రుచి

పచ్చళ్లలో ఇవి వేరయా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ ఒకే రకమైన వంటలు తిని విసుగు పుడుతుంది. మళ్లీ మళ్లీ అవే వంటలు, అదే బిరియానీ.. ఇలా కాకుండా కాస్త వెరైటీగా తినాలనుకుంటే ఈ వంటలు మాత్రం కచ్చితంగా మీ కోసమే.. అదిరిపోయే కోడిగుడ్డు పచ్చడి నుంచి సీ ఫుడ్ పచ్చళ్ల వరకు అనేక రకాలను వండుకోవచ్చు. పచ్చి రొయ్యలను, చికెన్‌ను, మటన్‌ను టేస్టీగా వండుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తింటారు. మరి అలాంటి రుచుల్లో నాన్‌వెజ్ పచ్చళ్లు ముందుంటాయి. మరి అవి ఏంటో చూద్దామా..
చికెన్‌తో..
చికెన్: అరకిలో
కారం: 100 గ్రాములు
వెల్లుల్లి: 50 గ్రాములు
నూనె: పావు కిలో
లవంగాలు: పది
దాల్చిన చెక్క: అంగుళం ముక్క
యాలకులు: మూడు
ధనియాల పొడి: 100 గ్రాములు
జీలకర్రం: 30 గ్రాములు
కరివేపాకు: కొద్దిగా
ఉప్పు: తగినంత
పెద్ద నిమ్మకాయలు: ఆరు
తయారుచేసే విధానం
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడగాలి. ఐదు నిముషాల పాటు తడి లేకుండా పొడిపొడిగా అయ్యేంత వరకు ఉడికించాలి. స్టవ్‌పై బాణలి ఉంచి అరకప్పు నూనెను వేసి వేడిచేసి ఇందులో చికెన్‌ను వేసి దోరగా వేయించాలి.2
లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులను పొడి చేసుకోవాలి. మిగిలిన నూనెలో చేసి పెట్టుకున్న మసాలా, కారం, ఉప్పు, వెల్లుల్లి, ధనియాలపొడి, జీలకర్ర, నిమ్మరసం, వేయించిన కరివేపాకు వేయాలి. ఇందులోనే వేయించిన చికెన్‌ను కూడా వేసి బాగా కలుపుకుని నిలువచేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి తయారు.

రొయ్యలు, గోంగూరతో..
కావలసిన పదార్థాలు
గోంగూర: రెండు కట్టలు
రొయ్యలు: పావు కిలో
పసుపు: ఒక చెంచా
అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా
గరం మసాలా: అర చెంచా
కారం: రెండు చెంచాలు
ధనియాల పొడి: ఒక చెంచా
నూనె: తగినంత
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
రొయ్యలను బాగా శుభ్రం చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాల, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపి పదిహేను నిముషాల పాటు నాననివ్వాలి. బాణలిని తీసుకుని స్టవ్‌పై ఉంచాలి. అందులో కొద్దిగా నూనెను వేసి వేడిచేయాలి.
ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసి డీప్ ఫ్రై చేయాలి. వీటిని ఒక పక్కన పెట్టేయాలి. తరువాత మరో బాణలిని తీసుకుని అందులో కొద్దిగా నూనెను వేయాలి. శుభ్రం చేసి, ఆరబెట్టి ఉంచుకున్న గోంగూరను ఈ నూనెలో వేయాలి. కొద్ది నిముషాలు అటూ, ఇటూ తిప్పిన తరువాత గోంగూర ఒక ముద్దలా అవుతుంది. తరువాత ఇందులో తగినంత ఉప్పు, మిగిలిన పసుపు, ధనియాలపొడి, కారం పొడి వేసి బాగా కలపాలి. ఇందులోనే రొయ్యలను కూడా వేసి బాగా కలిపి కొద్దినిముషాలు స్టవ్‌ను సిమ్‌లో ఉంచాలి. తరువాత ఇందులో గరంమసాలా కూడా వేసి బాగా కలపాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి.

రొయ్యలతో..

కావలసిన పదార్థాలు
రొయ్యలు: అర కిలో
వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా
కారం: అర కప్పు
ఉప్పు: ఒక చెంచా
లవంగాల పొడి:
అర చెంచా
నూనె: అర కిలో
నిమ్మకాయ: ఒకటి
తయారుచేసే విధానం
రొయ్యలను బాగా కడిగి రెండు, మూడు నిముషాలు స్టవ్‌పై ఉంచి రెండు పొంగులు వచ్చాక తీసి ఒక పొడి బట్టపై వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె వేసి వేడి చేసుకుని రొయ్యలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు త్వరగా వేగిపోతాయి కనుక తొందరగా నూనెలో నుంచి చిల్లుల గరిటెతో గినె్నలోకి తీసుకోవాలి. రొయ్యల పచ్చడిలో లవంగాల పొడి కాస్త ఎక్కువగా, కారం కాస్త తక్కువగా వేస్తే బాగుంటుంది. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి. స్టవ్ సిమ్‌లో ఉంచుకుని తక్కువ మంట పెట్టి అందులో నూరిన వెల్లుల్లి ముద్ద, లవంగాల పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆర్పేసి గినె్నలోకి తీసుకున్న రొయ్యలను ఇందులో వేసి బాగా కారం పట్టేలా కలపాలి. వేడి తగ్గిన తరువాత నిమ్మరసం పిండాలి.

కోడిగుడ్డుతో..

కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు: డజను
కారం: పావు కిలో
ఉప్పు: 200 గ్రాములు
పసుపు: రెండు చెంచాలు
మెంతులు: ఒక చెంచా
జీలకర్ర: ఒక చెంచా
ఎండుమిర్చి: ఏడు
చింతపండు: పావు కిలో
నూనె: పావు కిలో
వెల్లుల్లి రెబ్బలు: కొన్ని
తయారుచేసే విధానం
ముందుగా మెంతుల్ని దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి. కోడిగుడ్లను ఉడికించుకుని పొట్టుతీసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి కోడిగుడ్లను వేసి దోరగా వేయించుకోవాలి. ఒక వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతిపిండి, నూనె తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరోసారి కలపాలి. బాణలిలో మిగిలిన నూనె వేసి వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్రతో తాలింపు పెట్టి పచ్చడిపై వేసి బాగా కలపాలి. చివరగా పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని వేసి బాగా కలపాలి. అంతే నిలువ ఉండే కమ్మని కోడిగుడ్డు పచ్చడి సిద్ధం.

చేపలతో..
కావలసిన పదార్థాలు
చేప ముక్కలు: కిలో
నూనె: రెండు కప్పులు
ఉల్లిపాయలు: ఒక కిలో
అల్లం తరుగు: 100 గ్రాములు
వెల్లుల్లి: 200 గ్రాములు
పచ్చిమిర్చి: 15
కారం: మూడు చెంచాలు
ధనియాలపొడి: ఆరు చెంచాలు
మిరియాలపొడి: రెండు చెంచాలు
మెంతి పిండి: ఒక చెంచా
వైట్ వెనిగర్: ఒక లీటర్
వెల్లుల్లి రేకలు: మూడు
పసుపు: ఒక చెంచా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా చేపలను అరంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను పొడిపొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి చేపముక్కలను డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన నూనెలో కారం, ధనియాల పొడి, మిరియాలపొడి, మెంతిపిండి వేసి వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న చేపలు వేసి మరికొంతసేపు వేయించాలి. అందులో వేయించిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమానికి వెనిగర్ చేర్చి సన్నని సెగపై ఉడకనిచ్చి తగినంత ఉప్పు వేసి కలపాలి.
చేప ముక్కలు చెదరకుండా చిక్కబడే వరకు ఉంచి స్టౌ కట్టేయాలి. దీన్ని మూత పెట్టి కొంతసేపు అలాగే ఉంచాలి. చల్లారాక పచ్చడిని గాజు సీసాలోకి తీసుకుని పైన వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. వారం రోజులు బయటే ఉంచి తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది.

మటన్‌తో..

కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ మటన్: కిలో
అల్లం-వెల్లుల్లి పేస్ట్:
రెండు చెంచాలు
కారం: అరకప్పు
లవంగాల పొడి: అరచెంచా
నూనె: అరకిలో
ఉప్పు: తగినంత
నిమ్మకాయలు: రెండు
తయారుచేసే విధానం
మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని పొడి బట్టపై వేసి కాసేపు ఆరనివ్వాలి. తరువాత ఒక బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడిచేసుకుని మటన్ ముక్కలను వేయించుకోవాలి. మటన్ ముక్క ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ముక్కను ఉడికింది లేనిదీ చూసుకుని నూనెలో నుంచి చిల్లుల గరిటతో ఒక గినె్నలోకి తీసుకోవాలి.
తరువాత బాణలిలో ఒకటిన్నర కప్పు నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనెను తీసేయాలి. తరువాత స్టవ్ మంట తగ్గించి పెట్టుకుని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, లవంగాల పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆర్పేసి గినె్నలోకి తీసుకున్న మటన్ ముక్కలను వేసి అన్ని ముక్కలకు కారం పట్టేలా కలపాలి. వేడి తగ్గిన తరువాత నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకుని నిలువ చేసుకోవాలి.