మెయిన్ ఫీచర్

కవితా ఓ కవితా.. ఏవౌ నీ భవిత?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత మనిషితో పాటే పుట్టి ఉంటుంది. మనిషితో పాటే కవిత కదులుతూ వస్తోంది. మనిషి కవితను కదిలిస్తున్నాడు. కవిత మనిషిని కదిలిస్తోంది. మనిషికీ కవితకూ పోలిక కదలిక. అందుకే శ్రీశ్రీ ‘‘కదిలేదీ, కదిలించేదీ’’ అంటూ కవితా ప్రస్తావన చేశారేమో? మనిషి ఉన్నన్నాళ్లూ కవిత ఉంటుంది. కవిత ఉన్నన్నాళ్లూ మనిషి ఉంటాడు. మనిషి, కవిత లేకపోవడం ఉండదేమో?
=====================================

కవితకు ఏన్నో నిర్వచనాలు, విశే్లషణలు, వివరణలు. కవిత్వాన్ని నిర్వచించగలమా? విశే్లషించగలమా? వివరించగలమా? వాక్యం ద్వారానే కవిత పుడుతుంది. కానీ వాక్యం కవిత్వం అయిపోతుందా? ‘‘వాక్యం రసాత్మకం కావ్యం’’ అని 1350లలో లాక్షణికులు విశ్వనాథ అన్నారు (కవి విశ్వనాథ సత్యనారాణ కాదు). ‘‘రసం’’ అంటే ఏమిటి? అదీ అనిర్వచనీయమే. 1580-1660ల జగన్నాథ పండితులు తమ రసగంగాధరంలో ‘‘రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం’’ అని అన్నారు. ‘అర్థమూ, రసమూ కలిసి కదిలిన, కదిలించిన రచనలు కవితలైనాయి’ అని అనుకోవచ్చు.
‘‘అపూర్వోభాతి భారతాః కావ్యామృత ఫలే రసః /చర్వణే సర్వ సామానే్యః స్వాదువిత్ కేవలం కవిః’’ అని 11వ శతాబ్దపు భల్లాలదేవ భోజచరిత్రలో అన్నారు. అంటే ‘వాక్కుయొక్క అమృత ఫలమైన కావ్యంలోని రసం అపూర్వమై ప్రకాశిస్తోంది. దాన్ని అందరూ రుచి చూస్తూనే ఉంటారు. కానీ స్వారస్యాన్ని గ్రహించగలిగిన వారు కొద్దిమంది సాహితీవేత్తలు మాత్రమే’ అని అర్థం. ‘‘కవిత్వం ఒక శక్తివంతమైన భావంయొక్క సహజమైన పొంగు. అది తన మూలాలను ప్రశాంతతలో స్మరించుకోబడిన రసావిష్కరణలనుంచి తీసుకుంటుంది’’ అని 1770-1850ల విల్ యమ్ వొడ్స్ వర్త్ అన్నారు. ‘‘ఒక కవి పని కొత్త రసాలను కనుక్కోవడం కాదు. మామూలు వాటిని ఉపయోగించడమూ, ఆపై వాస్తవంలో లేనేలేని రసాలతో భావాల్ని వ్యక్తీకరించడానికి వాటిని కవిత్వంగా పనిచేయించడమే’’ అని 1888-1965ల టి.ఎస్. ఇలిఅట్ అన్నారు.
రంకెలు వెయ్యడం, ఆర్తనాదాలు చెయ్యడం గానం అవనట్లే వికృతపు భావాలను వక్రపు భాషలో వాంతి చెయ్యడం కవిత్వం అవదు. గానానికి శ్రుతి, తాళం ఉన్నట్లే కవిత్వానికి చింతనా సంస్కారమూ, సరైన భాషా ఉంటాయి. సంస్కారహీనమైనది కవిత్వం అవదు. కళ అవదు.
‘‘శబ్దార్థాల సముచిత సహభావం ఉన్న విద్యే సాహిత్య విద్య’’ అని 10వ శతాబ్దపు రాజశేఖరులు అన్నారు. పగిలిపోయిన పదాలూ, కుళ్లిపోయిన భావాలూ సాహిత్యమో, కవిత్వమో అవవు. ‘‘శబ్దార్థాలతో కూడినది కావ్యం’’ అని 2వ శతాబ్దపు లాక్షణికులు భామహ అన్నారు. శ్రీశ్రీ దీనికి నిలువెత్తు ఉదాహరణ. వారు ఎలా శబ్దాలతో అర్థాలను ఇచ్చారో చరిత్ర చూపి చెప్పింది. ఇవాళ రాస్తున్నవాళ్లు దాన్ని పట్టించుకోవడంలేదు. ‘‘నేను నా బాధను వెలుగును చేస్తాను’’ అనీ, నా విధి ప్రతిదానికీ మోసం చెయ్యలేదు’’ అనీ రవీంద్రనాథ్ ఠాగూర్ (1861-1941) అన్న దాన్ని మనం గమనించాలి. ఇక్కడ సరైన పదాలూ, భావాలూ అమరి మనకు కవిత్వాన్ని ఇచ్చాయి.
క్రీ.పూ. 384-322ల అరిస్టాట్ల్ కవిత్వాన్ని గురించి చెబుతూ ‘‘కవిత్వంలోని విషయం విశ్వజనీనమై ఉండాలి కానీ ప్రత్యేకంగా వ్యక్తిగతం కాకూడదు’’ అని అన్నారు. తిక్కన కవి తమ భారత రచన చేస్తున్నప్పుడు ‘‘ఆంధ్రావళి మోదమొంద రచియింతును’’ అని అన్నారు. కవి తన కవితను జనాల కోసమూ, వారి ఆనందం కోసమూ రాయాలి. తన కోసం కాదు. కవిత్వం అంటే ఒకడు తన పుర్రెలోని వెర్రినీ, తన వికారాన్నీ, తన మానసిక రోగాన్నీ వెళ్లగక్కుకోవడం కాదు.
ఒక కావ్యం లేదా కవిత సకల కాలాలకూ చెందినది. షెయ్ క్స్పియర్ గురించి చెబుతూ ‘‘షేయ్ క్స్పియర్ ఒక కాలానికి చెందినవారు కాదు. సర్వకాలాలకూ చెందినవారు’’ అని జాన్ స్న్ అన్నారు. జాన్ స్న్ మాటలు నిజం. షెయ్ క్స్పియర్ రచనలు 400 ఏళ్ల తరువాత కూడా అత్యధిక ప్రజాదరణతో చలామణిలో ఉన్నాయి. వాల్మీకి, కాళిదాసులకు ప్రాచీనత్వం రాలేదు. వాళ్ల రచనలకు ప్రాంతీయత అంటుకోలేదు. కాలాల్నీ, దేశాల్నీ దాటి అంతర్జాతీయ మైనాయి వాళ్ల రచనలు.
ఇవాళ అంతర్జాతీయంగా ఎక్కువగా చదవబడుతూ కొనియాడ బడుతున్న కవులు నలుగురు. వాళ్లు 1. లావ్ ట్సూ (క్రీ.పూ. 614-517), 2. జలాలుద్దీన్ రూమీ (1207-1273), 3. షెయ్ క్స్పియర్ (1564-1616), 4. ఖలీల్ జిబ్రాన్ (1883-1931). అంతర్జాలంవల్ల ప్రపంచం మన అరిచేతిలో కనిపిస్తోంది. కనిపించేదాన్ని మనం కళ్లు తెరుచుకుని చూడాలి, చదవాలి. అంతర్జాతీయంగా ఆదరించబడుతున్న కవిత్వం మనకూ కనిపిస్తుంది. మనం తెలుగులో ‘‘కవిత్వం’’ అంటూ చదువుతున్నది ఏపాటిదో మనకే తెలిసిపోతుంది. తెలుసుకోవడం తప్పుకాదు. అంతర్జాతీయ స్థాయి కవిత్వాన్ని ఆస్వాదించడం మనం ఇకనైనా నేర్చుకోవాలి. అంతర్జాతీయ స్థాయి కవిత్వంపై మనకు రావాల్సిన అవగాహన రావాలి.
1916లో ప్రముఖ ఇంగ్లిష్ కవి డబ్ల్యూ.బి. ఎయ్ ట్స్ ‘ద అక్స్‌ఫడ్ బుక్ అవ్ మోడ్న్ వొస్’ అన్న పేరుతో 1892-1935ల మధ్య వచ్చిన కొన్ని మంచి ఇంగ్లిష్ కవితలను సంకలనం చేసి ప్రకటించారు. ఆ సంకలనంలో పెద్దగా ప్రచారంలో లేని భారతదేశపు కవి శ్రీపురోహిత్ స్వామి (1882-1941) రాసిన ఒక కవిత (ఉర్దూకు ఆంగ్లానువాదం) చోటు చేసుకుంది. అది- ‘‘నిజానికి ఒక అద్భుతం/నువ్వు సర్వశక్తులకు ప్రభువువి/నేను కొంచం శక్తిని అడిగాను/నువ్వు నాకొక భిక్షపాత్రను ఇచ్చావు’’ అన్న కవిత. ఇది ప్రపంచం హర్షించే కవిత్వం. ఇలా మన తెలుగు కవుల కవిత్వం ఎందుకు అంతర్జాతీయ సంకలనాలలో చోటుచేసుకోవడం లేదు? ఏదేదో చెబుతూ కాలక్షేపం చేస్తున్న మన తెలుగు కవి, విమర్శక పుంగవులు అంతర్జాతీయ స్థాయికి తెలుగు కవిత ఎందుకు వెళ్లలేదో అర్థం చేసుకోవాలి. 1500 ఏళ్లకు ముందే తమిళ కవి తిరువళ్లువర్ ఒకచోట ఇలా అన్నారు- ‘‘అడుక్కుంటూనే ప్రాణం బ్రతకాలంటే ప్రపంచాన్ని రాసినవాడే పెద్దఎత్తున చెడిపోవాలి’’. ఆ తిరుక్కురళ్ తెలుగుతో పాటు 100 భాషల్లోకి అనువాదమయింది. మరో తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి (1882-1921) ఒక కవితలో ‘‘ఆకాశమా, లేత ఎండా, దట్టమైన వృక్షరాశీ, మీరందరూ ఎడారి నీళ్లేమో? ఉట్టి దృష్టి దోషాలేమో?’’ అని అంటారు. ఇది అంతర్జాతీయ కవిత్వం.
మన తెలుగులోనూ అంతర్జాతీయ స్థాయి కవిత్వాన్ని అందించిన కవులున్నారు. అన్నమయ్య, వేమన, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్ర శర్మలు తెలుగులో అంతర్జాతీయ స్థాయి కవులు. తెలుగులో ఇంక మంచి కవులు లేరని కాదు. మరెవ్వరూ మంచి కవిత్వం రాయలేదని కాదు. ఇవాళ ఏ శిల్పంతో, ఏ చింతనతో, ఏ విధమైన శబ్దకూర్పుతో, ఏ స్థాయిలో ఉన్న కవిత్వం అంతర్జాతీయంగా ఎక్కువగా ఆదరించబడుతోందో ఆ శిల్పంతో, ఆ చింతనతో, ఆ విధమైన శబ్ద కూర్పుతో, ఆ స్థాయిలో ఈ ఐదుగురు కవులూ కవిత్వం రాశారు.
అన్నమయ్య ‘‘మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే / ఛండాలుడుండేటి సరి భూమి యొకటే / కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే/ పుడమి శునకము మీద పొలయు ఎండొకటే’’ అంటూ ప్రదర్శించిన శిల్పం మహోన్నతమైనది. ఈ శిల్పం రూమీ, ఖలీల్ జిబ్రాన్ లలో కనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో రాయడంవల్లే వేమన తెలుగు ఎల్లలు దాటి ప్రపంచంలోకి ప్రవహించగలిగారు. ప్రపంచంలో వాడుకలో ఉన్న పలు భాషల గురించి తెలియజేస్తూ ఇంగ్లిష్‌లో ‘ద లేంగ్విజ్ స్ అవ్ ద వొల్డ్’ అన్న పుస్తకం వచ్చింది. 1977లో రూట్ లెడ్జ్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అందులో తెలుగు గురించి తెలియజేస్తూ వేమన రాసిన సీస, కంద పద్యాలు రెండిటిని ఇచ్చారు. వేమనను తెలుగు కవితకు ప్రతీకగా గుర్తించారు వాళ్లు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన 3 పద్యాల 12 పాదాల నీవు-నేను అన్న కవిత ఒక అంతర్జాతీయ స్థాయి కవిత. అందులో ‘‘పొదలు పెనుచీకటిని కాంతిని వెదకికొందు’’ అన్న చివరి పంక్తి మనకు లావ్ ట్సూ, రూమీ, జిబ్రాన్‌లను గుర్తుకు తెస్తోంది. ‘‘బహుజన రక్త చిహ్నములందు నాది ఇదని గుర్తేమి కన్పడును సామీ’’ అని వారు అనడం కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నదే. ఉన్నతమైన కవిదృష్టి, శిల్పశీలత్వం కలవారు విశ్వనాథ. శ్రీశ్రీ కవితా! ఓ కవితా!, జ్వాలాతోరణం, కేక, నీడలు, మానవుడా! వంటి కవితలు అంతర్జాతీయ స్థాయివి. శేషేంద్ర శర్మ ‘‘అర్థమయింది, శబ్దంలో కాదు నిశ్శబ్దంలో రాగముందని’’ అనీ, ‘‘ఏ చీకటిలో నీ జీవకాంతుల బంధువులు స్పందిస్తున్నాయో?’’ అనీ, ‘‘ఎండలాంటి నా ఊహ శబ్దం మీద పడింది’’ అనీ అంటూ తెలుగును దాటిన తనంతో అంతర్జాతీయతతో కవితను చెప్పారు.
‘‘మహోన్నతమైన మంచి, నీరు లాంటిది’’ అనీ, ‘‘తలపులు మెదడును బలహీన పరుస్తాయి’’ అనీ, ‘‘విజయం ఓటమి అంత అపాయకరమైనది’’ అనీ, ‘‘నేను గాలిలా ఒక లక్ష్యం లేకుండా వీస్తూంటాను’’ అనీ లావ్ ట్సూ అన్న తీరులోనూ, ‘‘వాళ్లు అంటున్నారు మాకు భవిష్యత్తు లేదని. వాళ్లు అంటున్నది నిజమే. అది మాకు సుఖమే’’ అనీ, ‘‘నువ్వే పాట, వినాలనుకుంటున్న పాట’’ అనీ, ‘‘నేను కరుణానిలయంలో ఉన్నాను, నా హృదయం ప్రార్థనాలయం’’ అనీ జలాలుద్దీన్ రూమీ అన్న తీరులోనూ, ‘‘అందం కరుణతో జీవిస్తూంటుంది’’ అనీ, ‘‘ఉష్ణానికి ఇంక భయపడకు ఓ సూర్యుడా!’’ అనీ, షేయ్ క్స్పియర్ అన్న తీరులోనూ, ‘‘నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు అనకూడదు, దేవుడు నా హృదయంలో ఉన్నాడని దానికి బదులుగా అను నేను దేవుడి హృదయంలో ఉన్నానని’’ అనీ, ‘‘నీకు తెలుసా? ప్రాణంలో ఒక అర్థముంది దాన్ని మరణం దాచలేదని’’ అనీ ఖలీల్ జిబ్రాన్ అన్న తీరులోనూ ఉన్న వ్యక్తీకరణలు ఇవాళ అంతర్జాతీయంగా రాణిస్తున్న కవితలైనాయి.
కవిత్వం కుల, మత, ప్రాంత, వర్గ, ముఠాలకు అతీతంగా ఉండాలి. ఆశ్లీలానికీ, అసభ్యతకూ అతీతంగా ఉండాలి. కానీ కుల, మత, వర్గ, ప్రాంత, ముఠాల సంగమాలవల్లా, అశ్లీల, అసభ్యతల వల్లా, హస్యాస్పదమైన కవిసంధ్యలవల్లా తెలుగు కవిత్వం వికారమై పోతోంది. భాష భ్రష్టు పట్టిపోతోంది. ఏ శిల్పం అంతర్జాతీయంగా కవిత్వమయిందో ఆ శిల్పం తెలుగులో ఉండాల్సినంత లేదు. నిజాయితీగా నిజం చెప్పుకోవాలంటే తెలుగులో ‘‘కవులు’’ అని అనబడుతున్నవాళ్లు కవిత్వాన్ని కాటేస్తున్నారు. ‘‘విమర్శకులు’’ అని అనబడుతున్న వాళ్లు విషాన్ని పంచుతున్నారు. కవిత్వం పేరుతో తెలుగులో ఇంకేదో చలామణి అవుతోంది. అందుకే తెలుగులో పెద్దగా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కవిత్వం లేకుండా పోయింది.
కవితా ప్రక్రియలు హైకు, రుబారుూ, గజల్, ఏక పంక్తి వంటివి పూర్తిగా హాస్యాస్పదమైపోయాయి. మరెక్కడా లేనివిధంగా ఏక వాక్య పితామహులు, విశారదులూ, గజల్ విజ్ఞాన సర్వస్వాలూ, గురువులూ, గజల్ శిరోమణులూ తెగ తచ్చాడుతూ తెలుగుకు తలవంపులు తెస్తున్నారు. తెలుగులో ఉన్నంత ఎక్కువగా సాహితీ రత్నాలు మరే భాషలోనూ ఉండరేమో? బిరుదుల కోసం తెలుగు సాహిత్యంలో డబ్బు ఖర్చయినట్లుగా మరో భాషలో అవలేదేమో?
తొలి ఇంగ్లిష్ కవి చొసర్, జెఫ్రీ (1342-1400) ‘‘బంగారం తుప్పుపట్టిపోతే ఇనుము సంగతేమిటి?’’ అని అడిగారు. ఇప్పుడు ‘‘కవితే భ్రష్టుపట్టిపోతే తక్కిన వాటి మాటేమిటి?’’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనలో కవితకు భవిత ఉంటుందా? భవితకు కవిత ఉంటుందా? అన్న ప్రశ్నలకు ‘‘ఉంటుంది’’ అన్న సరైన జవాబును సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆపై ‘‘కవిత భవిత కావాలి/ భవిత కవిత కావాలి’’.

--రోచిష్మాన్, 9444012279