మెయన్ ఫీచర్

డిజిటల్ పేరున జనాల నెత్తిపై సెట్‌టాప్ బాక్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యంత్రాన్ని మనిషి తయారుచేసాడు గాని, మనిషిని యంత్రం తయారుచేయలేదు... యాంత్రీకరణ అవసరమే కానీ, ప్రజల కడుపుకొట్టే యాంత్రీకరణ వద్దు...’ అనే సంభాషణలు ‘నయాదౌర్’ సినిమాలోనివి. స్వాతంత్య్రానంతరం నెహ్రూ రష్యా అడుగుజాడల్లో నడుస్తూ, పరిశ్రమల స్థాపనకై ఒప్పందాల్ని చేసుకుంటున్న సందర్భంగా 1957లో బిఆర్ చోప్రా ఈ సినిమాను నిర్మించాడు. మదర్ ఇండియా తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నయాదౌర్ రికార్డు సాధించింది. అందులో గుర్రపు టాంగాకు, ట్రక్కు లాంటి సర్వీసుకు పోటీపెడితే, గుర్రపు టాంగానే గెలిచినట్లు చూపడంలో మనుషులకు, జంతువులకు, యంత్రాలకు గల వ్యత్యాసాన్ని దర్శకుడు కళాత్మకంగా తెరకెక్కించి, రాజకీయ నాయకుల్ని, సమాజాన్ని ఆలోచింపచేసాడు.
కాని, నేటి నేతలంతా పుట్టుక భారతీయతే గాని బుర్రంతా అంతర్జాతీయమే! ఇప్పుడైతే అంతా అంతర్జాలమే! మాట్లాడితే కంప్యూటర్ పరిభాషనే! అందుకే మన నేతలంతా అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సిఇవోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గ్రామాలతో సహా యావత్ దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చివేస్తున్నారు. చివరికి సుపరిపాలన కూడా సులభమైన, అతిసాధారణ సాంకేతిక పరిజ్ఞానంతోనే అందుతుందని, ఆధార్ రూపశిల్పి నందన్ నిలేఖని సెలవిస్తున్నారు. విరల్‌షాతో కలిసి రాసిన ‘రిబూటింగ్ ఇండియా’అనే పుస్తకంలో దేశాన్ని సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతోనే ఎలా ముందుకు తీసుకెళ్ళాలో ప్రస్తావించాడు.
ఇన్ఫోసిస్ కోఫౌండర్ అయిన నందన్ నిలేఖని, నాటి యుపిఎ ప్రభుత్వంలో ఆధార్ కార్డుకు శ్రీకారం చుట్టాడు. పనె్నండు అంకెలు, చేతి వేలి ముద్రలు గల ఈ ఆధార్ ప్రతీ పౌరుడి భవిష్యత్తును బంగారంగా మారుస్తుందని ఈయన ఆలోచన. అనేక అభ్యంతరాల మధ్యన, సుప్రీంకోర్టు ఆక్షేపణలతో ఆధార్‌కు కొంతమేరకు కళ్ళెంపడినా, భారతీయుల భవిష్యత్ అంతా అమెరికాలాంటి అంతర్జాల సంస్థలకు చేరిపోయింది. నిలేఖని ప్రతిపాదించిన పనె్నండు సాఫ్ట్‌వేర్ సూత్రాలలో ఆరు దాదాపుగా పూర్తిఅయ్యాయి. అవి ఆధార్, నేరుగా డబ్బులు జమ, కరెన్సీ లేకుండా మైక్రో ఎటిఎమ్‌ల నిర్వహణ, కాగితం లేకుండా వినియోగదారుడి గుర్తింపు, ఎలక్ట్రానిక్ టోల్‌గేట్ల నిర్వహణ, గూడ్స్ అండ్ సర్వీసు టాక్స్‌లు. మిగతా కావాల్సిన ఆరు: ఎన్నికలు, విద్య, ఆరోగ్య పరిరక్షణ, శక్తి, న్యాయం, జమఖర్చులు. ఇవన్నీ పూర్తయితే రాబడి పెరిగి, ఖర్చు తగ్గుతుందని, ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని నిలేఖని ఉవాచ!
అయితే, నేరుగా డబ్బుల జమ విషయంగా వంటగ్యాసు వినియోగదారులు, ఫీ రిఇంబర్స్‌మెంటులో విద్యార్థులు ఎలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో తెలిసిందే! గతంలో సబ్సిడీ పోగా చెల్లించే సిలిండర్ ధరకు భిన్నంగా, నేడు పూర్తి ధర చెల్లించిన తర్వాతనే సిలిండర్ సరఫరా జరుగుతున్నది. సబ్సిడీ డబ్బుల్ని కొంతకాలం ఏజెంట్లు వాడుకున్న తర్వాత గాని బ్యాంకుల్లో జమచేయడం లేదు. ఇదీ, సక్రమంగా జరుగుతున్నట్లు గుర్తించే స్థాయి మెజారిటీ ప్రజలకు లేదు. సరే, దీని ద్వారా దొంగ సిలిండర్లు, ఒక కుటుంబానికే రెండు కనెక్షన్లు లేకుండా చేసారే అనుకుందాం! కాని, ప్రతీ సిలిండర్ సరఫరాకు అదనంగా రూ.20-30 వసూలుచేస్తున్న విషయం సివిల్ సప్లై అధికారులకు గాని, పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని చెపుతున్న పాలకులకు గాని కనపడడం లేదు. ఎందుకంటే, ఈ వసూళ్ళు ఉన్నతస్థాయి అధికారులకు పోలీసువారికి సంబంధిత అధికారులకు, రాజకీయ నాయకులకు వుండవు కాబట్టి! కాని వాటాలు మాత్రం వుంటాయి. ఈ అక్రమ వసూళ్ళకు గురయ్యేది సాధారణ వినియోగదారుడే! అధవా, ఏ వినియోగదారుడన్నా ఈ విషయంగా ఫిర్యాదుచేస్తే, పట్టించుకునే అధికారులు లేకపోతే మానే! ఏజెంట్ల పట్టింపు, బెదిరింపులు మాత్రం అధికవౌతాయి. ఆధార్‌తో దొంగల్ని, దొరల్ని ఇట్టే గుర్తించవచ్చు అనేది మరో ఆలోచన! ఇప్పటికే దేశంలో 925 మిలియన్ల ప్రజలు ఆధార్ పొందారు. త్వరలో ఒక బిలియన్‌కు చేరబోతున్నది. దేశంలో దొంగలుపడుతున్నారు. రేపులు చేస్తున్నారు. ఒక్కరంటే, ఒక్కరు ఆధార్ బయోమెట్రిక్ విధానంతో పట్టుబడింది లేదు.
నేడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నవి రెండే రెండు వస్తువులు. ఒకటి ఆయుధాలు కాగా, రెండోది సాఫ్ట్‌వేర్ పరికరాలు. అమెరికాలో ఆయుధం లేని ఇల్లు వుండదన్నట్లు, ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ చొరబడని గుడిసె కూడా లేకుండాపోతున్నది. ఇండియాలో ఇప్పటికే 900 మిలియన్ల సెల్‌ఫోన్లు వాడకంలో వుండగా, రోజు పదుల సంఖ్యలో స్మార్ట్ఫున్లు, టాబ్‌లెట్లు, ఐప్యాడులు మార్కెట్లో డంపుఅవుతూ, యువతను పిచ్చెక్కిస్తున్నాయి. ఇంటిల్లిపాదిని దోచుకుంటున్నాయి. గ్రామీ ణ ప్రాంతాల్లో ఈ సెల్‌ఫోన్లపై ప్రతీ కుటుంబం పెట్టే ఖర్చు దాదాపు వెయ్యి రూపాయలకు పైగా వుంటుంది. టీవి నెలసరి ఖర్చు కలిపితే దాదాపు రూ.1200 దాటుతుంది.
ఇప్పుడు మరో ఉపద్రవం వినియోగదారుల్ని బురిడీ కొట్టించబోతున్నది. నలుపు-తెలుపు టెలివిజన్లతో ప్రసారాల్ని మొదలుపెట్టిన దూరదర్శన్ తర్వాత రంగుల్లోకి, ఎల్‌సిడిలోకి, ఎల్‌ఇడి లోకి, వంపు (్ళఖ్పూళ) టీవిలోకి మారిపోయింది. ప్రతీ మార్పు వినియోగదారున్ని ఆకర్షించి, బుట్టలో వేసుకోవడంతో, మార్కెట్లోకి వచ్చిన ప్రతీదాన్ని కొనుక్కోవాలనే ఉత్సాహం కలుగుతుంది. ఇలా ఇంటింటా, ఒకటీ, రెండు టీవీలు జమ అ య్యాయి. మొదట్లో నేరుగా ప్రభుత్వ ప్రసార సాధనాల ద్వారా వీక్షించిన వినియోగదారులు, మెల్లిగా కేబుల్ ఆపరేటర్ల చేతుల్లోకి వెళ్ళిపోయారు. వీటికి తోడు, నేరుగా ప్రసారాలంటూ (డిటిహెచ్) పుట్టగొడుగుల్లా కంపెనీలు వచ్చాయి. వాటి బ్రోచర్లల్లో చూపే ప్యాకేజీలు వాటిని తయారుచేసిన వాడికే తెలియవనుకుంటా! ఇలా టీవిల వీక్షణం పేరున నిత్యదోపిడి దేశవ్యాపితమైంది. వీటికితోడు వందలాది చానళ్ళు! దారి తెన్నులేని ఈ చానళ్ళు 24తి7 అనే నినాదంతో హేతువాదుల్ని సైతం మూఢనమ్మకాల్ని నమ్మేలా చేస్తున్నాయి. దయ్యాల్ని, భూతా ల్ని, మంత్రాల్ని, తంత్రాల్ని జనాలు పిచ్చిగా నమ్మేలా చేస్తున్నాయి. నేరాల్ని, ఘోరాల్ని పదే పదే చూపుతూ, సొమ్ముచేసుకోవడమే కాదు, సమాజంలో కావాల్సినంత నేరప్రవృత్తిని పెంచిపోషిస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన ప్రసారభారతి, తననుతానే నియంత్రించుకొని ప్రైవేట్ ఛానళ్ళకు దాసోహం అంటున్నది.
చానళ్ళను నియంత్రించాల్సిన ప్రసారభారతి ఈమధ్యన ఓ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. పిల్లలందరికీ తప్పనిసరిగా టీకాలు వేయించాలనే ప్రచారంలా ప్రతీ టీవి సెట్‌టాప్ బా క్స్‌ను డిసెంబర్ 31లోపల అమర్చుకోవాలని, ఇకముందు అన్ని డిజిటల్ ప్రసారాలే అని, ఈ బాక్స్‌లు అమర్చుకుంటే అద్దంలా ప్రసారాలను చూడవచ్చు అని, రెండువందలకు పైగా చానళ్ళు దర్శనమిస్తాయని, కోరుకున్న చానళ్ళనే ఎంపిక చేసుకోవచ్చు అని సెలబ్రిటీలచే హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే నెలనెలా రెండువందల రూపాయలకు పైగా చెల్లిస్తున్న వినియోగదారులు, ఈ డిజిటల్ ప్రసారాలు మొదలైతే, అయిదువందల నుంచి ఏడువందల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుందని అంచనా! ఇప్పటికే నియంత్రణ లేని కేబుల్ ఆపరేటర్లు ఈ సెట్‌టాప్ బాక్స్‌ల ద్వారా వినియోగదారుల్ని దోచుకోవడమేకాక, నెలనెలా వడ్డింపులు ఊహకు అందకుండా వుంటాయి. అయినా వినియోగదారుడికి ఇన్ని చానళ్ళు అవసరమా! పట్టణ, గ్రామీణ ప్రాంత సాధారణ వినియోగదారులు చూసే చానళ్ళు రమారమి పదికి మించవు. అలాగే, ఇప్పుడున్న విధానంలో అవే చూడగలడు. అత్యున్నత ప్రసారాల పేరున (డిజిటల్) బలవంతంగా వినియోగదారుల్ని సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోవాలని ఆదేశించడం జబర్ధస్తే అవుతుంది. నిజంగా స్పష్టత కావాలనుకున్న వినియోగదారులు సెట్‌టాప్ బాక్స్‌ల్ని పెట్టుకోవచ్చు! కాని గంపగుత్తగా, ప్రతీ టీవి వినియోగదారుడు విధిగా వాటిని కొనిపెట్టుకోవాలని ఆదేశించడం, ప్రభుత్వ దోపిడి విధానం తప్ప మరొకటి కాదు. నిజంగానే జనాలపై, టీవి ప్రేక్షకులపై ప్రేమ వుంటే, ప్రభుత్వమే వాటిని కొని ఇవ్వాలి. లేదా, సంబంధిత టెక్నాలజీని ట్రాన్సిమిషన్ల దగ్గర అమర్చేలా చూడాలి. కాదంటే టీవీల తయారీ సందర్భంగానే సంబంధిత టెక్నాలజీ అమర్చేలా ఆదేశాలివ్వాలి.
ఇవేవి కాకుండా, వినియోగదారులే వాటిని బలవంతంగా కొనేలా చేయడం అంటేనే సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని విధిగా వాడాలని నిర్దేశించడమే అవుతుంది. గతంలో వ్యవసాయ పంపుసెట్లకు ఇలాంటి కెపాసిటర్లను వాడాలని ప్రభుత్వం రైతులచే కొనిపించింది. ఈ కెపాసిటర్లు నాటి ఆంధ్రప్రదేశ్‌లో ఓ మంత్రివర్యుడి కంపెనీకి చెందినవి కావడం గమనార్హం! ఇలా బహుళజాతి కంపెనీల వస్తువుల్ని వినియోగదారులు విధిగా కొనేలా ప్రభుత్వమే చొరవ చూపడమంటే, దోపిడిని ప్రోత్సహించడమే! జనం సంక్షేమంకోరి, వీటి అవసరాన్ని గుర్తిస్తే, ప్రభుత్వమే ఆ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రసారాల్ని చేయాలి. రేడియో ప్రసారాలకు ఎలాంటి రుసుములు చెల్లించనట్లే, టీవి ప్రసారాలకు కూడా చెల్లింపులు లేకుండా ప్రభుత్వం చూడాలి. ఎలాగో చెత్త ప్రకటనల్ని చూసి, అవసరం లేని వస్తువుల్ని, సౌందర్య సాధనాల్ని, గృహోపకరణాల్ని కొంటూ జనాలు జేబుల్ని చిల్లులు చేసుకుంటూనే వుంటున్నారు కాబట్టి!

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162