రుచి

ఉసిరి రుచులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉసిరికాయను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. ఆరోగ్య సిరిగా చెప్పుకునే ఉసిరి సీజన్ ఇది. వీటితో రకరకాల వంటకాలు చేసుకుంటారు. ఉసిరి ఊరగాయ, పచ్చడి, పులిహోర, కూర, పిల్లలకు క్యాండీ, మురబ్బా.. ఇలా ఏదైనా కాస్త తీపిగా, కాస్త వగరుగా, కాస్త పుల్లగా.. వహ్వా అనిపిస్తుంది. అందుకే ఈ కార్తీకమాసంలో కూడా ఉసిరితో వంటిల్లుని ఘుమఘుమలాడించేద్దాం..

పులిహోర

కావలసిన పదార్థాలు
బియ్యం: అరకప్పు
ఉసిరికాయలు: పది
పసుపు: అరస్పూను
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
నువ్వులపొడి: రెండు చెంచాలు
జీడిపప్పు: నాలుగు
ఎండుమిర్చి: నాలుగు
పచ్చిమిర్చి: నాలుగు
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: ఒక చిన్న కట్ట
శనగపప్పు: ఒక స్పూన్
మినపప్పు: ఒక స్పూన్
ఆవాలు: ఒక స్పూన్
తయారీ విధానం
ముందుగా అన్నం వండుకుని వెడల్పాటి గినె్నలో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పువేసి వాటిని కచ్చాపచ్చాగా దంచాలి. పెద్ద ఉసిరికాయలైతే తురుముకోవచ్చు. తర్వాత పాన్‌లో నూనెవేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేగాక అందులో ఎండుమిర్చి, పసుపు వేసుకోవాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన లేదా తురిమిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. దీన్ని రెండు, మూడు నిముషాలు మీడియం మంటపై వేయించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అన్నంలో వేసి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే నోరూరించే ఉసిరి పులిహోర రెడీ..

చట్నీ

కావలసిన పదార్థాలు
ఉసిరికాయలు: పది
నూనె: ఒక చెంచా
సోంపు: ఒక చెంచా
ధనియాలపొడి: ఒక చెంచా
కారం: ఒక చెంచా
నెయ్యి: ఒక చెంచా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం: ముందుగా ఉసిరికాయలను ఉడికించి గింజలు తీసేసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక పాన్‌ను తీసుకుని స్టవ్‌పై ఉంచి పాన్‌లో నూనె వేసి కాస్త వేడయ్యాక సోంపు వేసి వేగించాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేయాలి. ధనియాల పొడి, కారం, నెయ్యి వేసి కలియబెట్టి మరికాసేపు వేగించాలి. తరువాత తగినంత ఉప్పు వేసి కలిపి స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చట్నీ తయారు.

మురబ్బా

కావలసిన పదార్థాలు
ఉసిరికాయలు: కిలో
కెమికల్ లైమ్: రెండు చెంచాలు
పంచదార: ఒకటిన్నర కిలో
నీళ్లు: ఆరు కప్పులు
నిమ్మరసం: ఒక చెంచా
తయారుచేసే విధానం
ముందుగా ఫోర్క్ సహాయంతో ఉసిరికాయలకు రంధ్రం చేయాలి. తరువాత నీళ్లలో ఒక చెంచా కెమికల్ లైమ్ వేసి అందులో ఉసిరికాయలు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయానే్న ఆ నీళ్లన్నీ తీసేసి ఉసిరికాయలను శుభ్రంగా కడిగి మళ్లీ ఒక రాత్రంతా లైమ్ నీటిలో నానబెట్టాలి. తిరిగి ఉదయానే్న నీళ్లు తీసేసి ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలను బాగా పిండాలి. అప్పుడే వాటిలో మిగిలి ఉన్న లైమ్ పూర్తిగా పోతుంది. ఒక పాత్రలో నీళ్లు మరిగించి అందులో ఉసిరికాయలు వేయాలి. ఉసిరికాయలు మెత్తగా అయ్యాక నీళ్లు ఒంపేసి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో నీళ్లు పోసి పంచదార పానకం తయారుచేసుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మరసం వేయాలి. తరువాత ఉసిరికాయలు వేసి మరో ఐదు నిముషాలు పాటు ఉడకనిస్తే రుచికరమైన ఉసిరి మురబ్బా సిద్ధమైనట్టే.. దీన్ని చల్లారిన తరువాత జాడీలో భద్రపరచుకోవాలి.

ఆమ్లా క్యాండీ

కావలసిన పదార్థాలు
ఉసిరికాయలు: కిలో
పంచదార: ఒకటిన్నర కిలో
తయారుచేసే విధానం
ఉసిరికాయలను కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారిన తరువాత వాటి గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేయాలి. ఒక స్టోరేజ్ బాక్స్‌లో ఉసిరికాయ ముక్కలను ఉంచి వాటిపై పంచదార పోసి భద్రపరచాలి. రెండు రోజుల తరువాత చూస్తే ఉసిరికాయ ముక్కలు పంచదార పానకంపై తేలుతూ కనిపిస్తాయి. ఇప్పుడు పానకంలోని ఉసిరికాయ ముక్కలను తీసి రెండు రోజులు ఎండలో పెట్టాలి. తరువాత గదిలో ఫ్యాన్ కింద పెట్టి మరో రెండు రోజులు ఆరనిస్తే నోరూరించే ఆమ్లా క్యాండీలు తయారు. వీటిని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో భద్రపరచుకోవాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.

కూర
కావలసిన పదార్థాలు
పెద్ద ఉసిరికాయలు: అరకిలో
పసుపు: అర టీ స్పూన్
కారం: అర టీ స్పూన్
జీలకర్ర పొడి: అర టీ స్పూన్
ధనియాల పొడి: అర టీ స్పూన్
ఆవాలు: అర టీ స్పూన్
మెంతులు: అర టీ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: రెండు స్పూన్‌లు
కొత్తిమీర: ఒక చిన్న కట్ట
తయారీ విధానం: ఉసిరికాయలను తొడిమలు లేకుండా శుభ్రం చేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత పసుపు, కారాలతో పాటు తగినంత నీటినిపోసి ఉడికించాలి.
ఉడికిన ఉసిరికాయలపై తొక్క తీసి ఆరనివ్వాలి. తర్వాత ఓ నాన్‌స్టిక్ పాన్‌లో నూనెవేసి ఆవాలు, మెంతులు వేయాలి. అవి చిటపటలాడాక ఉసిరికాయల్ని వేసి మంట తక్కువ చేసుకుని రెండు నిముషాలు వేయించాలి. తర్వాత ఇందులో జీలకర్ర పొడి, ధనియాలపొడి, ఉప్పు, నిమ్మరసం కలిపి మరో రెండు నిముషాలు వేయించాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఈ కూరని వేడివేడి అన్నంలో నెయ్యివేసుకుని, కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

అచార్
కావలసిన పదార్థాలు
ఉసిరికాయలు: కిలో
ఆవాల నూనె: పావు కిలో
ఆవాలు: ఒక చెంచా
ఉప్పు: తగినంత
కారం: ఒక పెద్ద చెంచా
ఇంగువ: రెండు
తయారుచేసే విధానం
ముందుగా ఉసిరికాయలను పావుగంట పాటు ఉడికించాలి. తరువాత ఆ నీళ్లను ఒంపేసి ఉసిరికాయలను ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టాలి.
ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడయ్యాక ఆవాలు, ఇంగువ, కారం వేయాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు కలపాలి. ఉసిరికాయలకు మసాలా బాగా పట్టేంత వరకు వేగిస్తే ఉసిరికాయ ఆచార్ రెడీ. చల్లారిన తరువాత జార్‌లో పెట్టుకుని భద్రపరచుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది.