సాహితి

భాషా మయూరాలు... కవితా నృత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రసగంగ కృష్ణ ఒకప్రక్క, ప్రపంచ కవితా తృష్ణ మరో ప్రక్కన, వివిధ భాషల మయూరాలు గొంతులు విప్పాయి. భావాల జీవధాతువులతో పురులు విప్పాయి. అక్షాంశ రేఖాంశ పరిధుల్ని దాటి అక్షర కవితా పఠనలు చేశాయి. విజయవాటిక - బహు భాషల బహు విధముల కవితా పేటిక విప్పి, కవిత్వ పర్వ శుభదినాలుగా ఆవిష్కరించుకుంది.
ఒక నెలలో ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో మహోత్సాహంతో నిర్వహించనున్న ఒక భాషా సాంస్కృతిక ఉత్సవ వాతావరణ కాలంలో... మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశంలో విజయవాడలో అమరావతీ పొయిటిక్ ప్రిసమ్ పేరున బహు దేశ బహు భాషా కవుల కవితా పఠనల సందడిలో కైతల విందులు; రుచిమంత భావానుభూతుల, ఆలోచనల వడ్డింపులు. విజయవాడ మరియు అమరావతి సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యాన, అధికారులైనప్పటికీ సైనిక క్రమశిక్షణతో పనిచేసిన సిఇఓ, చరిత్రాధికారి డా. ఈమని శివనాగిరెడ్డి, గౌరవ సాహిత్య సలహాదారు, ద్విభాషా కవయిత్రి శ్రీమతి పద్మజా అయ్యంగార్, సి.సి.వి.వి. స్థాపకులు వై.హరిశ్చంద్ర ప్రసాద్, శ్రీమతి వై. తేజస్వినుల భాగస్వామ్య కార్యాలవల్ల విజయవంతమైంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, విజయవాడ మేయర్ శ్రీ్ధర్, శ్రీమతి నన్నపనేని రాజకుమారి వంటివారు సాహిత్యాంశాల ప్రస్తావనలతో ఆయా సందర్భాలలో సముచిత ప్రసంగాలు చేయడం అభినందనీయం. అమరావతీ పొయిటిక్ ప్రిసమ్ పేరున ఒక బృహత్కవితా సంపుటి శాశ్వత ప్రాతిపదికన ప్రకటించడం సంస్థ చేసే బృహత్కార్యం.
2016లో వచ్చిన కవితా సంపుటిలో 53 భాషల 527 కవితలు చోటుచేసుకోగా ప్రస్తుతం 2017లో 85 భాషల 948 కవితలు చోటుచేసుకోవడం అభివృద్ధి దశా విశేషం. వేయి మైళ్ల నడకలో ముందు వేసే ఒకటి రెండడుగులూ ముఖ్యమే మరి.
అల్బేనియా, అరబిక్, ఫ్రెంచి, జర్మన్, గ్రీకు, హిబ్రూ, హంగరీ, జపనీస్, కొరియా, మిజో, నేపాలీ, థాయ్, తర్కిష్, ఆంగ్లం వంటి విదేశీ భాషలు, తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళం, కన్నడం, అస్సామీ వంటి స్వదేశీ భాషలు ప్రాతినిధ్య గళ విలాసాలు ప్రదర్శించాయి.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల తెలుగు కవులకు అరవై మందికి పైగా ప్రాతినిధ్యం లభించింది. పక్షులైతే సీమావధులు దాటి, కాల వ్యయంతో సరిపెట్టుకుని చేరవలసిన ప్రాంతాలకు చేరతాయి, విహరిస్తాయి. ఈ కవితోత్సవంలో పాల్గొన్న దూర దూర విదేశ కవి పక్షులు రాకపోకల స్వంత ఖర్చులు పెట్టుకుని కేవలం కవిత్వాభిమానంతో వచ్చాయ(ర)ని నిర్వాహకులు సభాముఖంగా ప్రకటించినప్పుడు సముచిత కరతాళ ధ్వనులు మార్మోగాయి. వసతి, విందు, రవాణా సౌకర్యాలు నిర్వాహకులు ఆత్మీయంగా ఏర్పాటుచేశారు.
పురివిప్పిన గొంతుల్లో కైతల సిరులు
ఉప్పులూరి ఆత్రేయ శర్మ ‘ఔన్నత్యం’ కవితలో - మేడపై, పిట్టగోడపై, పైకప్పుపై / పావురాల కిచకిచలు, విహారాలు / ఆహారాలు, సమావేశాలు / పలకరింపులు, పులకరింతలు / రెక్కల టపటపలు, చిత్రవిచిత్ర విన్యాసాలు / అలజడి లేదు ఆరాటం లేదు / కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ / తోపులాటలు లేవు, తూటాల పేలుళ్లు లేవు / సొంతదారుడు లేడు, బాడుగవాడు లేడు / రిజిస్ట్రేషన్లు లేవు, రిజర్వేషన్లు లేవు / విభజనలు లేవు, కబ్జాలు లేవు / ... ఎత్తులో ఉన్నందువల్లనేమో ఆ ఔన్నత్యం’ - అన్నారు. ఇంత మానవులమూ అంత పక్షుల ముందు ఏపాటి అనిపించిన ఈ కవిత ప్రేక్షక హస్తాల వౌనభంగానికి దారితీసింది.
‘నదిలో కొట్టుకుపోతున్న దుంగపై / కాసేపు వాలి / పేరు, ప్రవర చెప్పుకునే వలస పక్షులు చేసే గానమిది’ అనే కేంద్రీకృత భావాన్ని చెప్పిన బొల్లోజు బాబా వలసపక్షుల గానం కవితా సంపుటికి ఒక అలంకారం. కొండ్రెడ్డి వెంకటరెడ్డి ‘శ్రమ చేతులైతే’ కవిత విజయాలకు శ్రమ మార్గం ప్రబోధం చేసింది. మందరపు హైమావతి ‘పూలమ్మాయి’ ఖండికలో ‘పూలమ్మడమంటే పూల సువాసనలు ఆస్వాదించడమంత సులభం కాదు’ అంటూ ఆమెను అవమానాల ఎండలో కమిలిన కలువ పువ్వుగా చెబుతూ తండ్రి మందుకూ, తల్లి అనారోగ్యాల గీతిక అయినప్పుడు ఉన్న బాధ్యతను కరుణాత్మకంగా రాశారు. ఎం.కృష్ణమోహన్ లోటస్ టెంపుల్ కవితలో పదచిత్రాలు భావయుక్తంగా మెరిశాయి.
మెర్సీ మార్గరెట్ ‘కవి మరణానంతం’ కవితలో ‘పుస్తకం తెరవబడే వుంది / కళ్లజోడు గుమ్మంకేసి చూస్తూనే వుంది / అతని పాదరక్షలకి నిజం తెలిసినా, లోనికెళ్లవు... ఇంట్లోకి ఇక ఏ వెలుతురూ తొంగిచూడదు’ అంటారు. రసోద్దీపన తెలిసిన కవయిత్రి అనిపించింది. ప్రాణహిత కవి నందిని సిధారెడ్డి ‘రంగుజీవి’ జానెడు చెక్కమీద వేలాడుతూ జారుతూ రంగులు వేసే ఆయనని ఆయన జీవితాన్ని కవిత్వీకరించి దర్శనమిప్పించారు. అంగాలు అర్పించుకున్న మంథని మధుకర్ ప్రేమ స్మృతిగా ఎండ్లూరి సుధాకర్ ‘అంగలార్పు’ కవితలో ‘ప్రపంచంలోని / పురుషాంగాలన్నీ / చిన్నపిల్లలై / ప్రేమ దేవతముందు ప్రణమిల్లి ‘వీనస్! పవిత్ర ప్రేమకు అంగవిచ్ఛేదన న్యాయమేనా? / వధకు తేబడ్డ గొర్రెపిల్లలా / మధుకర్ వర్ణహింస సమంజసమేనా?’ అని ప్రశ్నించాయంటూ ప్రపంచ ప్రేమికులారా! ఈ పరువు హత్యల్ని ఖండించండి అంటూ మంచి నివాళి కవిత రాశారు. పత్తిపాక మోహన్ ‘కొలంబో అయినా... కన్యాకుమారి అయినా అంతులేని గాథలు... తరగని అలలు’ గల సముద్రాన్ని మానవపరంగా వాచ్య రహితంగా కవిత్వీకరిస్తూ ‘సముద్రం / ఎక్కడైనా సముద్రమే / స్తబ్దత దాని నిబద్ధత కాదు / దూరాలను కలిపి / భారాలను తగ్గించడమే దానికి తెలిసిన విద్య’ అన్నారు. ‘కళ్లకు కట్టిన మాయ జలతారు తెర / చీలికలై పేలికలై జారిపోయిందనీ / గుండెల్లో దిగిన బాకు బంధించిన నెత్తురు ఉడుకు / ఇక ఎప్పటికీ చల్లారదనీ నాకు తెలుసు’ అంటూ ‘అయినా కనికరం లేని స్మృతులే నాకు కావాల’నడంలో ఏదో ఒక అవ్యక్త వైయక్తిక బాధ అగాథంగా ఉందనిపిస్తుంది. శిఖామణి ‘కవిత్వం’లో కవిత్వం అంటే ఏమిటో ఉదాత్తంగా చెప్పారు. అలిశెట్టి ప్రభాకర్ ఖండిక జ్వలించే ‘అక్షరం’ ఒక అక్షర కవిత. ‘బతికీ బతక్కమునుపే బతుకులు తెల్లారిపోతున్న’ బాధా సందర్భంలో దారి వంకరైనప్పుడు మనమే చూసి నడవాలని అంటారు ఒక అనుభూతి వ్యక్తీకరణతో. తన ‘తప్పెవరిది కాదు?’ కవితలో - కనె్నగంటి అనసూయ, ‘కాన్వర్సేషన్స్’ కవితలో బెంగాల్ కవయిత్రి అమనితాసేన్ శ్రోతలను ఆకట్టుకున్న మానవీయ కవితలలో ఒక ముఖ్య కవిత. అమనితా సేన్ విమానాశ్రయం లాంజ్‌లో కూర్చొంది. ‘సంభాషణలు’ అంశంపై కవిత రాయాలని ఆలోచిస్తోంది. ఇంతలో బాధాపూరిత రోదనల చిహ్నాలుగా ఒక ఏడాది వయస్సు పసివాడు మూలుగుతున్నాడు. ఆ పిల్లవాని తల్లి వచ్చి ‘మేం చెన్నై నుండి తిరిగి వచ్చేశాం. ఈ ఒక సంవత్సరం బిడ్డకు ఎడమ కన్నుకు కేన్సర్ వచ్చింది’ అంది. బాధాపూరిత శబ్దాలు చేసే పిల్లాడి విషయంలో తల్లి వైద్యం గురించి అడిగితే - సిద్ధమవుతున్న ‘సంభాషణల’ కవితను పునరాలోచించుకుంటూ తాను సరైన జవాబుకు నిరీక్షిస్తున్నానన్న ఈ కవిత ఒక కవి మార్గాన్ని విషాద వస్తువు ఎలా మారుస్తుందో తెలుపుతుంది. లైంగిక వేధింపులపై, ప్రేమపై, విరహంపై, సామాజిక వర్తమాన అనేక సమస్యలపై, మానవ సహజ అనుభూతులపై, కృష్ణాతీరంపై, ఇసుకపై, ఆలోచనలపై, మరణంపై, మనస్సుపై, కుటుంబ గాథలపై, బాధలపై కవి వ్యక్తిత్వాలపై, చైనా ప్రజలపై - ఇలా ఇలా ఒకటి కాదు అనేకానేక అంశాలపై కవిత్వాలు బహుళార్థ సాధకులుగా, అనేక అనుభూతుల వ్యక్తీకరణలుగా, ఒక శాశ్వత చైతన్య కవితా వాహికులుగా బహుభాషా కవి సమ్మేళనం సాగింది. 949 పుటల అంతర్జాతీయ కవితా సంపుటిని సభా సమయానికే స్వల్ప వ్యవధిలో తీసుకురావడం అభినందనీయం. అయితే కవితా పఠన సందర్భంలో ఏ భాష కవితకైనా సారాంశాన్ని ఆంగ్లంలో చెప్పడం జరిగితేనూ, కవితా బృహత్సంహితలో ఆంగ్లంలో సారాంశాన్ని ఇస్తేనూ అధిక ప్రయోజనం ఒనగూడేది, మరింతగా. స్వభాష అయినా, ఇతర రాష్ట్రాల భాషలయినా, విదేశ భాషలయినా కవిత్వం పలకడంలో కవిత్వ భాష అంటూ ఒకటి ఉంటుందని స్టేట్‌మెంటాలిటీని మితిమీరిన వాచ్య దృష్టి ఉండకూడదని ఈ ‘అమరావతి ప్రిసమ్’ స్పష్టం చేసింది. ‘పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్’ సంతతుల కవిత్వ ఆస్వాదన చేయాలనుకునే కవితా ప్రహ్లాదులకు అమరావతి ప్రిసమ్ రెండు రోజుల కైతల పండుగగా భాసించింది. కెనడా నృత్యకళాకారిణి అంజలీ పాటిల్ తన బృందంతో చేసిన కథక్ నృత్యం అత్యద్భుతంగా సాగింది. వారి హావభావ విన్యాసాలకు రసజ్ఞులు ముగ్ధులయ్యారంటే అది కూడా తక్కువేమో!
శాతవాహనుల కాలంనుండీ సాంస్కృతికంగా చారిత్రకంగా పేరొందిన విజయ వాటికలు సారవంతమైన కృష్ణాతీరంలో రస సారవంతమైన కవితా పఠనల కోలాహలం మధుర స్మృతులనూ, ఒక బహుభాషల బృహత్కవితా సంపుటినీ మిగిల్చింది. దేశదేశాల కవులు ఆనందంతో గడిపి వీడ్కోలు పలకరింతల్లో ఎక్కడి కవి పక్షులు అక్కడికే తప్పదనే భావ భారంతో కదిలివెళ్లారు. కవిత్వం, కళలూ మానవుల్ని కలిపే, సేద తీర్చే చలివేంద్రాలు. ఒక మంచి కవిత్వం ప్రపంచానికి చేర్చబడినప్పుడు ఎప్పటికీ ఆ ముందు ప్రపంచం అలా ఉండిపోదు అన్నాడు డిలాన్ థామస్.
అమరావతీ ప్రిసమ్ -2017 వల్ల ప్రపంచానికి ఎన్నో మంచి కవితలు అదనంగా చేరాయి. కవితా ప్రపంచం మారకుండా వుండగలదా? భాషా మయూరాల కవితా నృత్యాలు, పింఛాలే కాదు; గొంతులూ విప్పాయి.

- సన్నిధానం నరసింహశర్మ 9292055531