రుచి

స్వీటు... హాటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు స్కూల్ నుంచి వచ్చి, పెద్దలు ఆఫీసు నుంచి వచ్చీ కాసేపు ఏదో నోట్లో కరకరలాడిస్తూ ఉప్పుఉప్పుగా, కారకారంగా, తియ్యతియ్యగా, నోటికింపుగా ఏదైనా కాస్తంత తిని ఆ తరువాత రాత్రి పనులు చేసుకొంటే బాగుండు అనుకోవడం చాలా సహజం. అయతే నగరాల్లో అమ్మనాన్న ఇద్దరూ ఉద్యోగాలకు పోతూండడంతో పూర్వం లాగా కారాలు, స్వీట్లు డబ్బాలకు పోసి ఉండడం లేదు.
కానీ అప్పుడప్పుడు స్వీటు షాపుల్లో నుంచి తెచ్చుకుని తినడం అలవాటు చేసుకొంటున్నారు. వారంతా కాచి కాచి ఉన్న నూనెతో తినుబండారాలు చేయడం వల్ల అవి ఏదైనా అస్వస్థతను కలిగిస్తాయ. అట్లాకాకుండా ఆదివారాలు, లేక ఏదైనా సెలవురోజుల్లో ఇవి కాసిని చేసిపెట్టుకుంటే అటు పిల్లలకు, ఇటు పెద్దలకు రుచికి రుచినిస్తాయ. కాస్తంత ఓపికను కలుగ చేస్తాయ. వాటిని ఒక్కసారి చూద్దామా...
బ్రెడ్ గులాబ్‌జామూన్
కావల్సినవి: అంచులు తీసేసిన బ్రెడ్ స్లైసులు- నాలుగు, చక్కెర- ముప్పావు కప్పు, నీళ్లు- ముప్పావుకప్పు, పాల పొడి లేదా మైదా- రెండు టేబుల్ స్పూన్లు, పాలు- పావుకప్పు, నూనె- వేయించేందుకు సరిపడా, యాలకుల పొడి- అర చెంచా.
తయారీ: ఓ బ్రెడ్ స్లైసుని తీసుకుని పాలల్లో ముంచి వెంటనే తీసేసి గట్టిగా నొక్కాలి. ఇలా మిగిలిన స్లైసుల్నీ చేసుకుని అన్నింటినీ ఓ గినె్నలోకి తీసుకోవాలి. ఇందులో పాల పొడీ లేదా మైదా వేసి ముద్దలా కలపాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మరో గినె్నలో చక్కెరా, నీళ్లూ పోసి పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకం చిక్కగా అవుతున్నప్పుడు యాలకుల పొడి వేసి దింపేయాలి. ఇందులో ముందుగా వేయించుకున్న బ్రెడ్ ఉండల్ని వేసుకుంటే చాలు.
పనీర్ గులాబ్ జామూన్
కావల్సినవి: పాలు- లీటరు, పెరుగు- పావుకప్పు, పాలపొడి- రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర- కప్పు, నీళ్లు- కప్పు, యాలకుల పొడి- అర చెంచా, నూనె- వేయించేందుకు సరిపడా.
తయారీ: అడుగు మందంగా ఉన్న గినె్నలో పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. అవి మరిగాక అందులో పెరుగు వేయాలి. కాసేపటికి పాలు విరిగిపోతాయి. అప్పుడు పొయ్యి కట్టేసి ఆ పాలను వడకట్టాలి. పాల విరుగుడుని ఓ పల్చటి వస్త్రంలోకి తీసుకుని గట్టిగా నొక్కితే నీళ్లు ఇవతలకు వచ్చేస్తాయి. దాన్ని ఓ గినె్నలోకి తీసుకుని మెత్తని పనీర్‌లా చేసుకోవాలి. ఇందులో పాలపొడి వేసి మరోసారి కలిపి ఉండల్లా చేసుకోవాలి. వాటిని కాగుతోన్న నూనెలో రెండు చొప్పున వేసుకుని వేయించి తీసుకోవాలి. ఇప్పుడు మరో గినె్నలో నీళ్లూ, చక్కెర తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి తీగపాకం తయారవుతున్నప్పుడు యాలకుల పొడి వేసి దింపేయాలి. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ఉండల్ని వేస్తే చాలు. పనీర్ ఉండల్ని వేయించకూడదని అనుకున్నప్పుడు పాకంలోనే వేసి ఇరవై నిమిషాలు సన్నని మంటపై ఉంచి.. దింపేయాలి.
కాలా జామూన్
కావల్సినవి: గులాబ్ జామూన్ పొడి- రెండు కప్పులు, పాలు- పావుకప్పు, యాలకుల పొడి- చెంచా, ఆకుపచ్చ ఆహార రంగు- చిటికెడు, చక్కెర- టేబుల్ స్పూను, నూనె- వేయించేందుకు సరిపడా.
పాకం కోసం: చక్కెర- రెండు కప్పులు, నీళ్లు- రెండు కప్పులు, చక్కెర పొడి- అరకప్పు.
తయారీ: గులాబ్ జామూన్ పొడీ, పాలు ఓ గినె్నలోకి తీసుకుని కలపాలి. తరవాత కొద్దికొద్దిగా నీళ్లుపోస్తూ ముద్దలా కలపాలి. ఇందులోంచి పావుముద్దను విడిగా తీసి ఆకుపచ్చ ఆహార రంగూ, చక్కెరా, యాలకుల పొడి వేసి మరోసారి కలపాలి. మొదట కలిపిన పిండినీ, ఆకుపచ్చ రంగు ఉన్న ముద్దనూ చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. మొదట తెలుపురంగు ఉండను తీసుకుని కాస్త వెడల్పుగా చేసుకోవాలి. అందులో ఆకుపచ్చ రంగు ఉండను ఉంచి.. అంచులు మూసి మళ్లీ ఉండలా చేసుకోవాలి. ఇలాగే మిగిలినవీ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ఉండల్ని రెండు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి కాస్త నల్లగా అయ్యేవరకూ వేయించుకుని తీసుకోవాలి. ఇంతలో చక్కెరా, నీళ్లూ ఓ గినె్నలోకి తీసుకుని తీగపాకం పట్టి దింపేయాలి. వేడి కాస్త చల్లారాక ముందుగా వేయించి పెట్టుకున్న ఉండల్ని పాకంలో వేసి కాసేపయ్యాక ఇవతలకు తీయాలి. వాటిని చక్కెర పొడిలో ముంచి తీస్తే సరిపోతుంది.

చిలగడ దుంప గులాబ్ జామూన్
కావల్సినవి: చిలగడ దుంప- ఒకటి పెద్దది, మైదా- రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు- చిటికెడు, వంట సోడా- చిటికెడు, నూనె - వేయించేందుకు సరిపడా, చక్కెర- ఒకటింబావు కప్పు, నీళ్లు- ఒకటింబావు కప్పు, యాలకుల పొడి- అరచెంచా.
తయారీ: చిలగడ దుంప చెక్కుతీసి ఉడికించుకోవాలి. తరువాత దీన్ని మెత్తని ముద్దలాచేసి అందులో ఉప్పూ, మైదా, వంట సోడా వేసి అన్నింటినీ కలిపి ముద్దలా కలపాలి. ఐదు నిమిషాలు నాననిచ్చి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని కాగుతోన్న నూనెలో రెండుచొప్పున వేసుకుని ఎర్రగా వేయించి తీసుకోవాలి. అదే సమయంలో మరో గినె్నలో చక్కెరా, నీళ్లూ తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి తీగపాకం అవుతున్నప్పుడు యాలకుల పొడి వేసి దింపేయాలి. పాకం కాస్త వేడి తగ్గాక వేయించిన చిలగడ దుంప ఉండల్ని అందులో వేస్తే చాలు.
ఒకే పిండి.. ఎన్నో పిండివంటలు
సన్న కారప్పూస
కావలసిన పదార్థాలు : శనగపిండి...1 కప్పు, ఉప్పు ... చిటికెడు, కారం ... చిటికెడు, నూనె ... 1 చెంచా, నీళ్లు... పిండి తడుపుటకు తగినన్ని, నూనె... వేపడానికి సరిపడినంత
తయారీ విధానం: ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. దీనిలో ఉప్పు కారం కలుపుకోవాలి. ఒక్క చెంచాను నూనెను వేడిచేసి ఈపిండిలో పోయాలి. ఉండలు కట్టకుండా నూనె అంతా శనగపిండికి పట్టేట్టుగా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ శనగపిండిని గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
ఇపుడుమార్కెటులో దొరికే సన్నకారప్పూస వేసుకొనే బాణలిమీద పట్టేట్టు ఉండే పరికరాన్ని తీసుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడిచేయాలి. నూనె మరుగుతుండగా ఈ పరికరాన్ని ఆ బాణలిపై పెట్టి చపాతీ పిండిలాగా కలుపుకున్న శనగపిండి దానిపై రుద్దాలి. ఒకేవేపుకు రుద్దాలి. అపుడు బాణలీలో సన్నని కారప్పూస పడుతుంది. ఆ పూస వేగాక దించి వేరుగా పెట్టుకోవాలి.
నాడాలు
జంతికల గొట్టంలో పొడవుగా ఉన్నరెండుగీతలుండే బిళ్లను గొట్టంలో అమర్చుకోవాలి. ఇపుడు శనగపిండిని కొద్ది జారుగా కలుపుకుని దానిలో పెట్టుకుని మరుగుతున్న నూనెలో తిప్పాలి. పొడవు,పొడవుగా ఉండేలా శనగపిండి బాణలిలో పడుతుంది. దీన్ని బాగా ఎర్రగా కాల్చుకుని విడిగా తీసుకోవాలి. ఇదే నాడాజంతికలు అంటారు
కారంబూది
శనగపిండిని కాస్త జారుగా కలుపుకుని చిల్లులున్న గరిటలో పోసుకొని నూనె బాణలిలో దిగవిడచాలి. అపుడు పూసలు పూసలుగా శనగపిండి బాణలోపడుతుంది. దీన్ని కూడా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకుని విడిగా తీసుకోవాలి. దీనిలో కావల్సిన వారు పల్లీలు, పుట్నాలపప్పు, జీలకర్ర కూడా కలుపుకుంటే తినడానికి రుచిగా ఉంటుంది.
నానారకాలు
శనగపిండిని జంతికల గొట్టంలో ఉండే రకరకాల చిల్లులను గొట్టానికి అమర్చి ఈ పిండిని నూనెలో వత్తుకుంటే రకరకాల జంతికలు వస్తాయి.

--వాణి ప్రభాకరి