రాష్ట్రీయం

ఐపీసీ, సీఆర్‌పీసీలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 6: బ్రిటీష్‌కాలం నాటివి, స్వతంత్ర భారతం ఏర్పడినప్పటి నుంచి అమలు చేస్తున్న భారత శిక్షాస్మృతిని సమూలంగా మార్పు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ.కిషన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం అనంతపురం నగరంలో మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తేవాల్సి ఉందన్నారు. ఇందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదిస్తోందన్నారు. పోలీసుల సంక్షేమం, ఆరోగ్యం వంటి అనేక అంశాలపై దృష్టి సారించిందన్నారు. అలాగే దేశంలో 70 ఏళ్లుగా అమలు చేస్తున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)లో సవరణలు చేయడం తప్ప, భారత దేశ వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రక్షాళించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో సమగ్రంగా భారతీయ చట్టాలను మార్చాలని కేంద్రం భావిస్తోందన్నారు. ఇటీవల పుణెలో డీజీపీలతో నిర్వహించిన సమావేశంలో మూడు రోజుల పాటు చర్చలు జరిపి ఐపీసీ, సీఆర్‌పీలను పూర్తిగా మార్చాలని, సమగ్రంగా చట్టాన్ని రూపొందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందుకోసం కొత్త బిల్లు తెస్తామన్నారు. చట్టాల మార్పుపై మేధావులు, న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు, పోలీసు వ్యవస్థ, సివిల్ సొసైటీ నుంచి సలహాలు స్వీకరిస్తున్నామన్నారు. ఏపీ రాజధాని అమరావతిని విశాఖకు మార్చడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్ణయించిన తర్వాత కేంద్రం స్పందిస్తుందన్నారు. పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని బట్టి తాము స్పందించలేమన్నారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో విద్యార్థులు, అధ్యాపకులపై ఆదివారం రాత్రి జరిగిన దాడి గురించిన ప్రశ్నించగా, ఈ విషయాలు తనకు పూర్తిగా తెలియవని సమాధానం దాట వేశారు. తొలుత జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద పోలీసు అమర వీరులకు నివాళులర్పించిన మంత్రి అమర వీరుల కుటుంబాలు, పోలీసుల త్యాగాలు, సేవలను కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, దేశ ప్రజల తరఫున పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. పోలీసుగా విధుల్లో చేరిన తర్వాత ప్రజాసంక్షేమం, పౌర సమాజ భద్రతకు పోలీసులు, రక్షక దళాలు జీవితాన్ని ధార పోస్తున్నాయన్నారు. ప్రజా రక్షణలో
అమరులైన వారిని నిరంతరం స్మరించుకోవాల్సి ఉందన్నారు. కాశ్మీర్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి చోట్ల దేశ సరిహద్దులను కాపలా కాస్తూ అహోరాత్రులు రక్షణ కల్పిస్తున్నారన్నారు. మైనస్ 50 డిగ్రీల చలిలోనూ బీఎస్‌ఎఫ్‌లో మహిళలు తుపాకీ చేతబట్టి పహారా కాస్తున్నారని ప్రశంసించారు. పోలీసు వ్యవస్థ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, వీరి త్యాగాలకు గుర్తింపుగా ఢిల్లీలో నేషనల్ పోలీస్ మెమోరియల్, నేషనల్ వార్ మెమోరియల్ స్థూపాలను కేంద్రం నిర్మించిందన్నారు. నేషనల్ పోలీస్ మెమోరియల్‌లో ఆంధ్రప్రదేశ్ అమర పోలీసుల వివరాలు కూడా పొందుపర్చామన్నారు. ఎవరు ఢిల్లీకి వెళ్లినా ఈ రెండింటిని సందర్శించాలని, తద్వారా పోలీసులు, జవాన్ల త్యాగాలు తెలుస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు. పోలీసు మెమోరియల్ స్థూపానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి శిలలను తెప్పించి తయారు చేశామన్నారు. దేశ రక్షణ కోసం త్యాగాలు చేసే వారిని గౌరవించాలన్నారు. వారి త్యాగాలను ఎప్పటికీ మరవలేమని అన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను కేంద్ర మంత్రి బహూకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు, జాతీయ నెహ్రూ యువకేంద్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి, అనంతపురం, హిందూపురం ఎంపీలు పీడీ. రంగయ్య, గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

'చిత్రం... అనంతపురం నగరంలోని పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి