సబ్ ఫీచర్

గురజాడ.. డిస్ట్రిక్ట్ మున్సిఫ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాడ వారికప్పుడు ఎనిమిదేళ్ళు. రాయవరంలో ఉండే మాతామహుల ఇంటికి వెళ్ళాడోసారి గురజాడ. తాతగారు కృష్ణయ్య పంతులుగారు కోర్టులో సిరస్తదారు. తాతగారికి అప్పుడప్పుడూ సాయంకాలంపూట టిఫిన్ తీసుకొని వెళ్ళి ఇచ్చి వస్తూ ఉండేవాడు గురజాడ. అలా ఒకరోజు తాతగారికి టిఫిన్ ఇచ్చి కోర్టు ఆవరణలో చెట్లక్రింద తోటి పిల్లలతోపాటు ఆడుకుంటున్నాడు.
అప్పుడు పిల్లలంతా పెద్దయ్యాక తాము ఏఏ ఉద్యోగాలు చేస్తామో చెప్పుకుంటున్నారు. ఒకడు మాస్టరవుతానన్నాడు. ఇంకొకడు తహసీల్దారవుతానన్నాడు. మరొకడు డాక్టరౌతానన్నాడు. గురజాడ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఎకాఎకిని కోర్టు తలుపులమీద ది..-- గ్జజీ. ఱ.., ఱ.జ., నిడ్గన్ళి శ్రీడని, అని వ్రాసి, ఇంటికి చక్కాపోయాడు. మరునాడు ఇది చూచిన జిల్లా మున్సిఫ్, ‘ఎవరీ అప్పారావు? ఎందుకిలా రాశాడు?’ అని విచారించగా, ఆ అప్పారావు సిరస్తదారు కృష్ణయ్య పంతులుగారి మనవడని తేలింది. వెంటనే గురజాడను కోర్టుకు పిలిపించి ఇలా ప్రశ్నించాడు.
‘‘మా కోర్టు తలుపుల మీద సుద్దతో వ్రాసిందెవరు?’’
‘‘నేనే’’.
‘ఎందుకు వ్రాశావ్?’ ఆ పిల్లవాడు జరిగిన కథంతా చెప్పాడు. మున్సిఫ్ నవ్వుతూ ఇలా అడిగాడు. ‘అయితే గోడ మీద వ్రాయక కోర్టు తలుపుల మీద ఎందుకు వ్రాశావ్?’
‘‘నా జేబులో సుద్దముక్క మాత్రమే ఉంది. బొగ్గుముక్కతో సరేగానీ, సుద్దతో తెల్లటి గోడపై ఎలా వ్రాయడం?’’ అని అమాయకంగా అడిగాడు గురజాడ. ఎనిమిదేళ్ళ పిల్లవాడి సూక్ష్మ జ్ఞానానికి మున్సిఫ్ మురిసిపోయాడు. ‘‘కృష్ణయ్యా! నీ మనవడు జిల్లా మున్సిఫ్ కావడమేం ఖర్మ? ఏకంగా హైకోర్టు జడ్జీకూడా కాగలడు’’ అని మనసారా దీవించాడు. తనకున్న పరిమితులవల్ల గురజాడ న్యాయమూర్తి కాలేకపోయినా విశ్వవిఖ్యాత యశోమూర్తి అయ్యాడు.
గురజాడ సునిశిత పరిశీలన
గురజాడకు సూక్ష్మ పరిశీలన మెండు. ప్రతి విషయాన్నీ, ప్రతి వ్యక్తినీ అనుక్షణం సూక్ష్మంగా విశే్లషణ చేసుకుంటూ ఉండేవాడు. వారు గమనించిన విషయాలను డైరీలో కూడా వ్రాయడం జరిగింది. ఈ సూక్ష్మ పరిశీలనా జ్ఞానం ‘కన్యాశుల్కం’లోని పాత్రల చిత్రణలో వారికి విశేషంగా ఉపయోగపడింది. మధురవాణి, గిరీశం, లుబ్ధావధాన్లు వంటి పాత్రలు తెలుగువారి మనోఫలకాలపై చిరస్థాయిగా నిల్చిపోయాయి. ‘వారొకప్పుడు జీవించారేమో’ అన్న భ్రమనూ కల్గించాయి. గురజాడ సునిశిత పరిశీలనను ఆయన పోషకులైన ఆనంద గజపతి మహారాజు, వారి సోదరి రీవారాణి ఇరువురూ కనిపెట్టారు. ఆనంద గజపతి ప్రసంగవశాత్తూ ఒకసారి గురజాడ గురించి ‘అప్పారావుకు కన్నురిట్టగించి చూసీ చూడనట్లు చూడడం ఒక అలవాటు’ అని అన్నాడు. దానికి గురజాడ తన డైరీలో ‘ఆయన మాట నిజమే! నాకు ఏదైనా ఒక వస్తువు కనిపించినప్పుడు దానిని చూసీచూడనట్లు చూడాలని ప్రయత్నించేవాడిని’ అని వ్రాసుకున్నాడు. అంటే గురజాడ తాను ఇంత నిశితంగా పరిశీలిస్తున్నానన్న విషయం అవతలి వాళ్ళకు తెలియకూడదని భావించాడేమో! మరో సందర్భంలో ఆనంద గజపతి సోదరి రీవారాణి వేరొకరితో ఇలా చెప్పింది ‘‘జాగ్రత్త, అప్పారావు చూస్తుండగా నువ్వు ఏమీ వ్రాయకు. నీ కలం తిరుగుడులనుబట్టి, నువ్వు ఏమి వ్రాస్తున్నదీ ఆయన చూపులతోనే పోల్చుకుంటాడు. గురజాడవారి ఇంతటి ప్రజ్ఞాపాటవాలు ఏ పాతిక శాతమో తప్ప ఆంధ్ర సాహిత్యానికి పూర్తిస్థాయిలో వినియోగపడలేదు. బ్రతుకు బాటలో సంస్థానపు లావాదేవీలు, దావాలలోనే వారి శక్తియుక్తులు చాలావరకు ఖర్చైపోయాయి.
తెలుగు కన్యాశుల్కానికి సంస్కృత నాందీ ప్రస్తావన
గురజాడవారు రచించిన కన్యాశుల్కం నాటకం 1892 ఆగస్టు 24న జగన్నాథ విలాసినీ నాటక సమాజం వారిచే తొలిసారిగా ప్రదర్శితమైంది. సంస్కృత నాటకాలను అలవాటుగా ప్రదర్శించే ఈ నాటక సమాజంవారు కన్యాశుల్కం నాటకాన్ని సంస్కృతంలో రచింపబడిన నాందీ ప్రస్తావనలతో సహా ప్రదర్శించారు. ఈ నాందీ ప్రస్తావనలను రచించినవారు నాటి విజయనగర ఆస్థాన పండితులు ముడుంబై వరాహ నరసింహస్వామిగారు. 13-8-1892న వారీ నాందీ ప్రస్తావనలను రచించినట్లు ‘మాటామంతీ’ గ్రంథం తెలియజేస్తోంది. సంస్కృతాంధ్రాలలో దాదాపుగా 70 గ్రంథాలను రచించినవారు శ్రీ నరసింహస్వామిగారు. ప్రదర్శననాడు దీనిని పఠించినవారు మేడేపల్లి వెంకటరమణాచార్యులవారు. వీరూ అనేక గ్రంథాలను వ్రాసినవారే.
కన్కాశుల్కం నాటకానికి రచింపబడిన నాందీ శ్లోకం-
శ్రేయోదేయాత్పరమ పురుషః పావనః పాపహారీ
దూరీ భూతాగ్రహలవతయా నిర్భయం చింతనీయః
సద్వా‚సద్వాయ ఇదమఖిలం స్పష్టవా నిచ్ఛయా దౌ
నిస్సంగాయ నిఖిల మవధూ యాంత రాస్వాదయంతే.
- పావనుడు, పాపహరుడు, శాంత స్వరూపి అయిన పరమపురుషుడు శుభములనిచ్చుగాక! అని ఈ శ్లోకానికి అర్థం. ఈ నాందీ శ్లోకం తరువాత సుదీర్ఘమైన ప్రస్తావన రచింపబడింది. ఈ నాందీ ప్రస్తావనవల్ల మనకు చాలా విషయాలు బోధపడతాయి. గురజాడవారు కన్యాశుల్కం వ్రాయలేదనే దుష్టవాదానికిది చెంపపెట్టు. 1892లోనే ఇంత స్పష్టంగా గురజాడవారే కన్యాశుల్కం వ్రాశారని తేలుతుంటే, ఇక కన్యాశుల్కం కర్తృత్వం మీద చర్చ అప్రస్తుతం. అవివేకం. ఈ నాందీ ప్రస్తావనలు రచించిన నరసింహస్వామిగారు అప్పటికే ప్రసిద్ధులు. వయోవృద్ధులు.
కన్యాశుల్కం నాటక రచన యొక్క ప్రధాన లక్ష్యాలు రెండు. అవి 1) నాటి సమాజంలో వేళ్ళూనుకున్న కన్యాశుల్కం దురాచారాన్ని సమూలంగా నిర్మూలించడం. 2) ‘గ్రామ్యం’ అని నాడు ఈసడించబడుతున్న వ్యావహారిక భాషకు పట్టం గట్టడం. గిడుగువారి ఉద్యమానికి కన్యాశుల్కం నాటకం ఒక గొప్ప టానిక్కులా ఉపయోగపడింది. గిడుగు, గురజాడ లేకుంటే ఆంధ్ర సాహిత్యం కృతక అలంకారాలతో కళావిహీనమయ్యేదేమో!
కన్యాశుల్కం నాటకం ఆనందగజపతి మహారాజుగారి కంకితం. వారు వ్యావహారిక భాషా సమర్ధకులు. సంఘ సంస్కరణాభిలాషి. ఆయన ‘కన్యాశుల్కం’ దురాచారాన్ని రూపుమాపటానికి నాటి శాసనసభలోనూ పోరాటం సాగించాడు. కానీ అది బాల్యవివాహ నిషేధ రూపంలో చట్టంగా రూపొంది వారికి పాక్షిక విజయానే్న కలిగించింది. కన్యాశుల్కం ‘ప్రస్తావన’లో అనేకమార్లు ‘అగ్రాంథికీ’ అనీ ‘వ్యవహార రూపం ఆంధ్ర భాషామాదాయ’ అనీ స్పష్టంగా కన్యాశుల్కం నాటక రచన లక్ష్యాన్ని ముడుంబైవారు నొక్కివక్కాణించారు. ఈ నాందీ ప్రస్తావనలవల్ల గురజాడవారి గూర్చి వారి సమకాలికులలోగల భావమేమిటో కూడా మనకు ద్యోతకమవుతోంది. గురజాడ ఆంగ్ల విద్యాధికుడనీ, ఆంగ్లంలో కవిత్వం చెప్పగలవాడనీ, గ్రాంథిక భాష సామాన్య ప్రజలకు అందుబాటులోనిది కాదనే అభిప్రాయం కలవాడనీ, జన సామాన్యానికి వ్యావహారిక భాషే యోగ్యమైనదని భావించి గురజాడ అప్పారావుగారు ఈ కన్యాశుల్కం నాటకాన్ని రచించాడని ముడుంబైవారు స్పష్టంగా తెలియజేశారు. షేక్స్పియర్, యోలియర్, బెన్‌జాన్సన్ ఇత్యాదులు గురజాడకు అభిమాన కవులనీ తెలిపాడు.
నాటక ప్రదర్శన తరువాత 26-8-1892నాటి స్థానిక ‘తెలుగు హార్పు’ పత్రిక వార్తాకథనం గురజాడ కృషిని విశేషంగా ప్రస్తుతించింది. సమకాలీన ఇతివృత్తాన్ని గైకొని సమాజానికి మంచి సందేశం ఇచ్చిన గురజాడను విశేషంగా అభినందించింది. ది ఈస్టుకోస్టు న్యూస్, బాలిక, ది ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వంటి పత్రికలు కూడా నాటకంలోని సహజత్వాన్ని ప్రస్తుతిస్తూ గురజాడను ప్రశంసించాయి. ‘కన్యాశుల్కం ఆద్యంతం ఔచితీ రసవంతం’అని ప్రజాబాహుళ్యం వేనోళ్ళ శ్లాఘిస్తుంటే గురజాడ ఎక్కడ ఉన్నా ఆనందించక మానడు.

- డి.వి.ఎం. సత్యనారాయణ, 9885846949