శిప్ర వాక్యం

ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అమెరికా, ఇండియా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు. ప్రజలు ఓటుహక్కుతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారు. అతడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయాలి. నేతలు పొరపాట్లు చేస్తే వారిని ప్రతిపక్షం ఎప్పటికప్పుడు సరిదిద్దాలి. బ్రిటన్‌లో ఒకవేళ పాలకపక్షం పడిపోతే పరిపాలనకు అంతరాయం లేకుండా ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది. ప్రజాస్వామ్య ప్రక్రియను బ్రిటన్ నుండి భారత్ స్వీకరించింది. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం నిర్దేశించినా మన దేశంలో ఇంకా అనువంశిక రాజకీయాల వాసన పోలేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నో నిబంధనలు, మంచి లక్షణాలున్నాయి.
* ఎవరైనా ఎన్నికల్లో నిలబడి గెలువవచ్చు. అలా గెలిచినవారు తమ పార్టీకి, ప్రజలకు విశ్వాసపాత్రులై ఉండాలి. ఓ పార్టీ టిక్కెట్ మీద గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించడం అప్రజాస్వామికం.
* భారత పౌరసత్వం ఉన్నవారు చైనా, అమెరికా, పాకిస్తాన్ వంటి ఇతర దేశాల కోసం పనిచేయటం దేశద్రోహం. కానీ ఇవాళ ఈ రెండు ధోరణులూ మనం చూస్తున్నాం.
* భారత్ వివిధ మతాల సమ్మేళనం. ఇక్కడ ఇస్లాం, క్రైస్తవ మతాలు వ్యాపించాయి. 1947లో మత ప్రాతిపదికన దేశాన్ని మూడు ముక్కలు చేశారు. నాగాలాండ్ వంటి క్రైస్తవ మత ప్రాబల్యం గల రాష్ట్రాలు తమను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని కోరుకుంటున్నాయి. హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో ఇతర మతస్థులు సుఖజీవనం సాగిస్తారు. కానీ, కాశ్మీర్ లోయ నుంచి హిందువులు తరిమివేయబడ్డారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం హిందువులను చంపివేస్తున్నది. ఈ పరిస్థితే ఆర్‌ఎస్‌ఎస్ బలపడడానికి కారణమైంది.
* మన సరిహద్దు దేశాల్లో ఎక్కడా ప్రజాస్వామ్యం లేదు. పాకిస్తాన్‌లో మతరాజ్యం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తనను తాను యావజ్జీవ అధ్యక్షునిగా ప్రకటించుకున్నాడు. దీనిని భారత్‌లోని ముస్లింలు, కమ్యూనిస్టులు తప్పుపట్టడం లేదు. ఎక్కడో పదవ తరగతి పేపర్ లీక్ అయితే కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను రాజీనామ చేయాలని అల్లరి చేస్తున్నారు. ఈ అల్లరి మూకలు చైనా వెళ్లి అక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టి జిన్‌పింగ్ స్థానంలో మరొక ప్రజామోదం గల నాయకుణ్ణి పాలకునిగా ఎన్నుకునేటట్లు చేయవచ్చు కదా!
* ప్రజాస్వామ్యానికి చట్టసభలు దేవాలయాలు. నేతలు అక్కడ మైకులు విరిచి వీధి రౌడీల్లా కొట్టుకోవడం అప్రజాస్వామికం. నెలల తరబడి పార్లమెంటు నడవకపోతే చర్చలు ఎలా జరుగుతాయి? ‘విజయవంతంగా పార్లమెంటును స్తంభింపజేశాం’ అని కొందరు నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది సైనిక నియంతృత్వానికి దారితీస్తుంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి, ప్రజల ప్రాథమిక హక్కులను హరించింది. పార్లమెంటును స్తంభింపజేస్తే ‘ఎమర్జెన్సీ’ వంటి దుర్మర్గాపు రోజులు వస్తాయి.
* న్యాయవ్యవస్థను కూల్చివేస్తే ప్రజాస్వామ్యం బతకదు. కమ్యూనిస్టులు బంద్‌లకు తరచూ పిలుపునిస్తూ ఉంటారు. ఉత్పత్తిని ఆపివేయడం, అరాచకాలతో ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయడం వారి మూల సిద్ధాంతం. మిగతా పార్టీలు ఇపుడు ఇదే ధోరణిని అందిపుచ్చుకున్నాయి. ‘విచారణ లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటం మానవ హక్కుల ఉల్లంఘన’ అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఇటీవల భారత్ బంద్ జరిగింది. ఇది న్యాయవ్యవస్థను ధిక్కరించడమే. న్యాయవ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దాలే తప్ప- మొత్తం వ్యవస్థను నిర్మూలిస్తే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది.
* ఆర్థిక నేరాలకు పాల్పడే నేతలపై చర్యలు తీసుకోవాలని ఎవరైనా కోర్టులను ఆశ్రయించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) ఇచ్చే నివేదికలను పాలకులు హుందాగా అంగీకరించడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది.
* దేశంలోని చాలా ప్రాంతాల్లో కొన్నాళ్ల క్రితం వరకూ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు లేవు. రాయలసీమలోని చాలా గ్రామాల్లో ఒకప్పుడు ‘ఓటు’ ఎలా ఉంటుందో తెలియని ప్రజలు ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడింది. కేరళలోని కన్నూరు జిల్లాలో సీపీఎం నేతలు బాలకృష్ణన్, పినరయ్ విజయన్‌లకు వ్యతిరేకంగా ఎవరైనా ఎన్నికలలో పోటీ చేస్తే వారి కాళ్లూ చేతులూ నరుకుతారు. లేదా హత్యచేసి ఎన్నికను వాయిదా వేయిస్తారు. తమకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని, ఐనా ఇందులోని డొల్లతనాన్ని ప్రపంచానికి చాటేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని వామపక్ష నేతలు అంటారు.
* నూటికి యాభై శాతం మంది ఓటింగులో పాల్గొనరు. పోలైన ఓట్లలో ఇరవై శాతం వచ్చినవారిని విజేతగా ప్రకటిస్తారు. అంటే నూటికి ఇరవై ఓట్లు వచ్చినవాడే పాలకుడు అవుతున్నాడు. ఈ దుర్మార్గానికి విరుగుడు ఏమిటి? ఎన్నికల్లో పాల్గొనని ఓటరుకు భారీగా జరిమానా విధించాలి.
* ఓటర్ లిస్టులో పేర్లు గల్లంతు కావడాన్ని, దొంగఓట్లు వేయడాన్ని అరికట్టాలి. వివిధ రకాలుగా ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని అరికట్టాలి.
* 1954లో జరిగిన ఎన్నికలలో ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారని చాలామంది భావించారు. గుజరాత్‌లోని సబర్‌కాంత ప్రాంతానికి చెందిన ఎస్.కె.పాటిల్ అనే నాయకుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాడు. అతడు పెత్తందార్లతో ఇలా చెప్పాడు.. ‘ఈ ఓటర్లను బందిలిదొడ్డిలో పెట్టండి. బిర్యానీ, మద్యం, రోజుకూలి ఇవ్వండి- సాయంత్రం ఐదు తర్వాత వారిని వదిలిపెట్టండి’ అని-
* ఆర్థిక నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
* ప్రచార మాధ్యమాలు ప్రజాభిప్రాయాలను ప్రతిబింబించాలి. మీడియా నైతికతను వీడితే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా వార్తలు సృష్టించే మీడియా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది.
* మయన్మార్ నుండి రెండు కోట్లమంది నిర్వాసితులు పశ్చి మ బెంగాల్‌లోకి వలస వ చ్చారు. వారి ఓట్లమీద ఆధారపడి అక్కడి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. విదేశీ పౌరులైన వీరికి భారత పాస్‌పోర్టులు- రేషన్ కార్డులు- ఆధార్ కార్డులను జ్యోతిబసు, మమతాబెనర్జీ ఎందుకు ఇచ్చారు? అని ఎవరూ అడగకూడదు. లక్షలమంది పండిట్లను కాశ్మీర్ నుండి తరిమివేశారు. వారికి స్వదేశంలో ఓటు హక్కు లేదు. దీన్ని ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు పట్టించుకోదు?
* ఇటీవల జరిగిన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్, అమెరికాలు జోక్యం చేసుకున్నాయన్న వార్తలు వచ్చాయి. ‘జాతీయవాదులకు ఓటు వేయకండి’ అని అహ్మదాబాద్‌లో ఓ చర్చికి చెందిన బిషప్ ఫత్వా జారీ చేశాడు. 2014లో న్యూఢిల్లీలోని ఇమాం బుఖారి దగ్గరకు సోనియా గాంధీ వెళ్లి, హిందూ మతతత్వ వాదులను ఓడించేందుకు ‘మీరు-మేము’ కలసి పోరాడుదాం అని కోరింది. ఇక్కడ ‘మీరు’ అంటే ఇస్లామిక్ జిహాదీ వర్గం- ‘మేము’ అంటే వాటికన్ క్రైస్తవ వర్గం.
* జమిలి ఎన్నికలు దేశానికి శ్రేయస్కరం. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నివారించవచ్చు.
* ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తేనే ప్రజల తీర్పుకు, ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది.
* ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి కనీసం 10వ తరగతి విద్యార్హత అయినా ఉండాలి. లేకుంటే అతడు పార్లమెంటరీ కర్యకలాపాలు ఎలా నిర్వహించగలడు?
* మతాల పేరిట రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని కోర్టులు తీర్పునిచ్చినా పాలక వర్గాలు వినడం లేదు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానించారు. తమిళనాడులో 50 శాతం మించి రిజర్వేషన్లు ఉన్నాయి. వీటి జోలికి వెళ్తే ఎన్నికల్లో విజయాలు సాధించలేమన్న భయం నాయకులకు ఉంది. చైనాలో, పాక్‌లో రిజర్వేషన్లు ఉన్నాయా? అక్కడ మైనారిటీలైన హిందువులకు రిజర్వేషన్లు లేవు. అసలు మైనారిటీ వర్గాలే లేవు. వారందరినీ చంపటమో, తరిమివేయటమో జరిగింది.
* ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల హింస ప్రజ్వరిల్లింది. ప్రతి అంశాన్ని ఎన్నికల కోణంలో ఆలోచించి రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. ఇది చివరికి సైనిక నియంతృత్వానికి దారితీయగలదు.
* కావేరీ నదీ జలాల విషయంలో సుప్రీం తీర్పును కర్నాటక ప్రభుత్వం బేఖాతరు చేసింది. న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థల మధ్య ఘర్షణ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ఎన్నికల్లో ప్రతికూలత ఉంటుందేమోనని భయపడి కావేరీ వాటర్ బోర్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం వెనుకంజ వేసింది. ఎన్నికల కోణంలో ఆలోచిస్తూ పోతే ప్రజల డిమాండ్లు నెరవేరవు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668