రాష్ట్రీయం

ఇల ధర్మపురి.. ‘అల వైకుంఠపురం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 9: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, సోమవారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా, అపర వైకుంఠపురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్ట్రేతర ప్రాంతాల నుండి జానపదుల బృందగానాలు, భగవన్నామ స్మరణలు, జయజయధ్వనాలు, మంగళవాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం అంబరాన్ని చుంబించింది. మొక్కులు చెల్లించడానికి ఆదివారం రాత్రి నుండే తరలి వచ్చిన భక్తుల, యాత్రికులతో సోమవారం ప్రాచీన క్షేత్రం అశేష జనసంద్రమైంది. నరసింహ శతక పద్యాలు, అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కృతులు, భక్తి సంగీతాలు, హరికథా కాలక్షేపాలు, అలౌకిక ఆనందాన్ని ఆస్వాదింపజేస్తూ, ఆధ్యాత్మిక లోకాల్లో విహరింపజేశాయి. దేవాలయాలలో గండాదీపం, వల్లుబండ, కోడె మొక్కులు, తలనీలాలు, పట్టెనామాలు, కోరమీసాలు తదితర మొక్కులను తీర్చుకున్నారు.
బ్రహ్మోత్సవ ప్రత్యేక పూజలు
బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా సోమవారం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం వంశపారంపర్య యాజ్ఞికులు కందాళై పురుషోత్తమాచార్య, వేదపండితుల ఆధ్వర్యంలో అర్చకులు వివిధ ఆలయాలలో ఉదయాత్పూర్వంనుండి నిత్య హవన, యువాగ్నిధ్యానం, సప్తజిహ్వాహోమం, అగ్నిజటాఝూట ఆధారాది పద్మాంతం యోగపీఠ హవనం, అష్టాక్షరీ మంత్రన్యాస, ద్వాదశాక్షరీ మంత్రన్యాస హోమం, షోడశోపచార పూజలు, మూర్తి మూలమంత్ర హవనములు, నృసూక్త, పురుషసూక్త, విష్ణుసూక్త, భూసూక్త, నీలాసూక్త హవనములు, పరావార హోమములు, ఉత్సవ ప్రధాన హోమం, వ్యాహృతి హోమం, నిర్వహించారు.
దేవాలయ గర్భగుడి నుండి చండ, ప్రచండాది ద్వార పాలకులకు, నృత్యమంటపస్థిత దేవతలకునివేదనాది కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం అనూహ్యంగా పెరిగిన రద్దీకి అనుగుణంగా దేవస్థానంలో నిర్వహించిన అన్నదానానికి పలువురు దాతలు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు తదితరాలను సమర్పించారు.
దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా మాడవ రోజున 7,99,396 రూపాయల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన కోరిన కోర్కెలు తీర్చే యోగానంద నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా సోమవారం గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు.

*చిత్రం...ధర్మపురి దేవస్థానం ముందు కిక్కిరిసిన భక్తజనం