రుచి

కేకుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్‌మస్ అంటేనే కేకుల పండుగ.. ఇక కేకులంటే పిల్లలకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే.. వారికి ఇష్టమైన కేకులను.. ఇంట్లోనే వండి.. మీకు ఎంత కావాలంటే అంత తినండి.. అని అనుమతినిస్తే వారి ఆనందానికి అస్సలు అవధులు ఉండవేమో.. అలా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేకుల తయారీ మీకోసం..

రెడ్ వెల్వెట్ కప్ కేక్

కావలసిన పదార్థాలు

గుడ్డు: ఒకటి
పంచదార: అరకప్పు
మజ్జిగ: పావుకప్పు
వెన్న: రెండు చెంచాలు
వెనిగర్: అరచెంచా
వంటసోడా: పావుచెంచా
మైదా: అరకప్పు
మొక్కజొన్నపిండి: పావుకప్పు
ఎరుపు ఆహారపు రంగు: చిటికెడు
చాక్లెట్ పొడి: పావుకప్పు
వెనిల్లా ఎసెన్స్: అరచెంచా

తయారుచేసే విధానం

గుడ్డుసొన, పంచదార, వంటసోడా, మైదా, మొక్కజొన్న పిండి, ఆహార రంగు, చాక్లెట్‌పొడి ఓ గినె్నలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరువాత కరిగించిన వెన్న, వెనిల్లా ఎసెన్స్, మజ్జిగ, వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కప్పుల్లో సగం వరకూ తీసుకుని 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది నుంచి ఇరవై నిముషాలు బేక్ చేసుకుంటే చాలు.. ఎంతో రుచికరమైన రెడ్‌వెల్వెట్ కప్ కేక్ తయారు.

నట్టీ ఫ్లోరెంటైన్

కావలసిన పదార్థాలు

ఉప్పు కలిపిన వెన్న: రెండున్నర కప్పులు
పంచదార: ముప్పావు కప్పు
బాదాం ముద్ద: చెంచా
మైదా: కప్పు
బియ్యప్పిండి: అరకప్పు
వేయించిన బాదాం పలుకులు: రెండు చెంచాలు
వాల్‌నట్ పలుకులు: పావుకప్పు
ఎండు చెర్రీలు: పావుకప్పు
మైదా: చెంచా

తయారుచేసే విధానం

ముందుగా కేక్ బేస్ తయారుచేసుకోవాలి. ముప్పావు వంతు వెన్న, సగం పంచదార ఓ గినె్నలోకి తీసుకుని రెండింటినీ కలపాలి. అందులో బాదాం ముద్ద, మైదా, బియ్యప్పిండి వేసి ముద్దలా అయ్యేవరకూ కలిపి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బేకింగ్ పాత్రలో తీసుకుని ఒవెన్‌లో ఇరవై ఐదు నిముషాల వరకూ బేక్ చేసుకుని తీసుకోవాలి. ఇది కేక్‌లా తయారవుతుంది. తరువాత మిగిలిన వెన్న, పంచదార, విడిగా పెట్టుకున్న చెంచా మైదా తీసుకుని కలపాలి. అందులో బాదాం, వాల్‌నట్ పలుకులూ, ఎండు చెర్రీలు వేసుకుని కలపాలి. కేకుపై ఈ మిశ్రమాన్ని పూతలా రాసి మరో పదిహేను నిముషాలు బేక్ చేసుకోవాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి.. ముక్కల్లా కోస్తే సరిపోతుంది.

ఎగ్‌లెస్ జీబ్రా కేక్

కావలసిన పదార్థాలు

మైదా: కప్పు
పంచదార పొడి: పావుకప్పు
బేకింగ్ సోడా: చెంచా
బేకింగ్ పొడి: చెంచా
వెన్న: పావుకప్పు
మిల్క్‌మెయిడ్: పావుకప్పు
పాలు: పావుకప్పు
కోకోపొడి: రెండు చెంచాలు
వెనిల్లా ఎసెన్స్: చెంచా
వెనిగర్: చెంచా

తయారుచేసే విధానం

ఓ గినె్నలో మైదా, పంచదారపొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో గినె్నలో వెన్న, మిల్క్ మేడ్, పాలు, వెనిల్లా ఎసెన్స్, వెనిగర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని మరో గినె్నలోకి తీసుకుని కోకో పొడి వేసి బాగా కలపాలి. నూనె రాసిన కేకు పాత్రలో ఒక గరిటెతో ఈ రెండు మిశ్రమాలను ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ సగం పాత్ర నింపి ఒవెన్‌లో 180 డిగ్రీల వద్ద 25 నిముషాల పాటు బేక్ చేసి తీస్తే ఎగ్‌లెస్ జీబ్రా కేక్ సిద్ధమవుతుంది. కోడిగుడ్డు తిననివారు ఇలాంటి కేక్ చేసుకుని ఆనందంగా తినేయచ్చు.

కాంటినెంటల్ ఆపిల్ కేక్

కావలసిన పదార్థాలు

మైదాపిండి: కప్పు
బేకింగ్ పౌడర్: రెండు చెంచాలు
వెన్న: 50 గ్రాములు
పంచదారపొడి: ఒకటిన్నర కప్పు
గుడ్లు: రెండు
పాలు: 100 మి.లీ.
ఆపిల్స్: మూడు
దాల్చినచెక్క పొడి: ఒక చెంచా

తయారుచేసే విధానం

మొదట ఆపిల్స్ తొక్కతీసి పలుచని స్లైసుల్లా కట్ చేసుకోవాలి. తరువాత మైదాపిండిలో బేకింగ్ పొడి వేసి కలపాలి. అందులోనే వెన్న, ఒక కప్పు పంచదార పొడి, గుడ్లు, పాలు పోసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కేకు టిన్నులో పోయాలి. దానిపై ఆపిల్ ముక్కల్ని పరిచి, పైన మిగిలిన పంచదారపొడి, దాల్చినచెక్క పొడి చల్లాలి. ఇప్పుడు 190 డిగ్రీల సెంటిగ్రేడు వద్ద అరగంటసేపు బేక్ చేసి తీయాలి. పిల్లలు ఎంతో ఇష్టపడే కాంటినెంటల్ ఆపిల్ కేకు తయారు.

చాక్లెట్ కేక్

కావలసిన పదార్థాలు

మైదా: ముప్పావుకప్పు
బేకింగ్ పౌడర్: అరచెంచా
ఉప్పు: అరచెంచా
గుడ్లు: ఐదు
పంచదార: కప్పు
తీపిలేని చాక్లెట్: రెండు పెద్ద ముక్కలు
నీళ్లు: రెండు చెంచాలు
ఐసింగ్ షుగర్: అరకప్పు
డార్క్ చాక్లెట్: నాలుగు పెద్ద ముక్కలు
క్రీం చీజ్: ఒక చిన్న ప్యాకెట్
వెనిల్లా ఎసెన్స్: అరచెంచా

తయారుచేసే విధానం

ముందుగా ఒవెన్‌ను 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసి పెట్టుకోవాలి. ఓ గినె్నలో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి జల్లించి పెట్టుకోవాలి. మరో గినె్నలో గుడ్లసొన తీసుకుని క్రీములా తయారయ్యేవరకు గిలక్కొట్టాలి. అందులో ముప్పావు కప్పు పంచదార వేసి అది కరిగేవరకూ కలపాలి. తరువాత మైదా వేయాలి. ఇప్పుడు చాక్లెట్‌ను కరిగించుకోవాలి. అంటే ఓ గినె్నలో సగం వరకూ నీళ్లు తీసుకుని స్టవ్‌పైన ఉంచాలి. అందులో చాక్లెట్ ముక్కలున్న గినె్నను ఉంచాలి. అది కరిగాక నీళ్లూ, మిగిలిన పంచదార వేసి కలిపి దింపేయాలి. దీన్ని మైదాలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదా చల్లిన కేక్ పాన్‌లో తీసుకుని ఒవెన్‌లో ఉంచాలి. పద్దెనిమిది నుంచి ఇరవై నిముషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి. ఇది చల్లారేలోగా దీనిపై పూత తయారుచేసుకోవాలి. డార్క్ చాక్లెట్‌ను ఓ గినె్నలో తీసుకుని స్టవ్‌పై పెట్టాలి. అది కరిగాక దింపేసి క్రీం చీజ్, వెనిల్లా ఎసెన్స్, ఐసింగ్ షుగర్ వేసి క్రీములా తయారయ్యేవరకూ కలపాలి. ఈ మిశ్రమాన్ని కేక్ అంతా పట్టిస్తే సరిపోతుంది. అంతే తీయతీయని చాక్లెట్ కేక్ రెడీ..