రుచి

పండుగవేళ తీయతీయగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి పండుగ అనగానే లడ్డూలు, ఇతర మిఠాయిలు గుర్తుకు వస్తాయి. అందుకని ప్రతి ఇంట్లో అనేక రకాల పిండివంటలు, స్వీట్స్ తయారుచేస్తారు. అయితే ఎప్పుడూ చేసినవే కాకుండా కాస్త వెరైటీగా, వివిధ రాష్ట్రాల్లో దీపావళి పండుగకు తయారుచేసే వంటలను చేసుకుంటే చాలా బాగుంటుంది కదూ.. మరెందుకాలస్యం వివిధ రకాల మిఠాయిలు తయారుచేయడమెలాగో తెలుసుకుని చేసేద్దాం..

కోవా మాల్పువా
కావలసిన పదార్థాలు
పాలు: ఒకటిన్నర లీటరు
కోవా: అర కప్పు మైదా: ఒక కప్పు
సోంపు: ఒక స్పూన్
పంచదార: ఒకటిన్నర కప్పు
ఉప్పు: చిటికెడు బేకింగ్ పౌడర్: చిటికెడు
నెయ్యి: వేయించడానికి సరిపడా
యాలకులు: మూడు
కుంకుమపువ్వు: కొద్దిగా
తయారుచేసే విధానం
ముందుగా వెన్న తీయని పాలను తీసుకుని కాచాలి. సోంపును మెత్తగా పొడి చేసుకోవాలి. కోవాను తురిమి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌ను తీసుకుని స్టవ్‌పై పెట్టి పంచదార, యాలకులపొడి, కుంకుమ పువ్వులను తీసుకుని కొద్దిగా నీళ్లు పోయాలి. పంచదార కరిగి షుగర్ సిరప్ తయారయ్యేవరకు ఉడికించుకోవాలి. పాకంలా తయారైన తరువాత ఈ సిరప్‌ను తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గినె్నలో కోవా, గోరువెచ్చని పాలు పోసి బాగా కలపాలి. పాలలో కోవా బాగా కలిసిపోయేంత వరకూ మిక్స్ చేయాలి. తరువాత అందులో మైదా కూడా వేసి మెత్తని పేస్ట్‌లా మృదువుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోనే మూడు స్పూన్ల పంచదార, సోంపు పొడి, బేకింగ్ పౌడర్‌లను కూడా వేసి జారుగా కలుపుకోవాలి. వీటిని ఒక పది నిముషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్‌ను స్టవ్‌పై ఉంచి అందులో నెయ్యి పోయాలి. తరువాత నెయ్యి బాగా వేడక్కక ముందే అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి ఒక కప్పును పోయాలి. ఇలా ఎన్ని వీలైతే అన్ని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మంటను పూర్తిగా తగ్గించాలి. అప్పుడు ఈ పిండి ఒక షేప్‌లోకి వచ్చి నెయ్యిలో పూరీల్లా కనపడతాయి. దీనే్న మాల్పువా అంటారు. దీన్ని రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి. తరువాత ఈ మాల్పువాను పక్కకు తీసి ముందుగా తయారుచేసుకున్న షుగర్ సిరప్‌లో వేసి రెండు నిముషాలు ఉంచాలి. వెంటనే దీన్ని తీసేసి వేడిగా సర్వ్ చేయాలి. పైన డ్రై ఫ్రూట్ పలుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే కోవా మాల్పువా రెడీ.

బేసిన్ లడ్డు

కావలసిన పదార్థాలు
శనగపిండి: ఒకటిన్నర కప్పు
నెయ్యి: అర కప్పు
బొంబాయిరవ్వ: నాలుగు స్పూన్‌లు
పంచదార పొడి: ముప్పావు కప్పు
యాలకుల పొడి: అర స్పూన్
బాదం పలుకులు: ఐదు
కిస్‌మిస్: ఒక స్పూన్
కుంకుమపువ్వు: కొద్దిగా
తయారుచేసే విధానం
స్టవ్‌పై బాణలిని ఉంచుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి కాగిన తరువాత బాదం పలుకులు, కిస్‌మిస్‌లను వేసి వేడిచేయాలి. తీసేసిన తరువాత ఇందులో మిగిలిన నెయ్యిని కూడా వేసి కరిగించాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇది మంచి వాసన వచ్చి, కొద్దిగా రంగు మారేంతవరకూ వేయించి పక్కకు తీసుకోవాలి. ఇందులో మరికొద్ది నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేసి వేయించాలి. ఇందులోనే యాలకుల పొడి కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమంలోనే వేయించిన శనగపిండిని వేసి మరికొద్దిసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్‌పై మరొక పాన్‌ను ఉంచి అందులో పంచదార, కుంకుమపువ్వు, కొద్దిగా నీళ్లు పోసి వేడిచేయాలి. పంచదార బాగా కరిగిన తరువాత వేయించిన శనగపిండిని మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలపాలి. ఇందులో బాదంపప్పు, కిస్‌మిస్‌లను వేసి దించేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి. అంతే ఎంతో రుచికరమైన బేసిన లడ్డూలు తయారు.

కలాకండ్
కావలసిన పదార్థాలు
పాలు: ఒక లీటరు
పంచదార: అర కిలో
నెయ్యి: పావు కప్పు
డ్రై ఫ్రూట్స్: తగినన్ని
తయారుచేసే విధానం
కలాకండ్ తయారీకి విరిగిన పాలను వాడాల్సి ఉంటుంది. అందుకని వెన్నతీయని పాలను కాచి అందులో కొద్దిగా నిమ్మరసం పిండితే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాణలిలో పంచదార వేసి, కొద్దిగా నీళ్లను పూసి లేతపాకం రానివ్వాలి. ఇలా వచ్చిన తరువాత ఇందులో విరిగిన పాలను పోయాలి. పాకం కాస్త గట్టిపడ్డాక నెయ్యి కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరపడేంత వరకు స్టవ్ సిమ్‌లో ఉంచి కలుపుతూనే ఉండాలి. తరువాత ప్లేటుకు నెయ్యి రాసి పాకాన్ని ప్లేటులోకి వంచి సమంగా చేసి, పైన నచ్చిన డ్రై ఫ్రూట్ ముక్కలను వేసుకోవాలి. కొద్దిగా ఆరిన తరువాత ముక్కలుగా కోసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌తో పాటు సిల్వర్ ఫాయిల్ కూడా అద్దితే బాగుంటుంది. అంతే ఎంతో రుచికరమైన కలాకండ్ రెడీ.

కోవాలడ్డు

కావలసిన పదార్థాలు
పంచదార: కప్పు
పచ్చికోవా: పావుకిలో
మైదా: కప్పు
పాల విరుగుడు: కప్పు
జాపత్రి పొడి: పావు స్పూన్
రెడ్ ఫుడ్ కలర్: చిటికెడు
నూనె: అర కిలో
జీడిపప్పు పలుకులు: అర కప్పు
తయారుచేసే విధానం
తాజా పచ్చికోవాలో పాల విరుగుడు, మైదా వేసి బాగా కలపాలి. దీనిలో ఫుడ్ కలర్, జాపత్రి పొడి వేసి మరోసారి కలపాలి. ఈ కలిపిన కోవాను చిన్న చిన్న ఉండలుగా చుట్టే ముందు దాని మధ్యలో జీడిపప్పు పలుకులను ఉంచి మూడు అంగుళాల పొడవు ఉండేటట్లుగా ఉండలు చుట్టుకోవాలి. తరువాత ఒక కడాయిని స్టవ్‌పై పెట్టి నూనె పోసుకోవాలి. ఇది కాగే లోగా మరో స్టవ్‌పై బాణలి పెట్టి అందులో పంచదారను లేత తీగ పాకం పట్టాలి. ఇప్పుడు కాగే నూనెలో చుట్టుకున్న ఉండలను వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. వేగిన వెంటనే ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పాకంలో వేయాలి. ఇలా అన్ని ఉండలనూ పాకంలో వేయాలి. రెండుగంటలు నానిన తరువాత వీటిని బయటకు తీయాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో పంచదార వేసి ఈ కోవా ఉండలను దొర్లించాలి. అంతే కోవా లడ్డూలు రెడీ.

జాంగ్రీ
కావలసిన పదార్థాలు
మినపప్పు: అర కిలో
పంచదార: కిలో
నెయ్యి: అర కిలో
బియ్యం: కొద్దిగా
తయారుచేసే విధానం
బియ్యం, మినపప్పులను అయిదారు గంటలు నానబెట్టాలి. తరువాత మినపప్పు, బియ్యంలను నీళ్లు తక్కువగా పోసి, మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై వెడల్పాటి గినె్నను ఉంచి అందులో పంచదారను వేసి, కొద్దిగా నీళ్లు పోయాలి. పంచదార బాగా కరిగి తీగపాకం వచ్చేంత వరకు తిప్పాలి. ఇందులో కొద్దిగా మిఠాయి రంగు కొద్దిగా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి నెయ్యి పోసి బాగా కాగనివ్వాలి. ఈలోగా ఒక లాంగ్ క్లాత్‌ను తీసుకుని, దానికి సన్నటి చిల్లు చేసి, పిండిని అందులో పోయాలి. నెయ్యి బాగా కాగిన తరువాత జంతికలు, జిలేజీ చేసినట్లే పిండిని నెయ్యిలో చుట్ట చుడుతూ వేయాలి. వీటిని నెయ్యిలో దోరగా వేగనివ్వాలి. వీటిని తీసి ముందుగా తయారుచేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేయాలి. కొద్దిసేపటి తర్వాత వీటిని తీసేసుకుంటే సరి.

చిలగడ దుంప కరకజ్జాలు

కావలసిన పదార్థాలు
బియ్యపుపిండి: రెండు స్పూన్‌లు
పచ్చి కొబ్బరి తురుము: రెండు కప్పులు
చిలగడ దుంపలు: పెద్దవైతే మూడు, చిన్నవైతే ఐదు
మంచి నీళ్లు: మూడు కప్పులు
మైదా: ఆరు స్పూన్‌లు
బెల్లం తురుము: రెండు కప్పులు
పంచదార: పది స్పూన్‌లు
యాలకుల పొడి: అర చెంచా
నూనె: వేయించడానికి సరిపడా తయారుచేసే విధానం
ముందుగా చిలగడ దుంపలను బాగా కడిగి, ఉడికించుకుని మెత్తగా చిదుముకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బాణలిని స్టవ్‌పై ఉంచాలి. ఇందులో ఒక కప్పు బెల్లం, పచ్చి కొబ్బరి తురుమును వేసి సన్నని మంటపై ఉడికించాలి. ఈ పదార్థాన్ని బాగా కలుపుతూ కొబ్బరి లౌజు వచ్చేవిధంగా ఉడికించాలి. ఒక వెడల్పాటి గినె్నను స్టవ్‌పై ఉంచి ఇందులో ఒక కప్పు బెల్లం, కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి, పది స్పూన్ల పంచదార వేసి బాగా కలపాలి. ఇవన్నీ బాగా కరిగి లేత పాకం వచ్చేంతవరకు ఉంచి స్టవ్‌పై నుంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మరొక గినె్నను తీసుకుని అందులో చిదిమిన చిలగడ దుంపలు, మైదాపిండి, బియ్యపు పిండిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తరువాత అరచేతులకు కొద్దిగా నూనెను రాసుకుని ఒక్కో ఉండను మన అరచేతికి సరిపడినంత పరిమాణం వచ్చేవరకు అదమాలి. అలా అదుముతూ మధ్యలో తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి లౌజును ఉంచి కజ్జికాయ ఆకారం వచ్చే విధంగా మడుస్తూ అంచును మెలిపెట్టి ముసేయాలి. ఇలా అన్నింటినీ తయారుచేసుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె వేసి కాగనివ్వాలి. తయారుచేసి ఉంచుకున్న కజ్జికాయలను నూనెలో వేసి దోరగా, బంగారు రంగు వచ్చేంతవరకు వేయించాలి. వీటన్నింటినీ ముందుగా తయారుచేసి పెట్టుకున్న బెల్లం పాకంలో వేయాలి. అంతే ఎంతో రుచికరమైన చిలగడదుంప కరకజ్జాలు రెడీ.