స్మృతి లయలు

పాండీ బజార్ - పాన్‌గల్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుక్కపిల్ల దొరికింది’ - ఇది రావికొండలరావు గారి నాటిక అనుకుంటాను. ఆంధ్ర మహిళా సభ వారి హాలులో అనుకుంటాను. నాటికల పోటీలు జరిగాయి. అన్నట్లు జ్ఞాపకం. కానీ ఈ నాటకంలో ‘రాజబాబు’ నటన అమోఘం. బహుశ అదే రాజబాబుకి అద్భుతమయిన సినిమా ఛాన్స్‌కి, సినిమా కెరీర్‌కి ఆరంభం అయిందేమో. ‘పాన్‌గల్ పార్క్’కి ఎదురుగుండా ‘చిత్ర’ పత్రిక నరసింహారావుగారి కార్యాలయం, ప్రెస్సు. రామ్‌ప్రసాద్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ ఉన్నవాడంటే ఆ రోజుల్లో చక్రవర్తియే. తను నన్ను బండి మీద ఎక్కించుకొని మహదానందంగా ‘చిత్ర’ ఆఫీసు ముందు దిగేవాడు. సినిమా పత్రికలో అప్పట్లో మరో పత్రిక ‘గుండూసి’ అరవం - దాని తెలుగు వర్షన్ ‘గుండుసూది’. రెండు పాపులర్ కానీ పత్రిక ‘చిత్ర’ కూడా స్టాండర్డ్ పత్రికగా వాసికెక్కింది. చోటామోటా సినిమా ఆర్టిస్టులకు సినిమా పత్రికల కార్యాలయాలు దేవాలయాలేగా - ఆంధ్రపత్రిక ఆఫీసు చాలా దూరం. పైగా లోపలికి పోనివ్వరు ఒకంతట. అయినా నటులు రామకృష్ణ, హరినాథ్ లాంటి వాళ్లు - యువ డైరెక్టర్లు, ఫొటోగ్రాఫర్లు వాళ్లు వీక్లీకి వస్తూనే ఉండేవాళ్లు. బేబీ టాక్సీలో రావటమే గొప్ప. ‘చిత్ర’ నరసింహారావుకి ‘కారు’ కూడా వుంది. రాజబాబు అక్కడ తారసపడేవాడు. పార్క్ పానీగల్ చాలా ఫేమస్. నేను కనపడితే చాలు - రాజబాబు తన సహజమయిన స్టయిల్‌లో ఆ.. నేను చూడలేదు అనుకోవద్దు.. ఆ.. ఆ.. పట్టేశా’నంటూ వెనక నుంచి వచ్చి పట్టేసుకుని వెడల్పుగా నవ్వేసేవాడు.
‘కుక్క పిల్ల దొరకలేదా?’ అంటే ఒక ‘హాఫ్’ కొట్టిస్తే తప్ప చెప్పలేను సార్’ అంటూ హోటల్‌లోకి దారితీసేవాడు. సరిగా అరకప్పు ‘కాఫీ’ తీసుకొని మిగతా ‘సగం’ నైవేద్యం సమర్పయామి అంటూ ఇచ్చేసేవాడు.
‘బిల్లు అక్కడ పెట్టు’ అంటే దాన్ని ముద్దెట్టుకుని అక్కడ పెట్టేసేవాడు. కాకపోతే పద్మనాభం అప్పటికే సీనియర్, పాపులర్ - ‘కన్నప్ప’ కథ నాటకం ఒకటి తయారుచేసి - తన ట్రూప్‌తో ఆంధ్రదేశం మీదికి దాడిచేసే యత్నాలలో ఉండేవాడు. ఈ ‘కన్నప్ప’ నాటకంలో తాను పూజారి వేషం వేసేవాడు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ అంతా అతనిదే. దీన్ని జార్జిటౌన్‌లోనే తొలి ప్రదర్శన చాలా అట్టహాసంగా, బ్రహ్మాండంగా చేశారు. దానికి సావుకారుపేట, మొదట వాషర్‌మెన్‌పేట తెలుగులు, గుజరాతీ, మార్వాడీ, తమిళ బంగారు వర్తకులు అంతా తరలి వచ్చారు. మద్రాసు నగరం గొప్పదనం ఏమిటీ అంటే శివాజీగణేశన్, ఎమ్మార్ రాధా లాంటి వారి నాటకాలు వరుసగా సినిమాలలాగా థియేటర్‌లో ఆడేవి. అడ్వాన్స్ బుకింగ్ గిరాకీ ఉండేది. శివాజీ గణేశన్ జహంగీర్ నాటకానికి ప్రెస్ కాంప్లిమెంటరీలు లేవు. టిక్కెట్లు కొనుక్కుని పోయి చూసి తరించారు. అట్లాగా ఈ ‘్భక్తకన్నప్ప’ నాటకం జనాలను అద్భుతంగా ఆకర్షించింది. హాలు అంతా ఒక ‘జవేరీ బజారు’లో బంగారు ‘నగల సంత’లాగా - మహిళా లోకం అంతా నాటుకొట్టు చెట్టియార్‌లే కనుక - బంగారం మెడల నిండా - నడుముకి వడ్డాణాలతో సహా వచ్చారు. పునుగు, అత్తర్, జవ్వాజీ వాసనలతో హాలంతా గుబాళించింది.
నాటకం మధ్య సన్మానాలు వగైరాలతో తెల్లారుగట్ల ఐదు గంటలకి ముగిసింది. సెట్టింగులు కూడా అదే లెవెల్‌లో ఉన్నాయి.
నాటకం కాంగానే హాలు అంతా ఒక్కసారి లేచింది. ఆవలిస్తుంది కాబోలు అనుకున్నా. కానీ ఒకే కంఠంగా ‘కౌసల్యా.. రామ.. పూర్వాసంధ్యా ప్రవర్తతే’ అంటూ సుప్రభాతం అంతా పాడిగానీ ఒక్కరూ హాలు వదిలిపెట్టలేదు.
శనివారం రాత్రి మద్రాసు హోటల్స్‌లో ‘అన్నం’ వడ్డించే - భోజనం దొరికేది కాదు. ఇడ్లీ సాంబార్ వితౌట్ ఆనియన్ - పైగా అన్నీ మాంసం దుకాణాలు బంద్. ఈ ‘్భక్తసిరియాళ’ నాటకం తరువాత నేను తంబుచెట్టి స్ట్రీట్‌కి దగ్గరే కనుక నడుచుకుంటూ పోయాను. వీధి దీపాలు ఇప్పటిలాగా మెర్క్యురీ కాంతులతో ఉండేవి కావు. ‘సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది’ అన్నట్లు ‘చిత్ర’ నరసింహారావు కారులో స్టూడియో షూటింగ్, వార్తలు విశేషాలు ‘ఆంధ్రపత్రిక’ ఆదివారంలో రాసేవాణ్ణి. నిజంగా రాంప్రసాద్ అంటే అంత ఇష్టం అందరికీ. విశ్వప్రసాద్ నవలలు అలాగే వాళ్ల బ్రదర్ ‘డాక్టర్’ (కలంపేరు) నవలలు మంచి గిరాకీ ఉండేది. వీటితోపాటే రామ్‌ప్రసాద్ ‘చరిత్ర’ నవలలకీ గిరాకీ. ఒక్కసారి రామ్‌ప్రసాద్ నవలలో ఒక ఛాప్టర్ డిక్టేట్ చేయడం చూశాను. ‘చిత్ర’ ప్రెస్‌లోనే రాత్రి పదకొండు దాకా గడిచేది ఒక్కోసారి. అప్పుడు నన్ను ‘పారిస్’కి ఆఖరి బస్సు ‘పదకొండు -ఎ’ అనుకుంటాను. నెంబరు - సరిగ్గా ‘టి.నగర్’ బోర్డు ముందు ఎక్కించేవారు ఎవరో ఒకరు వచ్చి. ఒక్కసారి కృష్ణారావు ‘ప్రెస్ మేనేజర్’ అంటుండేవాళ్లం. అతను వచ్చి సెండాఫ్ ఇచ్చేవాడు. ఈ కృష్ణారావుని అంతా కలిసి ఆట పట్టిస్తే నేనేమో అతని వకాల్తా తీసుకుంటూ వుండేవాణ్ణి. అటు తరువాత యితనే ‘రమ్య-కృష్ణ’ తండ్రి అయినాడని తెలిసింది. అప్పట్లో ‘పాకెట్ బుక్స్’కి ఆంధ్రాలో హాట్‌హాట్ గిరాకీ. అవతల రాస్తూ, ఇవతల కంపోజ్ చేస్తూ - అదో రకం చౌకధర కాగితం - సైజు ఇంగ్లీషు పాకెట్ బుక్‌సైజులో అచ్చు అయి - నేరుగా బెజవాడ గాంధీనగరం సెకండ్‌హ్యాండ్ బుక్ స్టాల్స్‌కి చేరుకుని అమ్మడం.. అద్దెలకు ఇవ్వడం మొదలయ్యేది.
చిత్ర సినిమా పత్రిక ధర్మమా అని మద్రాసు సినీ రంగంలోని ‘ర్యాంక్ ఒన్..’ సినిమా జర్నలిస్టుల పరిచయం అయింది. అందరిలోకి భీష్మాచార్యులు వారు ఇంటూరి వెంకటేశ్వరరావుగారు. ఆనక కొలను బ్రహ్మానందరావు, గౌతమాచారి, కాగడా శర్మ, మాగాపు రామన్ మొదలయిన వాళ్లు ఘనులు - కాగడా శర్మ చిన్నప్పుడు రాజమండ్రి నుంచి ‘బాల’ మాసపత్రికకు కొక్కెరగడ్డ - కామేశ్వరశర్మ అంటూ నాలాగే రచనలు చేస్తుండేవాడు.
‘కాగడా’ పత్రిక పెట్టి - కాగడా శర్మ అయినాడు. అక్కినేనిగారికి కా.శర్మ అంటే కారం రాసుకున్నట్లు ఉండేది. ‘ప్రీవ్యూ’లకు వెళితే వీళ్లంతా సందడి చేసేవాళ్లు. గౌతమాచారి (అతని పత్రిక గౌతమి) పొడుగు. ఓ సినిమాకి గౌతమాచారి ముందు ఆ వెనుక వరుసలో కాగడా శర్మ కూర్చున్నారు. సీటు మారను పొమ్మన్నాడు ‘గౌ’. ఆ సినిమా రివ్యూ రాస్తూ ‘కా’ - ఇలా రాశాడు. నాకు ముందు గౌతమాచారి కూర్చున్నాడు. కొన్ని సీనులలో ‘తలలే’ కనపడ్డాయి అంటూ వ్యంగ్యంగా రాశాడు. ఎందుకనో ఈ రివ్యూ నాకు జ్ఞాపకం వుంది. మద్రాసు నుంచి విజయవాడ డైలీలోకి మారుతూనే దుర్గా కళామందిర్‌లో విడుదల (1965) అయిన ఎన్టీఆర్ చిత్రం ‘సత్యహరిశ్చంద్ర’ దుర్గాకళా మందిరంలో రిలీజ్ అయింది. పీకలు తెగిపోయే రష్ - మొదటి రోజు ఫస్ట్ షోకి. మదరాసు అలవాటు ప్రకారం నేను ‘లేటు’గా వెళ్లాను. దుర్గా కళామందిరం (ఇప్పుడు లేదు) అసలు నాటకాల హాలు - దానికి ఆడిటోరియం చుట్టూరా పైన సన్నని నడవ లాంటి బాల్కనీ దాని మీద రెండేసి కుర్చీలు తెర నెత్తి మీదకు వచ్చేదాక వుండేవి. నన్ను ఎలాగో తంటాలుపడి కుడిచివర కూర్చోబెట్టారు - అక్కడ నుంచి తెర మీదకి వాలుతున్నట్లే వుంది. సరే ‘రివ్యూ’ రాస్తూ కార్నర్ టాప్ సీటులోంచి చూపించారు. ‘నాకు ఏడు బై ఎనిమిదో వంతు తెరయే కనపడ్డాది’ అంటూ చమత్కారంగా రాశాను. ‘దుర్గా’ కళామందిరం ‘మా వాళ్లదే’ లీజుకి ఇచ్చారుగా. మరో మాట అనలేదు లెండి.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే - కాగడా శర్మ ఇన్‌ఫ్లుయెన్స్ నా మీద అయాచితంగా కొంచెం పడ్డదేమో?
1963లో వీక్లీలో నేను ‘తెర మీద తెర వెనుక’ శీర్షిక రాయడం - అది సెనే్సషన్ కావడం. నాకున్న ‘తొలి మలుపు’ విద్యార్థి నవల రాసిన ఖ్యాతిని కూడా అది మింగేసింది. ఝామ్మని సాగింది. దాంతోపాటే ‘ప్రేమకు పగ్గాలు’ సీరియల్ కూడా ప్రక్కప్రక్కనే రాశాను. అదే టైములో మొదటిసారి లేదా ఆఖరిసారి కూడా ‘వీక్లీ’ - మ్యాజిక్ ఫిగరు.. అంటారే ‘లక్ష’ కాపీల ‘ప్రింటు’ ఆర్డర్ చవి చూసింది. అసలు సంగతి ఇది కాదు...
అతి ‘ప్రత్యేకమైన’ తారల ప్రయివేటు ఫొటోలు రసవత్తరంగా రంజుగా కబుర్లు వేశాం. పాపం! సినిమా పత్రికలు నానా అవస్థలు పడి ‘ట్రైకలర్ బొమ్మలు’ ఒకటో రెండో వేసి పత్రిక రిలీజ్ చేస్తే - అది అమ్మితే వచ్చే పైసలు, గాజుల బేరం - భోజనానికి సరి అన్నట్లుండేది.
మన వారపత్రిక కేవలం ఒక్క పావలాకి కథలు, సీరియల్స్‌తో పాటు ఇంకా ఎక్స్‌క్లూజివ్‌గా బొమ్మల శీర్షిక పూర్తిగా ప్రయివేటు కథలు, బొమ్మలతో మార్కెట్ మీద పడి కుమ్మేస్తూ వుండే, మండిపోయింది కాబోలు. పాండీబజారులో - కాగడా శర్మ తన పత్రికలో సుదీర్ఘమైన ఎడిటోరియల్ రాశాడు. ఇది ‘అన్యాయం’ మేమూ బ్రతకాలిగా... అన్నది దాని తాత్పర్యం. ‘సార్! ఇది ‘వీరాజీ’ బాబుకి మీరే చూపెట్టాలి’ అంటూ రాధాకృష్ణగారికి పోస్టు చేశాడు. పెద్ద పత్రికలకు చిన్న పత్రికల మీద లివ్ అండ్ లెట్ విన్ పాలసీ ఉండాలన్నదే సినిమా జర్నలిస్టులలో కొందరి బాధ. చివుక్కుమంది నా మనస్సు. నేనే ‘కామ్రేడ్’ని! అని తిట్టుకున్నాను. 30 వారాలు కాంగానే శీర్షిక ‘తెర మీద తెర వెనుక’ని ‘అటక ఎక్కించాను’ అటు తరువాత 1964లో ఎన్టీ రామారావు గారితో ‘ముఖాముఖీ’ అన్న శీర్షికను మళ్లీ పేల్చాను. అదీ, ‘అయ్యవారి’ ఆదేశాలతో. అదంతా ఒక ‘కల’. ఒక ‘మధుర స్వప్నం’. సందర్భవశాత్తు చెప్తున్నా. ఆనక ఈ కబుర్లు విశదంగా వస్తాయి లెండి - కాకపోతే నేను సినిమా రంగంలో సినిమా జర్నలిస్టులతో ఎప్పుడు తామరాకు మీద నీటిబొట్టులాగా ఉండే కాలం గడిపాను. అంచేతనే సినిమా జర్నలిజం పెద్దలు నన్ను ప్రేమగా గౌరవంగా చూశారు.
ఇంటూరి వెంకటేశ్వరరావుగారు వారి పత్రికలో ‘్ఫల్ దినపత్రిక’ సైజులో ఒక ప్రత్యేక సంచిక వేశారు. అందులో హేమాహేమీ ‘్ఫలిమ్’ ఎడిటర్‌లు, రివ్యూ రైటర్స్ ఉన్నారు. నన్ను కూడా అందులో చేర్చి - నా బొమ్మ ఒకటి అడిగి తీసుకుని మరీ -స్వయంగా ప్రశంసా వ్యాసం చిన్నది రాసి వేశారు ఇంటూరి వారు. యూనివర్సిటీ చదువులు చదివి సినిమా విమర్శలు, రివ్యూలు చేస్తున్న వీరాజీ సినిమా జర్నలిజానికి వనె్న తెచ్చాడు అన్నారాయన.
అయాచితంగా నాకు ఈ కీర్తి లభించింది. కానీ ఫీచర్స్, ఎడిటోరియల్స్ - అలా లే అవుట్ రంగంలో కొత్త పుంతలు తొక్కడం నా కోరిక. దృష్టి అంతా వాటి మీద ఉంచాను. సినిమా ఒక కొసరు హాబీ అనేవాణ్ణి. అంతలో మళ్లీ విధి వక్రించింది.
దినపత్రికను నేను తప్పనిసరిగా వదిలిపెట్టి వారపత్రిక సేవలకి హాలులో నుంచి ‘మెట్లెక్కి’ పై వీక్లీ డిపార్టుమెంటులోకి వెళ్లాల్సి వచ్చింది. అదీ ‘జాబ్ సేవింగ్’ కోసం - తప్పని ప్రాసెస్ అయింది. అదెట్లన్నన్?
(ఇంకా భోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com