సాహితి

స్ర్తిల కుటుంబ హక్కులు - కాళ్లకు మొక్కుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలకు సమాన హక్కులు ఇవ్వాలని, వారిని హృదయపూర్వకంగా గౌరవించగలగాలని వ్యాసాలు, ఉపన్యాసాలు చేయడం వేరు; వారి వాస్తవిక పరిస్థితిని కళ్లకు కట్టేట్లుగా వర్ణించి చెప్పడం వేరు. ఇది కధ మాత్రమే అని తీసిపారవేయడానికి లేకుండా, వాళ్లు పడుతున్న శారీరక, మానసిక యాతనలను తెలియజెప్పడం ఎంతో ఉదాత్తమయిన విషయం. కీ.శే. పురాణం సూర్యప్రకాశరావు రాసిన ‘చరణదాసులు’ (1956) కథలో ఇటువంటి ప్రయత్నం జరిగింది. ఈ కథలో సంసారిక సుఖానికి, కుటుంబ ఆలోచనకు లోటు ఏర్పడిన ఒక అభాగ్యురాలు తన వదినకు (అన్న భార్యకు) వ్రాసిన ఉత్తరం యిలా సాగుతుంది.
‘‘ఒకప్పుడు నిన్ను చూసి అసూయపడ్డాను. తలుచుకుంటే యిపుడు సిగ్గువేస్తుంది. ఆడదాన్ని గురించి యేమని చెప్పను? ఒక స్ర్తిని చూసి మరొక స్ర్తి సానుభూతి చూపిస్తుంది. నిజానికి అంతా ఒకటే చీకటి. కొట్లో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతున్నాం. ఒకరికంటే మరొకరు ఏ విధంగానూ మెరుగైన స్థితిలో లేరు.. ముఖం చూస్తే అసహ్యించుకుని, కొట్టి, తిట్టి, న్యూనతపరచి ‘నువ్వంటే నాకు అభిమానం లేదు. నీ ముఖం చూడను’ అని వదిలేశాడు నా భర్త నన్ను. ఇదొక రకం జీవితం. వేళకింత తిండి పడేసి, కట్టుకుందుకు గుడ్డముక్కలు నాలుగు యిచ్చి, అవసరం తీర్చుకుందుకు రాత్రి హృదయంలో కాస్త చోటు ఇచ్చి, తను ఇవ్వలేని గౌరవం తనకు ఇవ్వాలనే నమ్మకంతో, నీ శరీరంలోని జీవశక్తినంతా పీల్చి పిప్పిచేసే నీ భర్త కోసం దాసీదానివై నువ్వు బతుకుతున్నావు. అనేక సంసారాలు చూచాను. నే తెలుసుకున్న సత్యం ఒక్కటే. ఈ ఆడవాళ్లంతా చరణదాసులు! నువ్వు నీ భర్తని ఎంతైనా ప్రేమించు, ఎంతయినా గౌరవించు, ఎంతయినా సేవ చేయి. నీ హద్దులు దాటి నువ్వు ఒక్క అడుగైనా అవతల వేశావా నీ భర్త నిన్ను క్షమించడు..’. ఎన్నాళ్లు అమాయకంగా ఈ జాతి ఇలా మోసపోతుంది!
ఈ ఉత్తరాన్ని చదివిన ఆమె అన్న ప్రసాదం ‘దానికి మతిపోయిందిలే’ అని చెబుతాడు తన భార్యతో. ప్రసాదం అన్నగా ఆమెను ఆప్యాయంగా చూచినవాడే. ఆమె మెట్టింటి జీవితం సరిగా సాగడంలేదని సాక్షాత్తుగా చూచి, తన ఇంటికి తీసుకువచ్చినవాడే! మారుతున్న మనసున్నవాడే. అయినా వెనకటి వాసనలు, కుటుంబం పాటిస్తూ వస్తూన్న దురాచారాలు ఇంకా అతన్ని కట్టిపడేస్తూ వున్నాయి.
విశాలాక్షి, అనూరాధ వదినా మరదళ్లు. ఇద్దరి కుటుంబ పుట్టింటి వాతావరణం ఒక్కటే. మెట్టింటి కథనం కూడా అదే తీరు. స్ర్తిని చరణదాసిగా చూడడం, అంతకంటే ఎక్కువ స్థాయి ఇవ్వవలసిన అవసరం లేదని దృఢంగా నమ్మిన కుటుంబాలు.
విశాలాక్షి తల్లిదండ్రులు పరంధామయ్య, కామాక్షమ్మ రుూ మూసలో తయారయినవారే. భార్య అంటే కేవలం తను చెప్పిన పనులు చేస్తూ, తనకు బానిసగా వుండిపోవలసిన మనిషేనని పరంధామయ్య అనుకుంటాడు. అనూరాధ (కూతురు) రాసిన ఉత్తరంతో దిగులులో పడిపోయినా, మరో తరుణోపాయం అనే్వషించి కనుక్కోలేనంత అసమర్థుడు.
అనూరాధ (ప్రసాదం భార్య) ఎంతో తెలివితేటలు కలదానినని విశ్వసిస్తూనే, చాకచక్యంగా వ్యవహరిస్తూనే.. భర్తకు ఊడిగం చేయడంలోనే తన జీవిత సుఖం, పరమార్థం అంతా ఇమిడి వున్నదని భావిస్తుంది.
యాంత్రికంగా తయారయి, ఆలోచనా ద్వారాలు ఏ మాత్రం తెరుచుకోకుండా, చీకటిలో అనవరతము వుంటూ అదే వెలుతురు అనుకునే మనుషులకు రుూ కథలో పాత్రలు ప్రతీకలు. జీవితం పరిమితమయినదని అనుకుంటూ ఆ పరిమితులను దాటటానికి ప్రయత్నం చేసే అవకాశం కూడా వున్నదని యోచన లేనివాళ్లు.
అనూరాధ- రుూ సంకెళ్లన్నీ తెంచుకుని బయటపడి, నలుగురు పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ తన స్వీయ సంపాదనతో శాంతంగా వుండటానికి అడుగులు వేయ సాహసించిన మనిషి. పగవాడికి కూడా ఇటువంటి ఇక్కట్లు రాకూడదు అనుకునే సందర్భాలనుంచి బయటపడి స్వయంకృషితో మెలుగుతున్న వ్యక్తి. సమయాన్ని జయించి తరించిన ఒంటరిపాత్ర. కుటుంబ జీవనంలో సుఖసంతోషాలు కావాలనుకున్న వాళ్లందరూ జీవిత మూలాలలోనికి వెళ్లి తరచి తరచి చూచుకుని గమనించే విషయాలు ఈ పెద్ద కథలో ఎన్నో వున్నాయి. అరవయి సంవత్సరాల క్రిందటి కథే అయినా ఇంకా ఇలాంటి ఇతివృత్తంతోనే గుడుగుడుగుంజం ఆడుతున్న మనుషులు వుండవచ్చును. వారికి కరదీపిక యిది.

- శ్రీవిరించి, 09444963584