మెయిన్ ఫీచర్

సామాజిక గమనాన్ని సాహిత్యం అందుకోగలదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రామిక వర్గాల కొమ్ము కాసే ప్రపంచ దేశాల దృక్పథంలో వచ్చిన మార్పు అయితేనేమి, పాలకుల కపట రాజనీతి నైపుణ్యమైతేనేమి, విప్లవోద్యమాల సంఘటిత తత్త్వాన్ని కొంతవరకు నీరుగార్చిన మాట సత్యదూరమైనదిగా భావించలేము. నేటి సామాజిక గమనాన్ని విప్లవోద్యమాలు పట్టుకోలేనట్లే నేడు వెలువడుతున్న సాహిత్యం కూడా అందుకోలేకపోతోంది. శ్రామిక వర్గం పక్షం వహించే సాహిత్యం కూడా నిర్దిష్టమైన తమ దృక్పథాన్ని విడిచి అనిబద్ధతా తౌల్యంలోకి జారిపోతుంది. వౌలికమైన సమస్యలను విడనాడి, ముక్కిడి సిద్ధాంతాలను వల్లెవేస్తూ, పొదుగున, కడవన లేకుండా భావధారను మార్గదర్శకత్వం లేని మార్గాల్లో ఇంకిపోజేస్తున్నారు. అభ్యుదయ భావోద్యమాలు నీరసించి పోతున్నాయి. నీరుగారిపోతున్నాయి. అతి సామాన్య మానవుడు రాజకీయుల మాటలు నమ్మి భ్రమలకు లోనయ్యే విధంగా, సాహితీవేత్తలు కూడా పిచ్చి పిచ్చి భ్రమల్లో బతుకుతూ, ప్రణాళికాబద్ధమైన ఉద్యమ సాహిత్యానికి దూరంగా జరిగిపోతున్నారు. దోపిడీ విధానపు జాడ్యం పెట్టుబడిదారీ వర్గాలకు అంటనట్లే, శ్రామిక వర్గాలకు అంతో ఇంతో అంటి, భోగలాలస విలాస కలల్లో తేలిపోతూ, తమని తాము మరిచిపోయే స్థితిలోకి దిగజారిపోతున్నారు. వస్తు వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నారు. అప్పుల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారే కాని సంఘటితపడి వారి దౌర్భాగ్యాన్ని గూర్చి చర్చించుకోలేకపోతున్నారు. చైతన్యవంతమైన ఆలోచనా విధానాలవైపునకు రాలేని దౌర్భాగ్య స్థితిలో మునకలేస్తున్నారు.
‘నిజమైన సాహిత్యం మన సమాజంలో వుండే బర్బరత్వాన్నీ, క్రూరత్వాన్నీ పైశాచికత్వాన్నీ బయటపెట్టాలి. అప్పుడే అది ప్రజలకు సంబంధించిన సాహిత్యమవుతుంది. విప్లవ సాహిత్యమవుతుంది’ అని 1973లో కొడవటిగంటి కుటుంబరావు ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇటువంటి విప్లవ సాహిత్య సృజన కోసం నేడు మన సాహితీవేత్తల కలాలు కదంతొక్కుతున్నాయా? గతంలో వున్న పోరాటాల ప్రభావం ఈనాడు రాస్తున్న సాహితీవేత్తల మీద లేకపోవడానికి గల కారణాలు ఏమై వుంటాయి? ఈనాడు సమాజంలో దోపిడీ తగ్గి ఉద్యమాలు అణిగిపోయాయా? విప్లవోద్యమాలను చైతన్యపరచే రాజకీయ పార్టీల ప్రాబల్యం సన్నగిల్లిపోయిందా? దీర్ఘకాలిక వ్యూహాలతో ఎత్తుగడలతో పటిష్టమైన నిర్మాణంగల రాజకీయ పార్టీ ప్రజల అభిమానాన్ని ఆదరణను కోల్పోవటానికి గల కారణాలేమై వుంటాయి? పాలక వర్గం దోపిడీ మీద ఉసికొల్పిన తిరుగుబాటు చైతన్యం, ప్రజల్లో ఆత్మార్పణకు దారితీసిన వైఖరి ఏమై వుంటుంది? నేటి ప్రజాస్వామ్య విధానాలతోనే సుస్థిరమైన ధర్మబద్ధమైన దోపిడీ రహితమైన ప్రజా పాలనను సాధించగలమనే నమ్మకం కలుగుతుందా? నేడు పాలక పక్షాలు వహించే రాజకీయ తంత్రాలు, ఓట్ల కుతంత్రాలు చూస్తూనే ఉన్నాం. రాజకీయాలను శాసించే, పెట్టుబడిదారీ వర్గాలను గమనిస్తూనే ఉన్నాం. అయినా విప్లవ రాజకీయాలు అడుగంటిపోతునే ఉన్నాయ. తిరుగుబాటుకు దోపిడీకి గురవుతున్న వర్గాలు కూడా వెసులుబాటు కల్పిస్తూ నయా వంచనల్లో కొట్టుకుపోతున్నారు. నేటి ఈ చారిత్రక తప్పిదాన్ని ఎత్తిచూపే నిష్ఠగల సాహిత్యం ఈ రోజు కొరవడుతోందనడంలో ఎట్టి సందేహం లేదు. ఒకనాడు విప్లవోద్యమాలకు ఊపిరిలూదిన కవులు / రచయితలు ఈ రోజు పాలకవర్గం పందేరం చేసే పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారు. వారిచ్చే అవార్డు రివార్డుల వేటలో సతమతవౌతున్నారు. తాత్విక ధోరణులంటూ, ముట్టీ ముట్టనట్టు, అంటీ అంటని తిరస్కార భావాలను వ్యక్తీకరిస్తూ సాహిత్యం రాసి రాశులు పోస్తున్నారు. కుల మత ప్రాంతీయ వర్గాలు సాహిత్యంలో తలలెత్తి ఇంటికో సాహిత్యం ముఠా ఏర్పడుతుంది. వర్గ చైతన్యాన్ని విడనాడి వివిధ వాదాలుగా బలపడుతూ, విభిన్న వైఖరితో స్వార్థాన్ని బలపరుస్తూ సాగిపోతున్న సాహిత్య ముఠాల అస్పష్టతా భావాలు కవిత్వంగా చలామణి అవుతున్నాయి. అసంకీర్ణత అందలమెక్కుతోంది. తాము భ్రమలకు లోనవడమే కాకుండా కొంతమంది కవులు / రచయితలు పాఠకులను భ్రమలకు లోను చేసే సాహిత్యాన్ని సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటి వాళ్లంతా మేధావులైన రచయితలుగా పరిగణించబడుతున్నారు. ఇంకా సంప్రదాయవాదాలకు, వర్ణ వ్యవస్థకు, రాజ్యాంగ విరుద్ధమైన భావాలకు ఊతమిస్తున్న రచనలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ప్రజాధనాన్ని ఫణంగా పెడుతోంది. భూస్వామ్య విలువల్నీ, బూర్జువా విలువల్నీ ప్రోత్సహిస్తూ మూఢ విశ్వాసాలను, మూఢ భక్తిని బలపరుస్తూ, పాలక వర్గాలకు భజన చేసే సాహితీవేత్తల జోరు అధికమైంది.
మనిషిని అస్తిత్వమున్న మనిషిగా తీర్చిదిద్దే సాహిత్యాన్ని, దోపిడీని నిలువరించే జ్ఞానాన్ని కలిగించే సాహిత్యాన్ని, మనిషి సరైన మానవీయతా విలువలతో బతికే సాహిత్యాన్ని, సమిష్టిగా స్వేచ్ఛను సాధించుకునే లక్ష్యసిద్ధిగల సాహిత్యాన్ని ముట్టే పాఠకులు అంతకంతకు తగ్గిపోతున్నారు. పఠనాసక్తి నిజం చెప్పాలంటే సాహిత్యం రాసే కవులు / రచయితల్లో కూడా తగ్గిపోతోంది. విస్తృతమైన అధ్యయనం చేసే సాహితీవేత్తలు చాలా అరుదుగా కనిపిస్తున్నారనడం అతిశయోక్తి కాదేమో! నిబద్ధతగల రచనలు ఎప్పుడూ శ్రామికవర్గ చైతన్యాన్ని కాంక్షిస్తూ సాగిపోతుంటాయి. అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కోరుకుంటుంటాయి. ప్రజల పక్షాన నిలబడుతుంటాయి. పాలక వర్గాల దోపిడీని, అవినీతిని, అన్యాయాలను, అణచివేతలను ఎండగడుతుంటాయి. ఇటువంటి సాహిత్యాన్ని సృష్టించాలంటే కవులకు / రచయితలకు సామాజిక చైతన్యం కలిగి ఉండాలి. సామాజిక స్పృహ సాహితీవేత్తలకు మూడో నేత్రం. దానిని విప్పార్చి నిశితమైన సామాజిక పరిశీలనతో రచనలు చేసినపుడే అది ప్రజా సాహిత్యం అవుతుంది.
కవులు, రచయితలు పాలకవర్గ వికృత చేష్టలను నిశితంగా ఖండించినట్లయితే, ప్రభుత్వాలకు ప్రధాన విరోధులుగా సాహితీవేత్తలే నిలుస్తారు. కాని ప్రభుత్వాలకు అనుకూలురుగా, ప్రజలకు ప్రభుత్వానికిమధ్య సంధానకర్తలుగా, సాహితీవేత్తలు తమ పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధాంతాల ప్రాధాన్యత లేని, సాహిత్యానుభవ వ్యక్తీకరణకే ప్రాధాన్యం ఇస్తున్న రచయితలకు ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. ఇటువంటి రచనలు పాఠకులకు ఆహ్లాదాన్ని, మనోవికాసాన్ని కలిగిస్తాయని పాలక వర్గం నమ్ముతుంది. ఇలాంటి రచనలను పాలకవర్గం ప్రమోట్ చేస్తుంది కూడా. ఎంతకాలం ఈ రచనలు చదివినా పాఠకులకు సమస్యలు ఎదుర్కొనే లక్ష్యంగాని, మార్గం కాని తెలియవు. వారేమిటో, ఇతరులు ఏమిటో, ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియదు. మార్క్సిజం పరిధిలో ఆలోచించకుండా ఆత్మాశ్రయ ధోరణిలో ఆలోచించే విమర్శలు కాని రచయితలుగాని నేటి సామాజిక విధ్వంసక మూలాలను సరైన అవగాహనతో పసిగట్టలేరు. విధ్వంసక శక్తులను నివారించే చైతన్యవంతమైన ఆలోచనలను ఇవ్వలేరు. శాస్ర్తియమైన హేతుబద్ధమైన దృక్పథాలను కల్పించలేరనేది సత్యం.
ఏది ఏమైనా నేడు సాహితీవేత్తలు సమాజంలో కలిసి నడవాల్సి వుంది. కాలంతో కలిసి నడుస్తున్న సామాజిక ఒడిని పట్టుకోవాల్సిన అగత్యం ఎంతైనా వుంది. కాలంలో వచ్చే మార్పు సమాజాన్ని మూడడుగుల ముందు నడిపిస్తుంది. కానీ సాహితీవేత్తలు ఏడడుగులు వెనక నడుస్తున్నారు. నేడు సాహితీవేత్తలు ఏదో వెనుకటి అనుభవసారాన్ని మాటలగారడీతో అమృతరసంగా పాఠకులకు తాగింపజూస్తున్నారు. నేటి సామాజిక గమనాన్ని సాహితీవేత్తలు అందుకోవాలి. దాని లొసుగులను నిర్భయంగా నిర్మొహమాటంగా, నిస్వార్థంగా విప్లవ చైతన్యంతో ఎండగట్టాల్సి వుంది. కాలదోషం పట్టిన భావాలకు, సంప్రదాయాలకు తిలోదకాలివ్వాలి. ప్రతి వ్యక్తిలోను భౌతిక, భౌతికేతర శక్తులను వినియోగం చేసే స్వేచ్ఛాయుతమైన చైతన్యాన్ని కలిగించే సాహిత్యం ముందుకు రావాలి. కాలం కౌగిట్లో ఒదిగి నడుస్తున్న సమాజ వేగాన్ని అందిపుచ్చుకునే విధంగా సాహితీవేత్తలు తమ కలాలను కదపాల్సి వుంది.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 9948774243