రుచి

ఉగాది కొత్త వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితంలోని అన్ని అనుభవాలు కలిగినదైతేనే అర్థవంతం అని చేపే భావం ఇమిడి ఉంది ఇందులో.. ‘ఉగాది పచ్చడి’ ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన పదార్థం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనమైన తీపి, పులుపు, కారం ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడిని తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి, చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పండుగకి ఉగాది పచ్చడితో పాటు పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, వడలు, పులిహోర, మామిడి పచ్చడి వంటివాటిని ప్రత్యేకంగా చేసుకుంటారు. అయితే ఎప్పుడూ ఇలాంటి వంటలే తినాలంటే పిల్లలకే కాదు.. మనకీ బోరు కొడుతుంది.. అందుకే ఈ పండుగ రోజు సాంప్రదాయాన్ని పాటిస్తూ కొద్దిగా కొత్తదనంతో వంటలు చేసి వడ్డిస్తే.. పిల్లలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా, లొట్టలేసుకుంటూ తింటారు. మరి అలాంటి కొత్త వంటలను చూద్దామా..

సగ్గుబియ్యం దధ్యోజనం

కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం: కప్పు
పెరుగు: రెండు కప్పులు
పాలు: పావు కప్పు
పచ్చిమిర్చి: మూడు
అల్లం: చిన్న ముక్క
సెనగపప్పు: అరచెంచా
మినపప్పు: అరచెంచా
ఆవాలు: అరచెంచా
జీలకర్ర: అరచెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
జీడిపప్పు: పది
నూనె లేదా నెయ్యి: మూడు చెంచాలు
కొత్తిమీర తరుగు: చెంచా
పుదీనా తరుగు: చెంచా
తయారుచేసే విధానం
ముందురాత్రి సగ్గుబియ్యాన్ని మునిగేదాకా నీరుపోసి నానబెట్టాలి. పొద్దుటికి ఇవి నానిపోయి విడివిడిగా ఉంటాయి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె కానీ నెయ్యి కానీ వేయాలి. ఇది వేగిన తరువాత పోపు దినుసులు వేయాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. తరువాత ఇందులో జీడిపప్పు కూడా వేసి వేగాక ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయాలి. ఇవి బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా పెరుగును ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకుని అందులో అల్లం తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో చల్లారిన సగ్గుబియ్యం మిశ్రమం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకోవాలి. ఇష్టమున్నవారు బూందీ కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేసవికాలంలో వేడి తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

మామిడి, కొబ్బరి పచ్చడి

కావలసిన పదార్థాలు
మామిడికాయ: ఒకటి
పచ్చి కొబ్బరి చెక్క: ఒకటి
ఛాయ మినపప్పు: చెంచా
ఎండుమిర్చి: పది
ఆవాలు: అరచెంచా
మెంతులు: అరచెంచా
జీలకర్ర: అరచెంచా
నూనె: నాలుగు చెంచాలు
ఉప్పు: తగినంత
పసుపు: కొద్దిగా..
ఇంగువ: చిటికెడు
కరివేపాకు: రెండు రెబ్బలు
వెల్లుల్లి రెబ్బలు: ఆరు
తయారుచేసే విధానం
మామిడికాయ చెక్కుతీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పచ్చి కొబ్బరి వెనుకభాగం పెచ్చుతీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి మెంతులు, ఎండుమిర్చి, ఛాయ మినపప్పులను విడివిడిగా దోరగా వేయించాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇవి మెదిగాక పచ్చికొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగ మిక్సీ పట్టాలి. తరువాత బాణలిలో నూనె వేసి పోపువేయాలి. ఇందులోనే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేయాలి. ఇవి వేగాక మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోనే వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి పుల్లపుల్లగా, ఎంతో రుచిగా ఉంటుంది.

డ్రైఫ్రూట్స్ బొబ్బట్లు

కావలసిన పదార్థాలు
మైదాపిండి:
రెండు కప్పులు
నెయ్యి: నాలుగు చెంచాలు
ఉప్పు: చిటికెడు
జీడిపప్పు పొడి: అరకప్పు
బాదంపప్పు: అరకప్పు
అంజీర్ పేస్టు: అరకప్పు
ఎండుకొబ్బరి తురుము:
అరకప్పు
యాలకులపొడి: చెంచా
బెల్లం తురుము: అరకప్పు
తయారుచేసే విధానం
ముందుగా మైదాపిండిని శుభ్రం చేసుకోవాలి. ఓ గినె్నలో మైదాపిండి, ఉప్పు, చెంచా నెయ్యివేసి సరిపడా నీళ్లతో చపాతీపిండిలా కలిపి ఓ గంటసేపు నాననివ్వాలి. వేరే గినె్నలో జీడిపప్పు పొడి, బాదంపప్పు పొడి, అంజీర్ ముద్ద, ఎండుకొబ్బరి తురుము, యాలకులపొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి. నానిన మైదాపిండిని పూరీల్లా చేసి దాని మధ్యలో కలిపి జీడిపప్పు మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసేసి బొబ్బట్ల మాదిరి వత్తాలి. పెనంపై వీటిని వేసి రెండువైపులా నెయ్యితో కాల్చుకుంటే.. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ బొబ్బట్లు రెడీ..

మామిడి పులిహోర

కావలసిన పదార్థాలు
బియ్యం: అరకిలో
పుల్లటి మామిడికాయ: ఒకటి
సెనగపప్పు: చెంచా
పల్లీలు: పిడికెడు
జీడిపప్పు: పది
మినపప్పు: చెంచా
పచ్చిమిరపకాయలు: ఆరు
ఎండుమిరపకాయలు: ఐదు
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: నాలుగు చెంచాలు
జీలకర్ర: అరచెంచా
ఆవాలు: అరచెంచా
పసుపు: చిటికెడు
ఇంగువ: రెండు చిటికెలు
నువ్వులు: రెండు చెంచాలు
మెంతులు: పావుచెంచా
ధనియాలు: చెంచా
తయారుచేసే విధానం
ముందుగా పొడిపొడిగా అన్నం వండుకోవాలి. దీన్ని వెడల్పాటి పళ్ళెంలో ఆరబెట్టుకోవాలి. మామిడికాయ చెక్కుతీసి సన్నగా తురిమి అన్నంలో కలుపుకోవాలి. పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకోవాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, నువ్వులను విడివిడిగా వేయించి పొడి కొట్టుకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి నూనె వేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేయాలి. తరువాత పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. బంగారు రంగు వచ్చాక పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేయాలి. తరువాత పసుపు, ఉప్పు, నువ్వుల పొడిని కూడా వేయాలి. ఇది అరనిముషం ఉంచి వెంటనే ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ.

నవధాన్య పాయసం

కావలసిన పదార్థాలు
పెసలు: చెంచా
సెనగలు: చెంచా
బొబ్బర్లు: చెంచా
జొన్నలు: చెంచా
బియ్యం: చెంచా
కందులు: చెంచా
గోధుమలు: చెంచా
సజ్జలు: చెంచా
ఉలవలు: చెంచా
బెల్లం తురుము: రెండు కప్పులు
యాలకులపొడి: చెంచా
పాలు: లీటరు
జీడిపప్పు: అరకప్పు
బాదంపప్పు: అరకప్పు
కిస్‌మిస్: రెండు చెంచాలు
నెయ్యి: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
పెసలు, సెనగలు.. ఇలా నవధాన్యాలన్నింటినీ ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు వీటిని రెండుసార్లు కడిగి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఓ మందపాటి గినె్నలో పాలుపోసి సగమయ్యేవరకు బాగా మరిగించాలి. నేతిలో జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్‌లను వేయించి పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న పాలలో ఉడికించుకున్న నవధాన్యాలు, బెల్లం తరుము వేసి ఉడికించాలి. తరువాత యాలకులపొడిని జతచేయాలి. చివరగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లను కలపాలి. పైన మిగిలిన నేతిని కూడా వేసి వేడివేడిగా వడ్డిస్తే అద్భుత ఆరోగ్యాన్ని అందించే నవధాన్యపాయసం రెడీ.

పుచ్చకాయ మిల్క్‌షేక్

కావలసిన పదార్థాలు
తాజా పుచ్చకాయ ముక్కలు: మూడు కప్పులు
పుదీనా ఆకులు: పావుకప్పు
తాగే సోడా: అరకప్పు
వెనిల్లా ఐస్‌క్రీమ్: నాలుగు పెద్ద చెంచాలు
తయారుచేసే విధానం
మొదట పుచ్చకాయ ముక్కలు, సన్నగా తరిగిన పుదీనా ఆకులను మిక్సీలోకి తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ జ్యూస్‌లా చేసుకోవాలి. తరువాత నాలుగు గ్లాసుల్లోకి ఒక్కో గ్లాసులో ఒక్కో చెంచా చొప్పున వెనీలా ఐస్‌క్రీమ్ తీసుకోవాలి. తరువాత ఇందులో వడకట్టిన పుచ్చకాయ జ్యూస్ వేయాలి. చివరగా నాలుగు గ్లాసుల్లో కొద్దికొద్దిగా తాగే సోడా వేసుకుని పైన పుదీనా ఆకులను అలంకరిస్తే చాలు అద్భుతమైన పుచ్చకాయ మిల్క్‌షేక్ తయారు. భారీ భోజనం చేసిన తరువాత చల్లగా ఇలాంటి మిల్క్‌షేక్ తాగితే ఆహారం హాయిగా జీర్ణమవడమే గాక, కడుపులో చల్లగా ఉండి ఆత్మసంతృప్తి కలుగుతుంది.