రంగారెడ్డి

ఇక ప్రగతి పథం పట్టణ రథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 24: పట్టణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్ అమోయ్ కుమార్‌లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 మున్సిపాలిటీల్లో నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకు 10 రోజుల పుటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలు ఆదర్శవంతంగా ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచణ మేరకు పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం
ప్రజల్లో మంచి స్పూర్తిని తీసుకవచ్చిందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో పచ్చదనం, పారిశుద్ధ్యం, ఇంటింటికి తాగునీరు అందించడం, నిరాక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, వౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి వార్డులో 60 మందితో కూడిన 4 కమిటీలను ఏర్పాటు చేసి వార్డులలో గల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ప్రతి వార్డులో మొక్కలు నాటడంతో పాటు 80 శాతానికి పైగా మొక్కలను సంరక్షించాల్సి ఉంటుందని లేని పక్షంలో పురపాలక చట్టం ప్రకారం సంబందిత కౌన్సిలర్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి నిరక్షరాస్యులను గుర్తించడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా వార్డుకు 4 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 14వ ఆర్ధిక సంఘం నిధులతో చెత్త సేకరణకు గానూ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ముందుగా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజలతో కలియదిరుగుతూ వౌళిక సదుపాయాలను పరిశీలించారు. అదే విధంగా ప్రభుత్వాసుపత్రిని, ప్రభుత్వ పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డుతో పాటు పలు బస్తీలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హరీష్, ప్రతీక్ జైన్, మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కమీషనర్ ఇసాక్ అబ్‌ఖాన్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ముఖ్యమంత్రి సూచన మేరకు మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బస్తీలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు. పట్టణ ప్రగతి ద్వారా నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీల్లో వౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పారు. కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 15 మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 396 వార్డులలో వార్డు కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు.