రుచి

పొంగలి రకాలెన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశిని ఎంతో పవిత్రమైన, శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు హిందువులు. ధనస్సు నెలపట్టిన తరువాత చాలామంది ప్రతిరోజూ పొంగలిని విష్ణువుకు నైవేద్యంగా పెట్టి భుజిస్తారు. అలాంటి పొంగళ్లలోని రకాలను ఇప్పుడు చూద్దాం..

కట్టు పొంగలి

కావలసిన పదార్థాలు

బియ్యం: ఒకటిన్నర కప్పులు
పెసరపప్పు: రెండు కప్పులు
నెయ్యి: అర కప్పు
కరివేపాకు: రెండు రెబ్బలు
అల్లం: చిన్నముక్క
మిరియాలు: ఒక చెంచా
జీడిపప్పు: ఒక కప్పు
జీలకర్ర: ఒక చెంచా
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

బియ్యం, పెసరపప్పు కడిగి కొద్దిగా నీళ్లు ఎక్కువ పోసి వండాలి. నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దించేయాలి. పెద్ద కడాయి తీసుకుని నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగాక జీడిపప్పు వేయాలి. ఆ తర్వాత మెత్తగా చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలపాలి. అంతే.. మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన, రుచికరమైన కట్టుపొంగలి తయారు.

రవ్వ పొంగలి

కావలసిన పదార్థాలు

రవ్వ: ఒక కప్పు
పెసరపప్పు: పావు కప్పు
నెయ్యి: నాలుగు చెంచాలు
శనగపప్పు: రెండు చెంచాలు
మినపప్పు: రెండు చెంచాలు
జీడిపప్పు: పది
మిరియాలు: ఒక చెంచా
జీలకర్ర: ఒక చెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
పచ్చిమిర్చి: రెండు
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

బాణలిలో కొద్దిగా నెయ్యివేసి పెసరపప్పు వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టేయాలి. పెసరపప్పు బాగా ఉడికాక సన్నని మంటపై కాసేపు అలాగే ఉంచాలి. ఈలోపు ఇంకో కడాయిలో కొద్దిగా నెయ్యివేసి రవ్వను వేయించి పెట్టుకోవాలి. మరుగుతున్న పప్పులో ఈ వేయించుకున్న రవ్వ వేసి మరికొన్ని నీళ్లు పోయాలి. దీంట్లో ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. దీన్ని పక్కనబెట్టి మరో కడాయిలో నెయ్యివేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీన్ని ఉడికించిన రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి. అంతే ఎంతో రుచికరమైన రవ్వ పొంగలి తయారు.

సెనగపిండి పాయసం

కావలసిన పదార్థాలు

సెనగపిండి: కప్పు
జీడిపప్పు పొడి: పావు కప్పు
పచ్చికొబ్బరి తురుము: పావు కప్పు
పంచదార: ఒకటిన్నర కప్పులు
నెయ్యి: పావుకప్పు
యాలకులపొడి: ఒక చెంచా
పాలు: నాలుగు కప్పులు
జీడిపప్పు: తగినన్ని
కిస్‌మిస్: తగినన్ని

తయారుచేసే విధానం

ముందుగా జీడిపప్పును డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నెయ్యివేసి పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి. తరువాత జీడిపప్పు, కిస్‌మిస్‌లను దోరగా వేయించుకుని తీసేసుకోవాలి. అదే బాణలిలో మరికాస్త నెయ్యివేసి సెనగపిండి వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసి సన్నని సెగపై ఉడికించాలి. ఇది బాగా ఉడికిన తరువాత జీడిపప్పు పొడి వేసి కలపాలి. ఆ తరువాత వేయించిన పచ్చికొబ్బరి తురుము, పంచదార వేసి కలపాలి. చివరగా యాలకులపొడి, వేయించి తీసిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి అందిస్తే రుచికరమైన పాయసం రెడీ..

తీపి పొంగలి

కావలసిన పదార్థాలు

బియ్యం: ఒక కప్పు
పెసరపప్పు: అర కప్పు
బెల్లం తురుము: ఒకటిన్నర కప్పు
నెయ్యి: పావు కప్పు
కొబ్బరి పాలు: రెండు కప్పులు
యాలకుల పొడి: అర చెంచా
జీడిపప్పు: పది
బాదాం: పది
కిస్‌మిస్: పది
కుంకుమపువ్వు: కొద్దిగా

తయారుచేసే విధానం

కుక్కర్‌లో పెసరపప్పు వేసి వేయించాలి. అవి వేగాక బియ్యం వేసి రెండు నిముషాల తర్వాత నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. కొబ్బరిపాలు, ఒక చెంచా నెయ్యివేసి కుక్కర్ మూత పెట్టేయాలి. నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. అది చల్లారే లోపు కడాయిలో నెయ్యి వేసి బాదాం, జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి పక్కన పెట్టాలి. బెల్లం తురుములో కొన్ని నీళ్లు పోసి మొత్తం కరిగించి, మరిగించాలి. ఈ లోపు అన్నాన్ని మెత్తగా కలపాలి. దీన్ని మరుగుతున్న బెల్లం పాకంలో వేయాలి. నెయ్యి, యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి సన్నని మంటపై కాసేపు ఉడికించి దించేయాలి. చివరగా వేయించిన బాదాం, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అందంగా గార్నిష్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన తీపి పొంగలి రెడీ..
పులి పొంగలి

కావలసిన పదార్థాలు

గోధుమరవ్వ: ఒక కప్పు
చింతపండు: కొద్దిగా
ఆలివ్ ఆయిల్: రెండు చెంచాలు
ఆవాలు: ఒక చెంచా
శనగపప్పు: ఒక చెంచా
ఎండుమిర్చి: రెండు
కరివేపాకు: రెండు రెబ్బలు
ఇంగువ: కొంచెం
నూనె: తగినంత
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

చింతపండును కడిగి నీళ్లుపోసి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అందులో రవ్వను నానేయాలి. ఇప్పుడు కుక్కర్‌లో నూనె పోసి ఆవాలు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. ఇవి వేగాక చింతపండు నీళ్లతో సహా రవ్వని కుక్కర్‌లో వేసేయాలి. దీంట్లో ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేయాలి. ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి. కాసేపటి తర్వాత కుక్కర్ మూత తీసి దాన్ని ఒక గినె్నలో వేసుకుని కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు.