సాహితి

చాళుక్య, కాకతీయ స్ఫూర్తిలో తెలుగు ఇతిహాస దీప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెయ్యేళ్ల తెలుగు సాహిత్య నేపథ్యంలో మన వర్తమానం ఉన్నది. ఇవాల్టి ప్రాంతీయ పరిమితులు ఆనాటివారికి వర్తించవు. అలా వర్తింపచేసి సాహిత్యాన్ని దర్శిస్తే, మంచి ఫలితాలను రాబట్టలేము. క్రీ.శ. ఆరేడు శతాబ్దాలనుంచి, శాసన భాషగా తెలుగు ఉన్న దాఖలాలు రాయలసీమ శాసనాల్లో ఉన్నాయి. శాసన భాష అంటే రాజ వ్యవహారిక భాష. ఒక రకంగా గెటిట్ నోటిఫికేషన్‌లో వాడే భాష వంటిది. ఇందులో ఆనాటి పలుకుబళ్ళు, ఇవాళ మనం గుర్తించగలిగే తెలుగు మాటలు కొన్ని ఉండటం శాసన భాషగా తెలుగు పదాల వాడుకను ఖరారు చేస్తుంది. ఎనిమిది - తొమ్మిదో శతాబ్దం వరకూ కన్నడ - తెలుగు లిపి కలిసి ఉండటం వలన రచనలు ప్రత్యేకంగా తెలుగులోకి వచ్చే పరిస్థితి లేదు. పైపెచ్చు స్వతంత్ర రచన లేదు. చాళుక్య, కాకతీయ స్ఫూర్తి దర్పణం మన మహాభారత రచన, తూర్పు చాళుక్య వేంగి రాజు ఆజ్ఞ మేరకు, ఆయన ఆస్థాన కవి నన్నయ మొదలుపెట్టిన మహాభారత రచన - కాకతీయ కాలంలో ఆ రాజ్య సందర్శనం చేసిన, తమ నెల్లూరు రాజ్య సుస్థిరతను తమ పదవీచ్యుత రాజు మనుమసిద్ధి కోసం, కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సౌజన్యంతో సంపాదించుకున్న కవి తిక్కన కాలంలో భారత రచన ఇంచుమించు ముగిసింది. రాజరాజు అంతరంగం ఎలా నన్నయ రచనలో ప్రతిష్టాపితం అయిందో, అలాగే, కాకతీయుల కాలం నాటి శాంతిభద్రతలు, హరిహరాత్మక సామరస్యం, తిక్కన భారత రచనలో దీటుగా నిలబడ్డది.
ఆ శతాబ్దాల్లో ఏది రాసినా, అది రాజు సమర్థించిన, రాజు అప్పగించిన కావ్య కార్య భారమై ఉండాలి. కవి రాజమార్గం రచనలో కావేరి నుంచి గోదావరి వరకూ మా రాజ్యం ఉన్నది అని రాష్టక్రూట పాలకులు చెప్పిన తీరున, ఒకే రాజ్యం కావడం మూలాన కావేరీ తీరప్రాంతాల కన్నడ దేశానికి తెలుగు ప్రాంతాలనుంచి వెళ్లి అక్కడ కవులుగా నిలదొక్కుకున్న పంప, భారతం లోంచి ఒక ‘విక్రమార్జున విజయం’ రాయగా, తరువాతి కవి రణ్ణ భీమ ఘట్టం అంతా ‘గదాయుద్ధం’గాను, అక్కడి తమ పాలకులైన జైన మతావలంబికులైన రాజుల కోసం, మార్చి రాశారు. పంప, రణ్ణ, పొన్న, వీరిని కన్నడ భాషలో రత్నత్రయంగా పిలుస్తారు. పంపని, రణ్ణని భారతాధారిత రచనలు అర్జున విజయం, గదాయుద్ధం, జైన విశ్వాసాలకు అనుగుణంగా మార్చి రాశారు. జైన, బౌద్ధ మతాల్లో ప్రబలంగా ఉన్న సన్యాస పద్ధతికి ప్రతిగా, గృహస్థాశ్రమ ధర్మానికి బలమైన ప్రతిపాదన చేయడం కూడా రాజరాజు ఆలోచనే. వైదిక ధర్మావలంబీకుడైన తూర్పు చాళుక్యరాజు, రాజరాజ చోళుడి (1022-1061 పాలనా కాలం) వద్ద గోదావరికి ఈ దరిన, జైన, వీరశైవ మతావేశాల కన్నడ ప్రాంతానికి దూరాన, నన్నయను మహాభారత రచన చేయమన్నప్పుడు రాజాదేశం, ఒక వైదిక గృహస్థాశ్రమ ధర్మ ప్రశస్థ రచన తెనుగులో రూపం దాల్చాలి అన్నదే ఆంతర్యం. రాజరాజు కోరినది చిన్నదేమీ కాదు - అప్పటికే లక్ష శ్లోకాలకు ఎదిగిన మహాభారతానికి తెలుగు రచన కావాలన్నది ఆయన అభిమతం.
ఇతిహాసం అని పేరున్నది మహాభారతానికి. ‘ఇట్లు చెప్పబడింది’ అని నివేదన పూర్వక వ్రత కథ వలె, నిర్దేశ లక్ష్యాలతో చెప్తే ఇతిహాసం తెలుగులోకి వస్తుంది. కానీ, అలా నిస్సార నివేదిక వలె కాక, నన్నయ ఈ రచనను కావ్యేతిహాసంగా మలిచి రస పోషణ చేస్తూ, పాత్రలను సజీవం చేశాడు. ఇది పద్యం, గద్యం కలిపి చంపూ పద్ధతిలో తెలుగు మహాభారత రచనకు నన్నయ సమకూర్చిన ఆకర్షణ. దీనే్న పదమూడో శతాబ్దంలో తిక్కన నాటకీయత, తెనుగుదనం పెంచి, తెనుగుల పూలతోటగా మార్చాడు. కల్పనాచాతురికి పేరెన్నికగన్న ప్రబంధ పరమేశ్వరుడు ఎఱ్ఱాప్రగడ, పద్నాలుగో శతాబ్దంలో మిగిలిన సగం అరణ్యపర్వం శేషోన్నయం చేసి, తానూ కవిత్రయంలో ఒక్కడు అయ్యాడు. ఈ సమష్టి కృషికి పదకొండో శతాబ్ది నుంచి పద్నాలుగో శతాబ్ది వరకూ మూడు ప్రాంతాల సాహితీమూర్తుల కృషి, రమారమి మూడు వందల ఏళ్లు పట్టింది. అలా సంపూర్ణ మహాభారత రచన మొదలై పూర్తయ్యే కాలానికి, సాహిత్య స్వరూపంలో మార్పులు వచ్చాయి. ప్రబలంగా ఏర్పడ్డది నన్నయ ఏర్పరచిన చంపూ పద్యగద్య మిళిత కావ్యేతిహాస పద్ధతి. నిర్వచన రచనలు (పూర్తి ద్విపదల వంటివి మొదలైనా - వాటికి కవిత పండిత లోకంలో ఆదరణ పెరగలేదు. పాల్కురికి, గోన బుద్ధారెడ్డి తరువాత ద్విపదలో పెద్దగా రాసినవారు లేరు). నన్నయ మహాభారత రచన ‘వస్త్ధ్వుని’ లేదా ధ్వని ప్రధాన సాహిత్య సిద్ధాంతాలకు అనుగుణంగా సాగిన తీరు తదుపరి అనేకమంది కవుల ఆదరణ పెరిగింది.
నన్నయ కాలం తరువాతి తక్షణ సామాజిక మార్పులకు, మతావేశ చోదన తన సాధనగా - పాల్కురికి సోమనాథుడు, అప్పటికే ననె్నచోడుడు చెప్పిన వస్తుకవితా పద్ధతిలో, మత ధార్మిక సామాజికావేశాల శైవీయ ఇతివృత్తాన్ని మతావసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ, తెనుగు సాహిత్య ద్విపదకు ఆదికవిగా వీర శైవ గాథలను చెప్పినది బసవపురాణంగా వచ్చింది. దీనికి మూలమైన గాథలు, నయన రగడ, నామ శివయ్య రగడ మొదలైనవి కన్నడ రగడల్లో ఉన్నాయి. పండితారాధ్య చరిత్ర ద్వారా కూడా తెలుగు ప్రాంత వీరశైవుడైన మల్లికార్జున పండితారాధ్యుని చరిత్ర చెప్పే ద్విపద రచన. మహాభారతం నేరుగా మత ప్రబోధం చేయదు. కానీ వీరశైవ కవిత్వ గాథలు అందుకోసమే రాయబడ్డాయి. బసవ పురాణం అన్న పేరు కూడా పలు జైన పురాణములు అప్పటికే ఉన్న కన్నడ సాహిత్యము నుంచే తీసుకున్నది. వీటిలో పంచ కళ్యాణములు మున్నగు జైన పురాణ రచనా సంప్రదాయాలను, పాల్కురికి కూడా పాటించి ఈ బసవ పురాణాన్ని మనకు అందించాడు. ఇవి తెలుగు కన్నడ ప్రాంతాలకు చెందిన దేశి పురాణాలుగా శాశ్వతంగా పాల్కురికి రచనల్లో నిలిచాయి. ఈ ద్విపద పద్ధతి, కన్నడ సాహిత్య పద్ధతులకు ప్రియమైనది. అందుకు, కుమార సంభవం ద్వారా ననె్నచోడుడు, మల్లికార్జునుడు కూడా తమ రచనల ద్వారా ఈ శైవ భక్తి సాహిత్యకర్తలుగా నిలుస్తారు. నన్నయ ధ్వని సిద్ధాంతాన్ని తన రచనల్లో అనుసరించి రాయగా, పాల్కురికి రస సిద్ధాంత పోషక కర్తగా పరిశీలకులు భావిస్తారు.
నన్నయ మరణంతో ఆగిన భారతం మరలా తన ద్వితీయకర్తను వెతుక్కున్నది. అలా లభించాడు తిక్కన నెల్లూరి సీమలో. రాజ్యభ్రష్టతతో ఉన్న ఒక స్థానిక చోళరాజు, మనుమసిద్ధికి తిరిగి రాజ్యప్రాప్తిలో కాకతీయ పాలకుడు గణపతి దేవుని వద్దకు సహాయం కోసం రాయబారాలు వెళ్లిన మంత్రాంగం నడిపిన ధీశాలిగా గుర్తింపు గలవాడు తిక్కన. తన భారత రచనలో నింపిన తెలుగు సొబగులు, నన్నయ, పాల్కురికి వీరి దారికి ఒక మధ్యమార్గాన్ని వేసుకుంటూ, తాను ఉభయ కవి మిత్రుడు అనిపించుకునేలా, ‘ఆంధ్రావళి మోదంబొరయ’ చేసిన భారత రచన ఈ సామరస్యతకు పూర్తి ఉదాహరణగా నిలిచింది. రసాభ్యుచితబంధముగా, రసధ్వని మేళవింపుగా రచిస్తూ అదనపు జీవధాతువులు, సహజమైన పలుకుబడులు, కదలికలు, పాత్రలకు తెచ్చిపెట్టి, వాటిని నాటకీయ లక్షణ సమన్వితం చేసిన అక్షర భానుడు తిక్కన. భారతంలో స్క్రీన్‌ప్లే అంతా వారిదే - తిక్కన మేధోశాల ఒక రంగస్థలం. పాత్రలకు రక్తమాంస పరిపుష్టిల్ సౌందర్య సౌష్టవం, త్రి తలాల (త్రీ డైమెన్షనల్) లోతు ఇవన్నీ పదిహేను పర్వాల భారత రచనలో తిక్కన తీర్చిదిద్దిన అందాలు, చేసిన ఎగుమతులు. తిక్కనకు నాట్యశాస్తమ్రుతో పరిచయం, పలు ఘట్టాల మహాభారత చిత్రణ నుంచి నిరూపణకు అందుతుంది. కృష్ణా తీరవాసి, కాకతీయ కొలువులో ఉన్న సేనానీ, కళా కౌశలం గల జాయప సేనాని రచన ‘నృత్త రత్నావళి’ తిక్కనకు ఎరుకలో ఉన్నదే. ‘్ధర్మాద్వైత స్థితిలో, మహా కవిత్వ దీక్షా విధిలో, తానీ మహాభారత రచన చేశాను’ అని చెప్పుకున్న తిక్కన అటు కావ్యరచనా, ఇటు శాస్త్ర రచనా కూడా చేసిన ఉభయ కవి మిత్రుడుగా కూడా తన శక్తి ఏమిటో చెప్పాడు. తిక్కన హరిహరనాథ తత్వం, శివ కేశవ అభేదం చెప్పినా తన భారత కృతి హరిహరులకు అంకితమిచ్చినా, భారత రచనలో ఎక్కడా ఆయన మత ధోరణి కనిపించదు. తన రచనను రచన పరిధిలో ఉంచి మత విశ్వాసాల ప్రచార వేదిక చేయకపోవడం లౌకిక దృష్టి అయితే, అది తిక్కన మహాభారత రచనలో మొదలు.
ధ్వని/రస/రసధ్వని మిళిత స్వభావ ధోరణుల ఊయలగా కాలం, తెలుగు అక్షరం ఈ శతాబ్దాల్లో నడిచాయి. కాకతీయ సామంతరాజుగా కందూరులో నియమిత గోన బుద్ధారెడ్డి, పదమూడో శతాబ్దిలో పాల్కురికి పద్ధతిన, ద్విపదలో రాసిన రామాయణం ప్రసిద్ధమైనది. ఇది ఒక ప్రధాన పాత్ర చుట్టూ తిరిగే కావ్య పద్ధతిలో సాగే రచన. గోన బుద్ధారెడ్డి రామాయణ ‘త్రిజట స్వప్నం’ మన పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాము. పాల్కురికి సరసన గోన బుద్ధారెడ్డి ఆసీనుడు కాగా, భాస్కర రామాయణ కర్తలది వేరే దారి.
ఇదే కావ్య పద్ధతిలోనే అయినా, పధ్నాలుగో శతాబ్దిలో పద్య-గద్య మిళిత చంపూ శైలిలో ముగ్గురు కవులు కలిసి రాసిన భాస్కర రామాయణం, ప్రధానంగా హుళక్కి భాస్కరుడి పేరునే ఉన్నా మిగిలిన కవులు మల్లికార్జున భట్టు, రుద్రదేవుడు కూడా ఈ రామాయణ సహకవులు. ఈ రామాయణం మరలా, కవిత్రయం పద్ధతిలోనే ధ్వని రస మిళిత పద్ధతిలో సాగడం ఈ కవుల ఎంపిక. ఇందులో కల్పనా స్వాతంత్య్రం ఉన్నది. వాల్మీకి రామాయణంలో లేని చిత్రణలు, రామ పాత్ర ఔచిత్య ఉద్దీపన జరిగేలా ఈ కవులు చేయడం విశేషం. యుద్ధకాండలో శత్రువు అయిన విభీషణుడ్ని కూడా క్షమించి తనకు లంకా రాజ్యం ఇచ్చేస్తాను అని చెప్తున్నావు కదా - ఏ యుద్ధం కోసం అయితే వచ్చామో ఆ రావుణుడే వచ్చి శరణాగతి కోరితే ఏమి చేస్తావు అని సుగ్రీవుని ప్రశ్న. దానికి రాముని సమాధానం, నా అయోధ్యా రాజ్యమే ఇచ్చేస్తాను. రావణుడే క్షమించమని కోరితే అని. ఇది వాల్మీకంలో లేదు. ఇదే తరువాత పద్దెనిమిదో శతాబ్దిలో త్యాగరాజస్వామి వారికి తన కృతిలో ఒక సుందర చరణం అయింది. (సరస సామ దాన భేద దండ చతుర సాటి దైవమె వరె బ్రోవవే - పరమశాంభవాగ్రేసరుడననుచు బలుకు రావణుడు దెలియలేకపోయె - హితవు మాటలెన్నో బల్కితివి సతముగా సయోధ్యనిచ్చేనంటివి). దీని అర్థం - కాకతీయ కాలాంతర కృతి అయిన హుళక్కి భాస్కరుని నవీన చిత్రణల రామాయణ జ్ఞానం త్యాగరాజుకి ఉన్నదని. ఇది భాస్కర రామాయణ ప్రాముఖ్యత. పోతన పద్య చరణాల ప్రభావం కూడా త్యాగరాజు కృతుల్లో కనిపిస్తుంది.
రామాయణం కావ్య పద్ధతి రచన కాగా, మహాభారతం ఇతిహాస పరమైన రచన కాగా, భాగవతం మహా పురాణ పద్ధతి రచన. ఈ మూడు మనకు చాళుక్య కాకతీయ కాలాంతరంలోనే రావడం విశేషం. క్రీ.శ. 1030 ప్రాంతాల్లో మొదలైన తెలుగు రచనలో ఇతిహాస పరంపర అవిచ్ఛిన్నంగా సాగి పోతన (1450-1510) భాగవత పురాణ అనుసృజన - ఆంధ్ర మహాభాగవతము పేరిట రాసిన మహాపురాణ సృష్టితో ఆది కావ్యాలుగా చెప్పుకునే రామాయణ భారత భాగవతాలు చంపూ పద్ధతిలో కవిత్రయం, భాస్కర రామాయణ త్రయం, పోతన నాయకత్వంలోని భాగవత కవి బృందం ద్వారా సమష్టి కృషిగానే తెలుగు సాహిత్యంలో విలసిల్లుతున్నాయి. నాలుగు వందల ఏళ్ల కాలం పట్టింది వీటి ఆవిర్భావానికి. వీటి వెనుక గల రాజ్య నేపథ్యాలు చాళుక్యులు, కాకతీయులు, వారి ఉప పాలక రెడ్డిరాజులు ప్రధానం కాగా, భాగవత రచన నాటికి వెలమ రాజుల పాలనలో ఉన్నాము. మహాభారత సందర్భంలో రాజాదేశంతో మొదలైన ఇతిహాసాల ఆంధ్ర రచన పరంపరలో, హరిహరాంకితాలు, రంగనాథాంకితాలు, సాహిణి మార అనే పాలకునికి అంకితాలుగా సాగి, పోతన కాలానికి రాజ ప్రభావాలకు లొంగని ఆత్మశక్తి గల కవి రచనగా, పలికించిన రామభద్రునకు అంకితంగా మహాభాగవతం నిలిచింది. ఇలా ఒక అర్ధ సహస్ర కాలంలో తెలుగువారికి దఖలు పడిన ఈ ఇతిహాస త్రయం - ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తినిధిగా తమ రచనలను, సారమతులుగా ఈ కవీంద్రులు నన్నయ బాటలోనిలిచి ద్విపదను కొండకొచో స్వీకరించి, శాశ్వతంగా నిలబెట్టిన వేలస్తంభాల మండపాలు ఈ తెనుగు ఇతిహాసాలు. అందుకే చాళుక్య, కాకతీయ స్ఫూర్తిలో పది-పదిహేను శతాబ్దుల కాలపు ఈ తొలి అయిదువందల ఏళ్ల ఇతిహాస సృజన దీప్తికి వందనం చేద్దాం.

- తిరునగరి శ్రీనివాస్, 9441464764

- రామతీర్థ, 98492 00385