సాహితి

సరికొత్త సాహితీ పొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ ప్రక్రియ ఏదైనా రచయిత భావుకతకు, సమకాలీన అంశాలపై అతడి అవగాహనకు అద్దం పడుతుంది. కథ అయినా, నవల అయినా, పద్యమైనా, గద్యమైనా అన్ని ప్రక్రియలు కూడా రచయిత ఎంపిక చేసుకున్న కాల్పనిక అంశాలను ప్రతిబింబిస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో నిరుపమాన రచయితలెందరో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఒక్కో రీతి. తాము ఎంచుకున్న అంశాలను పాఠకుల హృదయాలు తాకేలా అందించగలిగే పదునైన పదజాలంతో సాగిన నవలలు కొన్నైయితే... భావుకతను భిన్న కోణాల్లో ఆవిష్కరించి సరికొత్త కాల్పనిక ప్రపంచాన్ని కళ్లకు కట్టే ధోరణి ఇంకొందరిది. రచయిత ఏ ప్రక్రియను ఎంచుకున్నా అది కచ్చితంగా అతడి సమకాలీన ప్రపంచానికి దివిటీగా నిలిచేదే అవుతుంది. ఆ నవలలోని భావాలు ఎంత గాఢంగా, ఎంత లోతుగా, ఎంత పదునుగా, ఎంత సునిశితంగా ఉంటే అంతగానూ పాఠకుడు ఆ నవలలో మమేకం కాగలుతాడు. రచయిత భావ ప్రకటన ప్రావీణ్యానికి, నైపుణ్యానికి మంత్రముగ్ధులు కాగలుగుతారు. అలాంటి అరుదైన సాహితీ కౌశలం అత్యంత అరుదు. ఇంతటి ఘనతను, భాషా పటిమను, భావ లోతులను స్పృశించగలిగే పరిపూర్ణ ఆలోచనా రీతిని సంతరించుకున్న రచయిత కాజువో ఇషుగురో. కొన్ని దశాబ్దాలుగా ఆంగ్ల సాహిత్యానికి భిన్న కోణాల్లో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ సాహితీ పురస్కారం లభించింది. ఆయన నవలలన్నీ కూడా ఐహిక ప్రపంచానికి వాస్తవిక కోణంలో దర్పణం పట్టినవే. ముఖ్యంగా ఆయన మాటల్లోనూ, ఆయన ఎంపిక చేసుకున్న పాత్రలు పలికే భావాల్లోనూ బలమైన ఉద్వేగం ఉంటుంది. ఆ ఉద్వేగంలో భావోద్వేగ శక్తి కూడా ఉంటుంది.
నాలుగు దశాబ్దాల పాటు సాహితీ ప్రపంచాన్ని కాచి వడపోసిన సాహిత్య దిట్ట ఆయన. రాసిన నవలలు తక్కువే అయినా వాటిలోని పాత్రలను ఆయన ఆవిష్కరించిన తీరు అత్యంత భిన్నమేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతివృత్తం ఏదైనా బలమైన భావజాలం, దానికి తగ్గట్టుగా పాత్రల సృజన ఆయన నవలలకు కొత్త శక్తినీ ఊతాన్ని ఇచ్చింది. ఏ నవల తీసుకున్నా కూడా ఆయన అంతకుముందు రాసిన వాటికి ఏవిధంగానూ సారూప్యాన్ని కలిగివుండకుండా కొత్తదనాన్ని సరికొత్త రీతిలో పాఠకుల్లో చివరివరకు ఉత్కంఠను ఉత్తేజాన్ని కలిగించేదిగానే ఉంటుంది. 1994లో కెంజాబురో ఓయె తరువాత నోబెల్ సాహితీ పురస్కారాన్ని అందుకున్న జపాన్ జన్మిత రచయిత ఇషుగురోనే కావడం గమనార్హం. సాధారణంగా పెద్ద నవలలు రాసేటప్పుడు సాహితీ లయ అన్నది కొన్ని సందర్భాల్లో కొరవడుతుంది. కానీ ఇషుగురో నవలలన్నీ కూడా ఎలా మొదలవుతాయో, అందులోని పాత్రలు ఎలా కదులుతాయో చివరి వరకు కూడా అదేరకమైన పటుత్వం వాటిలో వుంటుంది. అందుకే అత్యంత అరుదైన ప్రపంచ సాహితీవేత్తల్లో ఒకరుగా ఇషుగురో రాణించగలిగారు. ఆయన భావం పాఠకుల హృదయానికి తాకుతుంది. ఆయన సృష్టించే పాత్రలు కూడా ఐహిక ప్రపంచ లోతుల్లోకి వెళ్లి అందులోని నిర్లిప్తతను, నిర్జీవత్వాన్ని ఆవిష్కరిస్తాయి. అందుకే ప్రతి పాత్ర, అది పలికే ప్రతి మాట పాఠకుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఒక నవల తర్వాత మరొకటిగా ఇలా ఎన్ని రాసినా కూడా సమకాలీన అంశాలకు సవాళ్లకు దర్పణం పట్టే విధంగానే ఇషుగురో నవలలు సాగాయంటే అందుకు కారణం ఆయన ఎంపిక చేసుకున్న ఇతివృత్తం అంతే బలంగా, అంతే భిన్నంగా ఉండటమే. పైగా ప్రతి మాటలోనూ, ప్రతి పంక్తిలోనూ ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక కొత్త భావాన్నీ, సరికొత్త భావుకతను సృష్టించగలిగే సాహితీ సత్తా ఉండటం వల్లే ఇషుగురో నవలలన్నీ సమకాలీన ప్రపంచాన్ని ఉర్రూత లూగించాయి. లబ్ధప్రతిష్టులైన మహా రచయితలు సైతం ఆయన భావ ప్రకటనా స్ఫూర్తికి, ఆయన ఎంచుకున్న పాత్రలు పలికే మాటల లోతుకు దాసోహమే అయ్యారు. ఆయన నవల చదువుతుంటే దృశ్యం కళ్లకు కడుతుంది. ఆ పాత్రలే మన ముందు కదలాడుతుంటాయి. అవి వ్యక్తం చేసే భావాలు మనల్ని అమితంగా ప్రభావితం చేస్తాయి. కొత్త వాటిని సృష్టించడంతో పాటు వాటిలో వున్న రహస్యాలను వెలికి తీయడంలోనూ, వాటి ద్వారా ఐహిక ప్రపంచ లోతులను, వాటిచుట్టూ అలుముకున్న భ్రమలను పటాపంచలు చేస్తాయి. ఇంతగా ఒక రచయిత తను రాసే నవల పట్ల తదేక తాదాత్మ్యంతో పనిచేయడమన్నది చాలా అరుదుగానే ఉంటుంది. ప్రతి నవలా ఒక యజ్ఞంగా, ప్రతి మాట ఓ తూటాగా పలికించడం వల్లే ఇషుగురో వర్తమాన నవలా రచయితలకు ఇతివృత్తాలకు సంబంధించి నిరుపమానమైన విధాన శైలికి ఓ సాహితీ గురువే అయ్యాడు.
చినుకు చినుకు ఓ వానగా, ఆ వాన ఏరుగా, సెలయేరుగా, నదిగా, సముద్రంగా మారిన చందంగానే ఆయన ప్రతి నవల, అందులో ప్రవచించే ప్రతి మాట క్రమానుగతంగా పాఠకులను అందులో తాదాత్మ్యం చేస్తుంది. ఆ భావ లోతుల్లో మునిగిపోయేలా చేస్తుంది. అంతటి పదునైన కలం ఇషుగురోది. 1989లో ఆయన రాసిన మూడో నవల ‘ది రిమైన్స్ ఆఫ్ ది డే’ను తీసుకున్నా అందులో రచయితగా ఆయన కలం బలం కనిపిస్తుంది. ఆ సిరా నుంచి ఒలికిన మాటల శక్తి కళ్లకు కడుతుంది. ఇషుగురోకు బుకర్ ప్రైజ్‌ను అందించిన ఆ నవలను అంతే పదునైన రీతిలో అంతే గాఢతతో ఓ సినిమాగా తీశారు. అది కూడా నవల ఎంతగా పాఠకులను అలరించిందో సినీ ప్రేక్షకులను సమ్మోహితం చేసింది. కదిలించే నవలలు రాయడమన్నది అంత తేలిక కాదు. అందుకు కేవలం రాయాలన్న ఆలోచన ఒక్కటే సరిపోదు. ఆ రాయడంలో రాటుదేలిన సాహితీ పటిమ కావాలి. తాను అనుకున్న భావాన్ని పదునైన రీతిలో పండించగలిగే భావుకత కావాలి. అవన్నీ మూర్త్భీవించుకున్న ఇషుగురో వర్తమాన సాహితీ ప్రపంచంలో ఓ స్రష్ఠగా నిలుస్తాడు. కేవలం రాయాలని నవలలు రాయడం కాకుండా ఓ ఉద్దేశం, ఓ లక్ష్యం, ఓ ఆశయం తోడైనప్పుడే ఏ నవల అయినా నవనవోనే్మషం అవుతుంది. సమున్నత సాహితీ పురస్కారాలకు ఆలంబన అవుతుంది. నాలుగు దశాబ్దాల ఇషుగురో సాహితీ సృజన వర్తమాన రచయితలకే కాకుండా భవిష్యత్తులో కలమే బలంగా, సామాజిక దృక్కోణాలను భిన్న రీతుల్లో ఆవిష్కరించగలిగే సృజనను పెంపొందించుకోవాలనుకునే వారికి ఓ ఉద్దీపన లాంటిదే.

- బి. రాజేశ్వర ప్రసాద్