ ల్యాండ్ లాంటివాడు అంటూ ఎక్స్‌ప్లాయిట్ చేసేవాణ్ణి.
1963 అక్టోబరు మూడో వారంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి సతీమణి పత్రిక అభినేత్రి రామాయమ్మగారు తన ఎనబై ఐదో ఏట ఇహలోక యాత్ర చాలించారు.
ఆమె అంత్యక్రియలకు పత్రికలోని హెడ్స్ ఇతర ప్రముఖులు హాజరయ్యేము. నేను వీక్లీ హెడ్‌గా సత్రకాయ ఐనా ముందు వరుసలోకి తీసుకొని పోయి మా జియమ్ గారు వదిలిపెట్టారు. రామాయమ్మగారు అంటే మా అయ్యవారికి అత్తగారు. అమ్మ కామాక్షమ్మగారికి మాతృమూర్తి. వీళ్లు సుదీర్ఘమైన ఆంధ్రుల సాంస్కృతిక సంస్కరణలలో తెరవెనుక ఉండి నడిపించిన దివ్యమూర్తులు. అక్కడొక మీమాంస వచ్చింది. రామాయమ్మగారు ‘‘నేను నియోగులబిడ్డని లింగదారుల పద్ధతిలో గాక అంతిమ సంస్కారముగా అగ్ని సంస్కారమే చేయమని కోరారుట. అయితే దేశోద్ధారకుని సమాధి మందిరంలా ఉంది. అందులో పంతులుగారి ప్రక్కనే అమ్మగారికి సమాధి మందిరం ఎన్నడో నిర్మించి ఉంచారు. స్మారక మందిరంగా ఉండిపో యేలాగ అక్కడనే రామాయమ్మగారిని భూమాత ఒడిలో చేర్చాలని కుటుంబ సభ్యుల కోరిక. అయ్యవారు ఇరకాటంలో పడ్డారు. ఆయనకి అగ్ని సంస్కారము మీదనే మొగ్గు ఉంది అని తెలుసు చాలా మందికి.- సందర్భంకాదు కానీ ఒక మాట శ్రీ శంభూ ప్రసాద్ గారు స్వర్గస్థులైన నాక ఆయన అభీష్టము మేరకు అగ్ని సంస్కారమే చేశారు అని ప్రకాశరావుగారు చెప్పారు.
కుంచితపాదంగారు అటూ ఇటూ తిరుగుతూ అభిప్రాయ సేకరణ చేస్తూ నన్నుకూడా ‘ఎన్నయ్యా?’ ఎన్నసోల్రే అన్నారు. ‘‘బచ్చాగాణ్ణి అందరూ ‘గొప్ప’ వారి మధ్య నిలబడటమే గొప్ప - మెలికలు తిరిగాను. మాట అనలేదు.’’ చివరికి రామాయమ్మ గారిని కూడా దేశోద్ధారకుని సరసన స్మారక మందిరం లాంటి సమాధి మందిరంలో భూమాతకు అర్పించారు.
వారపత్రికలో ఆమెకు నివాళి ఎలా చెయ్యాలి. రాధాకృష్ణ గారి అమ్మొమ్మ ఆమె. అడిగాను. మీ అనుభవాలు చెప్పండి. రామాయమ్మగారి జీవితంలోని ఘట్టాలు చెప్పండి. మనుమలందరి మాటలూ, వేద్దామా? ఒక నివాళిగా.. అంటూ నిర్లిప్తంగా నవ్వాడాయన. ముందు ‘మనమాట’ రాస్తాను. అంటూ కూర్చున్నాడు ఇలా రాశాడు. ‘‘ఈ సంచిక చేస్తున్న సమయంలో ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు, కీర్తిశేషులు -దేశోద్ధారక శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి ధర్మపత్ని శ్రీమతి రామాయమ్మగారు పరమపదించారు.’’ అదే సంచిక ఏడ వ పేజీలో రామాయమ్మ గారి బొమ్మ నల్లబోర్డర్ తో వేశాము. ‘చాలు’ అన్నాడు బాస్. నేనేమీ మాట్లాడలేదు. ఆమె నేనెరుగను. చదువుకోలేదు.
సాధారణంగా స్వవిషయాలు కుటుంబంలో జరిగిన పెళ్లిళ్లు వగైరా సంబరాలను ప్లేడౌన్ చెయ్యడం అయ్యవారి దగ్గర్నుంచి అచ్చిన అలవాటేగానీ సెంటిమెంట్‌కు అతీతంగా ఉండడం ‘ఎస్సార్’ గారికే చెల్లింది.
అప్పుడు కింద దినపత్రికవారు ఏమి చేశారో నాకు పట్టలేదు. కాగా వారపత్రిలో అటు తర్వాత అందిన ఉత్తరాలు కూడా ఏమీ వేసినట్లు కూడా నాకు గుర్తులేదు. అదే అక్టోబర్‌లో బెజవాడలో ఇరవై రెండున పూర్ణచంద్రరావుగారి కుమారుడు రామారావు - పిన్నవయస్సులోనే లక్ష్మీటాకీస్ సెంటర్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో గాయపడి మరణించాడు. రాధాకృష్ణగారి దగ్గరకు వస్తూ- నన్ను చిరునవ్వుతో పలకరించే రామారావు మితభాషి అతని తమ్ముడు ‘బుజ్జి గారు’ అనే రాఘవేంద్రరావు అలా కాదు. కలుపుగోరుతనం ఉన్న మనిషి ‘అమిత భాషి’ అనే చెప్పుకోవాలి. రామారావు నడిపిన ‘తారక’పత్రికకి నేను కథ, శీర్షికా కూడా రాశాను. ఆయన నా తొలి మలుపు నవల మీద వాకాటి పాండురంగారావు రాసిన రివ్యూ కూడా వేశాడు. ఒక చక్కని సచిత్ర మాసపత్రికగా రూపుదిద్దుకుంటున్న తారక - చెరుకూరి రామారావు దుర్మరణంతో నిలిచిపోయింది. కానీ, అతని ఫొటో కూడా కనీసం, సంపాదించి వేయలేకపోయాము. రామారావు, అతని మిత్రుడూ - రుూ అపార వేగానికి బలియై కారు ప్రమాదంలో అర్ధరాత్రి మరణించడం -బెజవాడలో చాలా కాలం లక్ష్మీటాకీస్ సెంటర్ వేపు వెళ్తూ ఉంటే జ్ఞాపకం వచ్చేది.
వీక్లీలో ‘కథ కాని కథ’ రీడర్స్ డైజెస్ట్ లోని ‘లైఫ్ రుూజ్ లైక్ దట్’ అనే శీర్షిక లాగా రావాలని వాస్తవిక సన్నివేశాలకు సంక్షిప్తవ్యాఖ్యానంగా ఉండాలని అనుకున్నాం. దీనికి కూడా ఆదరణ అపారం గానీ వారం వారం ఎన్నో శీర్షికలకు వచ్చే ఎంట్రీలను నేనూ బాసూ ‘టాకిల్’ చెయ్యాలి. వందలాది ‘రిచెక్షన్’ కార్డుల మీదనే సంతకాలు చెయ్యడం ఒక పెద్దపని.
ఆ శీర్షిక ఆగింది. కానీ పాఠకులు గగ్గోలు పెట్టేశారు. తిరిగి మొదలు పెట్టేము. ఈలోగా ‘సామాన్యుని సరుగుడు’ శీర్షిక ఊపందుకుంది. అతి పెద్ద కొండ మీద సెలయేరు లాగా స్పీడుగా రూపుదిద్దుకున్న ఈ శీర్షిక తో ‘నక్షత్రకుని నసుగుడు’ ఆపేశాం.
బెజవాడ ఒక్కరోజు కోసం వెళ్లాను. అప్పట్లో పాలఫ్యాక్టరీ పాలు కార్డు తీసుకొని పోయి మన గినె్నలోనే పోయించుకునేవాళ్లం. రోజూ చిల్లర లేదంటూ ఒకటి నుంచి ఐదు పైసలు ఎగ్గొట్టేవాళ్లు. కానీ ఆ మొత్తం చాలా అయ్యేది. ఇదొక ప్రలోభం గా మారింది. దాని మీద ‘పైసా మనుషులు’ అంటూ స్పందించాను.
అది మొదలు -వీరాజీ సామన్యుని సణుగుడు భూమ్యాకాశాల మధ్య అన్ని అంశాలకు విస్తరించడం ప్రారంభించింది. నాకు బోలెడంత -వైర ప్రేమనీ, ప్రాచుర్యాన్నీ తెచ్చిన ఈ శీర్షిక జయదేవ్, శంకు, రాగతి పండరి లాంటి వాళ్లకు ప్రేరణ అయిపోయింది. ఓ సారి కానె్వంట్ చదువుల మీద ‘‘మమీ మమీ మాడ్రన్ బ్రెడ్’’ అంటూ సణిగితే మా రాధాకృష్ణ గారు నాలుగు వారాలాగి మళ్లీ దాన్ని రీపీట్ చెయ్యండి. అంటూ అడిగారు.
ఐతే నాకర్థమయింది. బెజవాడ డైలీ సన్నాహాలు మొదలయినాయి. నేను కూడా ఒక చెవి కోసిన మేకనే నన్ను బెజవాడ డైలీకి మారుస్తారు. వార్తలు, సంపాదకీయాలు - వ్యాఖ్యలు, వగైరాల మీదకి గాలి మళ్లించు కోవాలి కాబోలు అనుకుంటూ సినిమాల ధ్యాసని సి. ధర్మారావుకీ, వాసిరాజు ప్రకాశానికీ, మోహభ్ కుమార్ లకీ వదిలి పెడుతూ వచ్చాను.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 92900 99512 veeraji.columnist@gmail.com