శిప్ర వాక్యం

వ్రతం చెడ్డా ఫలం దక్కని ‘కమలనాథులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘ఉద్యమ దర్శనము’ అనే అంశంపై సుదీర్ఘ పరిశోధన చేసి 1970వ సంవత్సరంలో డాక్టరేటు పట్టా పొందాను. ఒక సెలయేరు ఎక్కడో కొండలలో, కోనలలో గంగోత్రి వద్ద పుట్టి మహాప్రవాహంలా మారుతుందో ఉద్యమాలు కూడా అలాగే ఎక్కడో ఎందుకో పుట్టి క్రమంగా వాగులను, వంకలను కలుపుకొని ప్రళయ భీకరంగా మారుతాయి. విదేశాలలో ఫ్రెంచి విప్లవం, రష్యా విప్లవం అలాంటివే.
1905లో బెంగాల్ విభజన జరిగింది. ఆ తర్వాత అర్ధ శతాబ్దం పాటు కొనసాగిన భారత జాతీయ సంగ్రామానికి ఇదే బీజం. బెంగాల్‌కు, ఆంధ్రాకు చాలా పోలికలున్నాయి. ‘నిన్న బెంగాల్‌లో జరిగింది.. రేపు భారత్‌లో జరుగుతుంది..’ అనేది పాత సామెత. అందులో అతిశయోక్తి ఉన్నదేమో తెలియదు కాని- ఈరోజు బెంగాల్ ఆలోచించినట్లు రేపు భారత్ ఆలోచిస్తుందనేది కొంతమంది మేధావుల అభిప్రాయం. బెంగాల్‌లో అరవిందుడు జన్మించాడు. వివేకానందుడు జన్మించాడు. ఇక్కడే నక్సల్బరీ ఉద్యమమూ పుట్టింది. దీని ప్రభావం భారతదేశమంతటా వ్యాపించింది. సైద్ధాంతిక నిబద్ధత, జాతీయవాదం అనే మార్గదర్శకాలతో అవతరించిన భారతీయ జనతాపార్టీ ఆ లక్ష్యసాధన కోసం అవసరమైతే నక్సలైట్లతో కలసి పనిచేస్తానంటూ నిర్భయంగా ప్రకటించింది. తెలంగాణలో భాజపాకు చెందిన కిషన్‌రెడ్డి న్యూ డెమొక్రసీ పార్టీతో కలిసి ఉద్యమం నడిపాడు. ఇది ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్ చెప్పిన మూలసూత్రాలకు పూర్తిగా విరుద్ధం. ముందే చెప్పినట్లు ఉద్యమాలు ఎలా పుడతాయో, ఎలా మలుపులు తిరుగుతాయో ఎవరు చెప్పగలరు?
ఇరవయ్యవ శతాబ్దంలో భారతదేశంలో కొన్ని ముఖ్యమైన ఉద్యమాలు సాగాయి. అందులో మొదటిది భారత జాతీయోద్యమం. దీనికి సత్యాగ్రహ విధానంలో మహాత్మా గాంధీ, సాయుధ పద్ధతిలో నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ నాయకత్వం వహించారు. రెండవది ఆంధ్రోద్యమం. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వంటివారి సారధ్యంలో సాగింది. మూడవది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. దీనికి 1969లో మర్రి చెన్నారెడ్డి, 2010లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వం వహించారు. ‘ఖలిస్తాన్’ (ప్రత్యేక సిక్కు దేశం) ఉద్యమానికి భింద్రేన్‌వాలా నాయకత్వం వహించారు. ప్రత్యేక ఉత్తరాంచల్ ఉద్యమాన్ని విజయ బహుగుణ వంటివారు నడిపారు. నక్సలైట్ ఉద్యమానికి కానూ సన్యాల్, చారు మజుందార్ వంటివా రు నాయకత్వం వహించారు. ఇవన్నీ గత కొన్ని దశాబ్దాల్లో కొనసాగిన ఉద్యమాలే. ప్రత్యేక డార్జిలింగ్ ఉద్యమం నూట పది సంవత్సరాలుగా సాగుతున్నది. ప్రత్యేక విదర్భ (నాగపూర్ రాజధానిగా) రాష్ట్రం ఏర్పాటు కావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఒకప్పటి స్వదేశీయ సంస్థానాలను ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించాలన్న డిమాండ్లు చాలాకాలంగా ఉన్నవే. తెలంగాణ ప్రాంతం నిజాం నవాబు పాలనలోనిది. వీటన్నింటికీ చారిత్రక నేపథ్యాలున్నాయి. పేదరికం నుంచి నక్సలిజం పుట్టింది. ఈ ఉద్యమానికి చైనా నుండి ప్రత్యక్షంగా సహాయం అందుతూనే ఉంది.
త్యాగాలతో సాగిన ఉద్యమాలు కొన్ని విజయవంతమయ్యాయి. గాంధీజీ త్యాగం వ్యర్థం కాలేదు. ‘నా శరీరాన్ని విభజించి, ఆ తర్వాత దేశాన్ని విభజించండి’ అని ఆయన అన్నాడు. కానీ, ఆయన కళ్లముందే మత ప్రాతిపదికపై దేశ విభజన జరిగిపోయింది. ఆ తర్వాతనే ఆయన హత్యకు గురయ్యాడు. దేశ క్షేమం కోసం గాంధీ, నెహ్రూ చేసిన త్యాగాలు తక్కువవి కావు. మరికొన్ని ఉద్యమాలు సమాజ క్షేమం కోసం గాని, త్యాగాలతో గాని పుట్టలేదు. 1905లో రాజకీయ ప్రయోజనాల కోసం లార్డ్ కర్జన్ బెంగాల్‌ను విభజించాడు. పర్యవసానంగా ‘వందేమాతరం’ ఉద్యమం పుట్టింది.
2013 ఆగస్టులో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు అంగీకారం తెలిపారు. ఇందులో ఎలాంటి త్యాగం లేదు. రాజకీయ స్వార్థం ఉంది. మరి- తెలంగాణ ఉద్యమాన్ని భాజపా ఎందుకు సమర్ధించింది? తెలంగాణలో ఎంఐఎం (మజ్లిస్) పార్టీని అణచివేయడానికే అని భావించాలి. ఉభయ కమ్యూనిస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దాదాపు అన్ని ఉద్యమాలలోనూ వారు వ్యూహాత్మకమైన తప్పులు చేశారు. ‘తెలంగాణలో ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. విడిపోయి కలిసుందాం. కలిసుండి విడిపోదాం..’ ఈ సినిమాటిక్ డైలాగులు ఈమధ్య తెరపైకి వచ్చాయి. కానీ- నిన్నటి మాట ఏమిటి? ‘ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే ప్రత్యేక దేశం కోరుకుంటాం.. మేము అధికారంలోకి రాగానే తెలంగాణలోని కార్పొరేట్ కళాశాలలన్నింటినీ నిషేధిస్తాం. తెలుగు తల్లట... ఎక్కడ తల్లి? చంద్రబాబు సెంటిమెంటు డైలాగులు కొడతాండు. సీమాంధ్రోళ్ల పీడ ఎప్పుడు విరగడ అవుతుంది?’ అనే మాటలు తెలంగాణ విభజనకు ముందు పెద్దఎత్తున వినిపించాయి.
‘లక్ష్యసాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతి పనికిరాదు. సాయుధ పోరాటం చేయాలి. సివిల్‌వార్ సృష్టిస్తాం. ఇక దంచుడే దంచుడు..’ అని రాష్ట్ర విభజనకు ముందు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్యమ నేతలు తిట్టడాన్ని జనం అప్పుడే మరచిపోయారా? కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణలోనే పుట్టాడు, హైదరాబాద్ నిజాం కళాశాలలో చదువుకున్నాడు. అయినా అతడిని సెటిలర్‌గానే తెరాస నేతలు జమకట్టారు. నిజానికి ఈ ప్రపంచమే పెద్ద సత్రం. అందరూ సెటిలర్లే. వస్తూపోతూ ఉన్నారు. ‘అరవై ఏళ్లుగా హైదరాబాద్‌ను మేము అభివృద్ధి చేశాం కాబట్టి ఈ నగరంపై మాకూ హక్కు ఉంది..’ అని ఆంధ్రోళ్లు అంటున్నారు. హైదరాబాద్ తెలంగాణాలో ఉంది కాబట్టి అది పూర్తిగా మాదే అని తెరాస ప్రభువులు అంటున్నారు. ‘హైదరాబాద్‌ను మా నిజాం ప్రభువులు నిర్మించారు. కాబట్టి మాదే, ఇక్కడ ఉర్దూ అధికార భాషగా కొనసాగాలి’ అని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వివిధ పార్టీలు, కొంతమంది నేతలు చేసిన ఇలాంటి వ్యాఖ్యానాలు ప్రజల్లో అశాంతిని రగిలించాయి. కొంతమంది నేతలు భావించినట్లు ‘అంతర్యుద్ధం’ సృష్టించక పోయినా- అలాంటి వ్యాఖ్యలు అంతులేని అలజడిని మాత్రం సృష్టించాయి.
రాజకీయాల్లో కూడా కొందరు ‘ఐరన్ లెగ్స్’ ఉంటారు. డిగ్గీరాజా (దిగ్విజయ్ సింగ్), గులాం నబీ అజాద్ లాంటి వారు ఈ కోవకిందకే వస్తారు. అజాద్ మంతనాలు మొదలుపెట్టగానే జమ్ము, లడక్‌లు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోవా? దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్‌లోని మాజీ సంస్థానాధీశుడు. అక్కడి ఎన్నికలలో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించాడు. ఓడిపోయాక దండ కమండలాలు అక్కడివారు ఆయనకు కానుకగా పంపించారు. ఆయన రాజకీయ సన్యాసం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా అవతారం ఎత్తాడు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాడు. అంటే ఈ ‘ఐరన్ లెగ్’ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ అదృశ్యమవుతుందని అర్థం. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 30 లక్షల మంది ‘సెటిలర్లు’ అనబడే సీమాంధ్రులు జీవిస్తున్నారు. ఇప్పుడు వీరు ఎక్కడికి పోవాలి? అభద్రతాభావంతో ఎంతకాలం జీవిస్తారు? ఇదే ప్రధాన సమస్య.
హైదరాబాదులోని చార్మినార్ సందర్శనకు సీమాంధ్రులు ధైర్యంగా రాలేరు, తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు తెలంగాణ పౌరులు ఇకమీదట ధైర్యంగా పోలేరు- అని గతంలో కొందరు సూత్రీకరించారు. ‘మానసికంగా మేము ఎప్పుడో విడిపోయాం’ అన్నారు ఉద్యమ సమయంలో కొందరు తెలంగాణ నేతలు. భౌగోళికంగా విడిపోయి నాలుగున్నరేళ్లు గడిచాయి. అసదుద్దీన్ ఒవైసీ కోరిక ప్రకారం హైదరాబాద్‌లో ఉర్దూ అధికార భాష కాబోతోంది అంటే- దేశంలో ఇకమీద ఉండేది ఒక తెలుగు రాష్టమ్రే. దాని పేరు ఆంధ్రప్రదేశ్. తెలంగాణను ముస్లిం ప్రాంతంగా మార్చడానికి అప్పుడే బీజాలు పడ్డాయి. తమాషా ఏమిటంటే ఒక యుద్ధం జరిగి ఒకరు ఓడితే, మరొకరు గెలుస్తారు. కాని భారతదేశంలో నేడు అందరూ ఓడిపోయారు. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కలవాడా..’ అనే వేములపల్లి శ్రీకృష్ణ గీతాన్ని సిపిఐ నేతలు ఏ ముఖం పెట్టుకొని పాడుకోగలరు? ప్రత్యేక రాష్ట్రోద్యమాల ముసుగులో దేశ విచ్ఛిత్తికి సిక్కులు, కొందరు లింగాయతులు, జైనులు, ఆర్య సామాజికులు తాము హిందువులు కాదంటూ ప్రకటించుకున్నారు. ఇది దారుణం. (బంచ్ ఆఫ్ థాట్స్ ఎం.ఎస్.గోల్వాల్కర్ పుట-105) దీని సారాంశం ఏమంటే హిందూత్వకు ప్రాధాన్యం ఇవ్వాలని, పాకిస్తాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకొని అఖండ భారత్ సాధించాలని శ్రీ గురూజీ గోల్వాల్కర్ ఈ వ్యాసంలోని తరువాతి పుటలో వివరించారు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతామని కొందరు భాజపా నాయకులు ప్రకటించారు. అంటే ‘అఖండ భారత్’ నుండి ‘నక్సల్ తెలంగాణ’ వరకు బిజెపి ప్రస్థానం సాగింది. వీరికి ‘వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు’. అటు ఆదర్శం గతి తప్పింది.. ఇటు సీట్లూ దక్కలేదు.. మొత్తానికి తెలంగాణలో భాజపా ‘రెంటికీ చెడ్డ రేవడి’ అయిందని ప్రత్యర్థులు సంబరపడుతున్నారు. *

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్