రాష్ట్రీయం

మండలిలో నెగ్గిన టీడీపీ రూల్ 71 నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వ విధానాలకు, రెండు బిల్లులకు వ్యతిరేకంగా రూల్ 71 కింద టీడీపీ ఇచ్చిన నోటీసు నెగ్గింది. చర్చకు ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నోటీసు నెగ్గడంతో బుధవారం వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నోటీసుపై చర్చ తరువాత నిర్వహించిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 27 ఓట్లు (టీడీపీ), వ్యతిరేకంగా 13 (వైకాపా) ఓట్లు వచ్చాయి. తటస్థంగా 9 మంది ఉండిపోయారు. వైకాపాకు అనుకూలంగా టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ రెడ్డి ఓటు వేశారు. సునీత తీరుపై టీడీపీ వర్గాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మండలి సమావేశం మంగళవారం ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి వరకూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. నినాదాలతో హోరెత్తించారు. నోటీసుపై ముందు చర్చ జరపాలని టీడీపీ పట్టుబట్టినప్పటికీ, మండలిలో ముందుగానే రెండు బిల్లులను అధికార పక్షం ప్రవేశపెట్టింది. పలుమార్లు వాయిదా అనంతరం ఈ నోటీసుపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా వైకాపా ప్రభుత్వ తీరుపై టీడీపీ సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు చనిపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదని టీడీపీ సభ్యురాలు సంధ్యారాణి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల కోసం డమీ కాన్వాయ్ మాత్రం తిప్పారని విమర్శించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులవైపు మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ దూసుకొచ్చారు. దీంతో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైపాకా పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని సభ్యులను శాంతింప చేశారు. మూడు రాజధానుల విధానం సరికాదని బీజేపీ సభ్యుడు మాధవ్ వ్యాఖ్యానించారు. భూ సమీకరణ విధానం మంచిదని, అందులో తప్పులను సరిదిద్దాలని కోరారు. చర్చ అనంతరం చైర్మన్ ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో నోటీసుకు అనుకూలంగా ఓట్లు ఎక్కువగా రావడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ మండలిలో చర్చ జరిగే అవకాశం లేదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. బుధవారం జరిగే సమావేశంలో అధికార పక్షం ఏ విధంగా వ్యవహరిస్తోందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
క్షమాపణ చెప్పాలి: యనమల
శాసన మండలిని కించ పరిచే విధంగా మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. మంగళవారం నాటి సమావేశాల్లో బొత్స బెదిరించే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. తమ సభ్యులకు ఫోన్‌లు కూడా చేస్తున్నారని, బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే బెదిరిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై బొత్స స్పందిస్తూ రాష్ట్రంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవాలని కోరుకోవడం కించిపరిచినట్లా అని ప్రశ్నించారు. తాను సభలో నిలబడే ఉంటానని, ఎవరిని బెదిరించామో చెప్పమన్నారు. మండలి కార్యక్రలాపాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడాన్ని యనమల తప్పుపట్టారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను చైర్మన్ షరీఫ్ కోరారు.
వీఐపీ గ్యాలరీలో విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రముఖులు
శాసన మండలి వీఐపీ గ్యాలరీలో ఎంపీ విజయసాయి రెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు సభా కార్యకలాపాలను వీక్షించారు. ఎమ్మెల్యేలు చాలా మంది వీఐపీ గ్యాలరీలో వీక్షించడం గమనార్హం.