రాష్ట్రీయం

హైదరాబాద్ రెండో రాజధాని ఆలోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేసే ఆలోచన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఆ ప్రభుత్వానికి సంబంధించిందేనని, కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కొంత మంది రైతులు వచ్చి తమ సమస్యలను చెప్పుకున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర సహకారం కోరితే తమ అభిప్రాయం చెబుతామని అన్నారు. పార్టీ పరంగా స్థానిక నేతలు తమ అభిప్రాయం చెప్పారన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. జమ్మూ, కశ్మీర్‌లలో పరిస్థితులు బాగా మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు. 1980 నుండి పాత్రికేయులతో కలిసి హైదరాబాద్‌లో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని, సాధారణ కార్యకర్తగా, విద్యార్థి నేతగా పెరిగి ఈనాడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాకు చేరుకున్నానని అన్నారు. బీజేపీలో అనేక స్థాయిల్లో పనిచేశానని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. దుర్బరమైన జీవితాన్ని గడుపుతున్న వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే సీఏఏ వచ్చిందని, ఎవరి పౌరసత్వం తొలగించడం జరగదని పేర్కొన్నారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటికీ నేటికీ ముస్లింల జనాభా పెరిగిందని గుర్తుంచుకోవాలని అన్నారు. అనేక కీలక పదవుల్లో ముస్లింలను గౌరవించుకున్నామని ఆయన పేర్కొన్నారు. అదే పాకిస్థాన్‌లో హిందువులకు ఈ తరహా గౌరవం లేదని అక్కడ హిందువుల జనాభా 15 శాతం నుండి 1.6 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఆనాడు పాకిస్థాన్‌లో 79 శాతం ఉండగా ఈ రోజు 96 శాతానికి పెరిగిందని అన్నారు. అంటే మిగిలిన నాలుగు శాతం ఇతర మతాల వారున్నారని, పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన నివేదికల్లోనే ఈ వివరాలు అన్నీ ఉన్నాయని తెలిపారు. సీఏఏ ఏ మతం వారికీ వ్యతిరేకం కాదని, ఆఫ్ఘనిస్థాన్‌లోనూ, బర్మాలో హిందువుల సంఖ్య భారీగా పడిపోయిందని అన్నారు. సీఏఏపై తప్పుడు ప్రచారం, విషప్రచారం జరుగుతోందని శరణార్థులను ఆదుకునేందుకేనని చెప్పారు. విద్యార్థులు సీఏఏపై రోడ్లమీదకు ఎందుకు వస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. ఎవరికీ వ్యతిరేకంగా ఒక్క అంశం కూడా లేదని వివరించారు. వెబ్ సైట్‌లో చట్టం కాపీ ఉందని, దానిని ఎవరైనా చదువుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్‌పీఆర్ అనేది రాజ్యాంగ పరిధిలో జరుగుతున్న కార్యక్రమమని, ఇది 15వది అన్నారు. బ్రిటిష్ కాలంలో ప్రారంభమైనదని 2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్‌పీఆర్‌ను నమోదు చేసిందని, ఇదేమీ కొత్త విషయం కాదని పేర్కొన్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. సహకరించేది లేదని కొన్ని రాష్ట్రాలు చెప్పడం సరైన వాదన కాదని చెప్పారు. జనాభా లెక్కలు తేలితేనే పధకాలు, కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఇండియన్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రధానకార్యదర్శి విరాహత్ అలి, ఎన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యూనియన్ నేతలు కిషన్‌రెడ్డిని సత్కరించారు.
'చిత్రం... మీట్ ద ప్రెస్‌లో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి