మెయిన్ ఫీచర్

రసధుని ధ్వనిఖని కన్యాశుల్కం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

***గురజాడ రాసిన కన్యాశుల్కం ఆధునిక తెలుగు సాహిత్యంలోనేకాక, నాటక ప్రక్రియలోనూ పెనుమార్పులకు కారణం అయింది. ఈ నాటకం తెలుగు సాహిత్యంలో చెప్పలేనంత సంచలనాత్మకమైన విప్లవం తెచ్చింది. ఈ నాటకం మీద వచ్చినంత విమర్శ, ప్రతివిమర్శలు మరి ఏ నాటకం మీద, ఇతర గ్రంథం మీద కూడా రాలేదు. అంతేకాదు ఒక రచయిత రాసిన ఒక గ్రంథం మీద ఇన్ని వేల పేజీల విమర్శ కూడా రాలేదు. ఇది గొప్పేకాదు, ఒక రికార్డు కూడా. గురజాడ చనిపోయి శతాబ్దం గడిచినా సమాజం ఆయనను గుర్తుపెట్టుకుందంటే గొప్పేకదా***.
==========================

గురజాడ వారికి పూర్వం వున్న సాహిత్యం భావాలపరంగా, భాషాపరంగా అనేక పెడధోరణులు, తిరోగమన ధోరణులు చోటుచేసుకున్నాయి. మతపరమైన మూఢ నమ్మకాలు. దుష్ట సనాతన సంప్రదాయాలు, మానవ జీవితాన్ని, ముఖ్యంగా స్ర్తిల జీవితాన్ని సర్వనాశనం చేశాయి. సమాజంలో సనాతనంగా, పాతుకుపోయిన అరాచకాల్ని, అక్రమాల్ని, మూఢ నమ్మకాల్ని, వికృత చేష్టల్ని సరిదిద్దవలసిన బాధ్యతను సాహిత్యం స్వీకరించలేక పోయింది. కవులు, రచయితలు త్రికరణ శుద్ధిగా, సమాజహిత సాహిత్యాన్ని నిర్మించలేక పోయారు. ప్రజల భాషనుకాక, కృతకమైన గ్రాంథిక భాషను చేపట్టారు. ఆ భాషకే సాహిత్య గౌరవం కల్పించారు. ఈ విషయాలన్నింటిని ప్రగతిశీల కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, సాహిత్యవేత్తలు, అందరూ ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. అంతటితో ఆగక పోరాటంతో ఎదురు తిరిగారు. విజయం సాధించారు. ‘‘కన్యాశుల్కం’’ అనేసరికి ప్రముఖంగా నలుగురు వ్యక్తులు మనకు గుర్తుకువస్తారు. రావాలి కూడా. ఒకరు సెట్టి ఈశ్వరరావు, రెండోవారు బంగోరె (బండిగోవుల రెడ్డి), మూడోవారు అవసరాల సూర్యారావు, నాలుగోవారు కె.వి.రమణారెడ్డిగారు. ఈ నలుగురి కృషి అనన్య సామాన్యమైంది.
గురజాడ తాను చేపట్టిన అన్ని ప్రక్రియల్లోనూ, సమాజంలోని కుళ్ళును బయటపెట్టారు. అది పోవాలని మనసారా కోరుకున్నారు కూడా. ఆనాడు వేమన, ఆ తర్వాత గురజాడ, సాహిత్యం ద్వారా తమతమ అభిప్రాయాల్ని ముక్కుసూటిగా వ్యక్తంచేశారు. అప్పారావుగారు మతం గూర్చి, కులం గూర్చి, సనాతనాచార సంప్రదాయాలు, మూఢ నమ్మకాల గూర్చి తీవ్రమైన నిరసన తన రచనల్లో తెలియజేశారు. సనాతన ఛాందస భావాలుగల సంప్రదాయవాదులు, వ్యక్తిగతంగా గురజాడ పైన, ఆయన సాహిత్యంపైన దాడి చేశారు. పత్రికల ద్వారా, గ్రంథాల ద్వారా, సభల ద్వారా, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. గురజాడ వర్గీయులు అంతకన్నా ఎక్కువ తీవ్రతతో ఎదురుదాడి చేశారు. వాదోపవాదాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఇప్పటికీ ‘‘కన్యాశుల్కం’’ మీద చర్చ జరుగుతూనే వుంది. అదే దాని గొప్పతనం. కందుకూరి, గురజాడ, జాషువా మొదలైనవారు, వాళ్ళ కాలంనాటి, సామాజిక స్థితిగతుల్ని, సాహిత్యం ద్వారా పరిష్కరించడానికి తమవంతు తీవ్రమైన కృషిచేశారు. విజయం సాధించారు. ప్రజల హృదయాల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారు. వీళ్ళు సమాజం గూర్చి పట్టించుకొని, రచనలు చేశారు కాబట్టే, సమాజం ఎప్పటికీ వీళ్ళను గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది.
‘‘ఇతివృత్త స్వీకరణలో, నిర్వహణలో, హాస్యరస పోషణలో, పాత్రోన్మీలనంలో తెలుగు సాహిత్యంలో ఇది అత్యుత్తమ నాటకం అనే విషయాన్ని మరవకండి’’ అని గురజాడ ఆదిభట్ల నారాయణదాసుకు రాసిన లేఖలో రాశారు.
ఇప్పటికీ తెలుగులో తిరుగులేని నాటకంగా ప్రజాదరణ పొందుతున్న అద్భుతమైన నాటకం ‘‘కన్యాశుల్కం’’. అందుకే కన్యాశుల్కంను శ్రీశ్రీ ‘క్లాసిక్’’గా అభివర్ణిస్తే, నాటకాల్లో కన్యాశుల్కం ‘ఎపిక్’గా కె.వి.ఆర్. పేర్కొన్నారు. రెండు అగ్రహారాల్లో జరిగిన సామాజిక స్థితిగతుల్ని, మనకళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు అప్పారావుగారు. అద్భుతమైన సన్నివేశాలతో, ఆసక్తికరమైన సంభాషణలతో, సహజమైన పాత్రలతో గొప్ప నాటక కళాఖండాన్ని సృష్టించారు గురజాడ. అటు కందుకూరి సాంఘిక విప్లవ స్ఫూర్తి. ఇటు గిడుగు రామమూర్తి. వ్యావహారిక భాషా ఉద్యమం, ఈ రెండింటి ప్రేరణతో గురజాడ కన్యాశుల్కం నాటకం రాశారు. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు అద్దంపట్టిన గొప్ప నాటకం ‘‘కన్యాశుల్కం’’. అందుకే గొర్రెపాటి వేంకట సుబ్బయ్యగారు ఇలా అన్నారు. ‘‘ఆధునిక సాహిత్య యుగకర్తేకాదు, తెలుగులో వ్యావహారిక భాషారచనకు, ఉపక్రమించిన వారిలో ప్రథములు కూడా గురజాడే. వ్యావహారిక భాషోద్యమానికి గిడుగు లక్షణం ఐతే, దానికి లక్ష్యం చూపిన వారు గురజాడ.
కన్యాశుల్కం నాటకాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇందులో మనకు సంఘంలో జరిగే కన్యాశుల్కం వివాహాలు, వితంతు పునర్వివాహం, మనిషిలోని కోపం, మనిషిలోని ఆవేదన, మాటల చాకచక్యం, మనిషి మోసం నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు, హాస్య దృష్టి, సమాజంలోని రకరకాల మనుషులు మనకు కన్పిస్తారు. జీవిత ప్రతిబింబం కన్యాశుల్కం. ఆనాటి సమాజంలోని సాంఘిక దురాచారాల్ని దుయ్యబట్టడానికీ, తద్వారా సంఘాన్ని సంస్కరించడానికీ గురజాడ చేసిన కృషి శ్లాఘనీయం. అందుకే శ్రీశ్రీ ‘‘తిక్కన, వేమన, గురజాడ’’ మహాకవులన్నాడు. ప్రజానాయకులు చేయలేని పని ఒక కవి చేశాడు, అదే అప్పారావుగారి గొప్పతనం. సాహిత్యం యొక్క శక్తి కూడా.
రస పోషణలో గురజాడ అందెవేసిన చేయి. అందులో హాస్య రసపోషణకు పెట్టింది పేరు. నాటకమంతా హాస్య రసంతో వ్యంగ్యంతో చమత్కారంతో వెటకారంతో, ముఖ్యంగా నాటకమంతా హాస్య ధ్వనితో నడుస్తుంది. అంతేకాదు హాస్య రసం, ధ్వని వల్లే కన్యాశుల్కంకు అంత పేరు వచ్చిందని విమర్శకులు కొనియాడారు.
కన్యాశుల్కం నాటకంలో, బాహ్య దృష్టికి హాస్యరస ప్రధానంగా కన్పిస్తున్నా, అంతర్గతంగా ఇందులో ధ్వని (వ్యంగ్యం) చోటుచేసుకుంది. అటు హాస్యం, ఇటు ధ్వని రెండూ సమాంతరంగా నాటకంలో చక్కగా పోషించబడ్డాయి. అందుకే అద్భుతమైన నాటకంగా పేరుగాంచింది. కన్యాశుల్కం నాటకమంతా హాస్య రసంతో నిండి వుంది. ఇతర రసాలు కూడా చోటుచేసుకున్నాయి.
శృంగారం గూర్చి, ముఖ్యంగా దాంపత్య శృంగారం గూర్చి గురజాడ కన్యాశుల్కంలో చక్కగా చెప్పారు. ‘‘బుచ్చమ్మ గనక తనతో లేచిపోయి వచ్చి, తన్ను పెళ్ళిచేసుకుంటే, తాను ఉద్యోగంచేసి, డబ్బు సంపాదిస్తాను. దాన్తో ఇళ్లు, వాకిళ్ళు, పిల్లలు, ఉయ్యాల జంపాల, ఇవన్నీ ఏర్పాటుచేసుకోవాలి గదా’’! ఇలా కాల్పనిక జగత్తులో తేలియాడుతూ తన దాంపత్య శృంగారాన్ని గూర్చి విశదీకరిస్తాడు గిరీశం. ఈ నాటకంలో రసవత్తరమైన ఘట్టం ఇది.
బుచ్చమ్మ, మీనాక్షి కథల్లో కరుణరసం కన్పిస్తుంది. అగ్నిహోత్రావధానులు తన్నిన ఘట్టంలో రౌద్ర రసం కనబడుతుంది. ఈ నాటకంలో ప్రతీచోట సంఘ కల్మషం బైటపడుతూ వుంటుంది. అలాంటి సాంఘిక భావాల మీద ప్రతి సహృదయుడికి జుగుప్స కలుగుతుంది. బీభత్స రసానికి జుగుప్స స్థారుూ భావం, చతుర్థాంకంలో వివాహ విఘ్నాలకి గిరీశం జాబు, రామప్పంతులు పార్టీ, లుబ్ధావధానులు ధనాశచే చేసే పనులు, లోకంకోసం తద్దినాలు పెడుతూ ‘‘కామిగాక మోక్ష కామిగాడు’’ స్ర్తిలతో వ్యవహరించే శీలం, ఎవరికి హేయమనిపించదు? పెళ్ళిళ్ళు కుదర్చడానికి జరిగే తంతు, అందులో లంచాలు, జ్యోతిషాలు, పురోహితుల చేష్టలు, ప్రదర్శించబడటంలో బీభత్స రసం కన్పిస్తుంది. కన్కాశుల్కంలో సప్తమాంకంలో లుబ్ధావధాన్లు ఇరుక్కున్న ఖూనీ కేసును, మధురవాణి తేలగొట్టడంలో అద్భుత రసం పోషించబడింది. మధురవాణి పరిణతచిత్తయై సౌజన్యారావును ఆశ్రయించి, భగవద్గీతను చేపట్టిన ఘట్టంలో శాంత రసం చోటుచేసుకుంది. ప్రతీ వాక్యం వెనుక ధ్వని భాసిల్లుతుంది. ‘‘డామిట్ కథ అడ్డం తిరిగింది’’ అనే ధ్వనితోనే, కన్యాశుల్కం నాటకం ముగుస్తుంది. ఒక సందర్భంలో గిరీశం ‘‘మైలపడితే స్నానం చేసి వేగిరంరా’’ అని మధురవాణితో అంటాడు. అప్పుడు మధురవాణి ‘‘యిప్పుడేం తొందర, తలంటుకుంటాను’’ అని అంటుంది. ఇక్కడ ‘నీ వ్యవహారం పూర్తిగా కడిగేసుకుంటా’ ధ్వని చాలా స్పష్టంగా కన్పిస్తుంది. ఈలాంటి ధ్వని వున్న సందర్భాలు నాటకంలో ఎన్నో వున్నాయి.
సంప్రదాయ భావాల్ని తీవ్రంగా ఖండిస్తూ ధ్వనితో కూడిన హాస్య రసపూర్ణమైన రచన కన్యాశుల్కం. అసలు విషయం ఏమంటే గురజాడ ధ్వని (వ్యంగ్యం) ప్రయోగంలో ఆరితేరిన దిట్ట. నాటకాన్ని లోతుగా క్షుణ్ణంగా చదివిన వారి అందరికీ ఈ విషయం తెలిసిందే. ఈ నాటకంలో హాస్యం నూటికి నూరుపాళ్ళు ధ్వనిని ఆశ్రయించి వుంటుంది.
అభినవగుప్తుడు, భరతుడు రాసిన నాట్య శాస్త్రానికి ‘‘అభినవ భారతి’’ అనే వ్యాఖ్యానం రాశాడు. రసం చేతనే కావ్యం సర్వం జీవిస్తుంది రస శూన్యమైన కావ్యం వుండదు, అందువల్ల రసమే కావ్యానికి ఆత్మ. వస్తు ఆలంకార ధ్వనులు సర్వదా రస పర్యవసాయులే అవుతాయని అభినవ గుప్తుడు తెలియజేశాడు. అలాగే ఆనందవర్ధనుడు రాసిన ‘‘్ధ్వన్యాలోకం’’కి ‘‘లోచనం’’ అనే పేరుతో అభినవగుప్తుడు వ్యాఖ్యానం కూడా రాశాడు. అభినవగుప్తుడు నాట్యశాస్త్రాన్ని ధ్వన్యాలోకాన్ని నిశితంగా పరిశీలించి ‘రస ధ్వని’ని ప్రతిపాదించాడు. ఎక్కువ మంది భారతీయాలంకారికులు అభినవగుప్తుని సిద్ధాంతాన్ని సమర్థించారు. ఒక కావ్యం/ నాటకంలో రసం, ధ్వని రెండూ వుండేదానే్న ‘రస ధ్వని’గా నిర్థారించారు. ఈ రెండూ వున్న కావ్యమే ఉత్తమ కావ్యం అవుతుందని తేల్చి చెప్పారు భారతీయాలంకారికులు. ఈ సిద్ధాంతాన్ని ఎక్కువమంది అనుసరించారు, అనుకరించారు. మొత్తంమీద గురజాడ రాసిన ‘‘కన్యాశుల్కం’’ నాటకంలో, భరతుడు చెప్పిన రసం, ఆనందవర్థనుడు చెప్పిన ధ్వని (వ్యంగ్యం) రెండూ సమ్మిళితంగా చోటుచేసుకున్నాయి. అంతేకాక అభినవగుప్తుడు చెప్పిన ‘‘రస ధ్వని’’, నాటకమంతా అంతర్లీనంగా చాలా స్పష్టంగా కన్పిస్తుంది. ఇలా ‘‘రసధ్వనులు’’ రెండూ సమాంతరంగా ప్రవహిస్తున్న ఏకైక విశ్వవిఖ్యాత మహా ఉత్తమ నాటకం ‘‘కన్యాశుల్కం.’’

- ప్రొ. వెలమల సిమ్మన్న, 9440641617