మెయిన్ ఫీచర్

వెరీ సింపుల్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న కథ. చిత్రమైన కథనం. చిగురంత పెట్టుబడి. చికాకుపెట్టని కాస్టింగ్. చివరి వరకూ వెన్నుదన్నుగా నిలిచే టెక్నీషియన్లు. చిత్రానికి ప్రాణం పోయగల సంగీతం. వీటన్నింటినీ మంచిగా తాలింపు పెట్టే కొంచెం అనుభవమున్న దర్శకుడు. వెరసి -సింపుల్‌గా మంచి చిన్న సినిమా.
చిన్న సినిమా అనగానే -పదో పరకో లకారాలు పట్టుకుని తీసేస్తున్న సినిమాల గురించి కాదు. అలాంటి ప్రయోగాలు వర్మ చేతల్లో కమ్మగా ఉంటాయేమోగానీ, థియేటర్లలో ఆడియన్స్‌ని మెప్పించేంత సీన్ ఉండదు. మరి చిన్న సినిమా అంటే-
ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం మూడు నుంచి ఐదు కోట్ల బడ్జెట్‌తో తీసే నిఖార్సయిన సినిమా. ఒకటీ, ఒకటిన్నర కోట్ల బడ్జెట్‌తో వస్తున్న సినిమాలూ తెలుగులో చాలానే వస్తున్నాయి. వాటినీ చిన్న సినిమాగానే పరిగణించాలి. కాకపోతే -హిట్టు ట్రాక్ ఎక్కినవి, ఎక్కుతున్నవి మరీ తక్కువ కనుక వాటి చర్చను పక్కనపెట్టొచ్చు. ఇక మినిమమ్ బడ్జెట్‌తో తీసిన సినిమాల్లోనూ ఫెయిల్యూర్స్ ఉండవని చెప్పలేం. నిజానికి ఈ కోవలో -తుస్‌మంటున్న సినిమాలే ఎక్కువ. కాకపోతే ఇరవై ముఫ్పై సినిమాలు పోయిన తరువాత ఒక్క చిన్న హిట్టుపడినా -మళ్లీ చిన్న సినిమాకు ఊపిరొచ్చేస్తోంది. -పాతిక సినిమాల నిర్మాణానికి ప్రాణం పోసేస్తోంది.

చిన్న సినిమా సంక్షోభంలో పడిందన్న మాట -పరిశ్రమలో ప్రతిసీజన్‌లో వినిపించేదే. నాలుగైదు సినిమాలు వరసపెట్టి తనే్నసినపుడు -అలాగే మొదలవుతుంది చర్చ. పెద్ద సినిమా దెబ్బకు చిన్న సినిమా కుదేలైపోయిదంటూ నష్టాలుబారిన పడిన నిర్మాతలు గగ్గోలు పెడతారు. అనుభవం లేకుండానే సినిమాను చుట్టేసి చిన్న సినిమాపైనున్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారంటూ -అప్పటికి నిర్మాణంలోవున్న చిన్న సినిమా నిర్మాతలు గోల చేస్తారు. ఇది రొటీన్.
వరుసపెట్టి వస్తున్న పెద్ద సినిమాల దెబ్బతో -చిన్న సినిమాకు థియేటర్లు దొరకడం లేదన్న యాగీ ఎప్పుడూ ఉంది, ఉంటూనే ఉంది. ఆ సినిమాకు ‘అలా ఎలా’ థియేటర్లు దొరికాయబ్బా అనుకోవడమే తప్ప, చాలావాటికి థియేటర్లు దొరకలేదన్న కంప్లైంటే వినిపిస్తోంది. చిన్న సినిమాకు ఇదొక పెద్ద సమస్య. ఇక -చిన్న సినిమా కథ మారదు... చిన్న సినిమానా.. చుట్టేసుంటారులే? లాంటి తేలిక మాటలూ బడ్జెట్ సినిమాలు ఎదుర్కోక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో -ఆడియన్స్‌కు అలవాటుపడిన సందీప్‌కిషన్, శర్వానంద్, నాగశౌర్య, నిఖిల్‌లాంటి హీరోలకో, రాజ్‌తరుణ్‌లాంటి అప్‌కమింగ్ హీరోకో -ఒక మంచి సినిమా పడితే చాలు. మళ్లీ చిన్న సినిమాలు చెలరేగిపోతాయి. ఫోర్-సి పెట్టుబడితో పరిశ్రమకొస్తే -మెప్పించగలిగే సినిమా ఒకటి తీయొచ్చులే అన్న ధైర్యం నిర్మాతలకూ వచ్చేస్తుంది. చిన్న సినిమాను సరైన ట్రాక్‌మీద నడిపిస్తున్న దర్శకులకూ కొదువ లేదుదన్న ధీమా కలుగుతుంది. అంతే -చిన్న సినిమాపై మళ్లీ పెద్ద చర్చ మొదలవుతుంది.
***
చిన్న సినిమా సంక్షోభాన్ని ఎదుర్కోవడమన్నది ఎప్పుటికప్పుడు కొత్తే. చిన్న సినిమా అన్న క్యాటగిరీ మొదలైన దగ్గర్నుంచీ ఈ పరిస్థితి ఉంది. లేచి నిలబడి పరిగెత్తడానికి చేసే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు ఎనె్నన్నో ఒడిదుడుకులు. అలాంటి ప్రయత్నంలో -ఒక్క సినిమా సక్సెస్ అయితే చాలు. అప్పటికి చిన్న సినిమా ప్లాన్‌లో ఉన్న వాళ్లకు బలమే బలం. ఏదేతేకానీ, ముందు సినిమా తీద్దామన్న ఊపొచ్చేస్తుంది. ఒక్క సినిమా -వంద సినిమాలకు ప్రేరణవుతుంది.
ఈ ఏడాది మొత్తంమీద కనీసం 50 నుంచి 60 వరకూ చిన్న సినిమాలనుకున్నవి వచ్చాయి. ఇందులో జోరు చూపించినవి నాలుగైదే ఉంటాయి. మిగిలినవన్నీ -ఎప్పుడొచ్చాయో తెలీదు. ఎప్పుడు వెళ్లిపోయాయో అర్థంకాదు. నిర్మాణం పూర్తి చేసుకొన్నవి కొన్ని. ఆడియో ఫంక్షన్ వరకే తెలిసినవి కొన్ని. పోస్టర్ వరకూ వచ్చినవి కొన్నైతే, ఒక్కరోజులోనే థియేటర్ నుంచి ఖాళీ అయిపోయినవి కొన్ని ఉండొచ్చు. జోరు చూపించిన సినిమాలు మాత్రం -ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చర్చకు తావిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర లాభాలు గడిస్తున్నాయి. థియేటర్లు దక్కించుకోవడమే కష్టమనుకున్న చిన్న సినిమా -ఓవర్సీస్‌కు ఎగబాకే స్థాయికి ఎదిగినవీ కనిపిస్తున్నాయి. అంటే -సరుకులేని సినిమా ఢమాల్‌మందేమోగానీ, నిఖార్సయిన కథతో వచ్చిన తెలుగు సినిమా పంబరేపుతోందన్న మాట.
***
గత ఏడాదిలో -కార్తికేయ, ప్రతినిధి, ఊహలు గుసగుసలాడె, రన్ రాజా రన్, గీతాంజలి, దిక్కులుచూడకు రామయ్యా లాంటి సినిమాలు బాగా లాభాలార్జిస్తే -అందుకు తీసిపోని సినిమాలు ఈ ఏడాదీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
చిన్న సినిమాకు పెద్ద హీరోలా కనిపించే వాళ్లలో ముందుగా నాని పేరు ప్రస్తావించాలి. నిజానికి నాని మార్కెట్ -ఎనిమిది కోట్లలోపే. అష్టాచమ్మా, రైడ్, పిల్ల జమిందార్, పైసాలాంటి చిత్రాలతో ప్రూవ్‌డ్ ఆర్టిస్ట్ అనిపించుకున్న నానిని -ఒక చిన్న సినిమా ఇప్పుడు పెద్ద హీరోని చేసేసింది. ఈ ఏడాది ఫోర్ట్ క్వార్టర్‌లో పడిన -్భలేభలే మగాయివోయ్ చిత్రం నాని రేంజ్‌ని డబుల్ చేసేసింది. ఒక్క నానికే కాదు -చిన్న సినిమాకు కెరాఫ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మారుతి రేంజ్‌ని కూడా ఈ సినిమా పెంచేసింది. ఏడుకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం -తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుని, నాలుగు రెట్లు షేర్ రాబట్టిందన్నది ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ బిజినెస్ చేయడం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే విషయం.
ఏడాది ఆరంభంలో ఉయ్యాల జంపాల చిత్రంతో- చిన్న సినిమాకు ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న రాజ్‌తరుణ్‌కు ఆరేడు నెలలు తిరక్కుండానే మరో మంచి సినిమా పడింది. సినిమా చూపిస్త మావ అంటూ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సినిమా రాజ్‌తరుణ్ మార్కెట్ స్థాయినే మార్చేసింది. మార్కెట్ విశే్లషకులు సైతం విస్మయానికి గురయ్యేలా బాక్సాఫీస్ దగ్గర సినిమా చూపిస్త మావ మంత్రం పనిచేసింది. కొన్నిచోట్ల పెద్ద సినిమాలను ఖాళీ చేసి -ఈ చిత్రానికి థియేటర్లు ఇచ్చారంటే సక్సెస్ ఏ రేంజిలో పడిందో అంచనా వేసుకోవచ్చు. పెట్టుబడికి మూడింతలు మార్కెట్టైన సినిమాతో -రాజ్‌పై నమ్మకాలు పెరిగిపోయాయి. చిన్న సినిమా నిర్మాతల చూపు అతనిపై పడింది. ఇటీవల విడుదలైన కుమారి 21 ఎఫ్‌తో రాజ్‌తరుణ్ రేంజ్ పూర్తిగా మారిపోయినట్టే. సుకుమార్ బ్రాండింగ్‌తో బయర్లకు లాభాల పంట పండించింది కుమార్ 21ఎఫ్. మూడురోజుల్లో మొత్తం పెట్టుబడిని రాబట్టుకుని -చిన్న సినిమాకు జయకేతనంగా నిలిచింది. స్వామి రారాతో తనేంటో ప్రూవ్ చేసుకున్న నిఖిల్‌కు -సూర్య వర్సెస్ సూర్య కలిసొచ్చింది. ఈ చిత్రం లాభాల పంట పండించటంతో -కానె్సప్ట్ బేస్‌డ్ చిన్న చిత్రాలపైనా ఓ గురి కుదిరింది. హారర్ కామెడీ జోనర్లో వచ్చిన చిత్రమైన సినిమా -రాజుగారి గది. సినిమా విడుదలకు ముందు భారీగానే ప్రచారం చేసినా -సినిమాపై ఎలాంటి అంచనాలూ కుదరలేదు. జీనియస్ ఫెయిల్యూర్‌తో చాలా గ్యాప్ తీసుకుని యాంకర్ ఓంకార్ నిర్మించిన చిత్రమిది. అంచనాలు లేకుండా వచ్చినా -ఆడియన్స్ బాగానే ఆదరించారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ థ్రిల్లర్‌గా ఓటేశారు. క్రమంగా వౌత్‌టాక్‌తో ఊపందుకున్న సినిమా - అదే సమయంలో వచ్చిన ఓ పెద్ద హీరో సినిమాను సైతం వెనక్కి నెట్టేసింది. బాక్సాఫీస్ దగ్గర బాగా సొమ్ము చేసుకోగలిగింది.
***
తాజాగా ప్రేక్షకుల ముందుకొస్తున్న -శంకరాభరణం. ఇదీ చిన్న సినిమానే. మినిమమ్ బడ్జెట్‌తో, వైవిధ్యమైన చిత్రంగా వస్తున్నదే. రచయిత కోన వెంకట్ బ్రాండింగ్‌తో వస్తున్న సినిమాపైనా పెద్దఎత్తునే అంచనాలున్నాయి. దీని ఫలితం -మరికొన్ని చిన్న సినిమాలకు ఊపిరి పోసేదిగానే కనిపిస్తోంది. నిఖిల్ కెరీర్ గ్రాఫ్‌పై ప్రభావం చూపించే సినిమా కూడా ఇదే. ఇలా -బాగున్న కథ, ఫలించిన ప్రణాళికతో చిన్న సినిమాకు విజయాలేం కొత్త కాదు. మారుతున్న సినీ కాలమాన పరిస్థితులు? ఆడియన్స్‌లో ఏ వర్గాన్ని టార్గెట్ చేశాం? యూత్ కథను ఆకట్టుకునేలా ఎలా చెప్పాలి? లాంటి లెక్కలతో మల్టీప్లెక్స్ కల్చర్‌ను టార్గెట్ చేస్తున్న వైవిధ్యమైన సినిమాలన్నీ లాభాలు ఆర్జిస్తున్నవే.
***
కథను ఎక్కడినుంచి ఏరుకొచ్చినా -కానె్సప్ట్‌లో కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా చెప్పడంలో సక్సెసైన సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నది నిజం. చిన్న సినిమాకూ బడ్జెట్ రేంజ్ పెరుగుతున్నట్టే -ప్రేక్షకులు సక్సెస్ రేంజ్‌నూ పెంచుతున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలతో సమానంగా ఆదరిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలు అందిస్తున్నారు. కథలో దమ్ముండాలి... కథనంలో కొత్తదనం ఉండాలి... టెక్నీషియన్స్ పనోళ్లై ఉండాలి.. లాంటి ఏ ఒక్క అంశంపైనో నమ్మకం పెట్టుకోకుండా అన్నీ కుదిరితేనే హిట్టన్న ధోరణిని వంటబట్టించుకుంటే -సక్సెస్ రూట్‌లో సినిమా నడుస్తున్నట్టే.

-ప్రవవి