రుచి

చద్దన్నంతో చక్కటి ఆరోగ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారి ఆహార, ఆచార వ్యవహారాల్లో అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉంటాయి. పూర్వం ఇంటిల్లిపాదీ ముప్పూటలా అన్నం తినడం అనేది మన సంస్కృతి. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటారు పెద్దలు. పరబ్రహ్మ అనేక రూపాల్లో వచ్చి భక్తుల కష్టాలు తీర్చినట్లే.. అన్నం కూడా విభిన్న రుచులతో మానవుల ఆకలిని తీరుస్తుంది. అన్నంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించే రైతు కుటుంబాలకు వరి అన్నం, జొన్న వంటి ధాన్యంతో అన్నం వండుతారు. కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియకు గురై అద్భుతమైన శక్తి జనిస్తుంది. దేహం సరైన రక్తప్రసరణతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా మారిపోతుంది. అప్పటికాలంలో చద్దన్నంతో ఉదయం భోజనం మొదలయ్యేది. ఇప్పుడంటే టిఫిన్ల సంస్కృతి పెరిగింది కానీ, ఒకప్పుడు చద్దన్నమే మహాప్రసాదంగా భావించేవారు. చద్దన్నం ఉదయం ఐదు గంటలకల్లా తినేసి పొలాల్లో పనులు ముగించుకుని కొరకొరలాడే ఆకలితో మధ్నాహ్నం పదకొండు, పనె్నండు గంటలకు నిండైన పదార్థాలతో మరోసారి భోజనం చేయడం, తరువాత పొలం పనులు చేయడానికి వారికి కావలసినంత శక్తి అందుతుంది. నేటికాలంలో మనం లెక్కలు వేసుకుని తినే కేలరీల లెక్క ఏ మూలకూ రాదు. సంపూర్ణ జీర్ణప్రక్రియకు ముందు కఠిన శారీరక శ్రమ చేయడంతో కడుపులో జీర్ణరసాలు సరిగ్గా తయారై ‘జఠరాగ్ని’ పుడుతుంది. దీంతో ఆకలి మొదలవుతుంది. అప్పుడు ఆహారం తీసుకుంటే రాళ్ళైనా కరుగుతాయి. రాత్రి వండి వార్చిన గంజిని కుండలో వేసి, అందులో మజ్జిగ చుక్క వేసి పులియబెడతారు. ఈ పులియబెట్టిన గంజిని ‘తరవాణి’ అంటారు. అలాగే రాత్రి మిగిలిపోయిన అన్నంలో గోరువెచ్చని పాలుపోసి, కొద్దిగా మజ్జిగ చేర్చి పులియబెడతారు. దీనే్న చల్ది అన్నం లేదా చద్దన్నం అంటారు. వీటిని ఆవకాయ ముక్కతో కానీ, గోంగూరతో కానీ లాగిస్తే ఆ మజాయే వేరు. చద్దన్నం, తరవాణి వల్ల శరీరానికి మంచి తేజస్సు వస్తుంది. ఇది పోషక విలువలు ఎక్కువ కలిగిన ఆహారం. ఇది చర్మవ్యాధులకు కూడా చెక్ పెడుతుంది.
ఇంతమంచి పోషకాహారాన్ని రాత్రి మిగిలిపోయిన అన్నం అనే పేరుతో పొద్దున తినడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు నేటితరం. కానీ ఆ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన, శరీరానికి అవసరమైన సహజ లవణాలు, పోషక విలువలు ఉన్నాయి. మన తాత ముత్తాతలు చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు. అందుకే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేది. రాత్రి వండిన అన్నాన్ని అలాగే ఉంచి, ఉదయం అందులో పెరుగు కలుపుకుని, మామిడికాయ లేదా గోంగూర పచ్చడి వేసుకుని, పచ్చిమిర్చిగానీ, ఉల్లిపాయగానీ నంజుకుని తింటే చాలా బాగుంటుంది. చద్దన్నం- ఆవకాయ ప్రఖ్యాతిగాంచిన బెస్ట్ కాంబినేషన్. కానీ ఇప్పుడు ఇలా తినేవారు అస్సలు కనిపించడం లేదు. చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వేడి శరీరతత్త్వం ఉన్నవారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే దేహానికి చాలామంచిది. చద్దన్నం తింటే ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపగలుగుతారు. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది. చద్దన్నం తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై కడుపులో వాతం, గ్యాస్ వంటి సమస్యలు దరిచేరవు. చద్దన్నం త్వరగా జీర్ణమై, రక్తంలోకి అతిలేలికగా చేరిపోయి శక్తి ఉత్పన్నమవుతుంది. చద్దన్నం అంటే పులిసిన కార్బోహైడ్రేట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. తదితర లవణాలు సహజసిద్ధంగా ఉంటాయి. అవే కావలసినంత దేహపుష్టిని ఇస్తాయి. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉండబట్టే ఇప్పటికీ పల్లెటూళ్లలో చద్దన్నం సంస్కృతి ఇంకా కొనసాగుతోంది.
ఈ చద్దన్నంపైన కూడా చాలా పరిశోధనలు జరిగాయండోయ్.. అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ చెబుతున్న లాభాలు వింటే మాత్రం రోజూ చద్దన్నం తప్పకుండా తినాల్సిందేనని మీరు కొత్త అలవాటు చేసుకుంటారు. అన్నం పులిసినప్పుడు ఐరన్, పొటాషియం, కాల్షియం, బి6, బి12.. వంటి సూక్ష్మ పోషకాల స్థాయి విపరీతంగా పెరుగుతుందట. అందువల్ల శరీర చల్లదనానికి చద్దన్నాన్ని మించినది లేదు. అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ చెప్పిన లాభాలేంటంటే..
* చద్దన్నం శరీరాన్ని చాలా తేలికగా ఉంచడంతోపాటు శక్తివంతంగా కూడా ఉంచుతుంది.
* శరీరంలో ఉపయుక్త బాక్టీరియా పెరుగుతుంది.
* పీచు అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, నీరసం తగ్గుతాయి.
* రక్తపోటు అదుపులో ఉంటుంది.
* అధిక వేడితో కడుపులో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి.
* శరీరాన్ని త్వరగా అలసిపోనివ్వదు.
* అలర్జీ కారకాలను, చర్మ మలినాలను తొలగించుతుంది.
* శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* పేగుల్లో పెరుగుతున్న అల్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నప్పుడు పొద్దునే్న కాఫీయో, టీయో తాగేబదులు ఈ చద్దన్నాన్ని అలవాటు చేసుకుంటే రోజంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. రుచికి రుచీ, పొదుపుకు పొదుపు, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంతకంటే ఏం కావాలి మరి.. అందుకే చద్దన్నం ఓ ఔషధం. మరి చద్దన్నంతో చేసే వంటలేమిటో చూద్దామా.. *

చల్దన్నం

కావలసిన పదార్థాలు
అన్నం: ఒక కప్పు
నీళ్లు: రెండు కప్పులు
ఉప్పు: తగినంత
పెరుగు: ఒక కప్పు
ఉల్లిపాయ: ఒకటి
పచ్చిమిర్చి: రెండు

తయారుచేసే విధానం

రాత్రిపూట ఒకకప్పు అన్నంలో రెండు కప్పుల నీళ్లు పోసి, మూతపెట్టి ఉంచాలి. ఉదయానే్న ఈ అన్నం కొద్దిగా పులుస్తుంది. దీనే్న చలిదన్నం అంటారు. దీనిలో కప్పు పెరుగు, తగినంత ఉప్పు కలిపి ఉల్లిపాయ, పచ్చిమిర్చిలతో కలిపి అన్నాన్ని తినేయాలి. రాయలసీమలో వేసవికాలంలో చాలామంది ఈ అన్నానే్న ఉపాహారంగా తిం టారు.

తరవాణి

కావలసిన పదార్థాలు
కొత్తకుండ
గంజి
అన్నం
మజ్జిగ ఉప్పు
దబ్బాకులు ఉప్పు

తయారుచేసే విధానం

అన్నం వార్చిన గంజిని కొత్త కుండలో పోస్తారు. రుచికోసం ఉప్పు, సువాసన కోసం దబ్బాకులు కూడా కుండలో వేస్తారు. దీన్ని కదలకుండా కుదురుపై ఉంచి కుండ నుంచి మూకుడుతో మూసి గుడ్డతో వాసన కడతారు. ఉదయం నుండి రాత్రి వరకు ఆ కుండలోని గంజి పులుస్తూ ఉంటుంది. రాత్రిపూట అన్నం కరుళ్ళు ఆ ద్రవంలో వేసి మళ్లీ వాసెన కడతారు. మర్నాడు ఉదయం ఆ అన్నాన్ని గట్టిగా పిండి తీసేస్తారు. ఈ గంజిలో పెరుగో, మజ్జిగో కలుపుతారు. ఈ తేట ద్రవానే్న తరవాణి అంటారు. ఈ ద్రవాన్ని, ఆవకాయ ముక్కతో నంజుకుంటూ తాగుతారు. ఇష్టమైనవాళ్లు అన్నాన్ని పిండేయకుంటా తరవాణి అన్నాన్ని తిని తరవాణిని తాగుతారు. ఈ తరవాణి వేసవి అమిత చలువనిస్తుంది. గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో ఒకప్పుడు తరవాణి అన్నం ముఖ్యమైన ఉపాహారంగా ఉండేది.