రుచి

అరటి వంటలు అదరహో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరటి పండును అలుసుగా చూడకండి. అరటిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. సంస్కృతంలో కదళి ఫలంగా పిలిచే అరటిపండు ఎన్నో ఉపయోగాలకు పుట్టినిల్లు వంటిది. ఒకప్పుడు ప్రతి పెరడులోనూ ఈ చెట్టు కనిపించేది. కేవలం పండు మాత్రమే కాదు అరటికాయ కూడా ఒంటికి ఎంతో మేలు చేస్తుంది. అరటి ఆకులో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంబంధిత వ్యాధులు దగ్గరికి కూడా రావు అని చెబుతారు పెద్దలు. అరటిపండులోనే కాదు, పచ్చి అరటికాయలో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. సాధారణంగా పచ్చి అరటికాయలను ఉడికించి, లేదా ప్రాసెస్ చేసి లేదా ఫ్రై చేసుకుని తింటుంటారు. పచ్చి అరటిపండ్లతో వివిధ రకాల రుచికరమైన వంటలను కూడా వండుతుంటారు. అరటికాయ బజ్జీ, అరటితో గ్రేవీలు, కర్రీలను కూడా తయారుచేసుకుంటుంటారు. ఉడికించినవి ఆరోగ్యానికి మరీ మంచిది. అరటిపండ్లను తిన్న విధంగానే అరటికాయలను కూడా తినడం వల్ల ఉత్సాహంగా ఉండటమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పైగా అరటికాయలో ఉండే ఫైబర్ వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోయి, జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది.

బనానా రైస్

కావలసిన పదార్థాలు
అరటికాయలు: రెండు
బియ్యం: కప్పు
జీలకర్ర: అర చెంచా
ఆవాలు: అర చెంచా
శనగపప్పు: చెంచా
పల్లీలు: 50 గ్రాములు
ఎండుమిర్చి: ఆరు
కరివేపాకు: రెండు రెబ్బలు
పచ్చిమిర్చి తరుగు: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
కొత్తిమీర: కట్ట
జీడిపప్పు: 50 గ్రాములు
నిమ్మకాయ: ఒకటి
నూనె: ఐదు చెంచాలు
పసుపు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా అన్నం పొడిపొడిగా వండుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అరటికాయ చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసి మూడు చెంచాల నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి. తరువాత స్టవ్‌పై అదే బాణలిని ఉంచి మిగిలిన నూనెను కూడా వేసి కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పెద్ద పాత్రలోకి అన్నం తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న పదార్థాలను వేసి బాగా కలపాలి. తరువాత జీడిపప్పు, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే బనానా రైస్ తయారు.

అరటికాయ 65

కావలసిన పదార్థాలు
అరటికాయలు: రెండు
కార్న్‌ఫ్లోర్: 50 గ్రాములు
నూనె: వేయించడానికి సరిపడా
మైదా: 25 గ్రాములు
పెరుగు: కప్పు
పచ్చిమిర్చి: నాలుగు
కరివేపాకు: రెండు రెబ్బలు
కారం: చెంచా
మిరియాలపొడి: అర చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్: చెంచా
కేసరి కలర్: అర చెంచా
గ్రీన్ చిల్లీ సాస్: రెండు చెంచాలు
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం
ముందుగా అరటికాయల్ని తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌లో మైదా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గ్రీన్ చిల్లీసాస్, కేసరి కలర్, కొద్దిగా నీరు పోసి జారుగా కలుపుకోవాలి. గుజ్జులా తయారైన మిశ్రమాన్ని అరటికాయలకు పట్టించి కొద్దిసేపు ఆరనివ్వాలి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి బాగా కాగాక అరటికాయ ముక్కల్ని వేసి వేయించాలి. బాగా వేగిన తరువాత నూనె వార్చి ఉంచుకోవాలి. తరువాత స్టవ్‌పై మరో పాన్ ఉంచి కొద్దిగా నూనె వేసి కాగాక కరివేపాకు, పచ్చిమిర్చి, వేయించిన అరటికాయ ముక్కల్ని వేసి మళ్లీ వేయించి స్పూన్‌తో మిశ్రమాన్నంతటినీ కలగలిపి దించేయాలి. అంతే అరటికాయ 65 రెడీ.

అరటి దూట పచ్చడి

కావలసిన పదార్థాలు
అరటి దూట: కిలో
నిమ్మకాయలు: 15
ఎండు మిరపకాయలు: 50 గ్రాములు
ఆవాలు: 50 గ్రాములు
పెరుగు: 250 మి.లీ.
పసుపు: 5 గ్రాములు
ఉప్పు: 25 గ్రాములు
కరివేపాకు: రెండు రెబ్బలు
పోపుదినుసులు
తయారుచేసే విధానం
ముందుగా అరటి దూటని తీసుకుని ముక్కలుగా తరగాలి. స్టవ్‌పై బాణలి ఉంచి కొద్దిగా నూనె వేయాలి. ఇందులో అరటి దూట ముక్కలు, ఎండు మిరపకాయలు, ఆవాలను కాస్తంత నూనెలో వేయించాలి. చల్లారిన తర్వాత రుబ్బుకోవాలి. నిమ్మకాయలను ముక్కలుగా చేసుకుని నూరుకున్న మిశ్రమానికి కలుపుకోవాలి. తరువాత దీనికి సరిపడా ఉప్పు, పసుపు, పెరుగులను కూడా కలుపుకోవాలి. స్టవ్‌పై మరో బాణలిని ఉంచి నూనె వేసుకుని కాగిన తరువాత కరివేపాకు, పోపు దినుసులు వేసి వేగిన తరువాత పచ్చడిలో వేయాలి. అంతే అరటి కాండం పచ్చడి సిద్ధమైనట్లే. ఈ పచ్చడి మధుమేహ వ్యాధి ఉన్నవారికి మంచిది.

తీపి బజ్జీలు

కావలసిన పదార్థాలు
అరటికాయలు: రెండు
గుడ్డు: ఒకటి
పంచదార: రెండు చెంచాలు
దాల్చిన చెక్క: పావు చెంచా
మైదాపిండి: ఆరు చెంచాలు
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
పెద్ద పాత్రలో ఒక చెంచా పంచదార, ఉప్పు, గుడ్డు వేసి బాగా గిలక్కొట్టాలి. ఇందులో మైదాను జతచేస్తూ సరిపడా నీటితో జారుగా కలుపుకోవాలి. మరోపాత్రలో మిగిలిన పంచదార, దాల్చినచెక్క పొడిని కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు అరటికాయల తొక్కతీసి అడ్డుగా సగానికి కోసి, పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మైదా జారులో ముంచుతూ నూనెలో దోరగా వేయించి తీసేయాలి. వీటిపై పంచదార, దాల్చిన చెక్కల పొడిని చల్లి తింటే చాలా రుచిగా ఉంటాయి.

పచ్చి అరటికాయ కబాబ్

కావలసిన పదార్థాలు
అరటికాయలు: నాలుగు
ఉప్పు: తగినంత
గరం మసాలా: చెంచా
జీలకర్ర: చెంచా
అల్లం పేస్ట్: చెంచా
పచ్చిమిర్చి పేస్ట్: చెంచా
నెయ్యి: చెంచా
కొత్తిమీర తురుము: అరకప్పు
కారం: చెంచా
బంగాళాదుంపల పేస్ట్:
రెండు కప్పులు
అల్లం: కొద్దిగా
పచ్చిమిర్చి: నాలుగు
ఉల్లిపాయలు: రెండు
కుంకుమపువ్వు: కొద్దిగా
తయారుచేసే విధానం
పచ్చి అరటికాయల్ని ఉడికించి తోలు తీసి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తరువాత అరటికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. తరువాత బంగాళాదుంపలు పేస్ట్, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అరటికాయ ముక్కలు, మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అరచేతిలో చిన్న ఉండలుగా తీసుకుని వాటిని గుండ్రంగా నొక్కుకుని పెనంపై వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చాలి. అంతే వేడి వేడి అరటికాయ కబాబ్స్ రెడీ. వీటిని టొమాటో సాస్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

అరటిపువ్వు వడలు

కావలసిన పదార్థాలు
అరటిపువ్వు తరుగు: రెండు కప్పులు
ఉల్లి తరుగు: అరకప్పు
ఉడికించిన బంగాళాదుంప గుజ్జు: కప్పు
అల్లం: అంగుళం ముక్క
పచ్చిమిర్చి: రెండు
మిరియాల పొడి: అర చెంచా
కరివేపాకు: నాలుగు రెబ్బలు
కొత్తిమీర తరుగు: పావుకప్పు
గరం మసాల: ఒక చెంచా
ఉప్పు: రుచికి తగినంత
గుడ్డు: ఒకటి
బ్రెడ్ పొడి: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
పసుపు: చిటికెడు
తయారుచేసే విధానం
అరటిపువ్వు తరుగు బాగా కడిగి, తగినంత నీటిలో చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. తరువాత ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి, అది కాగిన తరువాత ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర తరుగు.. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేయించాలి. తర్వాత గరం మసాలా, మిరియాలపొడి, ఉప్పు, ఉడికించిన పువ్వు తరుగు, బంగాళాదుంప గుజ్జు వేసి బాగా కలపాలి. నిముషం తరువాత దించేసి చల్లారనివ్వాలి. ఈ ముద్దను కట్‌లెట్స్‌గా చేసుకుని గిలక్కొట్టిన గుడ్డులో ముంచి, బ్రెడ్‌పొడిలో దొర్లించాలి. ఇప్పుడు స్టవ్‌పై బాణలి పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత చేసి ఉంచుకున్న కట్‌లెట్స్‌ను వేయించాలి. గుడ్డు ఇష్టపడనివారు మైదా జారును వాడుకోవచ్చు. ఈ కట్‌లెట్స్ టొమాటో సాస్‌తో తింటే చాలా బాగుంటాయి.