సబ్ ఫీచర్

సరళ సుందరం.. మొల్ల కవితామార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె॥ తేనెనోరుసోక తీయనయగురీతి
తోడనర్థమెల్ల తోచకుండ
గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూగ చెవిటివారి ముచ్చటగును
- అంటూ ఒక కవితా మార్గాన్ని ప్రవచించి అందులోనే ప్రయాణించిన పదహారవ శతాబ్దానికి చెందిన కవయిత్రి మొల్ల. తన రామాయణంతో బహుళ ప్రజాదరణ పొందిన కవయిత్రి ఆమె. దీనికి కారణం ఆమె ఎన్నుకున్న కవితా మార్గమే. కవిత్వమంటే తేనెచుక్క నాలుకకు తాకగానే ఎలా మధురంగా ఉంటుందో, అలా ఉండాలని నిర్వచించింది ఆమె. నిఘంటువులలో మూలమూలలో దాగివున్న పదాలతో కవిత్వం చెబితే, అది మూగ చెవిటివారి ముచ్చటే అవుతుందన్నది ఆమె దృక్పథం. నిజమే! ఏ యతిప్రాసల కోసమో, అర్థవిస్ఫూర్తి కోసమో పాయసంలో జీడిపప్పు పలుకుల్లా అక్కడక్కడా కఠినమైన పదాలు ఉంటే ఉండవచ్చేమోగానీ, అన్నీ కఠిన పదాలయితే మాత్రం ఆ కవిత్వాన్ని ఆస్వాదించడం కష్టం. కవిత్వాన్ని ఆస్వాదించాలంటే ముందు అర్థం కావాలి. అది పాఠకుడి మనస్సులోకి చేరాలి. అది పాఠకుడికి పదేపదే తలపునకు రావాలి. అప్పుడే కవికి పాఠకుడి మనస్సులో స్థానం లభిస్తుంది. ఈ ప్రక్రియటకు మొదటి మెట్టు అర్థం కావడమే. అంటే సాధ్యమైనంత వరకు కవిత్వంలో అన్వయ కాఠిన్యం లేకుండా ఉండాలి. ధ్వని ప్రధానమైన కవిత్వం ఉత్తమమైనదే. కానీ పాఠకుడు గ్రహించగలిగితేనే ధ్వనికి సార్థకత. స్వయంగా కవి చెబితే గానీ అర్థంకానంత ధ్వని శ్రేయస్కరం కాదు. కవిత్వం నచ్చి పదిసార్లు చదవాలి గానీ, అర్థం కావడం కోసం పదిసార్లు చదివే పరిస్థితి రాకూడదు. ఇదే సూత్రాన్ని మొల్ల తన కవిత్వ రచనలో అక్షరాలా పాటించి చూపించింది. పైగా ‘అల్పరాక్షరంబుల అనల్పార్థ రచన’ అనే సూత్రానికి భాష్యంలా భాసిల్లింది. ఉదాహరణకు సుందరకాండలో శ్రీరాముని వర్ణించే పద్యాన్ని చూడండి -
సీ॥ నీలమేఘచ్ఛాయబోలు దేహమువాడు
ధవళాబ్జపత్ర నేత్రములవాడు
కంబుసన్నిభమైన కంఠంబు గలవాడు
చక్కని పీనవక్షంబువాడు
తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు
ఘనమైన దుందుభిస్వనమువాడు
పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు
బాగైనయట్టి గుల్ఫములవాడు
తే.గీ॥ కపటమెరుగని సత్యవాక్యములవాడు
రమణి! రాముండు శుభలక్షణములవాడు
ఇన్ని గుణముల రూపింపనెసగువాడు
వరుస సౌమిత్రి బంగారువనె్నవాడు
- వరుస సౌమిత్రి బంగారు వనె్నవాడు’ అనడం ద్వారా రాముడు, లక్ష్మణుడు ఒక్కటే! కాకపోతే రాముడు మేఘంలా నల్లనివాడు, లక్ష్మణుడు బంగారంలా పచ్చనివాడు అని చెప్పింది. రంగులో తప్ప, రూపంలోనూ, వౌలిక స్వభావంలోనూ ఏ భేదమూ లేనివారు రామలక్ష్మణులు అనే విషయాన్ని ఎంత అందంగా చెప్పింది మొల్ల.
సీతమ్మ తల్లికి నమ్మకం కలిగించడం కోసం తన మేను పెంచిన సందర్భంలో హనుమను వర్ణిస్తోంది చూడండి -
కం॥ చుక్కలు తలపూవులుగా
అక్కజముగ మేనుపెంచి అంబరవీధిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదమునొందెనాత్మస్థితికిన్
- హనుమ ఆకాశమంత ఎత్తు ఎదిగాడనడానికి, చుక్కలు తలపూవులైనాయని ధ్వనిగర్భితంగా చెప్పింది మొల్ల.
అయోధ్యాపుర వర్ణన చేస్తూ మొల్ల చెప్పిన బాలకాండలోని ఈ అందమైన పద్యాన్ని చూడండి.
ఉ॥ రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు, వాహినీ
రాజులు దానమందు, మృగరాజులు విక్రమ కేళియందు, గో
రాజులు భోగమందు, దినరాజులు సంతత తేజమందు, రా
రాజులు మానమందు, నగరమ్మున రాజకుమారులందఱున్
రామరాజ్యమని ప్రజలు వేనోళ్ల పొగిడే రాజ్య వైభవాన్ని కవయిత్రి మొల్ల ఎంత సరళ సుందరంగా వర్ణిస్తుందో చూడండి -
సీ॥ సకలౌషధక్రియా సంజీవ కరణిచే
చెలగి రోగులను రక్షింపజాలు
బంధురోన్నత శస్త్ర సంధాన కరణచే
కుటిలారులనురంభగూర్పజాలు
సంతతోత్పాదన సౌవర్ణకరణిచే
అర్థుల దారిద్య్ర మడపజాలు
ననుదిన సంధానమును శల్యకరణిచే
బురుషార్థనికరంబు బ్రోవజాలు
తే.గీ॥ సిద్ధి విద్యానురాగ ప్రసిద్ధుడైన
రాజచంద్రుడితండని రాజులెల్ల
సన్నుతింపగ విలసిల్లె జగతియందు
భాగ్యవిస్తారి రామభూపాల శౌరి
- ‘సకలౌషధక్రియా...’ అనడం ద్వారా ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉందనీ, ‘శస్త్ర సంధానకరణిచే...’ అనటం ద్వారా ప్రజలందరికీ రక్షణ కల్పించబడిందనీ, ‘సంతతోత్పానకరణి...’ అనడం ద్వారా ఉత్పత్తి పెంచబడి సంపద అందరికీ పంచబడిందనీ, రామరాజ్యం సంక్షేమ రాజ్యం, సామ్యవాద సౌమ్యవాద రాజ్యమనీ మొల్ల ఎంతో అర్థవంతంగా వర్ణించింది. రామరాజ్యం ఎంత సత్యవంతంగా ఉందో ధ్వనిగర్భితమైన ఈ పద్యంలో చూడండి.
సీ॥ కుటిలతనదులందు, గుంతలంబులయందు
బొంకు జూదములందు, బూతులందు
లేమి వైరులయందు, లేమల నడుమందు
భగమంబుధులందు బరులయందు
గోపంబు ఖలులందు గ్రూర వర్తనులందు
వడకు వీణలయందు వ్యసనులందు
బంధంబు రతులందు బటు శిరోజములందు
మోహంబు ధనమందు ముదితలందు
తే.గీ॥ చింత కవులందు పదసుల చిత్తమందు
వర్ణమిళితంబు చిత్తరువందు, యవను
లందుననె, కాని యుండెడ జెందకుండ
లీలధర యేల రామభూపాలవరుడు
- శ్రీరామరాజ్యంలో కుటిలత్వం (వక్రత) నదుల నడకలలోనూ, ఆడువారి వెంట్రుకలలోనూ తప్ప ఇంకెక్కడా లేదట. లేమి అనేది శత్రువుల దగ్గర, ఆడవారి నడుము విషయంలోనే ఉందట. (ఆడవారి నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉన్నదనడం కవి సమయం, అదే కవయిత్రీ సమయం). ప్రజలలో చింత అంటే బాధ అనేదే లేదట. చింత కేవలం కవులలో, తాపసులలో మాత్రమే ఉందట. కవులకు కవిత్వం గురించి చింత (ఆలోచన). తాపసులకు పరబ్రహ్మమును గూర్చి చింత (ఆలోచన). రామరాజ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఎంత చమత్కారంగా వర్ణించింది మొల్ల.
‘ఈ (మొల్ల) రామాయణమును కొంతకాలము క్రిందట వరకును వీధిబడులలో బాలురకు పాఠముగా చెప్పుచుండిరి. ఇది పురుషులు చెప్పిన గ్రంథములలో ననేకములకంటె మనోజ్ఞమై ప్రౌఢమై యున్నది - అన్న కందుకూరి వీరేశలింగం పంతులుగారి మాటలు ప్రత్యక్షర సత్యాలు. బహుశా కృతక గ్రాంథికం ముదిరిన తరువాత మొల్ల రామాయణాన్ని బడులలో చెప్పడం ఆపివేశారేమో! మళ్లీ వ్యవహారిక భాషకు గుర్తింపు వచ్చిన తర్వాత మొల్ల రామాయణం పాఠ్యాంశమై తరగతి గదులనలంకరించి విద్యార్థులనలరించింది. తెలుగువారి మనస్సులో మొల్ల రామాయణానికున్న స్థానం సమున్నతం, సుస్థిరం.

- డీవీఎం సత్యనారాయణ 9885846949