శిప్ర వాక్యం

విపక్షాల ఐక్యత పగటికలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణకు చెందిన ప్రజా గాయకుడు గద్దర్ ఈ మధ్య దేశ రాజధానికి వెళ్లాడు. ఆయనకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుండి ఆహ్వానం వచ్చిందట! ఇంతకీ ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ సారాంశం ఏమిటి? దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా గద్దర్ కలిశాడు. కేంద్రంలో మోదీని, తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి తీరాలని సోనియా గాంధీ కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఇతర విపక్షాలతో, కొన్ని సంస్థలతో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉంది. కేజ్రీవాల్ పార్టీతో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు పెట్టుకుంటుంది. తెలంగాణలో కమ్యూనిస్టులను ఆదరిస్తుంది, సీమాంధ్రలో చంద్రబాబు పార్టీకి మద్దతునివ్వడానికి కాంగ్రెస్ ‘రెఢీ’ అంటోంది.
రాహుల్ గాంధీ ప్రధాని కాకపోయినప్పటికీ, 2019 ఎన్నికల తర్వాత తృతీయ కూటమికి మద్దతునిచ్చి భాజపాను అధికారం నుండి తొలగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. సోనియా కుమార్తె ప్రియాంకను రాయబరేలీ నుండి పోటీ చేయించాలని ఆ పార్టీ యోచిస్తోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృతీయ ఫ్రంటు నాయకురాలైతే- ఆమెను ప్రధానిగా చేయడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉంది. వీటన్నింటి సారాంశం ఒక్కటే.. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో భాజపా అధికారంలో ఉండకూడదు. మోదీని గట్టిగా వ్యతిరేకించడానికి కాంగ్రెస్ కోణంలో అనేక కారణాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి...
క్రైస్తవ సంస్థల భూ కబ్జాలు, లైంగిక వేధింపులు, పసిపిల్లల అక్రమ అమ్మకాలపై మోదీ కఠిన చర్యలు తీసుకుంటున్నాడు. స్వచ్ఛంద సంస్థలకు వచ్చే నిధులను అడ్డుకోవడంతో మత మార్పిడులకు ఆర్థిక సహకారం అందడం లేదు. కశ్మీర్, అసోం, బెంగాల్, తెలంగాణ వంటి ప్రాంతాల్లో తిష్ఠవేసిన చొరబాటుదారులను బంగ్లాదేశ్, మయన్మార్ వెళ్లవలసిందిగా మోదీ కోరుతున్నాడు. అసోంలో 34.8 శాతం వరకూ ముస్లింల జనాభా ఉంది. 1952 నుండి ఇప్పటికి 40 లక్షల మేరకు చొరబాటుదార్ల సంఖ్య పెరిగింది. బెంగాల్ 2.5 కోట్ల చొరబాటు దారులున్నారు. వీరు బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోతే మమతా బెనర్జీకి గడ్డురోజులే. హైదరాబాదులో భారీ సంఖ్యలో రోహింగ్యాలు దాక్కొని ఉన్నారు. బెంగళూరు పరిసర ప్రాం తాల్లో 40వేల మంది చొరబాటుదారులున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి రామలింగస్వామి ప్రకటించారు. ముస్లిం, క్రైస్తవ ఓటర్లను తమకు దూరం చేసేందుకు మోదీ యత్నిస్తున్నారన్నది కాంగ్రెస్ ఆందోళన. శశి థరూర్, సోనియా, రాహుల్, పి.చిదంబరం, కార్తీ చిదంబరం వంటి కాంగ్రెస్ నాయకులను కోర్టుల చుట్టూ ఎన్డీఏ సర్కారు తిప్పుతోంది. దీంతో మోదీ సర్కారును ఎలాగైనా అధికారం నుండి తప్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రచారయుద్ధం మొదలుపెట్టింది. తెరాస నాయకత్వం కూడ ప్రధానంగా కాంగ్రెస్ నేతలపై పాత కేసులను తవ్వితీసే ప్రక్రియను ముమ్మరం చేసింది. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు మజ్లిస్ పార్టీతో తెరాస దోస్తీ చేస్తోంది. కాగా, మోదీని వ్యతిరేకించే ముస్లింలంతా తమకే మద్దతు ఇస్తారని కాంగ్రెస్ ఆశిస్తోంది. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఓటర్లు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతునిచ్చి భాజపా, తెరాసలను ఓడిస్తుంది. ఇక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తాము గెలవకపోయినా ఫరవాలేదు కాని భాజపా ఓట్లకు గండి కొట్టేందుకు మాయావతి, ములాయం సింగ్ పార్టీలకు కాంగ్రెస్ అండగా ఉండే అవకాశం ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కొంతకాలంగా వ్యూహరచన చేస్తోంది. ఇవన్నీ ఎంతవరకు ఫలిస్తాయో ఇప్పుడే చెప్పలేం.
కాంగ్రెస్ వ్యూహరచనను అంచనా వేస్తూ, రాబోయే ఆరు నెలల కాలంలో భాజపా కూడా కొన్ని నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోబోతున్నది. కొన్ని చోట్ల నష్ట నివారణ చర్యలకు మోదీ యత్నిస్తున్నారు. మహారాష్టల్రో మరాఠా రిజర్వేషన్ ఆందోళనతో అక్కడి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం పునాదులు కదిలాయి. శివసేన, ఎన్సీపీలకు అనుకూలంగా కాంగ్రెస్ వ్యవహరించి మహారాష్టల్రో బిజెపిని గద్దెదించాలని చూస్తున్నది. కర్నాటకలో జెడిఎస్‌తో పొత్తువల్ల తమకు నష్టం వాటిల్లినా ఫరవాలేదు కాని లోక్‌సభ ఎన్నికలలో బిజెపి గెలవకూడదనేని కాం గ్రెస్ లక్ష్యం. ఇటీవలి ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ‘ఎంతకైనా తెగించండి.. మోదీని ఓడించండి’ ఇదీ ఇప్పుడు కాంగ్రెస్ ఏకైక నినాదం.
ఆంధ్రప్రదేశ్‌లో భాజపా ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలుచుకునే అవకాశం లేదు. కేంద్రం తమ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ‘ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు’ అనే నినాదం గ్రామస్థాయిలోకి చేరిపోయింది. ఈ దుస్థితి నుండి తమ పార్టీని రక్షించడానికి రాంమాధవ్ వంటి బిజెపి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఉత్తరాదిలో జరిగే నష్టాన్ని దక్షిణాదిలో పూడ్చుకుంటామని భాజపా అధ్యక్షుడు అమిత్ షా అంటున్నారు. ఇది ఆచరణ సాధ్యమేనా?
గతంలో ఇందిరా గాంధీ తన పదవికి ముప్పువచ్చినప్పుడు ఎమర్జెన్సీని విధించింది. పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ అనే దేశాన్ని సృష్టించింది. ఇప్పుడు సోనియా కూడా అలాంటి నిస్పృహలోనే ఉన్నారు. ‘నౌ ఆర్ నెవర్’ అన్నట్లు ఆమె ఆలోచిస్తున్నారు. విపక్షాలన్నీ ఐక్యతతో భాజపాపై పోరాడాలని సోనియా పిలుపునిచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో లొసుగులు కన్పడుతున్నాయి. రాహుల్, మమతా బెనర్జీ, శరద్ పవార్, మాయావతి, ములాయం సింగ్ వంటి విపక్ష నేతలెందరో ప్రధాని పదవిని ఆశిస్తున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలో ప్రస్తుతానికి సీపీఎంకు సరైన ప్రత్యామ్నాయం లేదు. తమిళనాడులో రజనీకాంత్ పార్టీ, పళనిస్వామి వంటి నేతలు ఎన్‌డిఏ కూటమిలో చేరే అవకాశం ఉంది. కర్నాటకలో కుమారస్వామి అంపశయ్య మీద కూర్చున్నాడు. ఏపీలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం అంత సులభం కాదు. తెలంగాణలో నేటికీ కేసీఆర్ అజేయుడే. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాకు స్థానిక కాంగ్రెస్ నేతలతో విభేదాలున్నాయి. ఆరోగ్య కారణాలతో శరద్ పవార్, సోనియాలు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనే అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్‌లో రామాలయ నిర్మాణం ప్రజల సెంటిమెంటుకు సంబంధించిన అంశం. ఈ విషయంలో భాజపా తీసుకునే చర్యలేమిటో ఇంకా స్పష్టం కాలేదు. మహారాష్టల్రో శివసేన బలపడినా కాంగ్రెస్‌కు వచ్చే లాభం లేదు. రాజస్థాన్‌లో భాజపా సీఎం వసుంధర రాజె పాలన పట్ల జనంలో అసంతృప్తి ఉన్నా, సంస్థాగతంగా కాంగ్రెస్ బలహీనంగా ఉంది. అసోం, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి బలపడుతోంది. చొరబాటుదారులను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తే అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెసు అడ్రసులు గల్లంతు అవుతాయి.
కేంద్రంలో అధికారాన్ని చేజార్చుకునేందుకు బిజెపి సిద్ధంగా లేదు. దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ కలలు కంటున్నాయి. అదే జరిగితే ఎమర్జెన్సీ వస్తుందేమో కాని సోనియా పాలనకు అవకాశం లేదు. ఎన్‌డిఏ కూటమి నుండి కొన్ని పార్టీలు వైదొలగినా, భాజపాకు కొత్త మిత్రులు లభించే అవకాశాలున్నాయి. తెలంగాణలో భాజపా పట్ల తెరాస సానుకూలంగా ఉండే పరిస్థితులు రావచ్చు. వివిధ సామాజిక వర్గాలను కలుపుకొని తెరాసను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.
విపక్షాలు ఏకతాటిపైకి రాకపోయినా- అప్పుడే మమతాబెనర్జీని ప్రధానమంత్రిగా కర్నాటక నాయకుడు దేవెగౌడ ప్రతిపాదించారు. ఆమె గనుక రేసులో ఉంటే పోటీనుండి తాను తప్పుకుంటున్నట్లు రాహుల్ ప్రకటించాడు. కానీ, మమతా బెనర్జీ వంటి వివాదాస్పద నేత ఈ దేశానికి ప్రధాని కావడాన్ని తాము సహించేది లేదని విపక్ష శిబిరంలోనే నిరసనలు వినిపిస్తున్నాయి. నిరాశలో ఉన్న విపక్షాలు ఐక్యతతో ముందుకు సాగడం పగటికలే అని భాజపా నేతలు ధీమాగా ఉన్నారు. *

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్