రుచి

వానల్లో వేడివేడిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చినుకుపడిందంటే చాలు.. వేడివేడిగా, కరకరలాడుతూ ఏవైనా తినాలనిపిస్తుంది. కానీ వాన.. తనతో పాటు జలుబు, దగ్గు, జ్వరాలను వెంటబెట్టుకుని వచ్చేస్తుంది. ఇలాంటి వాటికి వామాకు చక్కని ఔషధం. వామాకుతో బజ్జీలను వేసుకుంటే ఎలా ఉంటుంది? అటు ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇటు రుచికి రుచి.. అనుకున్నారేమో పెద్దవారు.. వెంటనే రుచిగా, వేడివేడి బజ్జీలను చేయడం మొదలుపెట్టేశారు. ఒక్క వామాకుతోనే కాదు, కార్న్‌తో, పల్లీలతో.. అటు ఆరోగ్యంతోపాటు రుచిని కూడా అందించే రకాలెన్నో.. మరి అలాంటి వాటిని ఒకసారి చూసేద్దామా..

నూడుల్స్ పకోడీ

కావలసిన పదార్థాలు
నూడుల్స్: రెండు కప్పులు
క్యాబేజీ తరుగు: రెండు చెంచాలు
క్యారెట్ తరుగు: రెండు చెంచాలు
క్యాప్సికమ్ తరుగు: రెండు చెంచాలు
ఉల్లికాడల తరుగు: రెండు చెంచాలు
సెనగపిండి: రెండు చెంచాలు
బియ్యం పిండి: అరచెంచా
కారం: అరచెంచా
ఉప్పు: తగినంత
గరం మసాలా: చిటికెడు
జీలకర్ర: చెంచా
కరివేపాకు: ఒక రెబ్బ
కొత్తిమీర: రెండు చెంచాలు
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
ముందుగా ఒక గినె్నలో నీళ్లను తీసుకుని స్టవ్‌పై పెట్టి మరిగించాలి. ఇందులో న్యూడుల్స్‌ను వేయాలి. ఒక్క ఉడుకు ఉడికాక వీటిని వడకట్టుకోవాలి. వీటిని మరొక్కసారి చన్నీళ్లతో కడిగి మరొక్కసారి వడకట్టుకోవాలి. తరువాత వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో న్యూడుల్స్, సెనగపిండి, బియ్యం పిండి, గరంమసాలా, జీలకర్ర, ఉప్పు, కారం, అన్ని కూరగాయల ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి. న్యూడుల్స్‌కు ఉన్న తడే సరిపోతుంది. మళ్లీ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై బాణలిని ఉంచి తగినంత నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తరువాత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బిళ్లల్లా ఒత్తుకుని వేసుకోవాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. వీటిని టొమాటో సాస్‌తో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటాయి.

క్రిస్పీ కార్న్

కావలసిన పదార్థాలు
స్వీట్‌కార్న్: రెండు కప్పులు
మొక్కజొన్న పిండి: నాలుగు చెంచాలు
కారం: అరచెంచా
జీలకర్రపొడి: పావుచెంచా
ఉప్పు: తగినంత
చాట్‌మసాలా: కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
రెండు కప్పుల స్వీట్‌కార్న్‌ని ఉడికించి నీళ్లు వడకట్టి పెట్టుకోవాలి. ఇందులో మొక్కజొన్న పిండి, కారం, జీలకర్రపొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మరి నీళ్లు కలుపుకోకూడదు. ఎందుకంటే స్వీట్‌కార్న్‌కు అంటుకుని ఉన్న తడితోనే పిండిని కలుపుకోవచ్చు. తరువాత స్టవ్‌పై బాణలి ఉంచుకుని నూనె వేసుకుని వేడిచేయాలి. నూనె కాగిన తరువాత అందులో కలిపి ఉంచుకున్న కార్న్‌ని వేసి దోరగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీనిపైన చాట్‌మసాలా చల్లి పిల్లలకు సర్వ్‌చేయాలి. చినుకుల కాలంలో కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి.

మసాలా పల్లీలు

కావలసిన పదార్థాలు
సెనగపిండి: చెంచా
బియ్యం పిండి: చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్: పావు చెంచా
ధనియాలపొడి: అర చెంచా
ఉప్పు: తగినంత
కారం: అర చెంచా
పల్లీలు: రెండు కప్పులు
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
వెడల్పాటి గినె్నలో సెనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలపొడి, ఉప్పు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే పల్లీలను వేయాలి. ఇందులో కాస్త నీళ్లు చిలకరించరించి పిండిని కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ జారుగా కాకుండా పొడిపొడిగా చేతికి అంటుకునేలా ఉండాలి. ఇలా అయితేనే పల్లీలకు పిండి మందంగా పట్టి తినడానికి బాగుంటాయి. స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తరువాత పల్లీల మిశ్రమాన్ని విడివిడిగా వేయాలి. బంగారు రంగు వచ్చిన తరువాత తీసుకుని వేడివేడిగా పిల్లలకు అందివ్వాలి. చినుకుల్లో ఇవి చాలా బాగుంటాయి.

వామాకు బజ్జీలు

కావలసిన పదార్థాలు
వామాకులు: పది
సెనగపిండి: ముప్పావు కప్పు
బియ్యం పిండి: పావు కప్పు
ఇంగువ: కొద్దిగా
ఉప్పు: తగినంత
కారం: తగినంత
ధనియాలపొడి: కొద్దిగా
వంటసోడా: కొద్దిగా
జీలకర్ర: ఒక చెంచా
పసుపు: చిటికెడు
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
ముందుగా వామాకులను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి గినె్నలో సెనగపిండి, బియ్యం పిండి, ఇంగువ, ఉప్పు, కారం, ధనియాలపొడి, వంటసోడా, జీలకర్రను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలి ఉంచి నూనెను పోసి కాగిన తరువాత సెనగపిండి మిశ్రమంలో వామాకులను ఒక్కొక్కటిగా ముంచి బజ్జీల్లా వేసుకోవాలి. లేత బంగారు రంగుకి మారిన తరువాత తీసేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన వామాకు బజ్జీలు రెడీ.

జిలేబీలు

కావలసిన పదార్థాలు
మైదాపిండి: మూడు కప్పులు
కార్న్‌ఫ్లోర్: అర కప్పు
పెరుగు: రెండు కప్పులు
బేకింగ్ సోడా: అర చెంచా
ఫుడ్‌కలర్: చిటికెడు
పంచదార: మూడు కప్పులు
కుంకుమపువ్వు: చిటికెడు
రోజ్ ఎసెన్స్: కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా
నెయ్యి: కొద్దిగా
తయారుచేసే విధానం
వెడల్పుగా ఉన్న గినె్నను తీసుకోవాలి. అందులో మైదాపిండి, మొక్కజొన్న పిండి, రెండు కప్పుల గట్టి పెరుగు, బేకింగ్ సోడా, ఫుడ్‌కలర్‌ను తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో వాడే పెరుగు ఫ్రెష్‌దే వాడాలి. పులిసినది వాడకూడదు. దీనిని పనె్నండుగంటల పాటు నానబెట్టాలి. లేదా రాత్రంతా నానబెట్టాలి. జిలేబీ తయారీలో ఫెర్మెంటేషన్ చాలా అవసరం. తరువాత పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి తీగ పాకం పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఐదు చుక్కల రోజ్ ఎసెన్స్, చిటికెడు కుంకుమపువ్వు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై వెడల్పాటి బాణలిని ఉంచుకుని నూనె వేసి వేడిచేయాలి. ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా కలపాలి. ఇది కాగాక ఫెర్మెంటేషన్ చేసిన పిండిని జిలేబీ మేకర్‌లో వేయాలి. లేదా మస్లిన్ గుడ్డలో వేసి అడుగున చిన్న రంధ్రం పెట్టుకున్నా సరిపోతుంది. దీన్ని వేడి నూనెలో జిలేబీలా వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత వీటిని పక్కకు తీసుకోవాలి. పాకం గోరువెచ్చగా అయ్యాక అందులో జిలేబీలను వేసి రెండు నిముషాలు మాత్రమే ఉంచి తీసెయ్యాలి. అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే జిలేబీలు తయారు. వానల్లో వేడి వేడి జిలేబీలు చాలా బాగుంటాయి.

బ్రెడ్‌బైట్స్

కావలసిన పదార్థాలు
బ్రెడ్: ఎనిమిది స్లైసులు
ఫిష్ పౌడర్: రెండు చెంచాలు
మైదాపిండి: కప్పు
ఉల్లిపాయ: చిన్నది ఒకటి
పచ్చిమిర్చి: మూడు
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
బ్రెడ్ చుట్టూ ఉన్నది తీసేసి వాటిని నాలుగు ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలని సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో మైదాపిండి, ఫిష్ పౌడర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పులను నీళ్లు చిలకరిస్తూ పిండిని మరీ జారుగా కాకుండా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె వేసి వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని పిండిలో ముంచి కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే బ్రెడ్‌బైట్స్ సిద్ధం.