క్రైమ్ కథ

ఎవరు దోషి? (క్రైమ్ కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి సెంబర్ నెల్లో ఆ గురువారం మంచు పడుతోంది. బరువైన ట్వీడ్ కోట్ జేబుల్లో తన రెండు చేతులని ఉంచుకున్న స్టీవ్, మిడ్ వెస్ట్రన్ ఎక్సేంజ్ బ్యాంక్‌లోకి సాయంత్రం మూడు తర్వాత కొన్ని నిమిషాలకి ప్రవేశించాడు. యూనిఫాంలోని గార్డ్ ప్రవేశం ద్వారా దగ్గర నిలబడి ఉన్నాడు. అతను బయట ఉన్న ఓ టవర్ క్లాక్ వంక చూస్తున్నాడు.
దాదాపుగా నిర్మానుష్యంగా ఉన్న బ్యాంక్ లాబీని దాటి స్టీవ్ కేష్ కౌంటర్ నంబర్ నాలుగు దగ్గరకి నడిచాడు. ఆ సమయంలో అదొక్కటే తీసి ఉంది. లావుగా ఉండి, తెల్లజుట్టు గల ఓ కస్టమర్ తన పనిని పూర్తి చేసే దాకా స్టీవ్ అతనికి కొద్దిగా వెనక నిలబడి ఓపికగా వేచి ఉన్నాడు. అతని పని పూర్తయ్యాక స్టీవ్‌ని రమ్మని కేషియర్ సౌంజ్ఞ చేశాడు.
కౌంటర్ మీది చిన్న నేమ్ ప్లేట్ మీద కేషియర్ పేరు రాసుంది. జేమ్స్ కాక్స్. నల్లటి కళ్లుగల అతను సన్నగా ఉన్నాడు. గోధుమరంగు జుట్టు. అతను స్టీవ్‌ని చూసి నవ్వి అడిగాడు.
‘మీకేం సహాయం చేయగలను?’
స్టీవ్ జేబులోంచి మడచిన ఓ కాగితం తీసి కేషియర్‌కి అందించాడు. గోడ గడియారం ముల్లు 3.03 నించి 3.04కి మారింది. స్టీవ్ వెనక్కి తిరిగి చూడకుండా తన పనవగానే కౌంటర్నించి తలుపు వైపు నడిచాడు. స్టీవ్ తలుపులోంచి బయటకి వెళ్లిన కొద్ది క్షణాలకి కేషియర్ జేమ్స్ అరిచాడు.
‘శామ్. అతన్ని ఆపు. దొంగ’
స్టీవ్ మంచుతో కప్పబడ్డ పేవ్‌మెంట్ మీద నిలబడి తల తిప్పి లోపలి నించి వినపడ్డ మాటలని విని ఆగి ఆశ్చర్యంగా చూశాడు. గార్డ్ శామ్ కొద్ది క్షణాలు కదలకుండా నిలబడ్డాడు. అర్థం అవగానే అతను తలుపు తెరచుకుని బయటకి వేగంగా వచ్చి, కోట్ పట్టుకుని స్టీవ్‌ని ఆపాడు. గార్డ్ కుడిచెయ్యి హోల్‌స్టర్‌లోని రివాల్వర్ కోసం తడమసాగింది.
‘ఎందుకు ఆపావు?’ స్టీవ్ చిరాగ్గా అడిగాడు.
గార్డ్ స్టీవ్ పక్కటెముకలకి రివాల్వర్ గొట్టాన్ని ఆనించి అతన్ని బేంక్‌లోకి లాక్కెళ్లాడు.
వాళ్లని చూడగానే జేమ్స్ తన కౌంటర్ వెనక నించి బయటకి పరిగెత్తుకు వచ్చాడు. బ్రాంచ్ మేనేజర్ హాఫ్‌మేన్ కూడా తన కేబిన్‌లోంచి హడావిడిగా బయటకి వచ్చాడు. జేమ్స్ చేతిలో ఓ కాగితం ఉంది.
‘ఏమిటి?’ మేనేజర్ హాఫ్‌మేన్ స్టీవ్‌ని ఎగాదిగా చూసి, జేమ్స్ వంక తిరిగి ప్రశ్నించాడు.
‘ఇతను డబ్బుని దొంగిలించాడు. పది డాలర్లు. దానికన్నా పెద్ద నోట్లన్నింటినీ నా నించి దొంగిలించాడు’
స్టీవ్ కేషియర్ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.
‘ఏమిటిది? నేను నీ దగ్గర దొంగతనం చేయలేదు. అది నీకూ తెలుసు’
‘శామ్. అతని కోటు జేబులన్నీ వెదుకు. నేను ఇచ్చిన నోట్లని అతను కోట్ జేబుల్లో ఉంచుకున్నాడు’ జేమ్స్ ఆందోళనగా గార్డ్‌కి చెప్పాడు.
‘నీకు పిచ్చి పట్టినట్లుంది. నేను దొంగతనం చేయడం ఏమిటి?’
‘శామ్. అతని జేబులన్నీ వెదుకు’ పరిస్థితి అర్థం చేసుకున్న హాఫ్‌మేన్ వెంటనే ఆజ్ఞాపించాడు.
గార్డ్ స్టీవ్‌ని చేతులు ఎత్తి ఉంచమని, దింపద్దని చెప్పి అతని జేబుల మీద తట్టాడు. తర్వాత అన్ని జేబుల్లోకి చేతులు ఉంచి వెదికాడు. బయటకి తీసిన అతని పంది చర్మం పర్స్‌లో పెన్నీలు, నికెల్స్, డైమ్స్ నాణాలు మాత్రమే ఉన్నాయి.
‘ఇతని దగ్గర ఉన్నది ఇదే’ శామ్ చెప్పాడు.
‘ఏమిటి? అతనా డబ్బుని కోటు జేబులో ఉంచుకోవడం నేను చూసాను’ జేమ్స్ గట్టిగా చెప్పాడు.
‘కాని ఇప్పుడు అక్కడ లేదా డబ్బు’ గార్డ్ చెప్పాడు.
‘నేను దొంగతనం చేయలేదని చెప్పానా? లేదా?’ స్టీవ్ కోపంగా అరిచాడు.
జేమ్స్ తన చేతిలోని కాగితాన్ని హాఫ్‌మేన్‌కి ఇచ్చి చెప్పాడు.
‘ఇదీ ఇతను నాకు ఇచ్చిన కాగితం. మీరే చదవండి’
హాఫ్‌మేన్ ఆ కాగితంలో దినపత్రికల నించి చింపి అతికించిన అక్షరాలున్న ఉత్తరాన్ని చదివాడు.
‘నీ దగ్గరున్న పెద్ద నోట్లన్నీ ఇవ్వు. నా దగ్గర రివాల్వర్ ఉంది. నువ్వు హీరో వేషాలేస్తే నిన్ను చంపుతాను. నేను జోక్ చేయడం లేదు.’
‘ఇతని దగ్గర రివాల్వర్ కాని, మరే ఆయుధం కాని లేదు.’ అది విన్న శామ్ స్టీవ్ శరీరాన్ని మరోసారి జాగ్రత్తగా తడిమి చెప్పాడు.
‘అందులో రాసింది చదివి, ఉందని నేను నమ్మాను. అందుకే అతను గుమ్మం దాటే దాకా నిశ్శబ్దంగా ఉండి, తర్వాత అరిచాను. బ్యాంక్ డబ్బుతో అతను పారిపోకూడదని శామ్‌తో అతన్ని పట్టుకోమని అరిచి చెప్పాను.’
‘నీకా ఉత్తరం ఎలా వచ్చిందో నాకు తెలీదు. దాన్ని నేను నీకు ఇవ్వలేదు. నీకో కాగితం ఇవ్వడం నిజం. అందులో ఎనిమిది డాలర్లకి ఏ చిల్లర నాణాలు కావాలో రాసానని నీకు తెలుసు’ స్టీవ్ కోపంగా చెప్పాడు.
‘ఆ నాణాలని మిస్టర్ జేమ్స్ మీకు ఇచ్చారంటున్నారా?’ హాఫ్‌మేన్ ప్రశ్నించాడు.
‘అవును’
‘అతనికి నేను చిల్లరేం ఇవ్వలేదు. ఆ ఉత్తరంలో రాసినట్లుగా మన బ్యాంక్ డబ్బుని ఇచ్చాను. అరవై ఐదు నించి డెబ్బై వేల డాలర్ల దాకా తీసుకుని ఉంటాడు’
‘జేమ్స్. నువ్వు అబద్ధాలకోరువి’ స్టీవ్ చెయ్యి పైకి లేచినా, తమాయించుకుని ఆగి చెప్పాడు.
‘నువ్వే ఆ పని చేస్తున్నది’ జేమ్స్ ఓ అడుగు అప్రయత్నంగా వెనక్కి వేసి చెప్పాడు.
‘నా దగ్గర నీ వెధవ డబ్బు లేదు. నన్ను వెదికారుగా. నా దగ్గరున్నదంతా ఎనిమిది డాలర్ల చిల్లర మాత్రమే. అదీ నువ్వు ఇచ్చిందే’
‘అది ఎవరి దగ్గరో ఉంది’ హాఫ్‌మేన్ స్టీవ్ వంక తీవ్రంగా చూస్తూ చెప్పాడు.
ఉద్యోగస్థుల్లోని ఒకరు అప్పటికే ఫోన్ చేయడంతో మఫ్టీలోని ఇద్దరు పోలీసు డిటెక్టివ్‌లు బ్యాంక్‌లోకి వచ్చారు. వారిలోని లెఫ్టినెంట్ ఫ్రైబర్గ్ గార్డ్‌తో బ్యాంక్ తలుపుని వెంటనే మూయమని చెప్పాక హాఫ్‌మేన్‌ని అడిగాడు.
‘ఏం జరిగిందో చెప్పండి’
జేమ్స్ గాభరాగా జరిగింది వివరించాడు. ఫ్రైబర్గ్ మధ్యలో అడ్డు ప్రశ్నలు వేయకుండా తన నోట్‌బుక్‌లో అతను చెప్పేది శ్రద్ధగా రాసుకున్నాడు. జేమ్స్ మొత్తం చెప్పాక అతను స్టీవ్ వైపు తిరిగి అడిగాడు.
‘ఇతను చెప్పింది నిజమేనా?’
స్టీవ్ తను తీసుకున్న చిల్లర గురించి చెప్పాడు.
‘ఈ రాత్రి నేను నా స్నేహితులతో పోకర్ ఆటని ఆడుతున్నాను. నేను వారికి బేంకర్ కాబట్టి చిల్లర అవసరమని అది తీసుకోడానికి వచ్చాను’
‘తనకి ఏ నాణాలు కావాలో రాసిన కాగితాన్ని కూడా ఇతను కేషియర్‌కి ఇచ్చానని చెప్తున్నాడు’ హాఫ్‌మేన్ వివరించాడు.
అతను నాకు ఇచ్చిన కాగితం ఇదొక్కటే. ఈ చిల్లరని ఇంకెక్కడో తీసుకుని వచ్చుంటాడు’ జేమ్స్ కోపంగా చెప్పాడు.
‘మీరు అతనిని కేబిన్‌ని చెక్ చేయండి. నేను ఇచ్చిన కాగితం అందులో ఎక్కడో ఉండి ఉంటుంది. పోయిన డబ్బు కూడా దొరకచ్చేమో’
‘నేను దొంగతనం చేసానని ఆరోపిస్తున్నావా?’ జేమ్స్ మండిపడ్డాడు.
‘మిస్టర్ జేమ్స్ కాక్స్ మిడ్ వెస్ట్ నేషనల్ బ్యాంక్‌లో గత నాలుగేళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న ఉద్యోగి’ తన వంక ప్రశ్నార్థకంగా చూసే ఫ్రైబర్గ్‌తో హాఫ్‌మేన్ చెప్పాడు.
‘నేను కూడా కర్టిస్ టూల్స్ కంపెనీలో నమ్మకంగా పనిచేసే ఉద్యోగిని. అందువల్ల జేమ్స్ విషయంలో మీరు ఏది నమ్ముతున్నారో నా విషయంలో కూడా అదే నమ్మాలి’ స్టీవ్ చెప్పాడు.
‘లేదా రోడ్ మీద తోడు దొంగకి ఇచ్చి పంపేసి ఉంటాడు’
‘సరే మిస్టర్ హాఫ్‌మేన్. దయచేసి ఎంత సొమ్ము పోయిందో ముందు తేల్చండి’
తర్వాత ఫ్రైబర్గ్ తనతో వచ్చిన మఫ్టీలోని సార్జెంట్‌తో చెప్పాడు.
‘్ఫ్లన్. నువ్వు మిగిలిన ఉద్యోగస్థుల్ని ప్రశ్నించు. వారిలో ఎవరైనా ముఖ్యమైంది ఏదైనా చూడటమో, వినడమో జరిగి ఉండచ్చు. నువ్వు జేమ్స్ కేబిన్‌ని, అతని లంచ్ బాక్స్ లాంటి వ్యక్తిగతమైన వస్తువులు కూడా వెదుకు’
జేమ్స్ నిర్ఘాంతపోయాడు. తర్వాత ప్రశ్నించాడు.
‘అంటే మీరో దొంగ మాటని నమ్ముతున్నారా?’
‘నేను ఎవరి మాటనీ నమ్మడం లేదు మిస్టర్ జేమ్స్. ఇక్కడ ఇందాక ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. దయచేసి మీ జేబులోవన్నీ బయటకి తీస్తారా?’
‘ఇది నన్ను అవమానించడం. సరే. నేను దాచాల్సిన అవసరం నాకు లేదు’ చెప్పి జేమ్స్ జేబుల్లోని వస్తువులన్నీ బయటకి తీసి బర్గ్‌కి అందించాడు.
ఫ్రైబర్గ్ అతని ఖాళీ జేబులని వెదికితే ఆ సొమ్ము లేదు. జేబుల్లోంచి బయటకి తీసిన వస్తువుల్లో కూడా లేదు. అతని కేబిన్‌లో కూడా ఆ సొమ్ము కాని, స్టీవ్ చెప్పిన డాలర్ చిల్లర లెక్క రాసిన కాగితం కాని లేదు.
అరవై ఎనిమిది వేల వంద డాలర్లు పోయాయని రికార్డ్ తనిఖీ చేసి కనుక్కున్నారు. కేష్ డ్రాయర్లో ఎన్ని నాణాలు ఉండాలో సరిగ్గా అన్నీ ఉన్నాయి. ఇతర ఉద్యోగస్థులు కూడా కొత్తగా ఉపయోగించే సమాచారాన్ని చెప్పలేకపోయారు. వాళ్ల దగ్గర కూడా పోయిన డబ్బు దొరకలేదు.
‘మీరు ఇచ్చానని చెప్పే కాగితం కాని, మీకు చిల్లర ఇచ్చిన దాఖలా కాని కనపడటం లేదు. దీనికి మీరేమంటారు?’ ఫ్రైబర్గ్ స్టీవ్‌ని ప్రశ్నించాడు.
‘నేనేం చెప్పలేను. నేను నిజమే చెప్పాను. నాకా సొమ్ము గురించి తెలీదు’ స్టీవ్ చెప్పాడు.
‘ఇతన్ని నువ్వు పట్టుకునే లోపల ఎంత దూరం వెళ్లాడు’ ఫ్రైబర్గ్ గార్డ్‌ని ప్రశ్నించాడు.
‘మెట్లు దిగి ఒకటి రెండు అడుగులు పేవ్‌మెంట్ మీదకి వేసాడు’
‘దాన్ని తోడు దొంగకి ఇచ్చి ఉండచ్చా?’
‘చెప్పలేను. ఇతను డబ్బుని ఎవరికో ఇవ్వడం నేను గమనించలేదు. నిజానికి ఇచ్చినా చూడలేదు. జేమ్స్ అరుపులు వినేదాకా నేను ఇతన్ని పట్టించుకోలేదు’ గార్డ్ చెప్పాడు.
‘అరవై ఎనిమిది వేల డాలర్లంటే చాలా నోట్లుండాలి. ఒకటి రెండు క్షణాల్లో దాన్ని నేను ఎవరికైనా ఎలా ఇవ్వగలను? మీరు గార్డ్‌ని కూడా వెతకండి. అతను నా తోడు దొంగేమో’ స్టీవ్ ఎకసెక్కంగా చెప్పాడు.
‘అవును. వెతకండి. ఇందులో నా ప్రమేయం లేదని తెలుస్తుంది’ శామ్ వెంటనే చెప్పాడు.
ఫ్లిన్ అతన్ని కూడా మిగిలిన ఉద్యోగస్థులని వెదికినట్లుగానే క్షుణ్ణంగా వెదికాడు. లేదు.
‘ఆ డబ్బు దానంతట అదే మాయం కాలేదు. స్టీవ్‌దే అందుకు బాధ్యత అని నా నమ్మకం’ హాఫ్‌మేన్ చెప్పాడు.
‘అతన్ని మా వెంట హెడ్‌క్వార్టర్స్‌కి తీసుకెళ్లి ప్రశ్నిస్తాం’ ఫ్రైబర్గ్ చెప్పాడు.
‘అలాగే. వస్తాను. కాని నేను మీ ప్రశ్నలకి జవాబులు చెప్పే ముందు నా లాయర్ నా పక్కన ఉండాలి. నన్ను దోషిగా అరెస్ట్ చేస్తే తప్పుడు అరెస్ట్‌కి నేను పోలీసు శాఖ మీద, బ్యాంక్ మీద పరువు నష్టం దావా వేసి పరిహారం కోరుతాను. ఇంకా మా లాయర్ ఏయే కేసులు పెట్టచ్చంటే అవన్నీ కూడా పెడతాను’ స్టీవ్ ఉగ్రంగా చెప్పాడు.
అతన్ని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కి తీసుకెళ్లారు. లాయర్ సమక్షంలో చాలా ప్రశ్నలు వేశాడు. అతను బ్యాంక్‌లో చెప్పిన అంశాల్లో ఎలాంటి మార్పు లేకుండా అవే జవాబులు చెప్పాడు. స్టీవ్ నలుగురు మిత్రులకి ఫోన్ చేస్తే ఆ రాత్రి వారంతా కలిసి పోకర్ ఆట ఆడటం నిజమే అని తెలిసింది. చివరికి ఫ్రైబర్గ్ అతని వంక అలసటగా చూసి చెప్పాడు.
‘సరే. నువ్వు వెళ్లచ్చు’
‘చిట్టచివరికి నేను చెప్పేది నమ్ముతున్నారన్నమాట’
‘లేదు. నమ్మడం లేదు. జేమ్స్ చెప్పిందే నమ్ముతున్నాను. రోడ్ మీద నీ తోడుదొంగకి ఆ డబ్బు ఇచ్చావని నా నమ్మకం. గార్డ్ అది చూడకపోవడం నీ అదృష్టం. నిన్ను ఇరికించే దారి మాకు కనపడటం లేదు. నీ మీద క్రిమినల్ రికార్డ్ కూడా లేదు. జేమ్స్, నువ్వు గౌరవనీయమైన పౌరులు. గట్టి ఆధారాలు కాని, డబ్బు కాని దొరక్కపోవడంతో నీ విషయంలో మేం ఏం చేయలేం’
స్టీవ్ లేచాక ఫ్రైబెర్గ్ అకస్మాత్తుగా కోపంగా చెప్పాడు.
‘కాని మేం ఈ కేసుని మూసేయడం లేదు స్టీవ్. నిన్నో కంట కనిపెడుతూంటాం. నువ్వు చేసే ఖర్చు ఆదాయంకన్నా అధికమైతే అప్పుడు... వెళ్లు’
‘నా జీవితాంతం గమనిస్తూండండి. నేను అమాయకుడ్ని’ చెప్పి స్టీవ్ బయటకి నడిచాడు.
* * *
మూడు వారాల తర్వాత ఓ రాత్రి బీవర్‌ఫుడ్ ఊరికి పదహారు మైళ్ల దూరంలోని ఇంకో ఊళ్లో మోటెల్‌లో గది నంబర్ తొమ్మిది మీద స్టీవ్ తలుపు తట్టాడు. తనెవరో చెప్పాక లోపల నించి తలుపు తెరచుకుంది. అతను తన కోట్ విప్పి గోధుమరంగు జుట్టుగల ఆ వ్యక్తి వంక చూసి నవ్వాడు.
‘హలో జేమ్స్’ పలకరించాడు.
ఆ గదిలోని మరో వ్యక్తి స్టీవ్ వచ్చాక మూడు గ్లాసుల్లో విస్కీని నింపసాగాడు.
‘స్టీవ్. నిన్ను పోలీసులు ఎవరూ అనుసరించలేదుగా?’ జేమ్స్ అడిగాడు.
‘కచ్చితంగా లేదు.’
‘పోలీసులు నిన్ను గమనించడం మానేసారా?’
‘మొదటంతగా లేదు. మన పథకం చక్కగా పారింది’ స్టీవ్ నవ్వుతూ చెప్పాడు.
‘అవును. ఫ్రైబెర్గ్ ఇంకా ఆ డబ్బు నువ్వు తోడ దొంగకి ఇచ్చి పంపావనే నమ్ముతున్నాడు. కాని ఎలాగో రుజువు చేయలేక పోతున్నానని బాధపడుతున్నాడు. నువ్వు చెప్పినట్లుగానే మనిద్దరిలో ఒకరి మాట నమ్మితే, పోలీసులు రెండోవారి మాటని కూడా నమ్మాలి. ఎవరో ఒకరిదే నమ్మితే అది పక్షపాతం అవుతుంది. వాళ్లకి ఆ డబ్బు ఎవరి దగ్గర ఉందో తెలీదు.’
ఆ గదిలోని మూడో వ్యక్తి పొట్టిగా ఉన్న తెల్లజుట్టు గల వృద్ధుడు. ఆ రోజు బ్యాంక్‌లో స్టీవ్‌కన్నా ముందు కేష్ కౌంటర్ నించి వెళ్లిన స్టీవ్ తండ్రి ఇద్దరికీ విస్కీ గ్లాసులని అందించి నవ్వుతూ చెప్పాడు.
‘మీ ఇద్దరూ మీ నాటకాన్ని ఆడేప్పుడు ఆ డబ్బు బ్యాంక్‌లోంచి నా బ్రీఫ్‌కేసులోకి వచ్చి భద్రంగా ఉంది’
వాళ్లు ముగ్గురూ అరవై ఎనిమిది వేల వంద డాలర్లని మూడు భాగాలు చేసి పంచుకున్నారు. తర్వాత గ్లాసులని ఒకదానికి మరొకటి తాకించి చెప్పారు.
‘మన చిన్న నేరానికి’

(బిల్ ఫ్రాంజినీ అండ్ జెఫ్రీ ఎం వాల్‌మేన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి